పడక్కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అర్ధంలేని వాగుడు అని తీసి వేయలేక పోయినా అనర్ధదాయకమైన ధోరణిలో ఏం జవాబు చెప్పినా ఈ ఆటంబాబు మరింత ప్రేలుతుందని మౌనాదేవి శరణు జొచ్చాడు.
నిరసనగా అంది. "వాగి వాగి నేను చావవలసిందే కానీ, మీనుండి జవాబు వస్తుందని నాకు నమ్మకంలేదు లెండి_"
ఒక వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకుని తనకు అన్యాయం చేస్తున్నాడని నిందించే వాళ్ళశృతి చివరికి రాగాన పడటం సహజం.
"దొంగతనం చేస్తూ దొరికినవారిని అడిగితే దొంగతనం చేయలేదని అనలేరు. చేశానని ఒప్పుకోనూ లేడు. అడిగి ప్రయోజనం శూన్యం అయినా స్త్రీ హృదయం నిలువలేదు. "బావా మనసులోని దుఃఖాన్ని, కోపాన్ని బయటికి పంపందే శాంతించదిది! ఎన్నాళ్ళనుంచో మధురమయిన బంధాన్ని ఊహించుకుని ఊహించుకుని మీచెంత చేరిన క్షణాల్ని పదిలంగా మనసులో పొదుపుకొని కాపురాన్ని కళకళ లాడేట్టు చేసుకోవాలనుకున్న నాకు మీరు ప్రసాదించే వరం యిదేనా బావా!"
ఆమె అన్న చివరిమాట మనసుని నిలువునా కోసివేసినా ఏమీ జవాబు చెప్పకుండా మౌనాదేవిని మరింత బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఇక నిలువలేక అతని పాదాల దగ్గరగా వచ్చి కూర్చొని బూట్లు విప్పుతూ అంది.
"నేనంటే మీకింత యిష్టంలేదని నాకు మన పెళ్ళికి ముందు తెలియదు బావా. మా నాన్న మీరు నేనంటే ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పిన రోజున బావా మరదళ్ళ బాంధవ్యాన్ని శాశ్వితం చేయటానికి స్థిరపడుతున్నారని శాశ్వితం చేయిబడుతుందని సంతోషించానేకానీ మీ మనసుకు కళ్ళెం లాగా తయారవుతానని కలలో కూడా అనుకోలేదు బావా! స్వప్నంలో అయినా చూచాయిగా తెలిసుంటే మీ నీడలకైనా వచ్చేదాన్ని కాదు.
అక్షతారోపణ చేసిన క్షణంలో మన దాంపత్య జీవితం అలాగే గుబాళిస్తుందని అనుకున్నాను కానీ ఇలా నిర్గంధకుసుమంలా అవుతుందని అనుకోలేదు. తలంబ్రాలు పోస్తున్నప్పుడు మీ మనసును మల్లెలుగా మార్చి నన్ను అలరిస్తున్నారని అనుకున్నాను. కానీ చిల్లిపోయిన మీ మనసుతో చల్లుతున్నారని అనుకోలేదు, సప్తపది తిరిగేటప్పుడు అది సఖ్యానికి నాంది అవుతుందనుకున్నాను. కానీ ఆ సప్తపది మేరకే మనసఖ్యం ఆగుతుందని అనుకోలేదు."
కొందరు మనసు చాలా చురుకుగా వుంటుంది. ఆలోచనలు అతి సుకుమారంగా సున్నితంగా వుంటవి. ఊహాలోకాల్లో స్వరవీధుల్లో సంచరిస్తూ వుంటారా భావుకులు. కాని మాయారహితమయిన ఈ ప్రపంచంలో భావనకి తావులేదు. అవి వాస్తవిక ప్రపంచంలో ఆ వూహలు చెల్లవని. వాటిని ఆధారంగా చేసుకుని నిర్మించుకున్న పేకమేడలు కూలిపోతాయని వాళ్ళకి తెలీదు. అందుకే మానవుడు బోల్తా కొడుతున్నాడు. అయినా మనసు మారడంలేదు.
సాక్స్ విప్పిన పాదాలపై కన్నీరు జారేసరికి ఉలిక్కిపడ్డాడు. కనులు తెరిచి చూశాడు. ఎర్రబడిన కనులతో జారుతున్న కన్నీటితో గందరించిన ముఖంతో.
