Previous Page Next Page 
మనసున మనసై పేజి 20


    తండ్రి ఆఫీసు నుంచి డైరెక్ట్ గా నర్సింగ్ హోముకు వచ్చాడు.
    తండ్రి రావడంతో తడబడింది జయంతి మొహం ముడుచుకుని అక్కగారివైపు తిరిగి కూర్చుంది తండ్రిని చూడనట్టే. ఆయన ఒక్కక్షణం జయంతిని అక్కడ చూసి ఆశ్చర్యపడ్డా తేరుకుని ఏం జరగనట్టే' ఊ....ఎలా వున్నాడు మనవడు....' అంటూ భార్య వడిలో పడుకున్న పసివాడిని దగ్గిరకెళ్ళి మురిపెంగా చూశారు. తరువాత కూతురి దగ్గరకెళ్ళి "ఏం ప్రాబ్లం లేదు కదా, మీ ఆయనకి ఫోను చేశాను, సాయంత్రం ట్రైనుకి బయలుదేరి వస్తానన్నాడు. ఏమన్నా ఇచ్చారా తినడానికి దీనికి' అని భార్యని  అడిగాడు. పది నిమిషాలు ఈమాట ఆ మాట మాట్లాడారు. కాని జయంతిని పలకరించలేదు. పద్మావతి కంటితో సైగ చేసింది. జయంతిని పలకరించమన్నట్టు. ఆయన పంతంగా పెదాలు బిగించి అవసరం లేదన్నట్టు తలాడించారు.
    'అమ్మా, నీవు నాన్నగారితో ఇంటికెళ్ళిపో వంటా అదీ చూడాలిగా-భోజనం అది చేసి ఏకంగా రాత్రికిరా-నీవెళ్ళి దమయంతిని పంపు' అంది వాసంతి.
    'అది వచ్చేవరకు వంటరిగా...' ఆవిడ సందిగ్ధంగా చూసింది.
    జయంతి వుందిగా.... అది వచ్చే వరకు కూర్చుంటుందిలే' అంది.
    తల్లి ఖాళీ ఫ్లాస్కులు, బట్టలు, క్యారేజి అవి తీసుకుని బయలుదేరింది. ఇద్దరూ వెళ్ళాక 'జయా, నాన్నతో మాట్లాడలేదేమో మర్యాదగా పలకరిస్తే ఆయన సంతోషించే వారు గదా. అయినా నీకెందుకే ఇంత పంతాలు, పట్టింపులు' చెల్లెలితో మందలిస్తున్నట్లంది.
    'ఆయన మాట్లాడరా నాతో! నేనెవరినో అన్నట్టు మొహం తిప్పేసుకున్నారు చూశావుగా' ఉక్రోషంగా అంది జయంతి. 'ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఇన్నాళ్ళకి కనిపిస్తే కూతురిని గదా ఎలా వున్నావు అనైనా అన్నారా.
    'బాగుంది. ఇంట్లోంచి దెబ్బలాడి వెళ్ళింది నీవు. వాళ్ళేం పొమ్మనలేదుగా నిన్ను, చిన్న దానివి నీకే అంత పంతం పౌరుషం వుంటే ఆయనకుండదా'    
    'అంతా నన్నే అంటారు. నేనేం చేసినా తప్పుకిందే లెక్క' మొహం ముడుచుకుని, పట్టుకున్న గొంతుతో అంది.
