సంతానాన్ని నిలువుగుడ్లేసి చూస్తూ అచేతనంగా వుండిపోయాడు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రొఫెసర్ పరశురాం. "మొదటి భార్యపోతే రెండో పెళ్ళిచేసుకున్నాను బాబూ". పరశురాం అయోమయంగా చూశాడు. "దానికి సినిమా పిచ్చి తప్పిస్తే వేరే బుద్దులేంలేవు బాబూ". సంతానం తగ్గి చెప్పడంమొదలుపెట్టాడు. ప్రొఫెసర్ పరశురాంకు ఇప్పుడర్ధమయింది. సినిమాపిచ్చి పోయి భర్త పిచ్చెందుకు పట్టుకుందో దేవయానికి. యురేకా! యురేకా! నూతన ప్రయోగంలో విజయం సాధించినవాడిలా తబ్బిబ్బయిపోయాడు ప్రొఫెసర్ పరశురాం. "సంతానం! నీ భార్యగురించి ఆందోళన పడొద్దు. ఆమెను త్వరలో మామూలుమనిషిని చేస్తాను. రేపు ఉదయం ఓసారి తీసుకురా" అన్నాడు పరశురాం ఉత్సాహంగా. "పనిలో పని. ఆ సినిమా పిచ్చికూడా వదలగొట్టండి బాబూ. మీకు పుణ్యంవుంటుంది". ప్రొఫెసర్ పరశురాం పక్కలెగిరేట్టు నవ్వాడు "సరే వెళ్ళిరాసంతానం". సంతానం రెండడుగులు వేసి ప్రొఫెసర్ గొంతు విని ఆగాడు "రేపు మర్చిపోకుండా నీ భార్యను తీసుకురా". "అట్టాగే బాబూ" అని సంతానం వెళ్ళిపోయాడు. పరశురాం లేచి డైనింగ్ హాల్లోకి వచ్చాడు. "రవి, దేవయానిని చూట్టానికి ఇప్పుడు మనం వెళ్ళనక్కరలేదు" "ఎందుకని అంకుల్" మహతి ఉద్విగ్నంగా అడిగింది. "ఆమె భర్తే ఇప్పుడువచ్చి వెళ్ళాడు" "ఆమె భర్త వచ్చాడా?" మహతి రిలీఫ్ గా నిట్టూర్చింది. "ఏమంటాడు" రవి అడిగాడు. "నేను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఆమెను రేపు ఉదయం తీసుకురమ్మన్నాను". "తీసుకొస్తానన్నాడా?"
"ఆ నువుకూడా వస్తేమంచిది. రాగలవా?" పరశురాం రవిని అడిగాడు. "రవి ఎందుకు అంకుల్?" మహతిమధ్యలో కల్పించుకుని అంది. "ఏం రాకూడదా?" మహతి కేసి చూస్తూ అన్నాడు రవి. "అనవసరం. వీణ మళ్ళీ తెగిపోయింది. పనికిరానిది తెచ్చావుగా? కొత్తది కొనాలి" రవి బలహీనత తెలిసిన మహతి అంది. "అలాగే మహతీ! రేపు కొందాం" మెత్తబడి అన్నాడు రవి. ప్రొఫెసర్ పరశురాం చిరాకుపడ్డాడు. మహతి అతనిచిరాకుని చూసి పట్టించుకోలేదు. "యస్ అంకుల్ ఎట్టిపరిస్థితుల్లోనూ రవి రేపు ఉదయం రాడు" మొండికేసినట్టుగా అంది మహతి. "రావా రవీ?" అడిగాడు పరశురాం రవి ముఖంలోకి చూస్తూ. "వీణ తీగ కొనడానికి వెళ్ళాలి. క్షమించండి" పక్కచూపులు చూస్తూనడిగాడు రవి. మహతి రవికేసి సంతోషంగా చూసింది. ఆమెకళ్ళల్లో నుంచిగర్వం తొంగిచూసింది. పరశురాంతల పంకించాడు. "సారీ అంకుల్. ఏమీ అనుకోవద్దు. రవి రాలేడు" అంది మహతి. "రవి రాకుండా నువాపగలవేమో? కాని...." అంటూ పరశురాం మహతికళ్ళల్లోకి చూశాడు. "కాని...