అతని మనసు సదా ఆమెవేపు ప్రవహిస్తూనే వుంటుంది. సదా ఆర్ద్రమైన అతని చిత్తంలో ఆమె నాటిన వలపు విత్తనం మొలకెత్తిందే గానీ పెరగలేదు. ఇద్దరూ భావుకులు ప్రేమజీవులు. గానీ వాళ్ళిద్దర్నీ ఒకర్ని చేసినా వాగ్దేవి వాళ్ళిద్దరి మనోగతాన్ని సరిగా వెళ్ళడించలేకపోతుంది. పుష్కలంగా జారుతున్న నీరు పంటచేలకి ప్రక్కగా పారుతూ వ్యర్ధమయినట్లుగా వాళ్ళ ప్రేమలు ప్రవహిస్తున్నాయి.
"ఎందుకిలా చేస్తున్నావ్ సావిత్రీ! నా మనసు అలా అని అన్నానా. నన్ను అర్ధం చేసుకోకుంటే మానె అపార్ధం చేసుకోవద్దు. నీవనుకొన్న భావన నీ మనసులో లేనేలేదు. వూహించుకున్న మాటలన్నీ అనాలోచితంగా వదలి నన్నెందుకు బాధిస్తావు__నీవు బాధపడుతూ నేను బాధపడుతూ__ఇలా ఎన్నాళ్ళూ! ఇదేం బావుండలేదు సావిత్రీ! మనం ఒకరి హృదయాలు మరొకరు చదవటం నేర్చుకోవాలి__"
ప్రశాంత స్వరంతో అతను చెబుతున్నా ఆమెకి స్వాంతన చిక్కటం లేదు.
"నాకు తెలుసుబావా! మీ మనసు ఎప్పుడూ మీ విరజ వెంటే వుంటుంది. అన్యధాలోచనలు మీకు రానే రావు. నర్శింగ్ హోంలోవున్నా యింటిలో వున్నా. అనుక్షణం మీ ఆలోచనలన్నీ ఆమే ఆక్రమించుకుంటుంది. చివరికి పడకమీదకూడా మీ ఆలోచనలు ఆమె మీదే పోతూ వుంటాయి. ఏం చేయను బావా!
భగవంతుడు నాకు చావునైనా ప్రసాదించకుండా వున్నాడు. మీ నుండి వేరైపోయి మీ కోసం మీ సుఖం కోసం మరణించడమే మేలు బావా! కనీసం నా చావుతోనైనా మీకు సుఖం దక్కితే అంతకంటే నేను కోరుకునేది ఏమీలేదు బావా!
ఉన్న దానిలో ఉప్పెన అన్నట్లుగా పైగా నీకీ దర్పం ఒకటి. యెందుకో? నేనే కాదనుకుంటే నా సంతానం కూడా మిమ్మల్ని యెంత బాధిస్తుందో బావా! అయినా నాకీ కాన్పులో సుఖంగా బయటపడతానని నమ్మకం లేదు. నాది బలహీనమయిన శరీరం ముందుననే. ఇక ఇప్పుడు మనసు కూడా బలహీనమై పోయింది! నాకు తెలుసు బావా. ఇంకెక్కువ రోజులు బ్రతుకను.
అతి సున్నితంగా ఆమె నోరు మూసి అన్నాడు. "చావు నీవు కోరుకున్నంత సులభంగా యెప్పుడూ లభ్యంకాదు సావిత్రీ! పిచ్చి ఆలోచనలు మానుకో దయచేసి. నిండు గర్భవతివి. ప్రశాంతమయిన చిత్తముతో వుంటేనే మనకు పండంటి పాపాయి పుడతాడు. యెందుకలా నీ మనసుకి తోస్తున్నదో కానీ నీవంటే నాకు ఎంత ప్రేమ సావిత్రీ! కానీ అది వెల్లడిచేసే సంఘటనలు కానీ మాటలు కానీ__రావు రాలేవు__"
అతని చేతిని ప్రక్కకి తొలగించి టైవిప్పి కోటు విప్పబోతూ అంది.
