Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 5


    
    "ఇంతసేపూ ఏమయ్యావమ్మా? ఎంత కంగారుపడ్డానో తెలుసా?" ద్వారం దాటి యింటిలోకి వస్తున్న సుకృతిని అక్కున చేర్చుకుంది అలివేలు. "రా భోంచెయ్"
    గదిలోని చీకటిని పూర్తిగా పారద్రోలని విద్యుద్దీపపు కాంతిలో చూసింది సుకృతి బిరియానీ పెకేట్టులా వుంది.
    "తీసుకొచ్చి రెండు గంటలైంది. చల్లారిపోయింది" సంజాయిషీలా అంది అలివేలు.
    ఎవరీ స్త్రీ? తనకేమౌతుంది? తన వాళ్ళనుకున్న వ్యక్తులు అపహాస్యం చేస్తుంటే నేనున్నావంటూ ముందుకొచ్చి యింత ఆప్యాయతని వర్షిస్తుందేమిటీ? కన్నీళ్ళతో తప్ప కృతజ్ఞతని వ్యక్తం చేయలేని స్థితి సుకృతది. "ఆకలిగా లేదు ఆంటీ."
    ఇకముందంతా అదేనమ్మా అనలేదు అలివేలు. ఆత్మీయంగా తల నిమిరింది! "నీకిలనతి తిండి అలవాటులేదేమో కదూ?"
    "అదికాదాంటీ" అమ్మని చూస్తూ నేలపై కూర్చుండిపోయిన సుకృతి ఆ తర్వాత యిక మాట్లాడలేనట్టుగా మోకాళ్ళపై తల వుంచుకుంది. ఈ జీవితంలో అడుగుపెట్టినందుకు కాదు, యిలాంటి జీవితం ఒకటుంటుందని ముందే తెలియనందుకు యిప్పుడు కుమిలి పోతూంది. "అమ్మకిలా వుంటే నాకు తిండెలా సహిస్తుంది?"
    రుద్దమైన సుకృతి గొంతు ఏ మనసు పొరల్ని కదిలించిందో అలివేలు సుకృతి పక్కన కూర్చుంది. "నువ్వు తినాల్సింది నీ కోసం కూడా."
    "చచ్చిపోవాలనుంది" రొప్పుతూ చూసింది సుకృతి. "అవునాంటీ! అమ్మకన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండనిపిస్తుంది."
    "తప్పే పిచ్చిపిల్లా! ఇలాంటి సమస్యలకి చావే పరిష్కారమైతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అయినా బ్రతికేస్తున్నాగా."
    "అమ్మని కూడా..." సుకృతి గొంతు పూడుకుపోతూంది.
    "బ్రతికించుకోవాలనుంది ఆంటీ.....అందుకే కేన్సర్ హాస్పిటల్ కి వెళ్ళాను....ఆ తర్వాత నాన్నని కలుసుకున్నాను...." అతడెంత నిర్లక్ష్యముగా ప్రవర్తించిందీ చెప్పింది సుకృతి.
    "పిచ్చితల్లీ...." నిర్వేదంగా నవ్వింది అలివేలు. "మనసునీ, శరీరాన్నీ అర్పించి నా మనిషి అనుకుంటూ వున్న ఆస్తిని పూడ్చిపెట్టిన నీ తల్లి యిలా పతనం కావటానికి కారణమైన మగాడు యిప్పుడు కాపాడటానికి ముందుకొస్తాడని ఎలా అనుకున్నావు. ఇది సినిమారంగం సుకృతీ! మొహాలకి మాత్రమేకాక మనసులకీ మేకప్ చేసుకుని అసలు రూపాలు అర్ధంకాకుండా అందర్నీ మభ్యపెట్టడం యిక్కడ సాంప్రదాయం. నీ తండ్రి మాత్రమే కాదు. నీ తల్లిని హీరోయిన్ గా పెట్టుకుని సిల్వర్ జూబ్లీ సినిమాలు తీసిన నిర్మాతలు కాని ఆమె పక్కన హీరోలుగా నటిస్తే చాలు తమ రేంజ్ పెరుగుతుందని ఒకనాడు మీ అమ్మని కాకాపట్టి పైకొచ్చిన హీరోలు కాని ఎవరూ నీ తల్లిని పట్టించుకోరు.....ఎందుకంటే యిప్పుడు నీ తల్లి గతం కాబట్టి....గతాన్ని గుర్తు చేసుకోకపోవడం యీ యిండస్ట్రీ అలవాటు కాబట్టి అంతెందుకు......నిన్నగాక మొన్నటిదాకా బ్రహ్మరథం పట్టిన పత్రికలు అభిమానులు ఎవరయినా నీ తల్లి గురించి ఆరా తీస్తున్నారా? అదంతేనమ్మా....నటిగా బ్రతికి వున్నప్పుడే షూటింగ్ లు చీకటిని చేరనివ్వని ఫ్లడ్ లైట్సు కాంతులూ.... నటిగా చనిపోతే వెలుగుండదు. చీకటే....ఎందుకంటే మిరుమిట్లు గొలిపే లైట్లకాంతిలోనే సినిమా చేవారికి ప్రదర్శింపబడేది చీకటిలోనే కాబట్టి."    
