Previous Page Next Page 
సంకల్పం పేజి 20

   

     OIL HAS BECOME A SAVIOR OF MANKIND TODAY AND, PERHAPS, DESTROYER ALSO.
 

    ఆ నానుడికి నువ్వు సమాధి కట్టు - ఆరిన బూడిదలో మిగిలిన ఉప్పు రవ్వలాంటి నీకు మంటలంటే భయం వుండకూడదు- కమాన్ లోపలకెళ్ళి బ్లూ అల్మారాలో సెకండ్ సెల్ లో ఒక రెడ్ ఫైల్ వుంటుంది. తీసుకో - వెళ్ళిపో ఇక వెనక్కి తిరిగి చూడకు...." అంటూ వాలు కుర్చీలో వెనక్కి వాలిపోయారాయన.
   
    వికాస్ లోపలికెళ్ళి ఆ ఫైల్ తో బయటకు వచ్చేసరికి ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అది తెలీని వికాస్ ఆయన కాళ్ళకు మరోసారి నమస్కరించి- ఆయన ప్రశాంతతకు భంగం కలిగించటం యిష్టం లేక విశాఖ బయలుదేరాడు.
   
    ప్రపంచానికి ఒక నూతన శకాన్ని వికాస్ ద్వారా అందించేందుకు మాత్రమే ఆయన మిగిలి వున్నారో.....
   
    వికాస్ కి భానోజీరావు నుంచి ఆహ్వానం రావటం...
   
    లిఖిత ఎంకరేజ్ చేసిన వికాస్ ని భానోజీరావు దగ్గరకు పంపించటం ఆయన అవమానించటం- దాంతో వికాస్ పగ- పట్టుదలను, ప్రతీకారాల్ని, దీక్షా దక్షతల్ని ప్రోది చేసుకోవటం, ఆఖరి రోజుల్ని లెక్కించుకుంటున్న ప్రొఫెసర్ దొరని కలవటం- ఆయనకు డిజైన్ ఇచ్చిన మరుక్షణం చనిపోవటం..... అంతా ఒక మెలో డ్రామాలోని భాగాలే- హ్యూమన్ లైఫ్ లో తారసిల్లే అద్భుత ఘట్టాల మెట్ల వరుసలే-
   
                                      *    *    *    *    *
   
    విశాఖలో బీచ్ ఒడ్డున వికాస్... చయనులు....
   
    పల్లీలు తింటున్నారు ఒక్కొక్కటి.
   
    "భవిష్యత్తులో పెట్రోలు బంకుల స్థానంలో బ్యాటరీ బంకుల ఏర్పాటు అవసరమౌతుంది. ఆ అవసరం వచ్చేలా చేస్తాను" కలలో అన్నట్లుగా అన్నాడు వికాస్.
   
    చయనులు మేనల్లుడి వేపు విస్మయంగా చూశాడు.
   
    "ధ్వని, పొగరహిత బ్యాటరీతో నడిచే మూడు, నాలుగు చక్రాల వాహనాల్ని నేను తయారుచెయ్యాలి. పరిసరాల్ని కూడా పరిరక్షించాలి" ఎక్కడో వున్నట్లుగా అన్నాడు వికాస్ తిరిగి.
   
                                     *    *    *    *    *
   
    ఆ మర్నాడే తెల్సినచోట అప్పుచేసి బొంబాయి వెళ్ళిపోయాడు వికాస్.....లోకల్ ట్రైన్ లో జుహూకి వెళుతూ ఆలోచించసాగాడు.
   
    ముందు తన దగ్గరున్న డిజైన్ ని డాక్టర్ విలియమ్స్ కి చూపించాలి- ఆయన్ని ఒప్పించాలి- ఆయన లాబ్ లో బ్యాటరీని తయారు చేయించుకోవాలి- ఓల్డ్ మారుతీకి బిగించి పరీక్షించి చూడాలి, సక్సెస్ అయితే ఆ తరహా బ్యాటరీ తనకు మాత్రమే సప్లయ్ చేసే నిబంధనని పెట్టాలి- మరో పదేళ్ళ వరకు కార్ ఎలక్ట్రిక్ బ్యాటరీని బయట కంపెనీలకు అమ్మకూడదు. డిజైన్ సీక్రెసీని మెయిన్ టైన్ చేయాలి- అల అని ఆయన్ను ఒప్పించాలి.
   
