ప్రపంచం పట్టించుకోనట్టు వదిలేసిన ఓ మహానటి అంతిమ నిష్కలాయణం గురించి తెలిసిన వాడిలా సానుభూతిగా చెప్పాడు డాక్టర్ "మెడికల్ సైన్సులో ఏ అద్భుతమైనా జరగొచ్చు మిస్ సుకృతీ....కేన్సర్ వచ్చిన ప్రతి మనిషీ బ్రతకడని మనం చెప్పలేం. అయితే మీ అమ్మగారి పరిస్థితి మాత్రం చాలా విషమించింది. ఖీమోథెరపీ లాంటి ప్రయత్నాలతో కొంత స్వస్థతని సాధించొచ్చు. కానీ చాలా ఖరీదైన ట్రీట్ మెంట్ అది."
"అంటే.....?"
"హాస్పిటల్లో అడ్మిట్ చేసి యిక్కడే ట్రీట్ మెంట్ కొనసాగించాలీ అంటే నెలకి కనీసం పాతిక వేలదాకా ఖర్చు వుంటుంది. నిజానికి ఆమె ఏ స్థాయి వ్యక్తో తెలిసినా మేం ప్రస్తుతం ఆమె స్థితిని బట్టి పాత బిల్లునీ అడగలేకపోయాం."
"పాతికవేలు ముందే చెల్లిస్తాను డాక్టర్. ఒక్క నెలేకాదు. ప్రతి నెలా.....అమ్మ బ్రతికేదాకా కనీసం అమ్మ స్పృహలోకి వచ్చేదాకా....." సుకృతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలుతుంటే మొండితనం ప్రదర్శించే పసిపిల్లలా చెప్పింది. వెంటనే అక్కడనుంచి బయలుదేరింది.
త్యాగరాయనగర్ లో వున్న ఓ ఖరీదైన యింటిలోకి వచ్చిన సుకృతి హాల్లోకి రాబోతూ ఆగిపోయింది. అక్కడ రామన్ వున్నాడు కానీ చావు బ్రతుకుల మధ్య వున్న రాజ్యానికి భర్తలా లేడు. స్నేహితుల్తో మందు సేవిస్తూ చాలా ఉత్సాహంగా జోక్ చేస్తున్నాడు.
మనసు బాధగా మెలితిరిగి పోయింది. ఏ రోజూ ఇలా తన యిల్లు తప్ప మరో ఇంటిలో అడుగుపెట్టని సుకృతి యీ రోజు వచ్చింది అమ్మ కోసం.....అమ్మను బ్రతికించుకోటానికి సహాయం అర్ధించటం కోసం.
ఎప్పుడో నటుడుగా కథ ముగిసిన రామన్ ఇప్పుడు బాగా డబ్బున్న నిర్మాత. ఆ డబ్బు అమాయకురాలైన రాజ్యం అనబడే నాటికీ చెందిందని అందరికీ తెలిసినా ఆ రంగంలో అది అనర్హత కాదు. ఇక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగడం ఓ ఆనవాయితీగా అందరూ అంగీకరించేదే కాబట్టి ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు నిమగ్నమై డబ్బు చేసుకుంటారు తప్ప సెంటిమెంట్స్ వుండవు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఇద్దరు ప్రముఖ ఫైనాన్సర్స్ తో ఓ సినిమా పెట్టుబడి గురించి మాట్లాడుతున్న రామన్ అలవోకగా ద్వారంకేసి చూసి "ఎవరూ" అన్నాడు.
వెంటనే జవాబు చెప్పలేదు సుకృతి.
గుండె దిటవు పరచుకోటానికి అరనిమిషం పట్టింది. "నేను నాన్న గారూ సుకృతిని."
అతడిలో ఏ చలనమూ లేదు "ఎందుకిలా వచ్చావ్?"
సుకృతికి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. ఇంతకాలం తర్వాత కనిపించి నందుకు తండ్రిగా అణుమాత్రమైనా లాలిత్యాన్ని ప్రదర్శించడం లేదు. ఇంటిలోకి అనుమతి లేకుండా అడుగుపెట్టిన ఓ భిక్షగత్తెలాగా నిలదీస్తున్నాడు.
