Previous Page Next Page 
మధుకీల పేజి 20

    మధు ముఖం మాడిపోయింది.
    సూట్ కేసు అందుకుని బయటకు నడవబోయాడు.
    "అన్నయ్యా!"
    జయప్రద పిలుపుకి ఆగిపోయాడతను.
    "నో! నో! జయా! వాణ్ణలా పిలవకు వాడ్ని వెళ్లని పాపం భార్యని సంరక్షించుకోనీ డోంట్ వర్రీ. మీకు నేనున్నాను."
    ఇక వున్నంతకీ తిట్లు దీవెనలూ తప్ప ఫలితం లేదనుకుని వెళ్ళిపోయాడు మధు.
    స్మశాన ప్రశాంతత అలుముకుంది ఇంట్లో.
                               *        *        *
    "గుడ్ మార్నింగ్"
    "ఓహో! సుధాకర్ నువ్వా? అత్తయ్య వాళ్లు బాగున్నారా?"
    "బావున్నారు?"
    "ఏమిటి ఈ మధ్య కాలేజీకి అసలే రావటంలేదు"
    "ఏం చెయ్యను మేడం. మా అన్నయ్య ఇల్లరికపుటల్లుడైపోయాడు. ఇంటి బాధ్యత అంతా నాదే అయింది."
    ఆ విషయం విని ఆశ్చర్యపోయింది ఆమె.
    "అరెరే! మధు ఎంత తెలివితక్కువ పని చేసుకున్నాడు
    "ఏముంది యిక ఇంటికి పెద్దదిక్కును నేనే. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను"
    "అయ్యయ్యో! యెంత కష్టం వచ్చింది. నాకు కాలేజీకి టైం అవుతోంది వెళుతున్నాను. సాయంకాలం కనిపిస్తానని చెప్పు అత్తయ్యకి శ్రద్ధగా చదివి డిగ్రీ తెచ్చుకో" అని వెళ్ళిపోయింది ఆమ
    "పురాణం చెపుతోంది నా బాధ్యత నాకు తెలీదా" అని అనుకుని అటుగా వచ్చిన స్నేహితుడి వెంట అతనిరూంకి వెళ్లాడు సుధాకర్.
    వీళ్ళిద్దరు రూంకు వెళ్ళేసరికి అక్కడ మరో నలుగురు అయిదుగురు పేకాట రంజుగా ఆడుకుంటున్నారు. వీళ్లూ వెళ్ళి కలిశారు.
    'ఒరే! మా నాన్నగారు నెలకి రెండుసార్లు ఎం.
    చిద్విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ 'ఒరే! డబ్బు మనల్ని వెదుక్కుంటూ రాదురా? దాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్లాలి. ఉద్యోగం చేసో ఊడిగం చేసో సంపాదించడం ఓ మార్గం. అడుక్కుతినడం అధమమార్గం. కాలేజీ చదువుపేరిట లాక్కోవటం రాజమార్గం. కానీ అన్నిటికన్నీ ఉత్తమమార్గం అడక్కుండా ఇంట్లో డబ్బెక్కడుందో తెలుసుకుని అవసరానికి తగినంత తెచ్చుకుని ఖర్చుచేసుకుంటం.'
    "దొంగతనమా?"
    "ఛ. ఛ. ఎంత మాటన్నావు. మన డబ్బుని మనం వాడుకోవటం దొంగతనమా?"
    అందరూ నవ్వేరు. అంతలో ఒకతను షో చేశాడు. సుధాకర్ కౌంట్ యిచ్చేడు. పదహారు రూపాయలూ అందిచ్చేడు.
    "దొంగసొమ్ము దొరలపాలు" అన్నాడొకడు.
    "షటప్! పేకాటలో డబ్బు ఎప్పుడూ పారుతూన్న నదిలా ప్రవహిస్తూనే వుంటుంది. ఈ క్షణంలో నా జేబులో మరో క్షణంలో నీ చేతిలో. చివరికంతా ఖర్చయిపోయేదే" అని 'పంచు! పంచు! ముక్కలు టైం వేస్టు' అన్నాడు సుధాకర్. ఆట మోజులో మునిగి పోయారంతా.
                             *        *        *
    "జయా!"
    "ఏం నాన్నగారూ!"
    "ఇలారా తల్లీ!"
    వంటింట్లో తల్లికి కూరలు తరిగి యిస్తున్న జయ చేతులు శుభ్రం చేసుకుని తడి చేతులు కొంగుకి తుడుచుకుని వచ్చింది.
    "ఇదిగో తల్లీ! నా స్టడీ రూంలో రెండో అల్మెరా పై అరలో అయిదో పుస్తకం భాగవతం అష్టమస్కంధం వుంటుంది తీసుకురా తల్లీ."
    "పుస్తకం మీరేం చేస్తారు నాన్నగారూ!" అని నోరు జారబోయి నాలిక్కరుచుకుని గదిలోకి వెళ్ళి అందంగా అట్టలు వేసిన ఆ పుస్తకం తీసుకుని తండ్రివద్దకు వచ్చింది.

 Previous Page Next Page