Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 3


    పట్టలేని ఆగ్రహంతో శశికాంత్ కాలర్ పట్టుకుని గబగబ నాలుగుసార్లు ఉపీ వదిలేశాడు వాడియా. ఖోస్లా వైపు తిరిగి "ఖోస్లా!" అని గావుకేక పెట్టాడు. "ఖోస్లా! లాయర్ షెనాయ్ కి ఫోన్ చెయ్! లెటజ్ సీ హౌ బెస్ట్ వుయ్ కెన్ డీల్ విత్ ద సిట్యుయేషన్! సాధ్యమైనంతవరకూ మన సొమ్ము మనం రాబట్టుకోవాలి వీడి దగ్గరనుంచి! లాయర్ ని వెంటనే రమ్మను!" అన్నాడు.

 

    గబగబ ఫోన్ దగ్గరికి నడిచాడు ఖోస్లా. శశికాంత్ ఇంటినుంచే అతని ఫోన్ ద్వారానే లాయర్ తో మాట్లాడాడు.

 

    "లాయర్ షెనాయ్ గారా? ఖోస్లా హియర్! ఒక షాకింగ్ న్యూస్ లాయర్ సాబ్! అన్నాడు గాభరాగా.

 

    "షాకింగ్ న్యూసా? ఏమిటి చెప్పండి!"

 

    "శశికాంత్ ఐ.పీ. పెడుతున్నాడు?"

 

    "వాట్?" అన్నాడు షెనాయ్ అపనమ్మకంగా.

 

    మళ్ళీ చెప్పాడు ఖోస్లా.

 

    "మైగాడ్! మీ డబ్బు ఎంత ఇరుక్కుపోయింది అతని దగ్గర?" అన్నాడు షెనాయ్.

 

    "నాది పదకొండు లక్షలు! వాడియాది పాతిక లక్షల పైనే!"

 

    విసురుగా ఖోస్లా చేతిలోంచి రిసీవర్ లాక్కున్నాడు వాడియా.

 

    "షెనాయ్! నేను మునిగిపోయాను. పాతిక లక్షలు పోగొట్టుకున్నాను షెనాయ్!"

 

    "ఎగ్జయిట్ కాకు వాడియా!" అని చెప్పాడు లాయర్ షానాయ్ "అవేశాపడితే మనకు ఒరిగేదేం లేదు. ఇలాంటప్పుడే నిగ్రహం, నిదానం, అవసరం. నేను చెప్పేది విను" అన్నాడు అనునయంగా.

 

    అతి కష్టం మీద తనని తాను అదుపులో పెట్టుకున్నాడు వాడియా. అతని మొహం మీద నుంచి ధారలుగా కారుతోంది చెమట.

 

    ఖోస్లా , వాడియా ఇద్దరూ కలిసి ఏం చెయ్యాలో చెప్పడం మొదలెట్టాడు లాయర్ షెనాయ్. అతను చెప్పినదంతా విని నిస్తేజంగా ఫోన్ పెట్టేశాడు వాడియా. బిజినెస్ డీలింగ్స్ లో అతను జీనియస్. ఈ లాయరు  షెనాయ్ చెప్పినట్లు చేస్తే ఈ శశికాంత్ ని మరింత ఇరుకులో పెడేయ్యగలడు తను.

 

    కానీ తన డబ్బు మాత్రం తనకి తిరిగి రాదు. దటీజ్ ష్యూర్!

 

    లాయరు షెనాయ్ చెప్పిన పద్దతి వాళ్ళ కోర్టు లిటిగేషన్ పెరుగుతుంది అంతే! అంతకుమించి లాభం లేదు.

 

    "ఖోస్లా! రా!" అన్నాడు వాడియా.

 

    ఇద్దరూ గబగబా బయటికి వెళ్ళిపోయారు. కొద్ది క్షణాల తరువాత ఒక సరికొత్త నిస్సాన్ కారు, ఒక హోండా కారూ లాయర్ ఇంటివైపు దూసుకుపోయాయి.

