'ఏమ్మా, మేం ఏం పాపం చేశామమ్మా అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తావేమిటి. నీకోసం ఎవరిమీదో తెల్సులే' అంది కవ్విస్తూ.
జయంతి కాస్త గాభరాపడి 'ఏం తెల్సు... ఎవరిమీదేంటి చెప్పు' అంది కుతూహలం నటించి.
'పాపం, బాస్ గారు రెండు మూడు రోజులనుంచి నీతో మాట్లాడుతున్నట్టులేదు. కారులో షికారు తీసుకెళ్ళినట్టు లేదు. అదా కోపం' అంది చనువుగా.
'చాల్లే-నన్ను షికార్లు తీసుకెళ్ళడం చూసినట్టు మాట్లాడుతున్నావు'
'చూడలేదూ...స్పెషల్ గా పెళ్ళిళ్ళకి వెంట పెట్టుకు తీసికెళ్ళి, దింపి.....తెల్సులేవోయ్' అంది ఉడికిస్తున్నట్టు...
'నీ కెందుకులే బాధ....నిన్ను తీసికెళ్ళమని సిఫార్సు చేస్తా'
'నాకేం అవసరం నాకో మొగుడున్నాడు తీసికెళ్ళడానికి-మొగుడు కావలిసిందానివి నీకే ఆ ఛాన్సు. మా కెవరికీ లేదు..' మీనాక్షి నవ్వుతూ అంది. జయంతి కోపం నటించింది. 'ఏయ్ హాస్యంగా అన్నా, మొహం ఇంక మార్చేయ్' అంది మీనాక్షి. పక్కనున్న ఇద్దరు ముగ్గురు టేబిళ్ళవాళ్ళు నవ్వారు. దివాకర్ యింతసేపు ఫోనులోనే మాట్లాడటం చూసి అతనివైపు నుంచి దృష్టి మరల్చడానికన్నట్టు ఏదో లెటర్ కోసం బీరువా వెతకసాగింది.
* * *
"ఏయ్ దివాకర్. యీ ఆదివారం నీవు ఫ్రీగా వుంటావా, మాయింటికి లంచ్ కి రారాదూ' అన్నాడు గోపాలకృష్ణ శనివారం ఫోన్ చేసి లంచ్ కి పిలిచి నెమ్మదిగా ఆజయంతి విషయం కదపాలని అతని ఆలోచన.
'ఆ సండే వద్దులే.....నాకు వేరే పనుంది, ఇంకోసారి వస్తాను' అన్నాడు దివాకర్ వెంటనే. "ఏం యింకేదన్నా ఎంగేజ్ మెంటుందా' ఆరా తీశాడు.
కాని దివాకర్ బయట పడకుండా 'ఆ.. పనుంది. ఒకర్ని కలవాలి, నెక్స్ట్ సండే చూద్దాంలే' అన్నాడు.
ఆ ఆదివారం మనీషాని వైస్రాయ్ లొ లంచ్ కి ఆహ్వానించాడు దివాకర్. ఓ విధంగా బలవంతం చేసి, మొహమాటపెట్టి మనీషాతో అంగీకరింపచేశాడు. పెద్దగా పరిచయంలేని దివాకర్ ఏకంగా లంచ్ కి పిలిచేసరికి మనీషా కాస్త యిబ్బంది పడింది. యింట్లో వాళ్ళేం అంటారోనని సందేహించింది. కాని దివాకర్ పట్టుదలగా తనే వాళ్ళ డాడీతో మాట్లాడి వప్పించి పర్మిషన్ తోనే తీసుకువెడతానంటే కాదనడానికి వంక దొరకలేదు. అల్లుడి స్నేహితుడని వాళ్ళు దివాకర్ కి చాలా మర్యాదే చూపించారు. బిజినెస్ మాన్ కుండే సహజమైన మర్యాద, వినయంతో పాటు అల్లుడి మిత్రుడు అవడంతో కాదనలేక 'జావ్ బేటీ జావ్' అన్నారు, బుటిక్ చూపించాక, అట్నుంచి లంచ్ కి తీసికెళ్ళి రెండు గంటలకల్లా యింట్లో దించుతానని ప్రామిస్ చేశాడు దివాకర్.