ఇంతకుమించి ఆప్యాయతని ఆమె కూడా ఆశించలేదు. "అమ్మని హాస్పిటల్లో చేర్పించాలి. కొంచెం సాయం చేయండి నాన్నా."
అర్దోక్తిగా ఖండించాడు "మరోసారి నాన్నా అని పిలవకు."
"ఏం ఎందుకని?" ఉక్రోషంగా అడిగింది.
"నువ్వు నాకే పుట్టావని గ్యారంటీ లేదు కాబట్టి."
ఇందరిముందు ఇంత జుగుప్సగా మాట్లాడుతున్నాడేం?
"అంతే సుకృతీ.....నీ తల్లి పెద్ద తిరుగుబోతు."
అది ఇంత కాలానికి తెలిసిందా? అని అడగలేదామె.
చేతులు జోడించింది "నాన్నగారూ"
"నువ్వూ వయసులోనే వున్నావు కదే" ఛెళ్ మనిపించాడు.....ఆ తర్వాత మరేదో మాట్లాడుతున్నాడు నీచంగా, క్రూరంగా.
తూలిపడబోయి నిభాయించుకుంది.
ఇలాంటి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాడేం? ఈ మనిషినా అమ్మ నమ్మింది. ఈ మనిషికోసమా యింతకాలమూ తపించింది. ఏ రోజూ తండ్రిగా లాలించనివాడు ఏదో ఓ రోజు తననూ కూతురిలాగే దగ్గరకు తీసుకోకపోడూ అనుకుంటే యింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడేం.
చంపేసేదే....కాని ఆమె హంతకురాలు కాదు.
అది కాదు ఆమె ఆలోచిస్తున్నది. ఇప్పుడు తను నిలబడ్డ ఇల్లు కూడా ఒకనాడు అమ్మ సంపాదించిందే. ఆ విషయం ఎలా మరిచిపోయాడు.
మనుషుల అవకాశవాదాలకీ, కక్షలకీ, కార్పణ్యాలకీ అతీతంగా తన దయిన ప్రపంచంలో బ్రతికిన ఆడపిల్ల ఆమె. ఒకప్పుడు చాలా ఉన్నదైనా ఇప్పుడు ఏమీ లేనిది.
దిగులుగా, బెంగగా బయటికి నడుస్తుంటే ఆ వ్యక్తి యిందాక రామన్ తో బాటు హాల్లో కూర్చున్న నాలుగో వ్యక్తి.
"నా పేరు మారి" తనను తాను పరిచయం చేసుకున్నాడు. "ఇప్పుడు సినిమా రంగంలో పైకొచ్చిన చాలామంది నటీమణులకి ఆదిలో సహాయం చేసినవాడ్ని. అలా అని నేను నిర్మాతని, దర్శకుడ్ని కాను."
ఇలాంటి బ్రోకర్సుని ఏమంటారో ఆమెకు తెలీదు.
"నీ తల్లి ట్రీట్ మెంట్ కి డబ్బు కావాలి కదూ? నువ్వు సరేనంటే నేను సహకరిస్తాను"
ఉత్సుకతగా చూసింది సుకృతి.
"ఎలా అన్నది నీ సందేహం అనుకుంటాను. తెలుగు సినిమా రంగం హీరోయిన్స్ కొరతలో కూరుకుపోయింది సుకృతీ. నువ్వు సరేనంటే నిన్నో పెద్ద స్టార్ ని చేస్తాను.....అలా కోపంగా చూడకు. ఇప్పుడు నీకు నీ తండ్రి సహాయం ఉండదు. నీకు నువ్వే ఎదగాలి. డానికి నీ అందాన్ని...." క్షణం ఆగాడు ఆమెను ఆపాదమస్తకం చూస్తూ. "పెట్టుబడిగా పెట్టాలి."
సుకృతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
"వెంటనే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్డు దగ్గరుంచుకుని అవసరమైనప్పుడు ఫోన్ చెయ్" అందించాడు విజిటింగ్ కార్డు. సులభంగా డబ్బు సంపాదించటానికి అందం, ఆడతనం ఎంత ఉపయోగపడేదీ తొందరగా నిర్ణయించే పరిశ్రమ సినిమారంగం ఒక్కటే సుకృతి. నీకు నిజంగా తల్లి మీద మమకారమే వుంటే ఆలోచించు."