"ఏమిటండి యిది?"
తబ్బిబ్బవుతూ "ఏది....ఏది......ఏమిలేదు శ్రీ.....ఏదో నిద్రరాక యిలా చూస్తున్నాను అంతే"
గలగలా నవ్వింది. ఆ నిశ్శబ్దంలో నిద్రపోయి లేచిన ఆవిడ గొంతుక మరి మృదువుగా మధురంగా వుంది. "వెనుకటి కేవడో రాజు మంచిదని రేయల్లా దొంగిలించాడట! అలా నిదురరాలేదని యిలా క్రొత్త పుస్తకమని చూస్తూ కూర్చుంటే ఎలా నిదుర పడుతుంది? రండి ఇక పడుకుందురు కానీ"
ఇంకేమి అనకుండా పుస్తకం మూసేసి లేచాడు. మెల్లిగా అతనిపై చేయివేసి అనుకుని సరసనే నడుచుకుంటూ వచ్చి మంచంపై వాలింది అతనితోటి.
"తలనొప్పిగా వుందా?"
"ఉహూ"
"గాలి ఆడటంలేదా?"
"ఊ" అన్నాడు ఇంకేమనాలో తోచక.
విసనకర్ర అందుకుని మెల్లిగా విసురుతూ ఓ చేత్తో మెల్లగా చెక్కిళ్ళ పై నిమురసాగింది.
ఆవిడకి ఎదురుగా తిరిగిముడుచుకుని ఒరిగి పడుకున్నాడు. కుడి చేయి ఆమె వీపు మీదగా వేస్తూ.
ఇంకాస్త దగ్గరిగా జరిగి మెల్లగా విసరసాగింది.
ఎప్పుడూ నిదుర పట్టిందో!
అలసట వల్లో, చాలా సేపు మేలుకోవటం వల్లో చల్లగా గాలి సోకుతూ వుండటం వల్లో మెల్లిగా నిదురలోకి జారిపోయాడతను.
ఆవిడ మాధవ్ నిదురపోవటం గమనించి విసనకర్రని అలా పారేసి మెల్లిగా తన చేత్తో అతన్ని చుట్టి యింకాస్త హత్తుకుని పడుకుంది.
మరో పది నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది.
ముఖం కడుక్కుని వచ్చి అక్కగారి చేతిలోంచి కాఫీ గ్లాసు అందుకుంటూ అంది.
"కాఫీ అలవాటు లేదేమో అక్కా? మరి".....
"ఎప్పుడయినా అవసరమవుతుందేమో నని మీ బావగారు నెస్ కాఫీ తెచ్చి వుంచారు."
"కాఫీని ఆప్యాయంగా ఆస్వాదిస్తూ అడిగింది. మరి బావగారికి? నీకు? బాబుకి?"
"మాయిద్దరికి బోర్నవిటా వుంది. బాబుకి హార్లిక్స్ కలిపాను. లేస్తూనే యివాలి యిద్దరికీ."
చిన్నగా నవ్వింది సరోజ.
"ఎందుకు నవ్వుతావ్"
"ఏముంది? వెనుకటికెవరో తండ్రి స్మార్తుండు. తల్లి మధ మతస్థురాలు. తనయుడు డారాధ్యుండు" అన్నట్టుగా ఒకరు బోర్నవిటా, కొడుక్కి హార్లిక్స్, ఇంటికి వచ్చిన వాళ్ళకి నెస్ కాఫీ. బావుందక్కా బావుంది. మరి సాయంకాలం ఎవరైనా వస్తే టీ యిస్తారా!"
రుసరుస లాడింది శ్రీదేవి.
"ఏమిటి సరోజ! నీకు ప్రతిది వేళాకోళంగా వుందా ఏమిటి? చదువుకోవటానికి వచ్చిన దానివి యిలా అయితే యిక సంబడం చెప్పాలా? నీకు చదువూ వద్దూ సంధ్యా వద్దూ శుభ్రంగా యింటికెళ్ళిపో"
ఆ మాట వింటూనే సరోజ ముఖం మ్లానమైంది. గతరాత్రి విన్న సంభాషణ అంతా గుర్తుకువచ్చింది. ఈ ఉచిత సలహా వెనక దాగివున్న విష హృదయంమాట తలచుకునే సరికి ఆవిడకి ఒళ్ళంతా కంపర మెత్తింది.
