Previous Page Next Page 
లీడర్ పేజి 22

    రాయవెల్లూరు జైల్లో సుమారు రెండున్నర సంవత్సరాలున్నారు.    
    తల్లినీ, పిల్లల్నీ పెట్టుకుని రమణమ్మ ఒంటరి పోరాటం ప్రారంభించింది. పిల్లలు, తండ్రి కోసం దేముడి ముందు ప్రార్ధనలు చేసేవారు. లక్షసార్లు రామనామం చేస్తే తప్పకుండా ఆరోజు నాన్నగారు వస్తారు అనే వెర్రి నమ్మకం వుండేది    
    ఆయన 'దేశం' మనిషి, తమకేమీ కాడని ఆ చిన్నారి మనసులు అర్ధం చేసుకోలేకపోయేవి!    
    పిఠాపురం రాజా ఏంటీ అన్ టచ్ బులిటీ సభ నిర్వహించారు. అందుకు ఆహ్వానం అందగానే, "రమణా నువ్వు కూడా బయల్దేరు!" అంటూ హడావుడిగా ఇంటికి వచ్చాడు శ్రీహరిరావు అప్పటికి రాయవెల్లూరు జైలునించొచ్చి వారమయింది.    
    అతని మాటలకి ఎదురు చెప్పదు ఆమె సాధ్యమయినంతవరకూ అతనితో బయల్దేరింది పిఠాపురం.
     సభకి గాడ్చెర్ల రామ్మూర్తిగారూ, ఆయన భార్య మంగవ్వగారూ, బిక్కిన వెంకటరత్నంగారూ, దుర్గాబాయమ్మగారూ మొదలగు పెద్ద లొచ్చారు. సభ ప్రారంభమయింది. ఎవరెవరో పెద్దలు ప్రసంగిస్తున్నారు. రమణమ్మ, దుర్గాబాయి పక్కనే కూర్చునుంది. అవతల మగవాళ్ళల్లో శ్రీహరిరావు కూర్చున్నారు. కాసేపయ్యాకా ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పడం ఆయన లేచి అతన్ని అనుసరించి వెళ్ళడం రమణమ్మ గమనించింది.    
    సభ సమాప్తమయింది. శ్రీహరిరావు జాడలేదు. "మనం లోపలికి వెళ్ళి రాణీగారిని పకలరించివద్దాం!" అంది దుర్గాబాయి "సరే!" అని రమణమ్మ అనుసరిస్తుండగా.    
    "అమ్మాయ్!" అని పిలిచారు రామ్మూర్తిగారు. "బిక్కిన వెంకటరత్నంగారు మీ ఊరెళుతున్నారు. ఆయనతో బాటుగా నువ్వు కూడా వెళ్ళిపోవడం మంచిది!" అన్నారు.    
    రమణమ్మ తెల్లబోతూ చూస్తూ "ఎందుకు? మావారెక్కడా?" అనడిగింది.    
    "శ్రీహరిరావుని అరెస్ట్ చేశారు" అన్నారాయన శాంతంగా.    
    "ఎందుకు అరెస్టు చెయ్యాల్సొచ్చిందీ? నేనాయన్ని వెంటనే కలుసుకోవాలి!"    
    "ఆడపిల్లని పోలీస్ స్టేషన్ కెళ్ళడం పద్దతిగా వుండదు?నా మాట విని వెళ్ళిపో!" అని ఆయనెంత చెప్పినా ఆమె వినలేదు.    
    "ఇద్దరం కలిసే వచ్చాం! కలిసే వుంటాం! నన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి" అని మొండిపట్టు పట్టింది.    
    చివరికి ఆమె ఇష్టప్రకారం పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్ళకతప్పలేదు వాళ్ళకి.    
