Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 28


    "మా చిన్నాన్న మంచివాడు!" నవ్వుతూనే అంది రాధ.
    
    "కోట్ల రూపాయలు తీసుకొని చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ పరారీ!" పేపర్ పట్టుకుని చదివాడు వార్తల తాతయ్య"
    
    "ఏవైనా మంచి వార్తలుంటే చెప్పు, తాతయ్యా!" విసుగ్గా అంది రాధ.
    
    "దీపం పథకం కింద గాస్ కనెక్షన్లు!" చదివాడు వార్తల తాతయ్య.
    
    "బానే ఉంది గానీ, మా ఆవిడ సిలెండర్ లోనూనే ఎక్కడనుండి పొయ్యాలండీ అని అడుగుతుందేమో!" అన్నాడు ప్రకాశం.
    
    రాధ నవ్వి, "పిన్నికి చెప్పనా?" అంది.
    
    "వద్దమ్మా! త్యాగరాజ కృతి బదులు తలంటేటప్పుడు నెత్తిమీద రామదాసు కీర్తన వాయిస్తుంది! అన్నాడు.
    
    "మేము తీయబోయే 'సూపర్ హిట్' సినిమాకి కొత్త మొహాలు కావలెను. వెంటనే ఉత్సాహవంతులు ఈ క్రింది చిరునామాని సంప్రదించండి!" అని చదివాడు వార్తల తాతయ్య.
    
    అప్పుడే బయటికి పోబోతున్న గణపతి ఆగి.... "ఏదీ.... ఇటియ్యి!" అని పేపర్ లాక్కున్నాడు.
    
    "వాళ్ళు వెతికేది మనుషుల కోసం అనుకుంటా!" అని ప్రకాశం అనగానే రాధ గలగల నవ్వింది.
    
    గణపతి కోపంగా పేపరు మడిచి పట్టుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు.
    
    "ఇంకా వార్తలు పూర్తిగా చదవనేలేదురా" అంటూ వార్తల తాతయ్య అతని వెంటపడ్డాడు.
    
    "అయోధ్యలాంటి ఇంటిని కిష్కింధలా మార్చే ఇద్దరూ బయటపడ్డారు!" అన్నాడు లేస్తూ ప్రకాశం.
    
    "హనుమంతుడు ఉన్నాడుగా?" నవ్వుతూ అంది రాధ.
    
    "సన్యాసిగాడేనా? జానకి కూతురు సమర్త పేరంటానికి ఏమేంతీసుకెళ్ళాలో మీ అమ్మకీ, పిన్నికీ చెప్తున్నాడు కాబోలు" అని ప్రకాశం కూడా బయటికి నడిచాడు.
    
    రాధ మనసులో సగం బెంగ తీరినట్లనిపించింది. ఇంగ్లీషు టీచరొస్తే తనూ ఇంగ్లీషు నేర్చుకుంటుంది. ఆ తర్వాత... దాని పేరేంటీ... ముఖ్యమంత్రి అస్తమానం చెప్తాడూ..... ఆఁ ... కంప్యూటర్ కూడా నేర్చుకుంటుంది. దాంతో అన్ని పనులు చేసుకోవచ్చట! ప్రేమలేఖ పంపచ్చా? ఛ! ఆ యంత్రానికి మెదడుంటుందిట.....చదివి అర్ధం చేసుకుంటుంది! సిగ్గెయ్యదూ!!
    
                                                            * * *

    పార్వతమ్మ వసారాలో నిలబడి ఎదురు చూస్తోంది. మాటి మాటికీ ఇంట్లోకెళ్ళి గడియారం చూసి మళ్ళీ బయటికి వస్తోంది. ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దుటే జానకీ వాళ్ళు ఊరికి ప్రయాణం. తీసుకెళ్ళాల్సిన సామాన్లూ, పిండివంటలూ సర్దిపెట్టి సూరమ్మ కూడా పడుకుందనడానికి గుర్తుగా గుర్రు వినిపిస్తోంది.
    
    పార్వతమ్మకి కంగారుగా ఉంది. సాయంత్రం మరిది వచ్చి ఆ మాట అడగగానే లోపలకెళ్ళి చూసింది. అప్పటినుండీ ఆమెకు కంగారుగా ఉంది. వీధి మొగలో ఏదైనా ఆకారం కనపడితే చాలు..... గణపతేమో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది, ఎవరెవరో వెళ్తున్నారు కానీ గణపతి జాడలేదు.
    
    సాయంత్రం ప్రకాశం వంటింట్లోకి వచ్చి "అన్నయ్య పురుగుల మందు కొనడానికి డబ్బు నీచేతికి ఇచ్చాడుట. తీసుకురా వదినా! నాగయ్య టౌన్ కెళ్తున్నాడట తనతో బాటు మనకీ తెస్తానన్నాడు!" అన్నాడు.
    
    "చెయ్యి ఊదుకున్నాక తీసిస్తా నాయనా!" అంది బూందీ తూస్తూ.
    
    ప్రకాశం సరే అని వీధిలోకి వెళ్ళిపోయాడు.
    