చెప్పండి అంకుల్. ఆగిపోయారేం!" "కిరణ్ రాకుండా నువాపలేవుగదా!" చాలా తాపీగా అన్నాడు ప్రొఫెసర్. మహతి త్రుళ్ళిపడింది. ముఖం వెలవెలాపోయింది. పచ్చివెలక్కాయగుజ్జు గొంతుకు చుట్టుకున్నట్టుగా అయింది. "అంకుల్ "గొంతు పెగుల్చుకొని అంది మహతి. "అవును మహతీ...." "ఏమిటి అవును?" "రవి రాకపోతే కిరణ్ వస్తాడు. తప్పక వస్తాడు. అంతే!" రవి ముఖంలోకి చూస్తూ పరుషంగా అన్నాడు ప్రొఫెసర్ పరశురాం. ఈయనకు మతిపోయింది. పైగా తాగాడు. అరపెగ్గు ఎక్కువకూడా తాగాడు. ఇప్పుడు ఈయనతోవాదించినా లాభంలేదు.
"ఫర్వాలేదు. మీరు వెళ్ళొచ్చు రేపు ఉదయం కిరణ్ వస్తాడని చెప్తున్నాగా? రవితో నాకు పనిలేదులే". "అంకుల్?" పరశురాం చిరునవ్వు నవ్వాడు. "మీ యిష్టం అంకుల్. రవినే తీసుకొస్తాను. ముందు మీరు రవినేగా రమ్మన్నారు?" కంగారుగా అంది మహతి. "మరి రవిని తీగ కొనాలంటున్నాడుగా?" పరశురాం నవ్వుతూ అడిగాడు. "ఏం రవి! రేపు ఉదయం...." రవి ముఖం చూసిన మహతికి ఆ పై మాటలు గొంతులో నుంచి పెగల్లేదు. అతడి ముఖం నిగనిగలాడుతోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మందకొడిగా ఉండే అతని చూపులు తీవ్రంగా ఉన్నాయి. మహతి మొహం ఈడ్చి ఈడ్చి వడగాల్పుకొట్టినట్టుగా అయింది. "ఓకే మహతీ!" అన్నాడు పరశురాం. మహతి రవినే చూస్తూ ఉంది. "ఓకే రవీ గుడ్ నైట్!" రవి కంఠం కూడా తీవ్రంగా ఉంది. "అంకుల్...." ఏదో అనబోయిన మహతిచెయ్యి పట్టుకొని" కమాన్ మహతీ!" అంటూ రవి ఆమె రెక్కపట్టుకొని లాగాడు. ముందుకు తూలబోయిన మహాతిని ప్రొఫెసర్ పట్టుకొన్నాడు. "రా మహతీ!" గుంజుతున్నాడు రవి. ప్రొఫెసర్ మహాతిని వదిలి ఆమె ముఖంలోకి చూశాడు. పులి నోట్లోపడిన లేడిపిల్లలా మహతి గిజగిజ లాడుతోంది. నిస్సహాయంగా ప్రొఫెసర్ కేసి చూసింది. "నీ కొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వెళ్లు" అన్నట్టుగా చూశాడు పరశురాం తాపీగా. "వస్తావా, లేక నన్నెళ్ళిపొమ్మంటావా?" రవి కంఠం కరుకుగా ఉంది. "వెళ్ళు మహతీ?" పరశురాం కంఠం ధైర్యం చెబుతున్నట్టుగా ఉంది. మహతి వెళ్తూ రెండుసార్లు వెనక్కు తిరిగి పరశురాంకేసి చూసింది. 'వెళ్ళు ఫర్వాలేదు' అని చూపులతోనే చెప్పాడు ప్రొఫెసర్ పరశురాం.