Read more!
 Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 3


    కారు ఆగింది.
    సుకృతి కళ్ళలో నీళ్ళు లేవిప్పుడు. ఇరవై యేళ్ళ తన జీవితానికి కొత్త నిర్వచనం తెలిసినట్టు యాంత్రికంగా కారు దిగింది.
    టాక్సీకి డబ్బులిచ్చిన అలివేలు సుకృతిని పొదివి పట్టుకుని నడిపిస్తుంటే మురికి కూపంలో వున్న వీధిలోని పసిపిల్లలు వింతగా చూస్తున్నారు. పెంటకుప్పలపై కూర్చున్న కుక్కల డ్రైనేజ్ నుంచి ఉబికే దుర్గంధంతోబాటు స్వాగతం చెబుతున్న దోమల్నీ గమనించకుండా ఓ చిన్న పెంకుటింటిలో అడుగుపెట్టింది సుకృతీ అలివేలుతో సహా.
    అది పెంకుటిల్లు అయినా పెచ్చులూడిన పాత సినిమా సెట్ లా వుంది. మాసిన గోడలు, దండెంపై వేలాడే చీరలు.....,ముందు వసారాకి ఆనుకుని వున్న గది వెనుకగా ఓ మూల చిన్న నవారుమంచం..... ఆ మంచంపై.....
    "అ.....మ్మా" వెక్కిపడుతూ తల్లిని చేరుకుంది సుకృతి. కళ్ళు నీటిపొరలతో మసకబారుతుంటే కట్టెలా వున్న అమ్మని పసిపిల్లలా ఒడిలోకి తీసుకుంది సుకృతి.
    ఇదేమిటి.....నటిగా కీర్తి పతాకం ఎగురవేసిన చేనె అందమైన ఆంధ్రత్వంలో మెరిసిన వెన్నెల సోన సోట్ల అభిమానుల గుండెల్లో మోగిన మధురవీణ ఇలా మూగపోయిందేమిటి .....పైరగాలంత ఉత్సాహంగా కదుల్తూ ప్రకృతి సిగపాయల తురిమిన చేమంతుల కాంతి గుబాళించిన నా తల్లి ఇలా కాల్చడానికి సిద్దంగా వున్న కట్టెలా కనిపిస్తుందేమిటి.
    ఏదమ్మా..... నిన్న మొన్నటి నీ నిగనిగలాడే....వెండితెరల శంఖారావంలా, నటనకి భాష్యంలా, పాత్రలకే ప్రాణాస్పందాన్ని కలిగించిన నువ్వేమిటిలా నిశ్చల సమాధిలోకి జారిపోయావు. ఏ శనిదేవత రథ చక్రపుటి దుస్తుల్లో నలిగిపోయావ్. ఏ సంఘం బహిష్కరించిందని ఇలా మంచం పట్టావు......ఏదమ్మా......నాకేదే దారి.....ఇప్పుడు నేనేం కావాలే.....
    "సుకృతీ" గుండె గొంతుకడ్డం పడిందేమో అలివేలు కంఠం గాద్గదికమైపోయింది. "నీ తల్లి స్పృహ లేకపోయినా నిన్నిలా చూస్తే తట్టుకోలేదమ్మా....."
    "ఆంటీ....." వెక్కిపడిపోతుంది సుకృతి. "అమ్మ యిలా అయిపోయిందే! ఇంత కాలం నువ్వయినా నాకెందుకు చెప్పలేదు. చెబితే ఏం చేసేదాన్నో నాకు తెలీకపోయినా అమ్మని అమ్మలా అయినా చూడగలిగే దాన్నిగా..... ఇప్పుడెలా ఆంటీ..... అమ్మకి స్పృహ ఎప్పుడు వస్తుంది. అమ్మతో నేనెప్పుడు మాట్లాడాలి......అసలు నేను వచ్చిన సంగతైనా తెలీకుండా అమ్మ చచ్చిపోతే....."
    ఈ పిచ్చిపిల్ల ఇంత మధనపడిపోతూందేం......ఎక్కడో దూరంగా చదువుకునే అమ్మాయి నిబ్బరంగా నిలబడగలదనుకుంటే ఇంత దీనంగా కదిలిపోతూ తన నెందుకింత ఆరడిపెడుతూంది. ఏ ప్రశ్నకైనా జవాబు తనకు తెలీదే.....ఏం చెప్పాలి.....
    అలా సుకృతి ఎంతసేపు కన్నీళ్ళు పెట్టుకుందో, తల్లిని చుట్టేసి ఎన్ని మాటల్ని పేర్చుకుంటూ మనసులోనే నిలదీసిందో అలివేలుకీ గుర్తు లేదు.
    ఉన్నట్టుండీ తల పైకెత్తిన సుకృతి అడిగింది "అమ్మని హాస్పిటల్లో చేర్పించొచ్చుగా?"
    దిక్కులు చూసింది అలివేలు, చేర్పించటం సమస్య కాదు. అంత స్తోమత వుండాలిగా ఇల్లు ఒళ్ళు గుల్లయిపోయాక ఇక బ్రతకదని తెలిసాక ఏం చేస్తే మాత్రం లాభమేమిటి.
    "మాట్లాడు ఆంటీ."
    "మందులు వాడుతూందమ్మా....." హోమియోపతి పిల్స్ వున్న బాటిల్ చూపించింది అలివేలు. "ఇవి మీ అమ్మ తరచూ వాడేవే."
    సన్నగా కట్టెలా వున్న చేతుల్ని వెదురుబొంగులా వున్న ఒంటినీ చూస్తూ అసహనంగా రెట్టించింది సుకృతి.
    "అమ్మని హాస్పిటల్లో అయినా చేర్పించాలి ఆంటీ.....తప్పదు....."
    ఇక చెప్పక తప్పని సరైంది అలివేలుకి. "ఆదిలో ఖరీదైన ట్రీట్ మెంట్ చేసుకుంది సుకృతీ. ఆ తర్వాత....డబ్బుల యిబ్బందితో మందులు చవగ్గా వుంటాయని హోమియోపతిని ఆశ్రయించింది. ఒకవేళ అప్పు పుట్టినా ఆ డబ్బునీ చదువుకోసం వినియోగించాలని ఆరాటపడుతూ....."
    ఆ తర్వాత యిక సుకృతి వినలేదు. రాణివాసం నుంచి బహిష్కరింపబడిన మహారాణికి వున్న ఒకే ఒక్క వారసురాలిగా తల్లి రిపోర్టుల్ని తీసుకుంది. అలివేలు ఏదో అడగబోతుండగానే బయలుదేరిన సుకృతి మరో అరగంటలో కేన్సర్ హాస్పిటల్ ని చేరుకుంది. మొదటిలో రాజ్యం ట్రీట్ మెంట్ తీసుకున్నదక్కడే.

 Previous Page Next Page