Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 21

శ్రీమంత్ ని పెళ్ళి చేసుకోలేదు తను!
కానీ నిజంగా తను అతడిని మరిచిపోగలిగిందా?
ఏమో!
శ్రీమంత్ ఇప్పుడు తన కోసం వస్తే తను అతనితో సరిగా మాట్లాడుతుందా? అతను తనవల్ల తప్పేమీ లేదని నమ్మించగలిగితే అతనితో మామూలుగానే వుండగలుగుతుందా?
ఈక్షణంలో అతనొస్తే...
"నీకోసం ఎవరో వచ్చారు" అంది రేణుక, పక్క రూమ్ అమ్మాయి.
చటుక్కున లేచి నిలబడింది లత. గుండెలు గబగబ కొట్టుకున్నాయి ఉద్వేగంతో.
శ్రీమంతా!
"నీకోసం కాదు. సుకన్య కోసం!" అంది రేణుక నవ్వుతూ.
తనమీద తనకే అసహ్యమేసింది లతకు.
ఇదేమిటి? ఆ జులాయి మనిషికోసం తపించిపోతోందా తను?
సుకన్య నవ్వుతోందేమోనని అటు చూసింది.
సుకన్య నవ్వడం లేదు! ఆమె మొహం భయంతో పాలిపోయి వుంది.
"ఏమైంది సుకన్యా?" అంది లత కంగారుగా.
ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది సుకన్య. కానీ ఏదో ఉందనీ, జరగకూడనిదేదో జరిగిందనీ, ఆమె మొహం చూస్తేనే అర్ధం అయిపోతోంది. సుకన్య మొహంలో భావాలు దాగవు.
"చెప్పు! ఏమి జరిగింది" అంది సుకన్య మంచం దగ్గరగా వచ్చి నిలబడుతూ.
చెబుధామా, వద్దా అని సంకోచిస్తూ, బెదురుగా చూసింది సుకన్య. ఆమె పెదిమలు కదల్చబోయేంతలో, "సుకన్యా! నీ కోసం వచ్చిన గెస్ట్ వార్డెన్ రూమ్ లో కూర్చొని ఉన్నారు" అంది హరిప్రియ అనే ఇంకో అమ్మాయి, అటువైపు వెళుతూ.
సుకన్య భయంతో స్పృహతప్పి పోయేలా కనబడుతోంది.
లతా ఆమెను నిశితంగా చూసి, "ఎవరొచ్చారు" అంది రేణుకతో.
"ఎవరో మొగాళ్ళు!" అంది రేణుక బయటికెళ్ళబోతూ.
"నాతో చెప్పు సుకన్యా! ఏమైంది?" అంది లత అనునయంగా.
"మీరు కాస్త తోడు రండి. ప్లీజ్! నాకు భయంగా వుంది" అంది సుకన్య.
"పద!"
ఇద్దరూ వార్డెన్ రూములోకి నడిచారు.
చిన్నరూమ్ అది. ఒక డెకొలామ్ టాప్ టేబులు, నాలుగు కుర్చీలు, ఫానూ. అంతే ఫర్నిచర్. వార్డెన్ అమృతవల్లి కూర్చునుంది. ఆమెకెదురుగా ఒకతను. బాగా పొడుగ్గా, చామనచాయగా వున్నాడు. బిగుతుగా, ఒంటికి అతుక్కున్నట్లు ఉన్న పసుపురంగు టీషర్ట్, నీలంరంగు కార్డ్రాయ్ జీన్సూ వేసుకుని ఉన్నాడు. మధ్యపాపిట తీసి దువ్విన పొడుగు జుట్టు మెట్లు మెట్లుగా మేడమీదికి పడుతోంది. చెంపలమీద గుబురుగా పెంచుకున్న సైడ్ లాక్స్, కుడిచేతికి స్టీల్ కంకణం లాంటిది ఉంది. షర్టుకి పై మూడు గుండీలు పెట్టుకోలేదు. అతను జయదేవ్! మృదులకి మేనేజర్!
    
