"మము బ్రోవమనీ చెప్పవే....సీతమ్మ తల్లీ..... మమ్ము బ్రోవమనీ చెప్పవే....!" అంటూ కొందరు భక్తులు చీకట్లోనే చిడతలు మోగిస్తూ సంకీర్తన చేస్తూ సాగిపోతున్నారు.
కోడితోపాటే నిద్రలేచే తాయారమ్మ లేచి దైవాన్ని స్మరించుకుని కళ్ళుతెరిచి వాకిటి తలుపుకి ఆనుకుని నిద్రపోతున్న కోడల్ని చూసింది. ఆశ్చర్యంగా "పార్వతీ... పార్వతీ....!" అని కేకలేసింది.
పార్వతమ్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది.
"అక్కడ కూర్చుని నిద్రపోతున్నావేమిటే?" అడిగింది తాయారమ్మ.
"ఏం లేదత్తయ్యా.... ఒక్కదానికీ లోపల నిద్రపట్టలేదు....." అంటూ హడావుడిగా సూరమ్మ గదిలోకి వచ్చి గణపతి మంచంవైపు చూసింది అది బోసిగా వుంది.
సూరమ్మ కొఇఒదా "కేశవా.....నారాయణా.....మాధవా...." అంటూ గోవింద నామాలు చుదువుతూ లేచి కూర్చుంది.
సరసమ్మ వచ్చి వాకిలి పాచి ఊడుస్తోంది.
రాధ లేచిన గుర్తుగా పాంజేబులు ఘల్లుమంటున్నాయి.
పార్వతమ్మకి మనసంతా అమావాస్య రేయంత చీకటిగా కనిపించింది.
అన్యమనస్కంగానే పనులు చేస్తోంది. పొయ్యిమీద పాలు పెట్టి ఒక్కొక్కరికే గ్లాసుల్లో పోస్తూ వుంటే శాంత అందిస్తోంది.
"త్వరగా తెమలవే.... తొమ్మిది గంటల బస్సుకి వెళ్దాం!" అంది స్నానం చేసొచ్చి విభూది రేఖ నుదిటిమీద దిద్దుకుంటూ సూరమ్మ.
పార్వతి అతికష్టంమీద గొంతు పెగుల్చుకుని "వదినా..... గణపతి...." అంది.
"టౌనుకెళ్ళి రెండో ఆట చూసి బస్సు అంధక అక్కడే పడుకునుంటాడు. వెధవ, కడుపు కాలితే వస్తాడులే! జేబులో పది రూపాయలు మించి లేవు!" అంది కోపంగా సూరమ్మ.
పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది.
శాంతా, ప్రమీలా కొత్తచీరలు కట్టుకున్నారు. రాధ జడగంటలు పట్టుకువచ్చి "అమ్మా... జడ వెయ్యి!" అంది.
"వయసొస్తోంది... ఇంకా అమ్మచేత జడ వేయించుకోవడానికి సిగ్గులేదూ!" అంటూ చిరాకుపడింది పార్వతమ్మ కూతురిమీద.
రాధ బుంగమూతి పెట్టి, "ఎందుకంత విసుగు? పిన్నిచేత వేయించుకో అని చెప్పొచ్చుగా!" అని వెళ్ళిపోయింది.
సన్యాసిరావు సామాన్లన్నీ బండిలో సర్దించేసి, "అక్కయ్యా..... బయల్దేరు!" అంటూ హడావుడి చేసేస్తున్నాడు.
తాయారమ్మకీ, వాతల తాతయ్యకీ వంటచేసి పెట్టి, ఇల్లు అప్పగించి ఏదో పోగొట్టుకున్నట్లుగా మాటిమాటికి వెనక్కి చూస్తూనే వెళ్లి బండెక్కి కూర్చుంది పార్వతమ్మ.
"వదినా! డబ్బిస్తే... నాగయ్యకి ఇచ్చి వస్తాను!" అన్నాడు ప్రకాశం.
"వచ్చాక చూసుకుందాం, ప్రకాశం! త్వరగా బయలుదేరు!" అంది.
ప్రకాశానికి వదిన మాటకి ఎదురు చెప్పడం, రెట్టించడం ఎప్పుడూ అలవాటు లేదు. ఠక్కున తల ఊపి బయలుదేరినాడు.
"గణపతొస్తే జానకి వాళ్ళ ఊరు రమ్మనండి!" అంది బండి కదులుతుండగా అత్తగారితో.
