29
"రంగా!" తన చేతిలో అతన్ని నడిపించుకుంటు తోటలోకి ప్రవేశిస్తూ పిలిచింది.
"అక్కా! ఏమైందక్కా? అలా పిలుస్తున్నావ్?"
"మీ అక్కని మరచిపోగలవా రంగా!"
"చిత్రహింసకు గురిచేసే మాటలు ఎందుకు విసురుతావు? నీకంతగా యిష్టంలేకపోతే చూపులు పోగొట్టుకుని బాధపడుతున్న నన్ను ప్రాణాలు పోగొట్టుకునేట్టు చేయి__" దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్వటం సాగించాడు కరిగిపోతున్న హృదయాన్ని కట్టివేసుకుంటూ అంది.
"నా ప్రాణాన్ని నేను తీసుకోలేక పోతున్నాను. మరొకరు ప్రాణం తీసే శక్తి నాకులేదు రంగా, అయినా ఎవర్నని నేను సంవత్సరం పరిచయంతోనే నన్నిలా పెనవేసుకుని పోవటం ఏమీలేదు. మీ బావ స్నేహితురాలిగా మీ ఇంట్లో ప్రవేశించిన నన్ను మీ అక్కకంటే మిన్నగా చూసుకుని, యిప్పుడు నేనుదూరం అవబోతున్నానని నన్ను నిందిస్తే నేనేం చెప్పగలను?"
విభ్రాంతుడౌతూ అన్నాడు. "విరజక్కా, నన్నేనా, నీవేనా ఇలా మాట్లాడుతున్నది? నీవు నీవు కాదక్కా నీలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. లేకపోతే యిలా మాట్లాడే హృదయం కాదునీది. చెప్పక్కా__ ఏ దుష్టశక్తి పూనింది నిన్ను...."
"మెల్లగా మాట్లాడు బాబూ! నన్నే దుష్టశక్తీ పూనలేదు. ఆ దుష్టత్వమంతా నా పుట్టుకలోనే వుంది. ఎవర్నీ ఏమీ ఎందుకూ నిందించనవసరంలేదు. నా హృదయం ఏమిటో నీకెలా తెలుసు బాబూ! నా పుట్టుకలోనే దుఃఖాన్ని కష్టాన్ని నా భారంగా తెచ్చుకున్నాను. ఎవ్వరికయినా నేను పంచి ఇవ్వగలిగేది ఇక అదేకదా! అయినా నన్నేదో ఎరిగినట్లు మాట్లాడుతున్నావ్! అసలు ఆడదాని మనసు తెలుసుకున్నది ఎవరు బాబూ!"
అభిమానాన్ని సూచించే దృడమైన స్వరంతో అన్నాడు.... "ఎందుకు కనుక్కోలేనక్కా! బాగా కనుక్కున్నాను. మీ అవసరాలతో వస్తారు, తీరేక వెళ్ళిపోతూ బంధిస్తారు. ఏడ్వకుండా ఏడ్పిస్తారు. మనసంటూ ఏమేమో మాటాడుతారు. అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి? నేనెవర్నని నన్నెందుకు పలుకరించావు? కళ్ళుపోయి ప్రపంచమంతా అంధకారమై భవిష్యత్తు శూన్యమై కుళ్ళుకుంటున్న నన్ను ఎందుకు ఓదార్చావు? నాలో అకారణంగా పొంగిన కవితాశక్తిని రూపకల్పన చేయడానికి ఎందుకు సహాయపడ్డావు? అర్ధాంతరంగా అలా ఇప్పుడిలా నా బ్రతుకు అధ్వాన్నం చేసి ఎందుకు వెడుతున్నావు, చెప్పక్కా చెప్పు?"
అతనంటున్న ఒక్కొక్క మాట అభిమానమనే విషంలో ముంచి ప్రీతీ అనే వాడిలో మొనదేలిన దుఃఖం టస్త్రాలుగా ఆమె హృదయంలో ఇక స్థలంలేదు అన్నట్లుగా రంధ్రాలు చేశాయి. అప్రయత్నంగా ఒలకబోతున్న కన్నీటిని ఆపుకుని నిగ్ధదీసుకుంటున్నట్టుగా అంది.
