Previous Page Next Page 
సంకల్పం పేజి 21

   

     దొర పాడుపడిన బంగ్లా అంతా కలియదిరిగాడు...
   
    మరణమన్నది అంత చేదుగా, బాధగా ఉంటుందా?
   
    మేనమామ ఉపశమనపు మాటలతో మూడురోజులకు కోలుకున్నాడు వికాస్. దొర వారసుల్ని ఆర్జించి ఆయన ఎప్పుడూ కూర్చునే పాత వాలు కుర్చీని తీసుకొని అదివరకే ఉన్న అవమానానికి తోడు, దొర మరణంతో వచ్చిన నిర్లిప్తతతో మేనమామ, తోడురాగా విశాఖకు బయలుదేరాడు వికాస్.
   
                                 *    *    *    *    *
   
    సింహాచలం.
   
    బస్టాండ్లో వున్న గోపురం కింద మెట్ల మీద కూర్చున్నాడు వికాస్, లిఖిత.
   
    ఇద్దరి చేతుల్లోనూ కూల్ డ్రింకులున్నాయి.
   
    "మళ్ళీ జింఖానాలోకి రమ్మని పిలుపొస్తే వెళ్తారా...." సీరియస్ గా అడిగింది లిఖిత.
   
    వెంటనే సమాధానం చెప్పలేదు వికాస్.... కొద్దిక్షణాలు గడిచాయి.
   
    "ఉద్యోగం ఓ చెరువు లాంటిది. బతికినంతకాలం అందులోనే ఈత కొట్టాలి. అది నాకిష్టం లేదు..." తన అభిప్రాయాన్ని చెప్పాడు వికాస్ స్థిరంగా.
   
    "మరి జింఖానాలో కెందుకు చేరారు...."
   
    "అనుభవం కోసం... మంచి అనుభవమే వచ్చింది కదా..." నవ్వుతూ అన్నాడు.
   
    "మరిప్పుడు..."
   
    "సాహసం సేయరా డింభకా.... అని ముందు కడుగేయడమే...." అని తనేం చెయ్యదలిచాడో, తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకోదలిచాడో.
   
    అస్పష్టంగా వున్న ఆలోచనని చెప్పాడు వికాస్.
   
    పదిహేను నిమిషాలసేపు చెప్పాడు.
   
    నిలబడి ఆలోచించడం కన్నా, నడుస్తూ ఆలోచించడమే మంచిది.
   
    ఆ ప్రయత్నంలోనే వున్నాడు వికాస్.
   
    "మీ పథకం బాగుంది.... ముందు కెళ్ళండి..... మీరు సక్సెస్ అవుతాడు....నాకా నమ్మకం వుంది. బై.... ది.... బై.... మీకో మాట.... మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నిస్సంకోచంగా నన్నడగండి...... ఎందుకంటే మీకు బయటెవరూ ఫ్రెండ్స్ లేరు కాబట్టి...."
   
    "థాంక్యూ...." ఆమె కళ్ళవేపు చూశాడు వికాస్. అదే సమయంలో వికాస్ కళ్ళవేపు చూసింది లిఖిత.
   
    ఇద్దరూ లేచారు.
   
    ప్రహ్లాదపురం జంక్షన్లో కారాపింది లిఖిత. వికాస్ దిగిపోయాడు.
   
    "వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం.... అప్పటికి మీ ప్రోగ్రెస్ చెప్పాలి.
   
    "ఎక్కడ కలుద్దాం...."
   
    ఒక్కక్షణం ఆలోచనలో పడింది లిఖిత.

    "రైల్వేస్టేషన్ బుక్ స్టాల్ దగ్గర.... సాయంత్రం అయిదు గంటలకు."
   
    కారు సర్రున ముందుకు దూసుకొని వెళ్ళిపోయింది.
   
                                        *    *    *    *    *
   
    రంగంలో అడుగుపెట్టడానికి మర్నాడు ముహూర్తం పెట్టుకున్నాడు వికాస్.
   
    ఉదయం -
   
    సరిగ్గా పదిగంటలకు-
   
    రూం నుంచి బయల్దేరాడు.
   
    బస్సెక్కాడు. ద్వారకానగర్ జంక్షన్లో దిగి, డైమండ్ పార్క్ వేపు నడిచాడు. డైమండ్ పార్క్ కి పదడుగుల దూరంలో...
   
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లోని కెళ్ళాడు.
   
    ముప్పై రూఅపాయలిచ్చి, ఎస్.ఎఫ్.సి. ప్రతీ ఏటా ప్రచురించే 'Sick Units' బుక్ తీసుకున్నాడు.
   
    బయటకొచ్చి, ఒక హోటల్లో కూర్చుని, కాఫీ తాగుతూ ఎక్కడెక్కడ ఏయే 'సిక్' యూనిట్లున్నాయో వెరిఫై చేశాడు.
   
    శ్రీకాకుళం జిల్లా.... విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా.
   
    విశాఖపట్నం జిల్లా డివిజన్ కింద వంద వివిధ రకాల సిక్ యూనిట్లున్నాయి. ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ లు.... సెమీ పెర్మనంట్ సినిమా థియేటర్లు...
   
    టైర్స్ ఫ్యాక్టరీలు.... పోలిథిన్ బాగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు...
   
    ఒకదాని తర్వాత ఒకటి.
   
    వరుసగా చూస్తున్న వికాస్ చూపు.
   
    ఒక్కచోట ఆగింది.
   
    శివానీ మోటార్స్.... శివానీ మోటార్స్...
   
    వివరాలు చూశాడు.
   
    1985లో ప్రారంభమైంది. 1989లో మూసేశారు.
   
