తనూజ మీద ఆవిడకి కోపం రాలేదు. ఆ పెంకి తనానికి తల్లి మనసు ముచ్చటగా నావ్వుకుంది. బొత్తిగా చిన్నతనం పోలేదు. ఎలాగో ఏంటో అనుకుంది. అందుకే నెమ్మదిగా నచ్చ చెపుతున్న ధోరణి లో మృదువుగా అంది. "నాతల్లి కదూ ...మొండితనం చేయకమ్మా! నీకు తెలియడం లేదు. భగవంతుడు నీమీద పెట్టిన ఈ బాధ్యత ఎంతగొప్పదో తెలుసా? నువ్వు మరో ఏడు నెలల్లో సృష్టికి ప్రతి సృష్టిచేయ బోతున్నావురా!ఈరోజు నుంచి ఈ కడుపు మాములుకడుపు కారు. ఇదొక దేవాలయము. నువ్విక్కడ ఓ జీవికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నావు. అందులో ఉన్న జీవిని దేవతా రూపంగా భావించి, సకల మర్యాదలు చేయాలి . నీ ఆశలూ,కోరికలూ, సహనం, శాంతి, ఓపికా అన్నీ దీని కోసమే కేటాయించాలి. నీకంటూ వేరే వ్యాపకం లేకుండా నీ ఈ గర్బాన్ని ఓ దేవాలయం లా కాపాడాలి. గుడిలో దేవుడికి నైవేద్యం పెట్టకుండా మాడుస్తావా? అలాగే నీ పాపాయిని కూడా మాడ్చకూడదు. పాపాయి ప్రస్తుతం దైవంతో సమానం. నా మాటవిని ఇది తాగు."
"తాగను.... తాగను... మంచం మీద దూరం జరిగింది తనూజ.
మంజుల కోపంగా, "తాగకపోతే మానేయ్.నాకేంటి? వాంతులయ్యేది నాక్కాదు నీకే. అవి తగ్గాలంటే ఇది తాగాలి. లేదంటే అలావాంతులు చేసుకుంటూ కూర్చో." అంటూ లేచి గ్లాసు మంచం పక్కనే ఉన్న స్టూలుమీద పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ముందుభర్తకి, వియ్యాల వారికి ఫోన్ చేసి, శుభవార్త తెలియజేసింది. వియ్యపురాలు శాంతి ఎంతోసంతోషించింది.
"అబ్బాయికి చెప్పారా వదిన గారూ ఈ వార్త?" అనిఅడిగింది.
"లేదండీ.... మనం చెబితే అతనికేం థ్రిల్. తనే చెప్తుంది.ఇప్పుడేవచ్చాం డాక్టర్ దగ్గర్నుంచి.బాగా వాంతులై ఉంది కదా!కాస్సేపురేస్ట్ తీసుకోమన్నాను. లేచాక తనే చెప్పు కుంటుంది లెండి" అంది.
రాహుల్ ఫోన్ చేసి "అంటీ, డాక్టర్ దగ్గరకు వెళ్ళారా? ఏమన్నారు? తనూ ఎలా ఉంది?" అని అడిగినా, "బాగానే ఉంది రెస్ట్ తీసుకుంటోంది." అని చెప్పిందే కానీ విషయం చెప్పలేదు.
భర్తా, అల్లుడూ సాయంత్రం ఆఫీసు నుంచి ఇటే వస్తారని అప్పటికప్పుడే ఆవిడ చకచకా మైసూర్ పాక్, చేగోడీలు చేయడానికి ఉపక్రమించింది.
మంజుల పని అయ్యేటప్పటికి ప్రసాద్ వచ్చేశాడు.
వస్తూనే కూతురి మంచందగ్గరికి వెళ్ళి తను తెచ్చిన స్వీటు తనూజ నోటికి అందిస్తూ "కంగ్రాట్స్ రా నన్ను తాతని చేసెస్తున్నావా అప్పుడే" అన్నాడు.
తనూజ ఎడుపుస్వరంతో అంది."ఎంటి డాడీ నువ్వు కూడా... నీకింకా పార్టీ పైవ్ ఇయర్స్ కూడా లేవు. అప్పుడే ముసలాడిలా తాత అనిపించుకోడానికి ఆరాట పడతావెం నాకిష్టం లేదు డాడీ...."
"ఏంటమ్మా....ఏంటిష్టం లేదు? తప్పదు రా....నువ్వు మరీ త్వరగా పెళ్ళి చేసుకున్నావు. నేను త్వరగా తాతనవుతా. దానికేం ఉంది. గ్లామరస్ , తాతని అనిపించుకుంటే నాకెంత క్రెడిట్" అన్నాడు మురిపెంగా. తనూజ నుదుటిమీద పడిన జుట్టు సవరిస్తూ.
