'ఓ, ఐలవ్ ఓల్డ్ సాంగ్స్. నాదగ్గర లత హేమంత్ కుమార్, రఫి అన్ని పాతపాటలు వున్నాయి. గజల్స్ అన్నీ కూడా యిష్టం.'
'ఐయామ్ హాపీ, మీకు సాహిత్యం, సంగీతం పట్ల మంచి అభిరుచి వున్నందుకు ఇంకో చిన్న ప్రశ్న. మీరు మీ అక్కలా అమెరికా వెళ్ళి సెటిలవడానికి యిష్టపడలేదని యిండియా వదిలి వెళ్ళడం యిష్టం లేదని అన్నారని విన్నాను. - ఐ కంగ్రాట్స్ యు ఫర్ ది నేషనల్ స్పిరిట్'
'దేశభక్తో మరోటో నీకు తెలియదు గాని, అంతా యిండియాను వదిలిపోతే దేశం ఏమవ్వాలి. అయినా యిప్పుడిక్కడ లేనిదేముంది అమెరికాలోకంటే. అఫ్ కోర్స్ బేసిక్ కంఫర్ట్స్ అంటే రోడ్లు, ఫోన్లు, నీరు, శానిటేషన్ వగైరాలలో మనం యింకా వెనకబడివున్నమాట నిజమే కాని వీటికోసం మాతృభూమిని వదిలి మన సుఖం మనం చూసుకోవడం అంటే నామనసెందుకో అంగీకరించడం లేదు. అన్ని కంట్రీలు తిరిగాను. చూడడానికి బాగున్నాయి- శలవులు ఎంజాయ్ చెయ్యొచ్చు కానీ వుండడానికి నీ మనసు అంగీకరించలేదు....' మనీషా చెప్తుంటే ముగ్ధుడై వింటున్నట్టుండి పోయాడు. 'రియల్లీ మిమ్మల్ని అభినందించి తీరాలి. ఇంత చిన్నవయసులో ఆకర్షణలకి లొంగకుండా మంచి వితరణ శీలిగా ఆలోచించగలగడాన్ని అభినందిస్తున్నాను. ఎంత చిత్రం మీ అభిప్రాయాలే నావీ అవడం, అమెరికా వెళ్ళి ఎం.బి.ఎ చెయ్యమన్నారు డాడీ. ఖర్చుకి కూడా వెనకాడకుండా పంపిస్తానన్నా వెళ్ళాలనిపించలేదు. మొన్న శ్రీధర్ కూడా అన్నాడు అమెరికా వచ్చేయ్. జాబ్ చూస్తానంటూ....కానీ, మీరన్నట్టు నా మాతృభూమి ముందు మిగతా దేశాలన్నీ దిగదుడుపే. అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి కోట్లు కూడా పెట్టొచ్చేమోగాని, యిక్కడుండే ఆత్మసంతృప్తి ఉండదనిపించింది. అయినా యిప్పుడిక్కడ ఎన్నో ఉద్యోగాలకు, ఎన్నో రకాల బిజినెస్ లకు అవకాశం వుంది. ఏంబిషన్, కాస్తంత చొరవ వుంటే బోలెడు వెంచర్లున్నాయి చేయడానికి'
మనీషా అంగీకరిస్తున్నట్టు తల ఆడించింది. 'మనీషా బుటిక్' అన్నపేరు కింద 'పేషన్ డిజైనర్స్' అన్న బోర్డుంది. మనీషా బ్యాగునుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది. అద్దాల బీరువాలనిండా రకరకాల ఔట్ ఫిట్స్- బయట హాంగర్లకి వేలాడుతూ కొన్ని షోరూమునిండా అలంకరించివున్నాయి. ఆమె అభిరుచి తగిన ఫర్నిచర్, కౌంటరులో కంప్యూటర్, గోడలకి పెయింటింగ్స్, మంచి మోడల్స్ ధరించిన దుస్తుల ఫోటోలు మంచి లైటింగూ అరేజ్ మెంట్, వుండాల్సిన హంగులన్నీ వుండి ఆమె అభిరుచిని తెలుపుతుంది. షోరూం మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తుంది. షోరూము వెనక పక్కగదిలో నాలుగు కుట్టుమిషన్లున్నాయి ఆర్డర్లు తీసుకుని డ్రస్సులు తయారు చేయడానికి, మనీషా స్వయంగా డిజైనింగ్ చేస్తుంది.