"అంతా విధి రంగా! విధి బండిచక్రంలోని ఆకుల్లా పైకీ క్రిందికీ తిరుగుతూ వీలయినపుడల్లా మనుషులు తిరగాలని కాలచక్రమే శాసిస్తోంది. నేనూకాదు నీవు కాదు. అందరూ అంతే! విధి కలిపితే కలిసి విడదీస్తే విడిపోవాలి. సుడిగుండాల్లో బ్రతుకుతూ కష్టాలు వచ్చి కాల ప్రవాహపు కెరటానికి ఎరగా మనిషిని పడవేస్తే అరవకుండా వెళ్ళాలి అంతే, మరేమీ చేయలేవు. అవును రంగా! కీలుబొమ్మల్లాగ తయారుకావలసిందేకాని మమత మమకారం అనేవి మరిచిపోవాలి. నన్ను నిందించినా పరవాలేదు రంగా! దుఃఖం నుంచి తేరుకుంటే చాలు. మనసుని సలభాళించుకో....ఎవరికెవరి__ఋణాలు బంధరూపేణా పశుపత్నీ సుతాలయా.
"ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయా...." ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా పలికి తన మనసులో చెలరేగుతున్న అశాంతిని తట్టుకోలేక అన్నాడు. "చాలా బాగా చెప్పావక్కా! ఋణం, అనుబంధం, పళువులు, పత్నీసుతులు, బంధువులు, మిత్రులు అంతా యింతే. ఎవరికెవరు? అవును నేను నీకేం అవుతాను? నీవు నాకేం అవుతావు? నిజమక్కా? ఎవరికెవరూ ఏమీ కారు. అసలు దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. అమ్మని చంపిన వెధవనని అన్నగారికి కోపం, మాతృవాత్సల్యానికి దూరం చేశానని అక్కకి కోపం, కానీ వాళ్ళు కొద్దిరోజులైనా అనుభవించిన ఆ అనురాగామృతధరలు అసలు నా చెంతకే రాలేదని వాటి వాసనలు కూడా నేనెరుగనని వాళ్ళు ఒక్కసారైనా ఆలోచించారా? అంతటి భావనాశక్తి వుంటే నన్నిలా ఎందుకు వేధిస్తారు? తన ప్రియమైన పత్నిని పోగొట్టుకొని కౌకిక వ్యవహారానికి దూరమై అసలు సంగతే పట్టించుకోక వ్యాపారసరళిగా పెంచే నాన్న, నా దురదృష్టాన్ని క్షణక్షణం గుర్తుకు తెచ్చే అక్క, నన్ను గుర్తించని అన్నగారు వారందరి మధ్య ఆశాజ్యోతిలా, ఆత్మజ్యోతిలా నాకు కనిపించినవాడు మా బావ. బావ నీడన బ్రతుకును పండించుకొంటున్న నన్ను మరోసారి గేళిచేసిన విధిని గేళి చేసే విరజక్కలాంటి దేవత నా ఆశాజ్యోతిని వెలుగుని ద్విగుణీకృతం చేసిన దేవత రావడంతో నష్టపోయినదానికన్నా సంపాదించుకున్నదే ఎక్కువని గర్వపడుతున్న నన్ను ఇలా అన్యాయం చేస్తావక్కా?"
ఒకరు అంధులు, మరొకరు మరోవిధంగా అంధులే! ఒకరు మరొకర్ని దారి చూపించమని అడుగుతున్నారు. ఎంత చిత్రం?
"నీ విషాదగాధ విని ద్రవించిపోతున్నాను రంగా! కానీ నేను అశక్తురాల్ని. స్త్రీని. నాకు స్వాతంత్ర్యంలేదు. నేను సంఘానికి లొంగిపోయేదాన్ని, మనసున మల్లెలమాలలూగుతున్న తరుణంలో త్రుంచి వేస్తున్న విధికి లొంగిపోతున్న గడ్డిపోచను. నేను ఏం చేయగలను రంగా? నన్ను మన్నించవా?"
ఆమె మాటలో స్పష్టంగా కనిపిస్తున్న అసహాతకి భయపడ్డాడు. అశక్తత తెప్పించిన ఆవేశం, కోపం అణిగిపోయాయి. ఆలోచనా పూర్వకంగా అన్నాడు.
"నిన్ను కాదక్కా క్షమించాల్సింది__నన్ను.... నన్ను క్షమించు. నీ మనసేమిటో తెలుసుకున్నానని గర్వపడి నా బాధ అంతా నీ మనసు తెలుసుకోలేక నీ తలపై రుద్దుతున్న నన్ను క్షమించు అక్కా! నీవు దేవతవి అన్న నోటితోనే నిన్ను దూషించిన నా నాలుకను నరికేయాలక్కా! విరజాదేవి మనస్సు తెలుసుకోలేని నా పాండిత్యం ఎందుకు? వెంకటేశ్వరుడిపై భక్తి గీతాలెందుకు? శ్రీనివాసుడిపై శతకం ఎందుకు తగలెయ్యనా? అన్నీ చింపేస్తాను. తగలపెడతాను. అప్పటికిగాని నా మనసు శాంతించదు. నాకు అన్ని విధాలా సహాయపడి నా కవిత్వాన్ని ఒక రూపానికి తెచ్చిన నిన్ను నిందించిన నేను మనిషిని కాదు రాక్షసుడిని."
