Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 20

 

    ఎక్కడెక్కడి బంధువులూ, వెదుక్కుంటూ వచ్చారు పెళ్ళికి. ఇంతకుముందు శశికాంత్ పార్టి ఇచ్చి తను దివాలా తీశానని చెప్పగానే కాన్ఫరెన్సు వుందని నెపం చెప్పి వెళ్ళిపోయిన ఉజ్వల, ఇపుడు నిజంగానే ఉన్న కాన్ఫెరెన్స్ ని కేన్సిల్ చేసుకుని మరి వచ్చింది.

 

    పెళ్ళయిపోయాక రిసెప్షన్.

 

    రిసెప్షన్ లో వధువరులిద్దరూ సోఫా దగ్గర నిలబడి వున్నారు. గెస్టులు ఒక్కొక్కళ్ళు వచ్చి- పూలహారాలు వేసి, తెచ్చిన బహుమతులు అందజేస్తున్నారు. కెమెరా ఫ్లాష్ లు నిర్విరామంగా వెలుగుతున్నాయి. వీడియో కెమెరా ఏ చిన్న డిటెయి ల్ ని కూడా మిస్సయిపోకుండా రికార్డు చేస్తోంది.

 

    పరమహంస కూడా వచ్చాడు పెళ్ళికి. చిన్న బహుమతి తెచ్చాడు. చందనంతో చెక్కిన గీతోపదేశం దృశ్యం అది.

 

    నవ్వి దాన్ని అందుకున్నాడు శశికాంత్.

 

    అందరికంటే చివరగా వచ్చాడు ఒక వ్యక్తీ. ఏనుగు తొండమంత లావుగా వున్న గులాబీల మాల ఉంది అతని చేతుల్లో. మనిషి మునిగిపోయెంత పెద్దదిగా వుంది అది. హారాన్ని మోసుకొస్తున్న మనిషి మొహం దాని వెనుక కప్పడిపోయి కనబడటం లేదు.

 

    హారాన్ని అతి కష్టం మీద తీసుకువచ్చి శశికాంత్ మెడలో వేశాడు ఆ మనిషి.

 

    అప్పుడు కనబడింది అతని మొహం.

 

    అతను కార్తిక్! శశికాంత్ కజిన్! శశికాంత్ కి ఒకప్పుడు కుడిభుజం లాంటి వాడు. శశికాంత్ దివాలా తీశాడని తెలియగానే తన దారి తను చూసుకున్నవాడు.

 

    "నువ్వా?" అన్నాడు శశికాంత్ అయిష్టంగా.

 

    వెంటనే నిస్సంకోచంగా శశికాంత్ పాదాల మీదికి జారిపోయాడు కార్తిక్.

 

    "కజిన్! కైండ్లి ఎక్స్యుజ్ మీ?" అన్నాడు దీనంగా.

 

    " ప్లీజ్ గెటప్! అండ్ ప్లీజ్ గెట్ అవుట్!" అన్నాడు శశికాంత్ కటువుగా..

 

    అతను అవమానాలని మరిచిపోడు.

 

    "శశి....."అనబోయాడు కార్తిక్.

 

    "ప్లీజ్ గెట్ ది హీల్ అవుటాఫ్ హియర్ !" అన్నాడు శశి కాంత్ కటువుగా.

 

    అందరూ  చిత్రంగా చూస్తున్నారు వాళ్ళిద్దరిని!

 

    మ్లానవదనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తిక్. అక్కడే నిలబడి ఉన్న ఉజ్వల మాత్రం మనసులో వున్న భావలేవి బయట పడకుండా నవ్వు మొహంతో చూస్తూ ఉంది.

 

    అటూ ఇటూ చూసి - "రేపు పెట్టారు ముహూర్తం" అన్నాడు శశికాంత్ రహస్యంగా సౌమ్యతో.

 

    అది విని కూడా - విననట్లు ఊరుకుంది సౌమ్య.

 

    "ముహూర్తం దేనికాని అడగరేం?" అన్నాడు శశికాంత్ కవ్విస్తున్నట్లుగా.

 

    ఇబ్బందిగా- సిగ్గుగా చిరునవ్వు నవ్వింది సౌమ్య.

 

    మన శోభనానికి రేపు మహుర్తం పెట్టారు. ఇంకా ఇరవై నాలుగు గంటలు ! ఎలా ఉండగలను!" అన్నాడు శశికాంత్.

 

    తల దించుకుంది సౌమ్య.

 

    అది గమనించింది ఉజ్వల.

 

    "రహస్యాలు మాట్లాడుకోవడానికి చాలా రోజులు ముందున్నాయి . ఇప్పటికి మీ ముందున్న మాతో మాట్లాడండర్రా?" అంది హాస్యంగా.

 

    అందరూ నవ్వారు.

 

    వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉండగా వచ్చాడు తేజస్వి. అతనితో బాటు ఆఫీసు సిబ్బంది- మరికొందరూ కూడా వచ్చారు. - తాము తెచ్చిన బహుమతిని తీసి చూపించాడు తేజస్వి.

 

    చిత్రంగా - అదికూడా గీతోపదేశం బొమ్మే.

 

    "ఏమిటి? మీ కంపెనీలో వాళ్ళందరికీ భగవద్గిత భాగా వంటపట్టిందా ఏమిటి? మీ ఎక్స్ ప్రోప్రయిటర్ గారు కూడా గీతోపదేశం బొమ్మే ప్రెజెంట్ చేశారు" అన్నాడు శశికాంత్ నవ్వుతూ.

 

    "అలా ఇవ్వడంలో ఏదన్నా హీతోపదేశం ఉందేమో?" అంది ఉజ్వల.

 

    మళ్ళీ నవ్వులు.

 

    ఫంక్షన్ ముగిసి సౌమ్య పడుకునే సరికి అర్ధరాత్రి దాటింది. సొమ్మసిల్లి పోయింది శరీరం. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. నిద్ర పట్టి పట్టగానే కల!

 

    అదే కల! తనకు కలవరం కలిగించే కల!

 

    ఒక అనాధాశ్రమం!

 

    అందులో చిన్నీ. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చిన్నీ.

 

    "అమ్మా అమ్మా అమ్మా" అంటూ.

 

    ఎందుకో గానీ - అతనితో  బాటు అనాధాశ్రమంలో వున్న పిలలు అందరూ కూడా పెద్దగా ఏడుస్తున్నారు. అంతా గోలగోలా ఉంది.

 

    ఎందుకు?

 

    చటుక్కున మెలకువ వచ్చింది సౌమ్యకి.

 

    నిజంగానే శోకాలు వినబడుతున్నాయి.

 

    ఇంటిల్లిపాదీ ఏడుస్తున్నారు.

 

    పిల్లలూ- పెద్దలు కూడా.

 Previous Page Next Page