'గుడ్, వెరీగుడ్... ఐ అప్రీషియేట్ యువర్ టేస్ట్' దివాకర్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ అన్నాడు. 'ఇదంతా మీ డాడి అరేంజ్ చేసి పెట్టారనుకుంటాను. మీకేం అదృష్టవంతులు. ఫైనాన్స్ ప్రాబ్లమ్ లేదు. పాపం ఎంతోమంది ఎన్నిరంగాలలో నైపుణ్యం వున్నా ఆర్ధిక వనరులు లేక, సమకూర్చుకోలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు'
'మరి అలాంటి వారికి మీ బ్యాంకింగు ఆర్ధిక సాయం చేయవచ్చుగా'
'ఎందుకు చేయడంలేదు. స్మాల్ స్కేల్ యిండస్ట్రీలకి, సిఎమ్ యివై కింద యువతకి అప్పులు యిస్తూనే వున్నాం-మా బ్యాంకులకున్న పరిమితులకు లోబడి. కాని, బిజినెస్ ఆరంభించడం ఓ ఎత్తు, నిలదొక్కుకోవడం మరోఎత్తు. అందరూ వెనక దన్నున్న మీలాంటి అదృష్టవంతులుండరు. ప్రోడక్ట్ తయారుచేయడం సులువు. మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. ఎంతో ఉత్సాహంతో కొందరు లోన్లు తీసుకుని మొదలుపెట్టి మధ్యలో మూతపడి, రుణాలు చెల్లించలేక అమ్ముకుని పోయేవారే సగం మంది. యిచ్చిన రుణాలని వసూలు చేసుకోవడం మా బ్యాంకులకి పెద్ద తలనొప్పి...' దివాకర్ బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందులు గురించి చెప్పాడు.
'మరయితే నాకు లోనిప్పించరా' సరదాగా అడిగింది.
'మీలాంటి వారికెందుకివ్వం, కళ్ళకద్దుకుని యిస్తాం. మీ బుటిక్ మరో బ్రాంచ్ యింకో చోట ఓపెన్ చేయడానికి, విస్తరించడానికి, ఎక్స్ పోర్ట్ చేయడానికి ఏది కావాలో ప్రాజెక్ట్ రిపోర్టు తయారుచేసి ఎంత అమౌంట్ కావాలో తెలియచేస్తూ అప్లైచెయ్యండి. నిముషాలమీద లోను యిప్పిస్తాను'
'థాంక్యూ...యింకోచోట యింకో బ్రాంచి ఓపెన్ చెయ్యాలన్న ఆలోచన వుంది. మా కజిన్ ఒకమ్మాయి అక్కడ బిజినెస్ చూసుకుంటానంటోంది. విషయం ఫైనలైజ్ అయ్యాక అప్లై చేస్తాను....' మనీషా అంది.
'ఓ.కే.....మనం లంచ్ కెడదామా వంటిగంట అవుతుంది' అన్నాడు. యిద్దరు బయటికి వచ్చారు. తాళాలు వేసి కారులో కూర్చుంది మనీషా.
లంచ్ చేస్తూ 'ఊ యిందాక ఆగిపోయిన సంభాషణ కంటిన్యూ చేద్దామా' అన్నాడు దివాకర్ లంచ్ ఆర్దరుచేసి రాగానే మొదలుపెట్టారు 'ఇంకేమిటి మీ ఇష్టాలు చెప్పండి. భోజనంలో మీ యిష్టాలేమిటి అది చెప్పండి ముందు. మీ కిష్టమయినవి ఆర్డరు చేస్తాను మళ్ళీ' అన్నాడు దివాకర్.
'చాల్చాలు యింకేం అక్కర్లేదు' గాభరాగా అంది మనీషా. 'తెలుగు ఫుడ్ లో ఇడ్లీ, దోశ, సాంబారిష్టం, గుజరాతీలో ఢోక్లా, ఎనీథింగ్ లైట్... శాఖాహారం మాత్రం తింటాను'
-ఓ మీరు వెజిటేరియన్ అన్నమాట. హౌ స్ట్రేంజ్, మనిద్దరి అభిరుచులు, అలవాట్లు తు.చ. తప్పకుండా కలిశాయి. అఫ్ కోర్స్ బై బెర్త్, నేను వెజిటేరియన్ ని-మేం బ్రాహ్మిన్స్ మి. మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ వెల్లుల్లి వగైరాలు కూడా తినరు. కావాలంటే మగవాళ్ళు చాలామంది మనలానే బయట తింటారు. కాని నాకెందుకో అసలు నచ్చదు. బహుశా దానికి కారణం చిన్నప్పుడు ఓ మేకను పట్టుకుని పీక కోయడం- అది గిలగిల కొట్టుకు చచ్చిపోవడం, ఆతోలు వలిచి, పేగులు లాగి, ఆ నానా భీభత్సం చూసి అసహ్యంవేసి జన్మలో తినను అనుకున్నాను'