"అది నేర్పినా, నేర్పకపోయినా ఫరవాలేదు కానీ, నిన్న వేసుకున్నానే ఇంగ్లీషు దొరసానిలా బట్టలు, లాగూ, చొక్కా, అలా వేసుకోవడం, స్టయిల్ గా తయారవడం నేర్పు చాలు!" అన్నాడు.
తిలక ఆశ్చర్యంగా చూసింది. అంతకు ముందురోజే ప్రకాశం శాంతకిచ్చి లంగా ఓణీ పంపిస్తూ, 'ఇక్కడున్నన్ని రోజులూ ఆ మగరాయుడి వేషం మాని, ఒంటినిండా బట్టలు వేసుకో!"మని చెప్పి పంపించాడు.
"ఏం మాట్లాడవు?" అన్నాడాయన.
"ఆఁ... అలాగే..." అంది తడబడుతూ తిలక.
"ఇంగ్లీషులో చెప్పు" అన్నాడు.
"ఓకే, సార్! ష్యూర్!" అంది.
"ఆయన తృప్తిగా చూసి, అద్గదీ!" అన్నాడు.
గణపతి చిన్నగా నవ్వాడు.
"నీకేం పనిరా ఇక్కడ? లోపలికి నడు" గదిమాడు సుబ్బారాయుడు.
గణపతి గబగబా లోపలికి నడిచాడు.
తిలక కదలబోయింది.
"నువ్వెక్కడికి? ఆగు" అన్నాడు.
ఆమె భయంగా ఆగిపోయింది.
"నువ్వు చాలా బాగున్నావు" అన్నాడు.
తిలక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది.
"ఆ మాటని ఇంగ్లీషులో చెప్పు" అన్నాడు.
"ఆడవాళ్ళనా, మగవాళ్ళనా?" అడిగింది.
"నన్ను" అన్నాడు.
ఆమె కొద్దిగా నవ్వి "యూ ఆర్ మోస్ట్ హేండ్ సమ్" అంది.
"నువ్వంటే నాకిష్టం!" అన్నాడు.
ఆమె తెల్లబోయి, "ఐ లవ్ యు!" అంది.
"నిన్ను నేను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు.
"ఛీ!" అంది.
ఆయన గట్టిగా "ఏమిటీ, నిన్ను అన్నాననుకుంటున్నావా? చింతకాయ మొహం నువ్వూనూ! ఆ మాట ఇంగ్లీషులో చెప్పు" అన్నాడు.
"ఐ విల్ మ్యారీ యూ" అంది చిన్నబుచ్చుకుని.
"నిజమా?" అన్నాడు నవ్వుతూ.
తిలక కంగారుపడింది.
పార్వతమ్మ లోపల్నుండి రాగానే, "ఇదిగో, ఈ బస్తీపిల్ల నేను బావున్నాననీ, నన్ను పెళ్ళాడతాననీ అంటోంది చూడు" అన్నాడు.
ఆవిడ మామూలుగానే "మంచిదేగా! షష్టిపూర్తితో బాటు చేసుకోవచ్చు" అంది.
"అంటే నీకేం లెక్కలేదన్నమాట" అన్నాడు.
"ఒక్క పెళ్ళేమిటీ, ఏటా శ్రీరామనవమికి జరిపినట్లు ప్రతి ఏడూ చేసుకున్నా నాకేం బాధలేదు!" అంది.
సుబ్బారాయుడు పెద్దగా ఫెళఫెళమని నవ్వి.
"మూలపుటమ్మలా నువ్వుండగా నాకు ఉత్సవ విగ్రహాలెందుకే!" అన్నాడు.
తిలక నెమ్మదిగా అక్కడనుండి జారుకోబోయింది.
"ఇదిగో.... నీ పేరేమిటో?" అన్నాడు.
"తిలక" అంది.
"చిలకలాంటి పిల్లకి చక్కగా అతికే పేరు. నువ్వెళ్ళి మా అమ్మాయికి ఇందాక నాకు చెప్పిన మూడు ముక్కలూ అనడం నేర్పించు, రేపు అమెరికా పెళ్ళికొడుకుతో అనాలి" అన్నాడు.