"గోరింటాకు చూడు ..... ఎంత ఎర్రగా పండిందో...!" అరచేతులు చూపిస్తోంది రాధ.
ఇంట్లోనే గణపతిని ఉంచుకుని పిల్లని ఇవ్వడంలేదని ఎవరైనా అనుకుంటారేమోననే రాధ విషయం ఆమెకి ఆ నిమిషంలో మనసులోంచి తీసేసినట్లయింది. కూతురు తల ఆప్యాయంగా నిమిరింది.
బండి లయగా ఊగుతోంది. జోడెద్దుల మెడలో గంటలు దంపుళ్ళ పాటలు శ్రుతిబద్దంగా మోగుతున్నాయి. జొన్న చేలు తలలూపి తాళం వేస్తున్నాయి. తొలి భానుని కిరణాలని గరికపోచలు కూడా బంగారంలా మెరుస్తున్నాయి. మట్టి దారి వంకర్లు తిరిగి వయ్యారంగా సాగిపోతోంది.
రాధకి కనుపాపలనిండా నిండిన రూపం ఎటుచూసినా కనిపిస్తోంది. 'నాన్న ఈ పాటికి చేరి కబుర్లాడుతూ ఉంటాడేమో!!' అనుకుంది.
"నా స్నేహితులు కుశలమా?" అని మాధవ్ అడుగుతున్నట్లుంది.
"ఎవరా స్నేహితులూ?"
"ఉభయ గోదావరీ తీరాల్లాంటి చెంపలూ, శ్రీశైల శిఖరంలాంటి ముక్కూ కృష్ణా తరంగాల్లాంటి కురులూ, పాపికొండల్లాంటి ఎత్తైన......"
"ఇంకా చాలు బాబూ!" సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుంది.
"ఏమైందే?" ప్రమీల రాదని కుదుపుతూ అడిగింది.
రాధ తెప్పరిల్లి "అబ్బే! ఏమీ కాలేదు!" అంది.
"అవుతుంది, తొందరపడకు! అన్నయ్య ఆ పనిమీదే వెళ్ళాడు!" అంది ఆటపట్టిస్తూ ప్రమీల.
శాంత మాత్రం తోడికోడలు ముభావంగా ఉండటాన్ని పసిగట్టింది. బహుశా వియ్యాలవారు ఏమంటారోనన్న కంగారై ఉంటుంది అని సరిపెట్టుకుంది.
* * *
"గోవిందా ప్రొడక్షన్స్" అన్న బోర్డుచూసి ఓసారి తన ఇష్టదైవమైన వినాయకుడిని ప్రార్ధించి లోపలికి అడుగుపెట్టాడు గణపతి. ఇస్త్రీ చేసిన చారల షర్టూ, స్నఫ్ కలర్ పాంటూ వేసుకున్నాడు. కళ్ళకి నీలం అద్దాలున్న కూలింగ్ గ్లాసెస్ పెట్టాడు. కాలర్ కీ, మెడకీ మధ్యన ఎర్రని రుమాలు మడత పెట్టి పెట్టాడు. కాళ్ళకి పాలిష్ చేసిన పాయింటెడ్ షూ వేశాడు. విలాసంగా నడవబోయాడు కానీ కాళ్ళు వణికి తప్పటడుగులు పడ్డాయి.
"ఎస్.... ఎవరు కావాలండీ?" అంది సల్వార్ సూట్ లో ఉన్న పద్దెనిమిదేళ్ళ పరువాల బాల.
"కొంపదీసి రమ్యకృష్ణ కానీ, సౌందర్య కానీ ఇక్కడ తనకోసం ఎదురుచూస్తూ కూర్చోలేదు కదా?" అనిపించి కళ్ళద్దాలు తీసి చూశాడు.
ఆ అమ్మాయి బుగ్గలు సొట్టపడేటట్టు క్యూట్ గా నవ్వి, "అమలాపురమా.... ఆముదాలవలసా?" ఎక్కడనుండి అని అడిగింది.
"వరద...." అని తడుముకుని వరద బాధితుడికి ఆహారపు పొట్లం దొరికినప్పుడు మొహం ఎలా పెడతాడో అలా పెట్టి, "వరదరాజపురం!" అన్నాడు.
"ఆ అమ్మాయి ఒక స్లిప్ మీద నంబరు వ్రాసిచ్చి "వెళ్ళీ లైన్ లో కూర్చోండి!" అంది.