    అప్పుడు చూసింది అలివేలు. తల్లి పొట్టని ఏపుకి అట్టలా అంటుకుపోయిన రాజ్యం కడుపుని స్పృశిస్తూంది సుకృతి అశ్రుశిక్తంగా.
    "ప్రపంచమంటే భయపడి అమ్మ కడుపులోకి తిరిగి పిండమై చేరి పోవాలనుకున్నా అది సాధ్యం కాదమ్మా......ఇప్పుడు నీ తల్లిని పిండంగా మార్చుకుని కడుపులో దాచుకోవాలి. ఎందుకే తల్లీ......యీ కన్నీళ్ళేమిటి? నువ్వూ వయసులో వున్నదానివేనని మీ నాన్న అన్నాడనా? అదంతేనమ్మా! ఓ సినిమాలో తండ్రిగా, మరో సినిమాలో భర్తగా, ఇంకోదానిలో అన్నగా నటించే అలవాటుగల రామన్ లాంటి కుసంస్కారులకి వావివరసలుండవు. ఉంటే అలా మాట్లాడలేడు. డబ్బుకోసం ఏ పాత్రయినా పోషించగల వాళ్ళు పెళ్ళాలనీ మార్చగలరు. కూతుళ్ళనీ పడక సుఖానికి ఆహ్వానించగలరు. వాడ్ని మరిచిపో లేదా చచ్చాడనుకో అయినా యిప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ తల్లి బ్రతుకమ్మా. అందుకోసం నువ్వు బ్రతకాలి."
    బడలికగా కళ్ళు మూసుకుంది సుకృతి. అంత నిరాశలోనూ అలివేలు మాటలు అణువంత స్ఫూర్తినిచ్చాయి. ఏది జీవితం.... జీవించాలనుకునేదా? లేక అనుకున్నది కాకపోయినా జీవించేదా? అమ్మ బ్రతకడమే తనకు ముఖ్యమయినప్పుడు అమ్మ మూలంగా వచ్చిన సుఖాలు దూరమైతే నేం? నిరాశావాదంలో నుంచి  ఆశావాదానికి నెట్టే పరిస్థితుల్లో నిలబడ్డ సుకృతి వయసెంతని ఇరవయ్యేళ్ళుగా.....మానసికమయిన రాపిడి రేపు ఆమెను ఎలా మార్చినాగాని యిప్పుడు చెప్పలేనంత వూరటనందించేది అలివేలు అండమాత్రమే.
    ఇంకా చావని ఆశావాదం అలివేలుని ఇప్పటికి బ్రతికేట్టు చేసిందని తెలీని సుకృతి ఆలోచనల్లో వుండగానే సమీపించింది అలివేలు. బిరియానీ పేకెట్టునందిస్తూ అంది- "నీకు రుచించదేమో అని ఖరీదయిన హోటల్ నుండి తెప్పించాను సుకృతీ."
    విస్మయంగా చూసింది సుకృతి. "నా కోసం నువ్వింత శ్రమపడవద్దు ఆంటీ."
    "నువ్వు తిను"
    "కడుపునొప్పిగా వుందమ్మా"
    "అదేం?"
    "ఒకరూ ఇద్దరూ కాదు నిన్నరాత్రి ఆరుగురితో గడపాల్సివచ్చింది."
    దిగ్భ్రాంతిగా చూసింది సుకృతి.
    "పిచ్చిపిల్లా! ఎందుకలా కంగారుపడతావు. నేమేమిటీ అన్నది రేపు నువ్వు తెలుసుకుని నన్ను అసహ్యించుకోవడం యిష్టంలేదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ఎప్పుడో ఓసారి జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో వేయడం ఒకటీ అరా డబ్బుకోసం మగాళ్ళతో వెళ్ళడం నా జీవితం....బ్రతకాలిగా...." దోషిగా తల వంచుకుని నిజాయితీగా చెప్పిన అలివేలుపై ఆమెకు ద్వేషం కలగలేదు.

 Previous Page Next Page