"సెకండ్ హాండా?" అందామె చిరాగ్గా.
"కాదు మేడమ్! బ్రాండ్ న్యూ! రెండు రోజుల క్రితం అతను కొన్నాడుట. అమ్మెయ్యమని అడిగాను. ఒప్పుకోలేదు. మంత్రమేసి ఒప్పించాను" అన్నాడు సగర్వంగా.
నవ్విందామె. "ఎలా బెదిరించావ్?"
"కారు ఇవ్వకపోతే ఏజెన్సీ రద్దు చేస్తానని చెప్పాను. వద్దువద్దని లబలబలాడేడు. కారు ఇస్తే గోవా ఏజెన్సీ కూడా ఇస్తామని చెప్పాను. గోవా ఏజెన్సీ అంటే కోవాలాంటిది. ఎలా వదులుకుంటాడు?"
"ఒకోసారి నువ్వుకూడా తెలివిగానే ప్రవర్తిస్తూ వుంటావు" అంది మృదుల.
జయదేవ్ నోరు మూతబడిపోయింది.
""బాంబేనుంచి ఎవరు తెస్తారు కారు?"
"శ్రీమంత్ ని పంపుతున్నాను."
"నేను కూడా వెళతాను."
"యస్ మేడమ్! ప్లేస్ టిక్కెట్స్ తెప్పించనా?"
"తెప్పించు. ఇప్పటికప్పుడు దొరుకుతుందా టిక్కెట్టు?"
"ఎందుకు దొరకదు మేడమ్! ఒక ఐదొందలు ఎక్కువ పే చెయ్యాలి. అంతే. మరి రిటర్న్ జర్నీ ఏ తారీఖుకి..."
"తిరిగొచ్చేటప్పుడు కొత్త కార్లోనే వస్తాను."
ఆశ్చర్యంగా నోరుతెరిచాడు జయదేవ్.
"అన్ని వందల కిలోమీటర్ల కారు ప్రయాణం..."
పంతంగా చూసింది మృదుల.
"చెప్పినట్లు చెయ్యి."
"ఎస్ మేడమ్!" అని కాస్త తటపటాయించి, "మీకు అభ్యంతరం లేకపోతే... శ్రీమంత్ కూడా ప్లేన్ లోనే వస్తాడు మీతోబాటు. మీరు వంటరిగా ప్రయాణం చేయడం..." అంటూ సాభిప్రాయంగా చూశాడు.
బోర్ గా ఒకసారి శ్రీమంత్ వైపు చూసిందామె.
"నలిగినా బట్టలు నీ యూనిఫారమా?" అంది విసుగ్గా.
శ్రీమంత్ మాట్లాడకుండా చూశాడు.
"ఏదో చెయ్! నీ ఇష్టం!" అని టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ బయటికెళ్ళింది మృదుల.
"టెంపరెక్కువ!" అన్నాడు శ్రీమంత్ జయదేవ్ వైపు తిరిగి కన్ను గీటుతూ.
స్ స్ స్
అది ఒక వుమెన్స్ హోమ్.
లత అందులో చేరి రెండు రోజులవుతోంది. మామయ్యా వాళ్ళ ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన తర్వాత అయిదురోజులపాటు వనితా వాళ్ళ యింట్లో వుంది తను. అక్కడ ఉంటూనే ఈ హాస్టల్లో సీటుకోసం ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ వేకెన్సీ ఒకటి రావడం తనని చేర్చుకోవడం జరిగాయి.
ఇదో కొత్త లోకం!
ఇదో కొత్త జీవితం!
ముభావంగా అయిపోయింది లత ఈ మధ్య.
తోడేలులాంటి మావయ్యా, స్థిరత్వం లేని శ్రీమంత్, హద్దు దాటని తన ఆశలూ, ఆ మాత్రం ఆశలు కూడా తీరని పరిస్థితులూ తలుచుకుంటూ ఉంటే చిరాగ్గా వుంటోంది.
