నవ్వాడు ఖోస్లా. ఆ అమ్మాయి చదివింది తొమ్మిదో క్లాసో, పదో క్లాసో! అంతే అన్నాడు పరమ రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి.
అది విని నివ్వెర పోయాడు వాడియా.
సరిగ్గా అదే సమయంలో అన్నాడు శశికాంత్.
"లేడిస్ అండ్ జంటిల్మన్!"
వెంటనే అందరి తలలూ అతని వైపుకి తిరిగాయి.
"లేడిస్ అండ్ జెంటిల్మన్!" అన్నాడతను అందరికి వినబడేలా గొంతు కొంచెం పెద్దది చేస్తూ. అతని పెదిమల మీద చిరునవ్వు మెరుస్తోంది. అతను నిలబడి వున్న తీరులో చాలా ఆత్మవిశ్వాసం కనబడుతోంది.
"ఫ్రెండ్స్!" అన్నాడు శశికాంత్, తన చేతిని అలవోకగా సౌమ్య భుజం మీద వేస్తూ.
"ఇంతకు ముందు నేను ఎన్నో పార్టీలు ఇచ్చాను. కొన్నిసార్లు తగిన కారణం ఉండి, కొన్నిసార్లు ఏ కారణమూ లేకపోయినా ఏదో ఒక సాకు కల్పించుకుని కూడా!
మీరంతా నామీద ఉన్న అభిమానంతో నా పార్టీలన్నిటికీ హాజరవుతూనే వున్నారు. థాంక్స్! థాంక్స్ ఎ లాట్.
కానీ, ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇస్తోంది మామూలు పార్టి కాదు. దిసీజ్ వెరి స్పెషల్! వెరి వెరి స్పెషల్!
అతను అలా అనగానే అందరూ చాలా ఆసక్తిగా చూశారు అతని వైపు.
"ఇవాళ నేను ఈ పార్టీ ఇవ్వడానికి రెండు కారణాలున్నాయి" అన్నాడు శశికాంత్.
"ఒకటి నేను ఈ అమ్మాయి సౌమ్యని పెళ్ళి చేసుకోబోతున్నాను. గంట క్రితమే మా ఎంగేజ్ మెంట్ జరిగింది."
"వెంటనే హాలు మారు మోగేలా చప్పట్లు వినబడ్డాయి.
"ఇక పొతే రెండవ కారణం ఏమిటంటే , ఫ్రెండ్స్! నేను బిజినెస్ లో దివాలా ఎత్తాను.
ఇది నేను ఇచ్చే ఆఖరి పార్టీ!
రేపటి నుంచి నేను బికారిగా రోడ్ల మీద ఉండబోతున్నాను" అన్నాడు శశికాంత్ చాలా మాములుగా.
ఆ మాటలు చెవిన పడగానే అక్కడున్న అందరూ దిగ్బ్రమచెందారు. వులిక్కిపడి అతని వైపు చూసింది సౌమ్య.
ఆ హల్లో ఎవరిదో గుండె జారి కిందపడి భళ్ళున పగిలిపోయినట్లు శబ్దం వినబడింది.
చటుక్కున అందరూ అటువైపు చూశారు.
నిలువెల్లా వణికిపోతున్న వాడియా కనబడ్డాడు వాళ్ళకి. కంపిస్తున్న అతని చేతులు షాంపేన్ గ్లాసుని వదిలేశాయి. అది కిందపడి ముక్కలు చెక్కలయిపోయింది.
"నో! దిసీజ్ నాట్ పాసిబుల్! అన్నాడు వాడియా. శశికాంత్ వైపు తిరిగి "శశికాంత్ అబద్దాలు చెబుతున్నావు నువ్వు! యూ ఆర్ జొకింగ్! నువ్వు దివాలా తియ్యడం అది అంతా ఉత్త హంబక్. అవునా, నిజం చెప్పు!" అన్నాడు ప్రాదేయపుర్వకంగా.
"ఐయామ్ వెరి సారీ వాడియా!" అన్నాడు శశికాంత్ నెమ్మదిగా.
"ఐయామ్ వెరి వెరి సారీ! బట్ దిసీజ్ నాటే జోక్! నమ్మలేని నిజం ఇది! నేను దివాలా తీశాను. వ్యాపారంలో మళ్ళీ కోలుకోలేనంతగా!
"మరి నేను నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన పాతిక లక్షలు ఏమవుతాయి? అన్నాడు వాడియా. భయంతో కీచుగా వచ్చింది అతని గొంతు.