    మిషనరీకి మాత్రం ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఫైనాన్స్ చేసింది.
   
    మిగతా వివరాలకు ఎస్.ఎఫ్.సి. అసిస్టెంట్ మానేజర్ (రికవరీస్) ని సంప్రదించాలని వుంది.
   
    మరొక్క నిముషం వేస్ట్ చెయ్యలేదు వికాస్.
   
    మళ్ళీ ఎస్.ఎఫ్.సి.కి వెళ్ళాడు.
   
    అసిస్టెంట్ మానేజర్ నలభై ఏళ్లవాడు. తమిళియన్. పేరు ఏలుమలై.
   
    తనను పరిచయం చేసుకుని, తనెందుకొచ్చాడో చెప్పాడు.
   
    "జింఖానాలో ఉద్యోగం వదిలేసి వచ్చేశారా" జాలిపడ్డాడు ఏలుమలై.
   
    "సివమూర్తి అని, ఆయన పెట్టాడది. హిందూస్థాన్ మోటార్స్ లో చాలాకాలం పనిచేసి వచ్చాడాయన. మేం దాన్ని స్వాధీనం చేసుకుని రెండేళ్ళయినా ఎవరూ రాలేదు. మొట్టమొదట వచ్చిన పార్టీ మీరే. ముందొక సారి అక్కడకెళ్ళి ఫ్యాక్టరీని చూసొస్తే మీకో అయిడియా వస్తుంది. అలాగే శివమూర్తితో కూడా మాట్లాడండి. ఆ తర్వాత మనం డిస్ కస్ చేద్దాం."
   
    వికాస్ లో కొత్త ఉత్సాహం ప్రవేశించింది.
   
    గాజువాకలోని చంపా నగర్లో ఉంటున్నాడు శివమూర్తి.
   
    వెంటనే గాజువాక వెళ్ళే సిటీబస్సెక్కాడు వికాస్.
   
    అరగంట ప్రయాణం.
   
    చంపా నగర్. స్టీల్ ప్లాంట్ దాటాక కొత్తగా కట్టిన కాలనీ- కొండ ప్రక్కన ఉందది.
   
    వికాస్ అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలైంది.
   
    త్రిబుల్ బెడ్ రూం ప్లాట్- ఇంటిముందు గార్డెన్.
   
    గేటుకి 'కుక్క ఉన్నది జాగ్రత్త' బోర్డు.
   
    కుక్కంటే భయం వికాస్ కి. నెమ్మదిగా గేటు తలుపు తీశాడు. ఎక్కడ కుక్క జాడ లేదు.
   
    లోని కడుగేశాడు. గ్రిల్స్ కి ఎడం పక్కనే ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు.
   
    రెండు నిమిషాల్లో ఓ పదేళ్ళ పాప వచ్చింది.
   
    "ఎవరు కావాలండి?"
   
    "శివమూర్తిగారు"
   
    తలుపు తెరిచింది పాప. ఒక సోఫా, రెండు కుర్చీలున్నాయక్కడ.
   
    కూర్చున్నాడు.
   
    మళ్ళీ రెండు నిమిషాల్లో ఆ పాప బైటకొచ్చింది.
   
    "తాతయ్య నిద్రపోతున్నారండి" లోనికెళ్ళిపోయింది.
   
    ఉండాలా.... వెళ్ళాలా? ఎన్ని గంటలకు లేస్తాడో... అక్కడున్న పేపరును తీసుకుని తిరగేస్తున్నాడు....
   
    గంటయింది అక్కడకొచ్చి, విసుగ్గా వుంది వికాస్ కి.
   
    బయటకొచ్చి కాఫీ తాగుదామనుకున్నాడు. బైటకొస్తే మళ్ళీ కుక్క తలుపు తెరవడం.... సమస్యలు....
   
    ఇంకో అరగంట గడిచింది.
   
    లాభం లేదు.... లేచి రావడానికి సిద్ధమయ్యే సమయంలో-
   
    ఏదో అడుగుల చప్పుడుకి తలెత్తాడు.
   
    ఎదురుగా సన్నగా, పొడవుగా వున్న వ్యక్తి జుత్తంతా బాగా తెల్ల పడింది. కళ్ళద్దాలు.
   
    "శివమూర్తిగారు...." లేచి నిలబడ్డాడు వికాస్.
   
    "ఆ.... నేనే" ఆ గొంతు కరుగ్గా ఉంది. శివమూర్తి సోఫాలో కూర్చున్నాడు. వికాస్ నించూనే ఉన్నాడు.
   
    "నా పేరు వికాస్" తనని పరిచయం చేసుకొని, తనెందుకొచ్చాడో చెప్పాడు. అంతా విన్నాడు శివమూర్తి విన్నాక-
   
    "దాన్ని తీసుకొని ఏం చేస్తావ్?"
   
    తనేం చెయ్యదలచుకున్నాడో చెప్పాడు వికాస్.
   
    "నువ్వొక్కడివేనా..... పార్టనర్స్ ఉన్నారా?"
   
    "ప్రస్తుతానికి నేనొక్కన్నే"
   
    "అవసరమైతే డబ్బు పెట్టాల్సి వుంటుంది గదా.... పెట్టగలవా?" అనుమానంగా అడిగాడాయన.
   
    దానికి వెంటనే జవాబివ్వలేదు వికాస్.
   
    "ప్రోపర్టీస్ వున్నాయా.... లేక బ్యాంక్ లోన్ ట్రై చేస్తావా?"
   
    "బ్యాంక్ లోనే" ఏదో చెప్పాలికదాని చెప్పేడు వికాస్.

 Previous Page Next Page