    డాక్టర్ విలియమ్స్ నీతి, నిజాయితీల కొరకు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దపడే వ్యక్తి- అని ప్రొఫెసర్ అప్పన్నదొర చెప్పిన మాటలు జ్ఞప్తికొచ్చి ధైర్యాన్ని పుంజుకున్నాడు వికాస్.
   
    ఎంతో నిరీక్షణ తరువాత సాయంత్రం ఐదుగంటలకు డాక్టర్ విలియమ్స్ అపాయింట్ మెంట్ దొరికింది వికాస్ కి.
   
    తను వచ్చిన పని- ప్రొఫెసర్ అప్పన్నదొర గురించి- ఆయన డిజైన్ గురించి చెప్పి, నిబంధనల్ని కూడా మృదువుగా చెప్పి డిజైన్ ని ఆయన చేతిలో వుంచాడు.
   
    ప్రొఫెసర్ అప్పన్నదొర బ్రెయిన్ చైల్డ్ కి రూపకల్పన చేయగలగడం ప్రతిష్టాత్మకమైన విషయంగా భావించిన విలియమ్స్ వికాస్ కి ఆ లాబ్ లోని గెస్ట్ రూమ్ ని కేటాయించి, ఆ రాత్రి పదిగంటలకే రూపకల్పనకు నాంది పలికాడు.
   
    క్షణాలు.... నిమిషాలు.... గంటలు... రోజులు.... వారాలు.... నెలలు....రూపకల్పన యజ్ఞంలో కరిగిపోయాయి. ఆరువారాలకు బ్యాటరీ తయారయింది.
       
    దాన్ని చూసిన వికాస్ కళ్ళు చెమర్చాయి.
   
    డాక్టర్ విలియమ్స్ కాళ్ళకు సమస్కరించి బ్యాట్రీని అప్పటికే సిద్దంగా ఆ లాబ్ ఆవరణలో వుంచిన ఓల్డ్ మారుతీ కారుకి ఫిట్ చేసి కారులో కూర్చుని ఒక్కసారి ప్రొఫెసర్ అప్పన్నదొరని, తన మేనమామ చయనుల్ని, డాక్టర్ విలియమ్స్ ని స్మరించుకొని ఇగ్నిషన్ కీ తిప్పాడు.
   
    కాని శబ్దం రాలేదు.
   
    వికాస్ మొఖం క్షణాల్లో వివర్ణమైంది.
   
    "భయపడకు మిస్టర్ వికాస్.... ఈ బ్యాటరీ ఒక మేధావి ఆలోచనల్ని ఆధారం చేసుకొని ఊపిరి పోసుకున్నది. ఫెయిల్యూర్ అన్నది దొరని చూసి భయపడుతుంది...." అన్నాడు విలియమ్స్ గంభీరంగా.
   
    "మరి.... మరి- కారు స్టార్టు కాలేదే....?" షాక్ లో వుండి అడిగాడు వికాస్. అతని కంఠంలో జీవం లేదు.
   
    "కారు స్టార్టు అయింది- ఇది ఎలక్ట్రిక్ కారని మర్చిపోయావా? స్టార్ట్ అయిన దీనినుంచి శబ్దం రాదు. గేర్ మార్చి ఏక్సిలేటర్ నొక్కు" అన్నాడు విలియమ్స్ విజయగర్వంతో.
   
    వికాస్ ఆశ్చర్యపోతూ క్లచ్ నొక్కి, గేర్ వేసి, నెమ్మదిగా క్లచ్ ని వదులుతూ, ఏక్సిలేటర్ ని రెయిజ్ చేశాడు- అంతే.... పెట్రోల్ కారుకంటే వేగంగా ముందుకు దూకింది.
   
    వెయ్యి గుర్రాల హార్స్ పవర్ తన కారుకీ, తనకీ వచ్చినట్లుగా అనుభూతించిన వికాస్ వెర్రి ఆనందంతో, భరించలేని ఆనందోద్వేగంతో లాబ్ ఆవరణలో గేర్స్ మార్చుతూ కారుని గాలికంటే వేగంగా నడపసాగాడు.
   
    హిజ్ మాస్టర్స్ వాయిస్....
   
    దొర గొంతు తనను ఆశీర్వదిస్తోంది.
   