                                                                   * * *
    
వార్డెన్ రూమ్ లో కూర్చొని ఉన్న జయదేవ్ ని చూడగానే ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేసింది సుకన్య.
"సుకన్యా! ఈయన నీతో మాట్లాడాలిట! విజిటర్స్ రూమ్ లోకి తీసికెళ్ళి మాట్లాడు" అంది వార్డెన్ అమృతవల్లి.
వద్దన్నట్లు తల వూపుతూ భయంతో గుటకేసింది సుకన్య.
లత కల్పించుకుంది.
"ఎవరాయన" అంది వార్డెన్ తో.
"సుకన్య కజిన్ ట"
"అవునా సుకన్యా?"
కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సుకన్య.
"ఆయన సుకన్య కజిన్ అని ఎవరు చెప్పారు?" అంది లత అమృతవల్లి వైపు తిరిగి.
"ఆయనే చెప్పారు" అంది వార్డెన్ గట్టిగా.
"ఇప్పుడు టైమెంతయింది?" అని ఆమెని నిలదీస్తున్నట్లు అడిగింది లత.
ఆమెకి లత అలా మాట్లాడడం అవమానమనిపించింది.
"వాట్ డూయూ మీన్? నన్నే ప్రశ్నలడుగుతున్నావేమిటి?"
"మరి రూల్స్ కి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు మిమ్మలినిగాక ఇంకెవరిని అడగాలి ప్రశ్నలు?"
"ఏంచేశాను రూల్సుకి వ్యతిరేకంగా?"
"అది చెప్పడానికే అడుగుతున్నాను టైమెంతయింతని? ఇప్పుడు ఏడున్నర అవుతోంది. సాయంత్రం అయిదునుంచి ఆరున్నరదాకే విజిటింగ్ అవర్స్. టైమైపోయిన తరువాత వచ్చిన వాళ్ళని, అందులో మొగవాళ్ళని వెనక్కి పంపించెయ్యల్సింది పోయి, మీ రూమ్ లో కూర్చోబెట్టుకుని సుకన్యకి కబురంపిస్తారా?"
"ఆ అమ్మాయి అతను తన కజిన్ కాదంటోంది. అతన్ని పంపించెయ్యండి."
గత్యంతరం లేక అతనితో "మీరెళ్ళిపోండి ప్లీజ్!" అంది అమృతవల్లి బతిమాలుతున్నట్లు.
అతను ఆమెని ఖాతరు చెయ్యలేదు. అదోరకంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. అతని మొహంలో కొంచెం ఆశ్చర్యం కనబడుతోంది.
"ఈ అమ్మాయి కొత్తగా ఇక్కడ చేరింది." అంది వార్డెన్ భయపడుతూ.
"చేరాల్సిన చోటికే చేరింది" అన్నాడు జయదేవ్. "పేరు లత. వయసు ఇరవై రెండు సంవత్సరాలు. ఎత్తు ఐదడుగుల ఆరంగుళాలు. ఐడెంటిఫికేషన్ మార్క్సు, ఎడమ మోకాలికిందుగా తేనెరంగు పుట్టుమచ్చ, కుడి మోచేతి దగ్గర ఇంకో పుట్టుమచ్చ. తండ్రి పేరు..." గడగడ వప్పచెప్పేస్తున్నట్లు చెబుతున్నాడతను.
నుదురు చిట్లించి తీక్షణంగా అతని వైపు చూస్తోంది లత.    
ఇతనెవరు?
తననిగురించి పూర్తి వివరాలు ఇతనికెలా తెలుసు?
"ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? తీరిగ్గా ఆలోచించు. నేనెవరినో గుర్తొస్తుంది."
"మీరెవరయినా నాకనవసరం! మీరు సుకన్య జోలికొస్తే బావుండదు." అంది లత.
"తనేం లీడర్ ననుకుంటోందా లేక ప్లీడర్ ననుకుంటోందా సుకన్యకి సపోర్టుగా రావడానికి! కాస్త చెప్పండి నా సంగతి!" అన్నాడు జయదేవ్ వ్యంగ్యంగా.

 Previous Page Next Page