Previous Page Next Page 
మనసున మనసై పేజి 19


    పదిన్నర అయ్యాక దమయంతి జయంతి ఆఫీసుకి ఫోనుచేసి చెప్పింది. 'ఓ అలాగా, ఎప్పుడు ఎప్పుడయింది పురుడు....' జయంతి ఎగ్జయిటింగ్ గా అడిగింది. ఎంతైనా తన అక్కకి కొడుకు పుట్టాడన్న వార్త విని ఆనందించకుండా ఎలా వుండగలదు. అందులో వాసంతి జయంతికి ఏన్నర్ధమే తేడా ఏమో యిద్దరూ స్నేహితురాళ్ళుగా వుండేవారు. జయంతి మొండితనం చేసి తల్లిచేత తిట్లు తిన్నప్పుడు వాసంతి ఓపిగ్గా జయంతి తప్పు ఎత్తిచూపేది. మంచి చెడ్డ ఆరిందలా వివరించేది. పంతం, కోపం, దురుసుతనంతో నీ నీ వెవరిని సాధించలేవు. మంచి తనంతో మనుష్యులు దగ్గిరవుతారు అంటూ బోధించేది తల్లి. కోపంగా చెప్పిన దానికంటే వాసంతి మాటల ప్రభావం జయంతి మీద ఎక్కువ వుండేది. అకారణంగా అందరిలో అక్కయ్యంటే అభిమానమే జయంతికి. 'బాబు ఎలా వున్నాడు! ఎవరి పోలిక' అంటూ ఉత్సాహంగా అడిగింది. 'వచ్చి చూడు ఎవరిపోలికో...' అంది దమయంతి నవ్వి. జయంతి ఒక్క క్షణం వూరుకుని "రావచ్చా నేను-చూడచ్చా వచ్చి" అంది నెమ్మదిగా. 'అదేమిటక్కయ్యా... నిన్నెవరు అసలు వెళ్ళమన్నారని రావచ్చా అని అడుగుతున్నావు పిచ్చి అనుమానాలేం పెట్టుకోకుండా వచ్చి చూడు అక్కయ్యా మరీ మరీ చెప్పింది రమ్మని అంది. 'సరే, సాయంత్రం ఆఫీసయిపోగానే వస్తాను....' అంది, 'గీత నర్సింగ్ హోమేగా' అని అడిగి తెలుసుకుంది.
    సాయంత్రం నాలుగున్నరవగానే కావాలనే ఓ అరగంట పర్మిషన్ అడిగే వంకతో దివాకర్ గదిలోకి వెళ్ళింది. 'ఎస్' అన్నాడు దివాకర్ కాగితాలలోంచి తలెత్తి-'ఓ అరగంట ముందు వెళ్ళడానికి పర్మిషన్.
    "ఏం, ఏమన్నా అవసరమా...' ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "ఏం లేదు, అక్కయ్యకి కొడుకు పుట్టాడట, నర్సింగ్ హోముకెళ్ళి చూద్దామని' అంది.
    'పుట్టాడట.... అంటున్నారు. ఆ సంగతి ఇప్పుడే తెలిసిందా, మీకు ఇంకో సిస్టర్ వున్నారా. ఆవిడా ఇక్కడే ఉంటారా...' కుతూహలంగా అడిగాడు.
    'ఆఁ... దమయంతి ఫోను చేసి చెప్పింది. మా సిస్టర్ ఇక్కడ ఉండదు - పుట్టింటికి వచ్చింది.' అతను అర్ధం కానట్టు చూశాడు.
    'అదేమిటి మీరు ఆ రోజు నా రూము అది అన్నారు. మీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారా మరి మీరు...
    జయంతి గాభరాపడి తడబడింది. జవాబు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధంకాలేదు. ఇంట్లో దెబ్బలాడి వచ్చి విడిగా ఉన్నానంటే ఏం బాగుంటుంది. అతను తను వంటరిగా వున్నానంటే తన వాళ్ళు ఇంకో వూరనుకొని వుంటాడు. కళ తప్పిన జయంతి మొహం చూశాడు ఆశ్చర్యంగా, జయంతి ఏం చెప్పకపోవడం చూసి ఏదో అనుమానం తట్టి మరీ పర్సనల్ విషయాలు అడిగితే బాగుండదని 'ఓ.కే. వెళ్ళండి' అన్నాడు జయంతి బతుకు జీవుడా అన్నట్టు బయటపడింది.