ఒకసారి వాడియా వైపు చూశాడు శశికాంత్. తరువాత అక్కడున్న అందరిని వుద్దేశించి "ఫ్రెండ్స్ - వ్యాపారంలో నాకు వచ్చిన నష్టం అంతా బేరీజు వేసుకుని చూస్తే ఒక ఐదు లక్షలు మాత్రం మిగిలింది. అది కూడా నా పర్సనల్ ప్రాపర్టీ!
కానీ నేను మీ అందరికి తిర్చవలసిన అప్పులూ, బకాయిలు, ఇవన్ని కలిపి ముప్పయ్ లక్షల దాకా వున్నాయి. అందుకని ఐ.పి. పెట్టడానికి కోర్టుకి అప్లయి చేశాను. నా ఇన్ సాల్వేన్ సీ పిటిషన్ ని కోర్టు అంగికరించాక వాళ్ళే పూనుకుని నాకు మిగిలిన ఈ ఐదు లక్షల ఆస్తిని మీ అందరికి తలా కాస్త పంచిపెడతారు.
"మై డియర్ ఫ్రెండ్స్" ఐయామ్ ఎక్స్ ట్రీమ్ లీ సారీ ఫర్ దిస్ అన్ ప్లెజెంట్ నెస్! అన్నాడు శశికాంత్ క్షమాపూర్వకంగా.
"యూ బాస్టర్డ్!" అన్నాడు వాడియా. ఇక మర్యాద అనే ముసుగులోంచి బయటికి వచ్చేస్తూ. ఒక్క గంతులో శశికాంత్ ని చేరి, అతని షర్టుని కాలర్ దగ్గర బిగించి పట్టుకుని ఉపుతూ , "యూ బ్లడీ బాస్టర్డ్! ముష్టి ఐదు లక్షలు యాభై మందికి పంచిపెడితే ఎంత వస్తుందిరా? మమ్మలనందరిని మూకుమ్మడిగా ముంచేశావు కదరా! యూ ఆర్ ఏ రెక్ లెస్ బగర్! యా! యూ ఆర్ ఏ రియల్ రెక్ లెస్ బగర్!" అన్నాడు రొప్పుతూ. అతని జుట్టు రేగిపోయి నుదుటి మీద పడుతుంది.
ఆ హల్లో ఉన్న తక్కిన వాళ్ళందరూ అసహనంగా శశికాంత్ వైపే చూస్తున్నారు.
నెమ్మదిగా వాడియా పట్టు విడిపించుకున్నాడు శశికాంత్. అతి కష్టం మీద రాబోతున్న కోపాన్ని తొక్కిపట్టి, కోటు సవరించుకుని అన్నాడు శశికాంత్.
"లేడిస్ అండ్ జెంటిల్మన్! మీ అందరికి లాభాలు చేకుర్చాలనే నేను అహర్నిశలు శ్రమించాను . మీకు ఇన్నాళ్ళ నుంచి లాభాలు చూపించాను కూడా! కానీ ఇప్పుడు రూపాయికి పదిపైసలు వచ్చే గొర్రె తోక వ్యాపారాల్లో ఇరుక్కుపోయి గిజగిజ లాడడం నా తత్త్వం కాదు. రూపాయికి రెండు రూపాయలు వచ్చే హై స్తేక్స్ బిజినెస్ లోకి వెళ్ళాను. నా కోసం మీకోసం కూడా! కానీ దురదృష్టవశాత్తూ వున్నది కూడా పోయింది. ప్రస్తుతం ఇది నా పరిస్థితి! తప్పు చేశానని ఇప్పటికి నేను అనుకోవడం లేదు. నేను పెద్దమనిషిని గనుక, ఐ.పి. పెట్టి నా సొంత ఆస్తిని మీ అందరికి పంచేస్తున్నాను. కానీ ఇంతటితో ఊరుకోను నేను! మళ్ళీ పుంజుకుంటాను. బిజినెస్ లో మళ్ళీ సంపాదించిన తరువాత మీలో ప్రతి ఒక్కరికి, మీకు రావలసిన ప్రతిపైసా తిరిగి ఇచ్చేస్తాను. వడ్డీతో సహా!
"ఫ్రెండ్స్! గివ్ మీ టైం! జస్ట్ గివ్ మీ టైమ్!" అన్నాడు శశికాంత్ వేడుకోలుగా.