"నో....నాకిష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ అబార్షన్.."
ఏం అర్ధం కాని వాడిలా అయోమయం గా భార్య వైపుచూశాడు ప్రసాద్. అతని చేతికి కాఫీ గ్లాసు అందిస్తూ అంది మంజుల.
"ఇదీ వరుస....ఇందాకట్నించి ఈ వాగుడే వాగుతోంది."
ప్రసాద్ కాఫీ గ్లాసు స్టూలు మీద పెట్టి నచ్చ చెపుతున్నట్టుగా అన్నాడు. "తప్పు నాన్నా... తప్పు . ఈ మాట మొదటిసారి తల్లి కాబోతున్న స్త్రీ నోటి నుంచి పొరపాటున కూడా రాకూడదు. తల్లి కావడం అంటే మాటలా!"
"హు....ఏం? పిల్లల్ని కనడం పెద్ద ఘనకర్యమా? పక్షులు, పశువులు కూడా కంటాయి" విసురుగా అంది.
'అదే... అందుకే అంటున్నాయి. పక్షులు పశువులూ నమర్ధాగా భావించని పని మనిషివై అదీ ఆడదాని వై పుట్టి నువ్వెందుకు నామర్ధాగా భావిస్తున్నావు?"అవకాశం వచ్చింది కదా అని నిలదీసింది మంజుల.
"మనిషిని కాబట్టే దేశంలో జనాభా పెరుగిపోతూ దారిద్ర్హ్యం పెరిగి పోతుందని నావంతు కర్తవ్యంగా జనాభా పెరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను."
"ఆహా... ఎంత గొప్ప సివిక్ సెన్స్ నా తల్లి! చాలు గానీ పిచ్చి వేషాలేయకు" వెటకారంగా అని ప్రసాద్ వైపు చూస్తూ అంది. "మీరు ఇలా రండి, దాని దగ్గర కూర్చుంటే మనకీ పిచ్చెక్కుతుంది."
బైట స్కూటర్ ఆగిన శబ్దం అయింది.
'అడుగో రాహుల్ వచ్చాడు. ఇంక నీ ఇష్టం ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంది మంజుల ఇంకనాకేం సంబంధం లేదు అన్న ధోరణి తో.
రాహుల్ స్కూటర్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. వస్తూనే గుమ్మం లో ఎదురైన మంజుల ని చూస్తూ ఆత్రంగా అడిగాడు. "అంటీ తనూ ఎలా ఉంది?" ఏమైంది?"
ప్రసాద్ అతని కంగారు చూసి ఆశ్చర్యంగా అడిగాడు మంజులని. "ఏంటి తెలియదా?"
లేదన్నట్టు చూసింది మంజుల.
"ఎంటంకుల్ " అడిగాడు రాహుల్ అయోమయంగా.
ప్రసాద్ నవ్వుతూ అతని భుజం తట్టి "కంగ్రాట్స్ రాహుల్. నువ్వు నాన్నవి కాబోతున్నావు." అన్నాడు.
తనూజ ముఖం చిట్లించింది.
రాహుల్ అదేం పట్టించుకోకుండా చెదిరిన ఆమె ముంగురులు సవరిస్తూ "పాపం! ఇందుకా అలా వాంతులు చేసుకుంటున్నావు. నాలుగు రోజుల్నించి తిన్న దేదీ వంట పెట్టకుండా! ఒకే... నీకేం కావాలో చెప్పు ఇప్పుడే తెస్తాను."
వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మంజులా, ప్రసాద్ అవతలికి వెళ్ళిపోయారు. కానీ మంజుల గుండెల్లో బాధగా వుంది. ఈ పిచ్చిది పిచ్చివాగుడు వాగి అతని ఉత్సాహం మీద ఎక్కడ నీళ్ళు చల్లుతుందో నని.
అదే అంది భర్తతో, "ఈ వార్త తెలిసిన దగ్గర్నుంచీ ఇలాగే వాగుతోంది. ఆ మొహంలో సంతోషం లేదు. ఏం లేదు. నాకేం అర్ధం కావడం లేదు దీని ఉద్దేశం ఏమిటో."
ప్రసాద్ తేలిగ్గా అన్నాడు. "ఏం కాదు, ప్రస్తుతం ఈ వాంతులు, వేవిళ్ళు చూసి అలా ఆలోచిస్తోంది. నాలుగురోజులు పొతే తనే సర్దుకుంటుంది. ఆఫీస్ కెళ్ళి స్వీట్స్ పంచి పెడుతుంది."