    పనయ్యాక వెళ్లి తన పెట్టె తీసి అడుగున చూస్తే డబ్బు పెట్టిన సంచీ కనబడలేదు. పదకొండు వేల చిల్లర.... మళ్ళీ చీరలన్నీ మడత విప్పి చూసింది. కనిపించలేదు. ఎడమ చేత్తో ఎక్కడన్నా పెట్టానేమోనని పరుపుకిందా, అలమర్లలో, టేబుల్ సొరుగుల్లో.....చివరికి రాధ అరలో అన్ని చోట్లా వెతికింది! కనిపించలేదు. అప్పుడు కంగారేసింది.
    
    ఒకవేళ తొందరవల్ల ప్రకాశం తనే తీసుకెళ్ళాడేమోనని మరిదికోసం ఎదురుచూసింది. ప్రకాశం వచ్చి కాళ్ళు కడుక్కుంటూ, "వదినా డబ్బు రేపు పొద్దుటే తీసుకుంటాను. ఇప్పుడు పొద్దుపోయిందిగా!" అన్నాడు.
    
    దాంతో అతను తీసుకెళ్ళలేదని రూఢీ అయింది. ఆమె గుండెల్లో రాయి పడ్డంత బరువుగా అనిపించింది. ఎవరి పని ఇదీ? ఆమెకి వెంటనే నాలుగు రోజుల క్రితం గణపతికి అన్నం పెడుతున్నప్పుడు అతనన్న మాటలు గుర్తుకొచ్చాయి.
    
    "ఐదువేలు సర్దు చాలు.... మావయ్యకి చెప్తేనేగా చంపేస్తాడూ....చిన్న మావయ్యకి కూడా చెప్పొద్దు!" అన్నాడు.
    
    అంటే! ఇది గణపతి పనేనా? ఆమెకి భయం వేసింది. డబ్బుపోయిందని కాదు! గణపతి ఈ డబ్బుతో ఇంట్లోంచి పారిపోయాడన్న నిజం తెలిసి!
    
    'శ్రీరామచంద్రా..... అభం శుభం తెలీదు వాడికి.... వాడ్ని నువ్వే కాపాడాలి! ఆ తల్లికి వాడే మిగిలాడు!' అని కళ్ళు మూసుకుని ప్రార్ధించింది.
    
    ఇదేమీ తెలీని సూరమ్మరైలింజన్ లా గురకలు పెడుతూ నిద్రపోతోంది. ఈ బాధనీ, భయాన్నీ ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది పార్వతమ్మకి. కానీ ఎవరిని లేపాలీ?
    
    ప్రమీల చంటిపిల్లాడిని పక్కలో వేసుకుని ఆదమరిచి నిద్రపోతోంది.
    
    తాయారమ్మ మంచం పక్కనే మడతమంచంమీద పేపర్ తల కింద పెట్టుకుని సన్నగా పిల్లి కూతలా ఊపిరి పీల్చి వదులుతూ వాతల తాతయ్య నిద్రపోతున్నాడు.
    
    సన్యాసిరావు సూరమ్మకి సాయం చేసి అలసిపోయి ఆవిడకి కాస్త దూరంలో చాపమీద మూడంకె లేసి నిద్రపోతున్నాడు.
    
    లోకంలో మంచి తప్ప ఏవీ ఉండదు అన్నంతగా చెంపకి చెయ్యి జేర్చి రాధ నిద్రపోతుంది.
    
    శాంతని లేపుదామంటే ప్రకాశం ప్రక్కనే ఉంటాడు! భార్యాభర్తల్ని వేరు చెయ్యడం పాపం మరి ఎవరితో ఈ బాధ పంచుకోవాలి? పొద్దుట చెప్తే రాత్రే చెప్పలేదేం? అంటారేమో! టౌన్ లో ఆఖరి బండి కూడా వెళ్ళిపోయి వుంటుంది.
    
    ఎక్కడో ఓ కుక్క రాయి తగిలినట్లుగా 'కుయ్... కుయ్' మన్న ఏడుపూ, బిచ్చగాడి తిట్లూ వినిపించాయి.
    
    గణపతి వస్తే తెలుస్తుందని ఆమె తలుపుకి ఆనుకుని గడపదగ్గరే కూర్చుంది. పగలల్లా పనిచేసి వుండటంవల్ల ఆమెకి కళ్ళు మూతలు పడి పోయాయి. తలుపుకి ఆనుకుని కూర్చునే నిద్రలోకి ఒదిగిపోయింది.
    
    రాత్రి పూసుకున్న మసిని మంచుతో కడుక్కుంటున్నట్లుగా ప్రత్యూష తెల్లగా పాకుతూ వచ్చింది. అది మొదటగా కనిపెట్టిన గుమ్మడి పువ్వు చూరుమీద పచ్చగా విచ్చుకుంది. ఆ తర్వాత లోకబాంధవుడ్ని లేపడానికా అన్నట్లు కోడి 'కొక్కొరొకో!' అని భూపాలరాగం పాడింది. వైకుంఠద్వారాలు తెరుచుకొనే సమయం అవుతోందని పారిజాతం గబగబా సుగంధాలు చిమ్మింది. దేవకాంచనం భక్తిగా చేతులు జోడించింది. రాధా మనోహరం ఆనందంగా తల ఊపి పారవశ్యాన్ని ప్రకటించింది! నిత్యమల్లి ఎప్పటిలాగే నవ్వులు చిలకరించింది.

 Previous Page Next Page