"అలాగేనండీ!" అనేసి, గబగబా వెళ్ళిపోయింది తిలక.
పార్వతమ్మ చిన్నబోయిన ముఖం చూసి,
"అమెరికా అల్లుడొస్తుంటే యెందుకా ఆముదం మొహం?" అన్నాడు.
"అమ్మాయ్ మాధవ్ ని యిష్టపడిందండీ" ధైర్యం చేసి అనేసింది.
"నాకేది ఇష్టమో, నా కూతురికీ అదే యిష్టం కానీ, నువ్వు నోర్ముయ్యి!" కసిరి విసవిసా లేచి వెళ్ళిపోయాడు అప్పటిదాకా శాంతంగా ఉన్న సుబ్బారాయుడు.
* * *
రచ్చబండ దగ్గర రావిచెట్టు ఆకు కదల్చడానికి కూడా జంకినట్లు నిశ్శబ్దంగా వుంది.
వూళ్ళో వున్న పెద్దలంతా గుండ్రంగా కూర్చుని ఆలోచిస్తున్నారు.
చాకలి రంగడు కోపంగా అరుస్తున్నాడు.
"నా కూతురు అభం శుభం తెలీని అమాయకురాలు. ఈ వీరిగాడు దాన్ని మాయమాటలు చెప్పి నమ్మించి తన గుడిసెలో రాత్రల్లా ఉంచుకుని తెల్లారి పంపించాడు. ఈ సంగతి వూరంతా పొక్కిపోయింది. ఇప్పుడు దాన్ని వాడు గాక ఇంకెవడు పెళ్ళిచేసుకుంటాడు? మీరే చెప్పండి సామీ!"
వీరిగాడు కూడా ఆవేశంగా "అంతా అబద్దం అదెందుకొచ్చిందో నాకు తెలియదు. తెల్లారి నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి రావడం తప్పయిపోయింది! వీడి పిచ్చికూతుర్ని నాకు అంటగట్టాలని చూస్తున్నాడు" అరిచాడు.
గంగరాజు కరణంగారితో "రంగయ్య కూతురికి పిచ్చని వీడంటున్నాడు. నిజమేనా? అన్నాడు.
రంగయ్య తల బాదుకుని ఏడుస్తూ, "పిచ్చీ కాదు, ఏమీకాదు బాబూ! కాస్తంత అమాయకురాలు, నెమ్మదిగా ఉంటుంది అంతే వాడిని దాన్ని పెళ్ళిచేసుకోమని చెప్పండి బాబూ" అన్నాడు.
"కావాలంటే తప్పు కడతాను. ఎంత డబ్బు కట్టాలో చెప్పండి. అంతే కానీ పెళ్ళి చేసుకోను" అన్నాడు వీరిగాడు.
పెద్దలంతా వాళ్ళల్లో వాళ్ళు తర్జనభర్జనలు పడసాగారు.
చుట్టూ మూగి వినోదం చూస్తున్న గుంపులో తిలకా, రాధ కూడా ఉన్నారు.
రాధ రంగడి కూతురివేపు చూసింది.
ఆ అమ్మాయి వెర్రి చూపులు చూస్తోంది. జరుగుతున్నది తన గురించేనని కూడా ఆ అమ్మాయికి తెలిసినట్లు లేదు. రాధ హృదయం జాలితో నిండిపోయింది.
"పోనీ, తప్పు కట్టెయ్యమందామా? ఓ రెండెకరాలు పిల్ల పేరిట రాస్తే సరీ!" అన్నాడు కరణంగారు.
ఆ మాటకి రంగయ్య భోరుమన్నాడు.
"వీల్లేదు!" అన్న గంభీరమైన కంఠస్వరానికి అందరూ అదిరిపడి చూశారు.
సుబ్బారాయుడు కోపంగా వీరిగాడితో "ఏరా? ఆ పిల్లని రాత్రల్లా ఇంట్లో పెట్టుకున్నాక దాని బతుకు ఏం కావాలి? నీ ఎకరాలకి ఆశపడి ఇంకోడు తాళి కడతాడా? నోర్మూసుకుని చచ్చినట్లు దాని మెడలో తాళికట్టు అదే న్యాయం!" అన్నాడు.