    ముందు బజారుకెళ్ళి ఏమన్నా కొని పట్టికెడితే బాగుంటుంది. చంటి పిల్లాడిని చూడడానికి ఖాళీ చేతులతో వెడితే బాగుండదనిపించి మంచి బేబీ డ్రస్సు, ఒక జాన్సన్ కిట్ (ఆయిల్, పౌడరు, సబ్బు, క్రీము) అన్నీ వుండేది కొంది. నర్సింగ్ హోముకెళ్ళేసరికి పద్మావతి గదిలో ఉంది. తల్లిని చూసి తొట్రుపడింది. అప్రయత్నంగానే గుండె గొంతులోకి వచ్చినట్టు ఏదో అడ్డుపడినట్టు గుటక మింగింది. పద్మావతి నిర్వికారంగా లోపలికొచ్చిన కూతురిని చూసి పలకరింపుగా నవ్వి 'బాగున్నావా' అంది. గబగబ తల ఆడించింది. అలికిడికి వాసంతి కళ్ళు విప్పి చెల్లెలి వంక అభిమానంగా చూసి నవ్వింది. జయంతి గబగబ వాసంతి మంచం దగ్గరికి నడిచి చెయ్యి నొక్కి 'కంగ్రాట్స్' అంది. తన వడిలో పడుకోబెట్టుకున్న మనవడిని పొత్తిళ్ళతో అందిస్తూ 'మీ పిన్నమ్మ వచ్చిందిరా బాబూ నిన్ను చూడడానికి' అని జయంతి చేతిలో పెట్టింది మనవడిని. జయంతి భయం భయంగా ఎత్తుకుని 'అమ్మో ఇంత చిన్నగా వున్నాడేమిటి...' అంది. 'ఎన్ని పౌనులున్నాడు' ... 'ఆరు పౌనులు' అంది పద్మావతి. 'జాగ్రత్త మెడ కింద చెయ్యి వెయ్యి' అంది- 'ఇదిగోరా నీకో డ్రస్సు' అక్కా వీడికోసం జాన్సన్ కిట్ పట్టుకువచ్చాను. ఏ సబ్బుతో పడితే ఆ సబ్బుతో రుద్దకండి' అంది. 'అబ్బో పరవాలేదు నాయనా. మీ పిన్నికి ఈ మాత్రం ముద్దు ముచ్చట గురించి తెలుసు. నీకో డ్రస్సు వచ్చిందిరా' అంది పద్మావతి నవ్వి. 'కూర్చోవే' అంది వాసంతి.
    'నార్మల్ డెలివరీయేనా' అక్కగారిని అడిగింది. తల ఊపింది వాసంతి.'బావగారెప్పుడు వస్తున్నారు...' 'పోను చేశారు. వస్తారు రేపటికో, ఎల్లుండికో' అంది- అంతసేపు అక్కగారితో తప్ప తల్లితో మాట్లాడలేదు జయంతి. 'ఇది చిక్కింది కాస్తా - ఆ బొద్దుతనం లేదు. మరి స్వయంగా వండుకుని తినడమాయె- ఇంటిపట్టున తల్లి వండిపెట్టినట్లుంటుందా' అనిపించింది తల్లి ప్రాణానికి. ఏం జరగనట్టు తను మాట్లాడుతున్నా కూతురు తనతో మాట్లాడలేదు అన్నది అర్ధమైనా ఆమె ఏమీ ఎరగనట్టే వూరుకుంది. ఈ కూతురు విషయంలో ఎప్పుడో గుండె రాయి చేసుకుంది పద్మావతి. ఒకరకమైన విరక్తిలోంచి పుట్టిన నిర్లిప్తత అది! అది మారదు, చెప్పినా వినేరకం కాదు అది చిన్న పిల్లకాదు - ఎక్కడో అక్కడ సుఖంగా వుంది అది చాలు అన్న నిర్లిప్తత.

 Previous Page Next Page