    తనకు జైర్గిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోమని చెబుతోంది. ప్రపంచాన్ని జయించి, శాసించమని ఉద్భోదిస్తోంది.  తన అస్థిత్వానికో ఆసరా కల్పించుకొమ్మని వెలుగెత్తి అరుస్తోంది.
   
    దొర జీవితపు చరమసీమలో ప్రసవించిన ఒక నూతన శకం ఎలక్ట్రిక్ కారు.... ఈ విషయం, ఈ విజయం, ఇదే కారులో భీమిలి వెళ్ళి దొరకి తెలపాలని ఉంది వికాస్ కి.
   
    నిశ్శబ్దంగా ఎలక్ట్రిక్ ట్రైన్ లా దూసుకుపోతున్న కారుని చూసి తనని అప్పటివరకు ఆవరించుకొని ఉన్న నీరవ నిశీధాల నిశ్వాసాల్ని తరిమి తరిమి కొట్టాడు వికాస్.
   
    కలల పొరల క్రింద... ఆశల అరల మాటున, ఆశయాల గోడల మాటు నుంచి దుమికిన తన భవిష్యత్ ఈ కారు.....
   
    ఆనందాశ్రువులతో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ మూడు గంటలపాటు ఏకధాటిగా కారుని రకరకాలుగా నడుపుతూ, ఇంజన్ ని ఆఫ్ చేస్తూ, స్టార్ట్ చేస్తూ,  పూనకం వచ్చిన వాడిలా అయిపోయాడు వికాస్.
   
    వికాస్ మానసిక స్థితిని, ఆనందాన్ని, ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని అర్ధం చేసుకోగలిగిన డాక్టర్ విలియమ్స్ లాబ్ లోకి వెళ్ళి మరో బ్యాటరీ రూపకల్పనకు లేత్ మిషన్ ముందు కూర్చున్నాడు.
   
                                      *    *    *    *    *
   
    మరో రెండు రోజుల తరువాత మొదటి బ్యాటరీని జాగ్రత్తగా చేయించుకొని విలియమ్స్ కి నమస్కరించి విశాఖ బయలుదేరాడు వికాస్.
   
    ఒక్కొక్క మెట్టుపై విజయం సాధిస్తున్న కొద్ది వికాస్ లోని ఆత్మవిశ్వాసం సంకల్పబలం రెట్టింపవుతున్నాయి.
   
    ఇక మిగిలింది....ఆటోమోబైల్ పరిశ్రమకి చెందిన ఒక సిక్ యూనిట్ ని పట్టుకొని ఆ యాజమాన్యాన్ని తన ప్రపోజల్ ద్వారా అంగీకరింప జేయటం. ఈలోపు అంతకంటే ముందుగా చేయవలసింది- ఒకటుంది. అతి ముఖ్యమైంది, ప్రధానమైంది, తనకు దారి చూపించి, సహకరించి, ఉత్సాహ పరిచి, వెన్నుతట్టిన ప్రొఫెసర్ అప్పన్నధోరణి కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకోవటం, ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ట్రైన్ వెళ్తూనే వుంది. వికాస్ కలల నిండా ఎలక్ట్రిక్ కార్లు.... ఆయిల్ బ్యాంకుల స్థానంలో బ్యాట్రీ ఛార్జింగ్ సెంటర్స్...
   
                                      *    *    *    *    *
   
    ఆ నిజాన్ని నమ్మలేక పోయాడు వికాస్.
   
    ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
   
    వెక్కి వెక్కి ఏడ్చాడు చిన్నపిల్లాడిలా.... గుండెలు పగిలేలా ఏడ్చాడు....నిద్రాహారాలు మానేసి ఏడ్చాడు.... స్మశానం మధ్య బూడిద కుప్పయిన విజ్ఞానాన్ని, మేధస్సుని, చూసి మరీ ఏడ్చేశాడు. కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు, రెండు రోజులు దొర బూడిదయిన స్మశానం నుంచి పిచ్చివాడిలా కదలలేక పోయాడు. వికాస్ చేతిలో అద్బుతాన్ని సృష్టించబోయే బ్యాట్రీ నీట్ గా ప్యాక్ చేసుంది. దానికేసి, బూడిద కుప్పకేసి నిర్లిప్తంగా, నిస్తేజంగా చూస్తుండిపోయాడు.

 Previous Page Next Page