"ఓదార్చటానికి కూడా మీరు మాటను వెదుక్కుంటున్నారా బావా. పండంటి పాపాయి పండంటి సంసారం__ ఇవన్నీ ఎవరికోలే బావాదక్కేది. ఏ జన్మలో నేను ఏ సంసారాన్ని విచ్చిన్నం చేశానో ఆ శాపం నన్నిలా వెంటాడుతోంది. నేనేం చేస్తాను బావా! యీ జన్మలా తెలిసీ ఎవరికీ అన్యాయం కానీ అపరాధం కానీ చేయలేదు. ఏ జన్మలో తెలిసో తెలియకో చేసిన దానికి నన్నిలా శిక్షించడం అన్యాయం బావా! భగవంతుడు__సమవర్తి__నన్ను యిలా అన్యాయంగా లేని తప్పుకి శిక్షించడం చూస్తే ఆయనలో కూడా న్యాయాన్యాయాలు సమపాళ్ళలోనే ఉన్నా ఏమోననిపిస్తుంది.
కోటు స్టాండుకు తగిలించి వచ్చి అంది. "ఇది నా బ్రతుకులాగే చల్లగా వుంది బావా? మళ్ళీ వేడిచేసుకుని వస్తాను...."
"బాదంపాలని చల్లగా త్రాగినా బావుంటాయిలే సావిత్రీ. మళ్ళీ యిప్పుడేల చేస్తావులే...." అందుకుని గటగటా తాగేశాడు.
అతనివేపు దయనీయంగా అంది.
"బావా! దయచేసి ఒక కోరిక.... చాటుచాటున పక్కిళ్ళవాళ్ళు, పనిమనుషులు అనుకునే మాటలు సహించలేను బావా! పవిత్రమూర్తి అయిన నా బావ నాకు తెలుసు కానీ లోకానికేం తెలుసు! మీ నడతనే శంకిస్తున్నారు, బావా! దయచేసి ఇక ఆమెని మనింటికి రావద్దని చెప్పండి. అంతగా మీరు చెప్పకపోతే నేను చెబుతాను బావా! సున్నితంగానే చెబుతాను మరీ అంత అనాగరీకురాల్నేమీ కాదులే!"
పిడుగు పాటుగా ఆమె అలా అనటంతో నిర్విణ్నుడై అన్నాడు. "ఏమంటున్నావు సావిత్రీ.... నా.... నా.... నడతనే శంకిస్తున్నావా"
సంతతధారగా ప్రవహిస్తున్న కన్నీటిలో అతని మూర్తి మసక మసకగా కనిపిస్తోంది. తప్పు చేయకున్నా తన బావలోకం దృష్టిలో_దృష్టి చెడిన లోకం దృష్టిలో దోషిగా కనిపిస్తున్నాడు. తప్పెవరిది! సంఘానిదా? సంఘం చూచినా దృష్టిదా? బావదా?
"నేను కాదు బావా! లోకం అంటోంది. కాకుకకంటే అధములైన మనుషులున్నప్పుడు సహించి వుండాలి లేదా? వేరే చోటుకి వెళ్ళిపోవాలి. రెండూ చేతగానివాడు దాన్ని ఖండించివేయాలి. విరజ ఇక ఇక్కడికి రావటం అంతమంచిది కాదు బావా!"
ఏమీ జవాబు చెప్పలేక నిర్వికారంగా నిలబడ్డాడు. "మీరు చెప్పాలి. అయినా చెప్పలేరు. నేను చెబుతాను ఆమె ముఖంమీదే! కానీ నా బావ పరువుపోవటం నేను చూస్తూ వుండలేను. వూరుకోలేను."
దుఃఖానికి అంతెక్కడ? తవ్వుకుని కుళ్ళుకుని కుళ్ళుకుని ఏడిచేవారికి ఆవంత దుఃఖమైనా అది మేరువంతంగా బాధిస్తుంది.
"నన్ను మన్నించు బావా! నీ మనసుకి కష్టం కలిగిస్తున్నాను. సుఖానివ్వలేకపోయినా కష్టం యివ్వకూడదు. కానీ పాపిష్టిదాన్ని. మీకెప్పుడూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. ఏనాడు ఎందుకు పాపం చేశానోగాని ఈనాడు యింతగా శిక్షను అనుభవిస్తున్నాను.... భగవంతుడా__"
చప్పున అతని కాళ్ళమీద పడిపోయి ఏడవసాగింది. మెల్లగా ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకుంటూ అన్నాడు.
"నీవు చేస్తున్నదాంట్లో తప్పేంలేదు సావిత్రీ! నీ యిష్టం వచ్చినట్లే చెయ్."
ఆ మాటలను అతను ఎలా పలికాడో అప్పుడు అతని మనోభావన ఎలా వుందో నేను చెప్పలేకుండా వున్నాను, శక్తి చాలడంలేదు.