    లోపలికి వెళుతూనే అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయిందామె. శ్రీహరిరావు ఇన్స్ పెక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చుని, కాళ్ళు పైకిపెట్టుకుని మరీ కబుర్లు చెపుతున్నారు. అతను నిలబడి చేతులు కట్టుకుని నవ్వుతూ వింటున్నారు.    
    రమణమ్మని చూడగానే, "రావోయ్ రా! ఈయనీ పూటకి నన్ను ఆతిథ్యం స్వీకరించమని తెగ మొహమాట పెట్టేస్తున్నాడు" అన్నారు.    
    అతను అంత రాత్రిపూట ఒక స్త్రీ పోలీస్ స్టేషన్ కి రావడం చూసి, కంగారుపడ్డాడు.    
    "ప్రొద్దుటే వస్తారు గురువుగారు! మీరెళ్ళండమ్మా" అన్నాడు అర్ధింపుగా,    
    "చూడండీ! నేనాయనతో వచ్చాను. ఆయనతో బాటే నన్నూ ఇక్కడే వుండనియ్యండి. నాకిక్కడెవరూ తెలిసినవాళ్ళు లేరు!" అని నిష్కర్షగా చెప్పేసింది.    
    అతను తల గోక్కుంటూ శ్రీహరిరావువైపు చూశాడు.    
    ఆయన చిద్విలాసంగా భార్యనే గమనిస్తున్నాడు.    
    "ఒక ఆడమనిషిని రాత్రిపూట రిమాండ్ లో పెట్టడమంటే నా గొయ్యి నే తీసుకున్నట్లు కాదా? మీరైనా చెప్పండి ఆవిడకి" అంటూ ఆయన్ని బ్రతిమాలాడు. "నేనేం చెయ్యలేను" అన్నట్లుగా చూసి నవ్వారాయన.    
    "అమ్మా! రూల్స్ ఒప్పుకోవమ్మా, నువ్విక్కడుండడానికి" అన్నాడతను ఆమెవంక ప్రాధేయపూర్వకంగా చూసి.    
    "ఏ రూల్స్ ఒప్పుకోవూ? ఏమీ చెయ్యకుండా, భార్యతో కలిసి ఆహ్వానం మీద సభకొచ్చిన పెద్దమనిషిని అన్యాయంగా అరెస్టు చెయ్యమన్న రూల్సా?" ఆడపులిలా గర్జించిందామె.    
    ఇన్స్ పెక్టర్ బదులివ్వడానికి జంకాడు.    
    "అసలెందుకు అరెస్టు చేశారో ముందు చెప్పండి!" ఆమె గొంతు ఆ స్టేషన్ గోడల మధ్య ప్రతిధ్వనించింది.    
    ఆడవాళ్ళు తలుచుకుంటే చెయ్యలేనిదేమిటి? యమధర్మరాజంతటి వాడినే సావిత్రి తల తడుముకునేటట్లు చేసింది.    
    "అవునసలు నన్ను ఎందుకు అరెస్టు చేశావో ముందు చెప్పు!" అన్నారు శ్రీహరిరావు నవ్వుతూ.    
    అతను నెమ్మదిగా చెప్పసాగాడు. "గవర్నర్ గారు మెడ్రాసునుండి బయల్దేరి విసకహపట్నం కాన్వకేషన్ కోసం వెళ్తున్నారు. శ్రీహరిరావుగారు బయటున్నట్లయితే రైళ్ళ రాకపోకల కవరోధం జరుగుతుందని చెప్పి అరెస్టు చెయ్యమని ఆర్డరేసారు."   
    అతను చెప్పడం ఆపగానే, ఆయన పెద్దపెట్టున నవ్వి, "చూశానటోయ్! మనం అంతే ఎంత భయమో! నువ్వు ఈ రాత్రికి ఇన్స్ పెక్టర్ గారి మాట విని అయన చెప్పిన చోట వుండు. ప్రొద్దుటే విడుదలయిది కలిసి వెళ్ళిపోదాం" అన్నారు.

 Previous Page Next Page