    "ఇంకా ఎందుకే ఈ పంతం పట్టుదల- అతను మన ఇంటి అల్లుడయ్యాడు. దమయంతి హాయిగా సంతోషంగా ఉంది. జయా, ఒక్కమాట మాత్రం చెప్పదలిచాను. గోపాలకృష్ణని వదులుకుని నీవు చాలా తప్పుచేశావు. నిజంగా అతన్ని పొందడం దమయంతి అదృష్టం అనుకో అదేలే ఎవరికెవరు రాసిపెట్టారన్నది ఎంత నిజమో! అతను నలుపన్న ఒక్కమైనస్ పాయింటు తప్ప అతను మనిషి చాలా మంచివాడు, సరసుడు, మంచి ఫేమిలీ, భలే సరదాగా మన దమయంతిని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా. అతనింట్లో అంతే చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇతను తాత పోలికట ఇతను తప్ప అంతా బాగున్నారు. అమెరికాలో అతని కజిన్స్ వాళ్ళు ఉన్నారు. అంతా మంచి సంస్కారం ఉన్నవాళ్లు-వాళ్ళ ఫేమిలీ యూనిటీ చూస్తే ముచ్చటేస్తుంది' వాసంతి చెప్పుకుపోయింది. జయంతి మొహంలో మారే రంగులు చూడలేదు వాసంతి. మొహం గంటి పెట్టుకుని 'చాలే పొగడ్తలు ఆపుతల్లీ నన్నెందుకు మధ్యబోరు చేస్తావు. అంత మంచి వాడయితే దమయంతి హాపీగా వుంటే అంతే చాలులే... జయంతి మాట పూర్తికాక ముందే దమయంతి గోపాలకృష్ణ వచ్చారు లోపలికి.. తనెక్కడికి వెడితే అక్కడికి ఈ మహానుభావుడు తయారవుతున్నాడు ఖర్మ అనుకుని జయంతి కాస్త మొహం చిట్లించింది.
    హాయ్ వదినగారు, కంగ్రాట్యులేషన్స్.....అంటూ వాసంతిని పలకరించి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు - 'అబ్బో ఆడపిల్లలాగ ఎంత జుత్తో, మీ పోలిక కనిపిస్తూంది అవును కదూ దమ్మూ..... దమయంతి 'అపుడే ఏం తెలుస్తాయి లెండి' అంది నవ్వి. జేబులోంచి వందరూపాయల నోటు బాబు గుప్పిట్లో పెట్టాడు. 'అయ్యో ఇప్పుడెందుకు తరువాత బారసాల అని వుంటాయిగా' అంది. వాసంతి మొహమాటంగా.
    'దేనిదారి దానిదే.... ఇప్పుడిస్తే అక్కడివ్వనని ఏం లేదు లెండి-వుత్తిచేత్తో పసివాళ్ళ ని చూడడానికి వస్తామా" అన్నాడు. మొహం తిప్పుకుని కూర్చున్న జయంతిని చూసి 'హలో చిన్న వదినారు-మీరొచ్చారే' అన్నాడు నవ్వుతూ-జయంతిని చూస్తే అతనికి కాస్త ఆటపట్టించాలనిపిస్తుంది. 'పోనీలెండి, పసివాడన్న మిమ్మల్ని రప్పించగలిగాడు'....జయంతి బ్యాగు పట్టుకుని చటుక్కున లేచి నిల్చుంది 'ఇంక వెడతానక్కయ్యా, చీకటిపడ్తూంది. నీవింటికి ఎప్పుడు వెడతావు. వెళ్ళే లోగా మరోసారి వస్తాలే....' అంది బయటికి నడుస్తూ....
    'నేనొచ్చానని వెళ్ళిపోతున్నారేమిటి, నేనే  బయటికి వెడతా మీరు కూర్చోండి' అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ. 'అవసరం లేదు. మీరే కూర్చోండి' అంటూ విసవిస బయటికి వెళ్ళిపోయింది జయంతి.
    'అమ్మ బాబోయ్. ఈవిడకెంత కోపం, పంతం, ఎన్నాళ్ళయినా మర్చిపోదుగాబోలు.
    'ఆఁ.....దాని మొహం, కోపం ఏమిటి, తగ్గిపోయినట్టనిపించడానికి ఇగో ప్రాబ్లమ్ అంతే, అదేం పట్టించుకోకండి మీరు' వాసంతి అంది.
    'అక్కయ్యా, నీవన్నా చెప్పకపోయావా, ఇప్పుడన్నా ఇంక ఇంటికి రమ్మని, ఉషారాణి కూడా వెళ్ళిపోయింది. వంటరిగా ఆ గదిలో ఎందుకు....' దమయంతి అంది.
    'చెప్పానే, ఏమిటో దాని తత్వం అర్ధం కాదు. ఎవరన్నా చెపితే వింటే బాగానే వుండును, దానంతట అదే దారికి రావాలి...'

 Previous Page Next Page