"వచ్చావమ్మా! ఇలారా! ఆ కుర్చీ దగ్గరిగా లాక్కో. అందులో గజేంద్రమోక్ష ఘట్టం తీయ్."
అలాగే చేసింది జయప్రద.
"కష్టం అనుకోకుండా నాలుగుపద్యాలు చదువుతల్లీ."
మెల్లిగా ప్రారంభించింది, సన్నని కంఠంతో తీగలా సాగుతున్న గొంతుకతో అద్బుతంగా వుందన్నట్టుగా పదం పదం విరిచి చదవసాగింది ఆమె.
రాగంలేదు. సంగీత జ్ఞానంలేదు ఆమెకి.
అయినా పద్యానికి తగిన లయతో భావానుగుణ్యమైన రాగంతో క్లుప్తంగా విలరంగా విడమరచినట్టుగా చదవసాగింది ఆమె.
తన్మయుడై వుంటున్నాడు సుందర్రావు.
వంటగదిలో వంటపనిలో నిమగ్నమైన సుందర్రావు భార్య అన్నపూర్ణ కూడా వినసాగింది ఆ కథనాన్ని.
ఆ ఇంటినీ ఆ పరిసరాల్ని మరితి త్లలీ కూతురు గజేంద్రుని వన విహారంలో దుఃఖంలో, కష్టంలో, ప్రార్ధనలో ఫలితంలో మునిగిపోయారు. ముఖ్యంగా జయప్రద చదువుతూ వుంటే పరవశుడయిపోయాడు సుందర్రావు.
దాదాపు గంట గంటన్నర ముగిశాక అన్నపూర్ణ గదిలోంచి బయటికి వచ్చింది.
తల్లికి పనిని వదిలి వచ్చినందుకు సిగ్గుపడింది జయప్రద.
కానీ తండ్రికి ఆనందాన్ని, చిత్తశాంతిని చేకూర్చగలిగినందుకు సంతోషించింది. సుందర్రావు ముఖంలో ఆనందం- తదాత్మ్యం-భావనా ప్రపంచంలో శ్రీహరిని చూసినంత పరవశం ప్రతిఫలిస్తున్నాయి.
"ఇక భోజనానికి లేస్తారా?"
"ఆఁ" అన్నారు సుందర్రావుగారు.
దాదాపు పదకొండు దాటివుంటుంది. మీకు పోతన గారి పద్యాలు వింటూ ఆకలి గుర్తుకి వచ్చినట్టులేదు" అంది అన్నపూర్ణ.
"నిజమే పూర్ణా! భక్ష్య భోజ్యాలతో భోంచేసి నట్టుగా వుంది."
"మరి భోజనం అక్కర్లేదా?" ముసి ముసి నవ్వుతో అందామె.
"అలా అడిగితే అక్కర్లేదనే చెప్పొచ్చు. శ్రీహరి నామం సోకిన జిహ్వకు యీ రుచులు నచ్చకపోవచ్చు. కానీ ప్రపంచంపై ప్రాణి నిలవాలంటే భోజనం అవసరం. మనమంకా అన్నగత ప్రాణులం పూర్ణా! ఆఁ ఆఁ యిక భోజనాలు ఏర్పాటు చెయ్. నీవు అన్నం మాటెత్తగానే ఆకలి ప్రారంభమైంది."
తల్లీ కూతుళ్లు వెళ్ళి భోజనాలకి ఏర్పాటు చేశారు.
కంచం ముందు కూర్చుని పచ్చడి కలుపుకుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుని "కందిపచ్చడా?" అన్నాడు సుందర్రావు.
"ఆఁ"
"చాలా కమ్మగా వుంది" అని తృప్తిగా తిని పప్పు కలుపుకున్నాడాయన. "చుక్క కూరలా వుందే" అన్నాడు మళ్ళీ.
"అవును-మీ కిష్టమైనవే అన్నీ కుదిరాయి. మెంతిచారు కూడా చేశాను." అంది అన్నపూర్ణ.
"ఒక్కోరోజు అదృష్టం అలా వుంటుంది. ఇంకో కడుపు ఎరుపు తెచ్చుకుందామా అన్నంత ఆకలి- అందుకు తగ్గట్టుగా కూరలూ అమరుతాయి. ఈ రోజు సాహిత్య భోజనంతోపాటు చవులూరించే తిండీ దొరికింది. అహఁ అలా అని రోజూ బావుండదని కాదు. రోజూ తినే తిండి అయినా రోజూ చేసే సంసారమే అయినా దిన దినానికో రుచీ క్షణ క్షణానికో అనుభవం నిత్య నూతనత్వాన్ని కలిగిస్తాయ్. ఈ రోజు యింకేం శుభం జరుగుతుందో"
అన్నపూర్ణ జవాబివ్వకుండా భర్తకి వడ్డించటంలో నిమగ్నమైంది.
సుందర్రావు తృప్తిగా భోంచేశాక తల్లీ కూతుళ్ళు భోజనం చేశారు.
వంటిల్లు శుభ్రంచేసి బయటికి రాబోతున్న అన్నపూర్ణకి వసారాలో ఎవరో భర్తతో మాట్లాడుతున్నట్లనిపించింది.
గబగబా బయటికి వచ్చింది.
శాస్త్రిగారు!
కానివేళ వచ్చారేమిటా అని తలుపు చాటునే నిలుచుంది ఆమె. వాళ్ళిద్దరూ ఏం మాటాడతారో అనుకుంటుంది.
"అవును సుందర్రావ్! నీ పనిమీదే వచ్చాను. ఎండనపడి వచ్చిందీ నిజమే. కానీ ఆత్మీయలం అలా అనుకుంటే ఎలా!"
"చాలా సంతోషం శాస్త్రిగారూ! ఈ ఎండలో రెండు మైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ అంత దూరంనించి వచ్చారంటే నాపై ఎంత దయో లెక్కించగలను."
"లేదులే! పక్కవీధిలో పనికూడా వుండింది. కానీ ముఖ్యం మీ పనే"