బరువుగా అంది. "సరే అక్కయ్యా! నీ మాటే వింటానులే"
చాలా సంతోషించింది శ్రీదేవి.
కానీ పైకి ఆ సంతోషం వెలికి రాకుండా చూసుకుని అంది ఆప్యాయంగా!" చాలా మంచిది. ఆ ! నా మాట వింటూనే మానేశావా ఎమిటిలే? అయినా నీ యిష్టం"
"కాదక్కా నీ మాట వింటాను. బావగారు వస్తూనే చెప్పి వెడతాను. యిప్పుడే."
"అబ్బ! నీతో ఏది వచ్చిన చిక్కే. అయినా అంత అర్జంటేమిటి? ఇంకా నాలుగు రోజులుండి వెడుదువుగానీ"
జీవం లేని నవ్వు నవ్వి "కాదులే అక్కా! నీకు తెలియదు. ఇప్పుడే వెడతాను" అంది.
"సరే ! నీ యిష్ట మేనన్నానుగా"
ఇంకాస్త ఒత్తిడి చేస్తే ఎక్కడ ఆగిపోతుందో, మళ్ళీ తద్దినం కొని తెచ్చుకొన్నట్టవుతుందేమోనని మౌనం వహించింది.
అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కుని వచ్చి తల దువుకుంటు పిలిచాడు మాధవ్. రాత్రి సరిగా నిద్రలేక పోవడంతో ముఖం గండరించి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నయ్.
గ్లాసు తీసుకుని వెళ్ళి యిస్తూ అంది.
"విన్నారా?"
"చెప్పకుండానే ఎలా వింటాను!" కొంచెం కొంచెంగా రుచి చూస్తూ ప్రశ్నించాడు.
"సరి! మీ వేళాకోళాలకేం గానీ, మా సరోజ యింటికి వెళ్ళి పోతుందట."
"ఎందుకు?" సాధ్యమైనంత మనస్సుని నిగ్రహించుకుంటూ అన్నాడు.
"ఆవిడకి చదవటం యిష్టం లేదట"
సరిగ్గా అదే సమయానికి అటు వచ్చిన సరోజ ఆ మాట విని అంది. "అదేం కాదు బావగారూ! నాకు కాలేజిలో సిటు వచ్చింది. దానివెంటే హాస్టల్ కి కూడా అప్లై చేశాను. అందులోనూ సీటు వచ్చింది. హాస్టల్ లో వుండి చదవాలని వుంది. ఈ రోజే జాయిన్ కావాలి. అందుకని యిప్పుడేవెడతానంటున్నాను."
నివ్వెరపోయి అంది శ్రీదేవి "అయితే చదువు మానుకుని యింటికి వెడతానన్నమాట ఒట్టిదేనా!"
పేలవంగా నవ్వి ఒకసారి నిర్ణయించుకున్నా విషయాన్ని అంత తేలిగ్గా మర్చుకోలేనక్కా సరేదాఏమిటి? నేను వెళ్ళి వస్తాను బావగారూ!"
వాళ్ళు ఏమి అనటానికి అవకాశం యివకుండా బయటికి వెళ్లి వెళుతున్న రిక్షాని కేకేసింది. వాడికి సామాను చూపించి రిక్షాలో పెట్టించింది.
ఇద్దరూ గేటు వద్దకి వచ్చారు.
రిక్షాలో ఎక్కుతూ అంది. "వెళ్లొస్తాను బావగారూ! అక్కయ్యా వెడతాను. పాపం నాతో హాయిగా నాలుగు రోజులు గాపాలనుకున్నావ్. అయితే ఏం చేస్తాం........బావకి చెప్పు"
రిక్షా కదిలింది.