కానీ, అతననుకున్నట్లు జరగలేదు. రాహుల్ ని బెదిరించి, వేధించి మర్నాడు డాక్టర్ దగ్గరకి వెళ్ళింది తనూజ.
కానీ ఆవిడకి అబార్షన్ చేయడానికి సరైన కారణం కనిపించక రాహుల్ ని "అబార్షన్ చేయడం నీ అంగీకారమేనా?' అని అడిగింది.
అతను చిన్న బుచ్చు కున్న మొహంతో , "నా ఇష్టమేంటి డాక్టర్! మోసేది తను, కనేది తను. తనకా శక్తి లేదంటోంది. నేను బలవంతం చేసి ఏం చేయగలను? నాకు పిల్లలు ఇష్టమైతే అనాధల్నో తెచ్చుకుని పెంచుంటాను." అన్నాడు నిష్టూరంగా.
ఆవిడ తనూజ ని అడిగింది. "నువ్వెందుకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావు?" అని.
తనూజ మొహం మాడ్చుకుని అంది. "నాకిష్టం లేదు. వీళ్ళందరి కోసం పదినెలలు ఈభారం మోసి పిల్లల్ని కనడానికి నేనేం యంత్రాన్ని కాదు. అయినా ఇది నా వ్యక్తిగత విషయం. ఇందులో ఎంతమంది అభిప్రాయం కావాలి మీకు నేను అబార్షన్ చేయమన్నాను చేయండి."
అనుభవజ్ఞురాలైన డాక్టర్ కి తనూజ అంతరంగం అర్ధం అయిపొయింది. ఆధునిక స్త్రీల విపరీత పోకడల కి ఈ అమ్మాయి మరో నిదర్శనం అనుకుంది. అందుకే అంది, "ఒకే తనూజా! ఇప్పుడెం మించిపోలేదు. తొందరలేదు. నీకు వారం రోజుల టైం ఇస్తున్నాను. మరోసారి ఆలోచించుకుని రా! అప్పుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే తప్పకుండా చేస్తాను."
"ఇంకా వారం భరించాలా ఈ దరిద్రాన్ని' విసుగ్గా అంది తనూజ.
ఈ అమ్మాయి మూర్ఖురాల్లా ఉంది అనిపించిందావిడకి. కోపం అణచుకుంటూ "ఇది కూడా భరించ లేకపోతె నువ్వు జీవితంలో ఏదీ భరించలేవు . మరి నిన్ను అందరూ భరించాలి కదా!" అంది.
తనూజ కి ఆవిడ మాటలకి కోపం వచ్చింది. తమాయించుకుంటూ తల వంచుకుని బైటకి వచ్చేసింది. ఆమె వెనకాలే పాలిపోయిన మొహంతో వెళ్తున్న రాహుల్ ని చూస్తుంటే జాలేసింది ఆవిడకి. ఏవిటో ఈ కాలం... అనుకుని నిట్టూర్చింది .
మర్నాడే రాహుల్ ఇద్దరూ వాళ్ళింటికి బయలుదేరారు. డాక్టర్ ఏం అన్నదో మంజుల అడగలేదు. తనూజ చెప్పలేదు. రాహుల్ మొహం చూస్తుంటే మాత్రం ఏదో అతనికి ప్రతికూలంగానే జరిగింది అనిపించింది. చిన్నబుచ్చు కున్న మొహం తో జబ్బుబడ్డ వాడిలా నిర్వికారంగా తనూజ ని తీసుకుని బయలుదేరాడు. అతనితో పాటు బయలుదేరిన తనూజ తో మంజుల గానీ, ప్రసాద్ కానీ ప్రేమగా మాట్లాడలేదు. అంటీ ముట్టనట్లు ప్రవర్తించారు. వెళ్లొస్తాను అని చెప్పినా మంచిది అని ఊరుకున్నారే గానీ ఎప్పటిలా 'జాగ్రత్త తల్లీ....ఆరోగ్యం జాగ్రత్త ,ఏదన్నా కావాలంటే ఫోన్ చేయి' అంటూ ఆప్యాయత తో కూడిన వీడ్కోలివ్వలేదు. తల్లిదండ్రుల వాలకం చూస్తుంటే తనమీద వాళ్ళిద్దరూ చాలా కోపంగా ఉన్నారని గ్రహించింది తనూజ. అయినా పట్టించుకోలేదు.