'ఏమిటి, నేనిలా ఎక్కువ చనువు తీసుకున్నాననుకుంటున్నారా' కారులో దివాకర్ మనీషాని చూస్తూ అన్నాడు - కాస్త యిబ్బందిగా కూర్చున్న మనీషా చిరునవ్వు నవ్వింది సుతారంగా, తల ఆడించి, మరయితే అంత మౌనం ఎందుకు?' 'ఏం మాట్లాడమంటారు? వుయ్ హార్ట్ లీ నో ఈచ్ అదర్' అంది మొహమాటంగా.
'అందుకే ఒకరి గురించి యింకొకరికి తెలియడానికే మాట్లాడటం, మాట్లాడకపోతే అభిప్రాయాలెలా తెలుస్తాయి' ఆమెని ఎలాగైనా మాటల్లో దింపి పరిచయం స్నేహంగా మార్చుకోవాలని దివాకర్ తాపత్రయం.
'మీరే చెప్పండి ఏం మాట్లాడమంటారో...' నవ్వుతూ అంది. చెపితే మాట్లాడేది చిలుక పలుకులవుతాయి... మాట్లాడాలంటే ఎన్ని సబ్జక్ట్స్ లేవు. పుస్తకాలు, సినిమాలు, టీ.వీ సీరియల్స్, అభిరుచులు, రాజకీయాలు...సరే ఇంటర్వ్యూ మాదిరినే ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పండి' హాస్యంగా అన్నట్టు అన్నాడు, మనీషా నవ్వింది.
'పుస్తకాలు ఐ మీన్ నవలలు చదువుతుంటారా- ఏం చదువుతారు చెప్పండి, దాన్ని బట్టి మీ మనస్తత్వం ఎనలైజ్ చేస్తాను. 'మిల్స్ అండ్ బూన్స్' నవలలు చదువుతారా' అన్నాడు. 'చిన్నప్పుడు.... అంటే పదమూడు పధ్నాలుగేళ్ళప్పుడు ఓ రెండుమూడేళ్ళు పిచ్చిగా అవే చదివేదాన్ని... 'మనీషా నవ్వుతూ అంది. 'అంటే....మీరు రొమాంటిక్ టైపన్నమాట....మీరు ఊహాలోకాల్లో తేలిపోయే సంఘటనలు, లైఫ్ లో యిష్టపడతారన్నమాట' దివాకర్ ఉడికిస్తున్నట్టు అన్నాడు.
'అదేం కాదు- ఆ ఏజ్ లో అందరూ చదువుతారు. ఎడాలసెంట్ ఏజ్ లో అంతా అలాగే ఆలోచిస్తారు' ఉడుక్కుంటూ ప్రొటెస్ట్ చేసింది మనీషా, దివాకర్ నవ్వాడు.
"ఓ.కె......ఓ.కె పోనీ యిప్పుడు ఎలాంటివి చదువుతారు?"
'అన్ని రకాలూ, షిడ్నిషెల్టన్, రాబిన్ కుక్, సోమర్ సెట్ మామ్ నించి అర్ధర్ హైవీ, ఇర్వింగ్ వాలిస్, జెఫ్రీ అర్బర్.... ఏది మంచి పుస్తకం అని తెలిస్తే అది చదువుతాను.'
'గుడ్ అంటే మీరు పుస్తక ప్రియులన్నమాట మీరు టి.వి చూడడాన్ని ఎక్కువ ఇష్టపడతారా- పుస్తకాలు చదవడం యిష్టపడతారా'
'అన్నీ యిష్టపడతాను- మంచి సీరియల్స్ సెలెక్టెడ్ వి చూస్తాను. రాత్రి కనీసం గంట పుస్తకం చదువుతాను. బుటిక్ లొ కూడా ఎవరూ కష్టమర్లు లేనపుడు పుస్తకాలు చదువుతాను...'
'గుడ్, కీప్ యిట్ అప్, పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు. మరి మ్యూజిక్ వింటారా...'