 

    వాళ్ళ వెనకనే హడావుడిగా మరికొంతమంది పరిగెట్టారు. చాలా కార్లు ఒకదాని వెంట ఒకటిగా స్టార్ట్ అయి అక్కడినుంచి వెళ్ళిపోయాయి.

 

    హల్లో ఉన్న కొంతమంది అసహనంగా ఫోన్ చుట్టూ మూగారు. ఎవరి తొందర వాళ్ళది. లాయర్ కి ఫోన్ చేయాలా? పోలీసులకి రిపోర్ట్ ఇవ్వాలా? శశికాంత్ కి తాము కొత్తగా ఇచ్చిన చేక్కులు అనర్ చెయ్యొద్దని బ్యాంక్ మేనేజర్ ల ఇళ్ళకు ఫోన్ చేసి అర్జెంట్ మెసేజెస్ అందించాలా?

 

    ఏం చెయ్యాలి?

 

    ఏం చెయ్యకూడదు?

 

    ఏది ముందు? ఏది వెనక?

 

     ఫోన్ కాల్స్ చేశారు కొందరు. తమలో తాము సంప్రదింపులు జరుపుకున్నారు. కొందరు. మరి కొంతమంది శశికాంత్ ని దుర్భాషలాడారు.

 

    తరువాత గుంపులు గుంపులుగా వెళ్ళి పోయారు అందరూ.

 

                                                                


    అప్పుడు నెమ్మదిగా హలంతా కలియజుశాడు శశికాంత్.

 

    తను కాక ఇంకా ముగ్గురే మిగిలారు. అక్కడ.

 

    ఒక స్తంభాన్ని అనుకుని తన కజిన్ కార్తిక్ నిలబడి ఉన్నాడు. అతను తనకి పర్సనల్ అసిస్టెంట్ కూడా. తన వ్యవహారాలు సగం అతనే చూస్తాడు.

 

    అతనికి కొంచెం దూరంలో ఉజ్వల నిలబడి ఉంది.

 

    ఉజ్వల! రెండు మాస్టర్స్ డిగ్రీస్, రెండు పిహెచ్. డిలు , మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ దిప్లామాస్ ఉన్న డాక్టర్ (మిస్) ఉజ్వల. ఆమె మొహంలో చిరునవ్వు తప్ప మరే భావమూ గోచరించడం లేదు.

 

    ఇకపోతే తనకి సమీపంలోనే నిలబడి ఉంది తన ఫియాన్సి సౌమ్య.

 

    మెల్లిగా పెదిమలు తడి చేసుకున్నాడు కార్తిక్.

 

    "శశి! నువ్వు నాతో కూడా చెప్పలేదు. ఐ.పి పెడుతున్నావని" అన్నాడు దెబ్బతిన్నట్లు శశికాంత్ వైపు చూస్తూ.

 

    "దటీజ్ ట్రూ ఓల్డ్ బాయ్!:" అన్నాడు శశికాంత్ నిర్లిప్తంగా. "ఈ పరిస్థితి రాకుండా చెయ్యాలని చివరి క్షణం దాకా ప్రయత్నించాను నేను. ఈ అన్ ప్లెజెంట్ నెస్ ని చివరిదాకా వాయిదా వెయ్యాలని చూశాను. ఇప్పుడింకా తప్పలేదు. చెప్పేశాను."

 

    
    పెదిమలు కదలకుండానే అస్పష్టంగా ఏదో గొణిగాడు కార్తిక్.

 

    "ఏమిటి?" అన్నాడు శశికాంత్.

 

    "ఏం లేదు!" అని అపుడే గుర్తు వచ్చినట్లు అన్నాడు కార్తిక్. శశి! ఈ పార్టీకి బిల్లు వచ్చింది హొటల్ నుంచి."

 

    "ఎంత?"

 Previous Page Next Page