వలవలా ఏడిచాడు. అతడిని దగ్గరికి తీసుకుని లాలనగా అంది. "లేదు బాబూ లేదు నీవు అసలైన మనిషిని ఆవేశంలో కోపం తెచ్చుకుని శాంతించి పశ్చాత్తాప పడేవాడు మనిషి. అవి లేనివాడు మనిషి. నీలో హృదయం ఉంది. దానికి రుచులూ వున్నాయి, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే, శరీరాలు దూరం కావచ్చు కానీ నిన్ను మరచిపోలేను, నన్ను మరచిపోవద్దని కోరటం అవివేకం బాబూ! నన్ను మరపు తెచ్చుకోలేవు. ఏనాడయినా మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే మాత్రం నీ దగ్గరికే వచ్చేస్తాను. నీ కవిత్వాన్ని ఆపకు. భగవానుడి స్తోత్రం చేసేందుకన్నా దానికి మించిన ఉపయోగంలేదు. నా టేపురికార్డర్ పంపుతాను. నీ గీతాలన్నీ రికార్డుచేసాను. ఇక రాయబోయేవన్నీ నీ స్వరంతోనే రికార్డు చేస్తాయి. కవి కంఠంలో కంటే మరే కంఠంలోనూ ఆ భావను దొరలదు"
"అబ్బ! నీవు దేవతవి కాదక్కా! అంతకంటే మరోమెట్టు పైనున్న దానివి. జలపాతంలా నీ గుండెల్లో నాపై ప్రవహించే ఈ అనురాగ స్రవంతిలో నేను తలమునకలవుతున్నాను. నా గుండె ఆగిపోతుందక్కా."
ఆమె పాదాల్ని ప్రేమగా నిమురుతూ అన్నాడు. "నాలో చలనం నిలిచిపోతుందక్కా ఊపిరి సలపటంలేదు. నాలో అణువణువునా నీ శక్తి తాండవిస్తుంది. నీపై ప్రేమతో నీ ప్రతి రక్తనాళమూ జ్వలిస్తోంది దహించుకు పోతుందక్కా. మళ్ళీ మళ్ళీ నేను చనిపోయేలోపుగా ఒక్కసారి కలువు అంతే చాలక్కా అంతేచాలు. నీ తీయనైన మాట ఒకసారి వింటే చాలు తర్వాతే నేను చచ్చిపోతాను. నీ మాట వినబడకుంటే మృత్యుదేవత కూడా నా దగ్గరికి రాలేదు, రానివ్వను. భగవానుడు నాపై కరుణ చూపుతూ కూడా దయలేకుండా ఉన్నాడీవిషయంలో ఒక్కసారి! ఒక్కసారి నిన్ను చూసే యోగ్యత కలిగిస్తేచాలు. తర్వాత చూపు పోయినా నాకు బాధలేదు. అది తీర్చలేడక్కా దేవుడు.
"తప్పకుండా తీర్చుతాడు రంగా" ఒక్క సెకనుపాటు ఆగి అంది "తప్పకుండా నా శరీరంపై నాకు అధికారం ఉన్నంతవరకూ పరిస్థితులనుకూలించితే తప్పకుండా నిన్ను చూసే నేను చనిపోతాను. నా జీవనజ్యోతి అనంతజ్యోతిలో మిళితం కాకముందు నాకు తప్పకుండా నా మనస్సు ఈ విషయం గుర్తుకు తెస్తుంది. భగవానుడు కరుణాళువుగా తప్పక నీవద్దకు వస్తాడు నన్ను నమ్ము రంగా ఆ టేపు రికార్డరు రేపే పంపుతాను."
కసాయి వాడివద్దకు తన ప్రియాతి ప్రియమైన లేగదూడని వదలిపోతున్న గోమాతలా వెళ్ళిందతన్ని వదలి.
30
"మురళీ"
ద్వారంవద్దనే హఠాత్తుగా యెదురువెళ్ళి కౌగలించుకుని గదిలోకి పిలుచుకునివచ్చి అన్నాడు "యం.యల్.ఏ. గ ఎన్నికయ్యావట కదా?"
చేతిలోని బాక్స్ ప్రక్కనపెట్టి స్వీట్ పాకెట్ చించి ఓ స్వీటుతీసి వేణు నోటిలో బలవంతంగా కుక్కుతూ అన్నాడు.