లత ఉండే రూమ్ లో రెండు బెడ్స్ ఉన్నాయి. ఆ రెండో అమ్మాయి పేరు సుకన్య. చాలా నెమ్మదస్తురాలు. చాలా అందగత్తె.
హాస్టల్లో చేరిన కొద్దిరోజులలోనే, ఖచ్చితంగా, నిర్మొహమాటంగా మాట్లాడే లత, అణకువగా, బెదురుగా ఉండే సుకన్య కి గార్డియన్ లాగా అయిపోయింది. లతలాగే సుకన్యకి శుభ్రతమీద పట్టింపు ఎక్కువ. బట్టలు తెల్లగా మల్లెపువ్వులాగా ఉతుక్కునేది. లత డ్యూటీలతో హడావిడిగా ఉన్నప్పుడు, ఆమె బట్టలకి కూడా తనే సబ్బు రాసి వుంచేది.
"క్రితం జన్మలో నువ్వు నాభార్యవయి ఉంటావ్! అందుకే నాకీ సేవలు!" అనేది లత నవ్వుతూ. ఆమెకి సుకన్య తన చెల్లెల్లా కనబడడం మొదలెట్టింది.
"భలే చెప్తారక్కా మీరు! సేవలు చెయ్యడానికేనా భార్యలు?" అంది సుకన్య నవ్వుతూ. లత ఆ అమ్మాయిని 'నువ్వు' అనేస్తోంది గానీ సుకన్య మాత్రం లతని యింకా బహువచనంలోనే సంబోధిస్తోంది.
"నేను అనట్లేదు చెల్లెమ్మా! లోకం అంతా అలా కోడై కూస్తోంది" అంది లత కూడా నవ్వుతూ.
సుకన్య మాట్లాడుతుంటే ఏ భామాకలాపం నృత్యమో చూస్తున్నట్లు వుండేది లతకు. అదే అడిగింది.
"నువ్వు డాన్స్ నేర్చుకున్నావా ఏమిటి?"
"కూచిపూడి నేర్చుకున్నాను" అంది సుకన్య మొహమాటంగా.
"ప్రోగ్రాములు ఇస్తావా?" అంది లత ఆసక్తిగా.
సుకన్య నవ్వి వూరుకుంది.
"ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నావ్. పెళ్ళి చేసుకుంటే మొగుడిచేత నువ్వే డాన్స్ చేయిస్తావ్ - నీ అందంతో."
అందంగా సిగ్గుపడింది సుకన్య.
హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది లతకి.
సుకన్యతో జరిగిన ఈ రెండు నిమిషాల సంభాషణలోనూ పెళ్ళి, భార్యా, భర్తా అనే పదాలు రెండుసార్లు దొర్లాయి.
అంటే నిముషానికోసారి పెళ్ళి గురించి ఆలోచిస్తోందా తను! పెళ్ళి మీద అంత ఆశగా వుందా! పెళ్ళి కాదేమోనని అంత భయంగా వుందా?
అసలు పెళ్లెలా చేసుకుంటుంది తను? పెళ్లి అనేది అయితే గియితే శ్రీమంత్ తో అయి ఉండాల్సింది.
వూహల్లో శ్రీమంత్ తో ఎంత చనువు పెంచేసుకుంది తను! అది గుర్తురాగానే లత చెంపలు లజ్జతో ఎర్రబడ్డాయి.
ఛీ!
ఇంకే మొగాణ్ణి గురించీ తనెప్పుడూ అలా ఆలోచించలేదు.
కానీ శ్రీమంత్ ని గురించి మాత్రం... ఆ నెలరోజుల ఊహాప్రపంచంలో...తన ప్రియుడిగా, తన భర్తగా... ఇంకా నిజం చెప్పాలంటే... తనకు పుట్టబోయే పిల్లల తండ్రిగా కూడా వూహించింది.
కానీ అతను జైల్లో పడేంత క్రమశిక్షణలేని వ్యక్తి అని మాత్రం వూహించలేదు.
ఇప్పుడు ఇంకో మొగాడిని అతని స్థానంలో వూహించుకోనూ లేదు.