Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 20


    
    " బెదిరిస్తున్నావా?"
    "కాదు హెచ్చరిస్తున్నాను"
    ఇన్స్ పెక్టర్ నవ్వాడు.
    "నిన్ను కూడా లోపలవేసి సత్కారం చేయమంటావా?"
    "కలలు కనకు ఇన్స్ పెక్టర్....! మేము ఉద్యమించడానికి రెడీగా వున్నాం. నిన్ను తిరిగి ఈ కుర్చీలో కూర్చునే అవకాశం లేకుండా చేయడానికి మాకెంతో సేపు  పట్టదు. మర్యాదగా అభినయ్ ని విడిచిపెట్టటం మంచిది."
    ఇన్స్ పెక్టర్ నోపు విప్పేలోగా సెల్ లోంచి పిలిచాడు అభినయ్.
    "పూర్ణా"
    పూర్ణ నిర్లక్ష్యంగా సెల్ కేసి కదిలాడు.
    తను తొందరపడి అతడిని కొట్టానా అన్న మీమాంసలో పడిపోయాడు ఇన్స్ పెక్టర్.
    "పూర్ణా! నేను తప్పు చేశాన్రా! తప్పు చేసిన వాళ్లను చట్టం పట్టుకొని శిక్ష వేయించడం  న్యాయం. చట్టాన్ని మనం గౌరవించాలి. అందుకే వీళ్లు కొట్టినా నేను మాట్లాడలేదు.
    నా శక్తి నీకు తెలుసు నేను తప్పించుకోవాలంటే ఈ పోలీస్ స్టేషన్, పోలీసులు, తుపాకులు, లాఠీలు నన్ను ఏమీ చేయలేవు. మీరు శాంతించండి. శాంతిభద్రతలకు మీరు భంగం కలిగించకండి. ఎలాంటి ఉద్రేకానికీ లోను  కావద్దు."
    ఆ మాటలు ఇన్స్ పెక్టర్ విన్నాడు.
    అతనికి చట్టం పట్ల గౌరవానికి  విస్మయం చెందాడు.
    కానీ... కానీ.. .అలాంటి పని ఎందుకు చేశాడన్నదే అతనికి అర్దం కావడంలేదు.
    పి. పి. గారు ఫోన్ చేస్తే అతడిని అరెస్ట్ చేశాడు.
    దారుణంగా కొట్టి హింసించానన్న భావం కలిగింది అతనికి.
    అదే సమయంలో లోపలికి పది, పదిహేనుమంది పరిగెత్తుకొట్టారు ఆడా, మగా.....
    వాళ్లంతా చూడ్డానికి అలగాజనంలా వున్నారు.
    "ఎవరు వీరంతా?" ఇన్స్ పెక్టర్ లేచి నించున్నాడు.
    "అభినయ్ బాబుని విడిచిపెట్టమని అడగటానికి వొచ్చాం బాబూ!" అన్నాడొకడు.
    "అందుకని దొమ్మీ చేయడానికి వచ్చారా? అసలు ఎవరయ్యా మీరు"అడిగాడు తిరిగి గర్జిస్తూ.
    "నా పేరు జగపతి కూరగాయలు అమ్ముకుంటాను బాబూ!"
    "నేను మటన్  షాపు షేక్ మస్తాన్ వలీని"
    "నేను కిళ్ళీకొట్టు యజమానిని. నా పేరు యాదయ్య."
    "నేను చెప్పులు కట్టుకునే మైసయ్యని"
    "నేను పూలమ్ముకొనే రత్తమ్మని బాబూ! మా గుడిసెలు కాలిపోతే తిరిగి కట్టుకోవడానికి సాయం చేసిన దేవుడు బాబూ అభినయ్ బాబు!"
    ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు.
    వాళ్ల మాటలు వింటూ ఇన్స్ పెక్టర్ విస్తుపోయాడు.
                                       10
    స్టేషన్ బయట కోలాహలంగా వుంది. మొత్తానికి తను ఏదో గొప్ప చిక్కుల్లో పడబోతున్నట్లుగా అనిపించసాగింది ఇన్స్ పెక్టర్ అవధానికి.
    కానీ అలాని అతను తన డ్యూటీని, హోదానీ మరచిపోలేదు. అతనికి ఉద్రేకం పెరిగిపోవటం మొదలుపెట్టింది. కోపం కూడా తారాస్థాయికి చేరుకుంటోంది.
    బయట స్టూడెంట్స్....
    లోపల అలాగాజనం....
    మర్నాడు పేపర్లో తన గురించి, తన పోలీస్ స్టేషన్ గురించి వార్త పడుతుంది. ఊరంతా తన పేరు గుప్పుమంటుంది.
    పై అధికారులు మెచ్చుకుంటారో, చివాట్లు పెడతారో తెలీదు.
    జనంలో అభినయ్ పట్ల గల ఆదరణని చూస్తుంటే ముఖ్యమంత్రి ఇంటి వరకూ ప్రొసెషన్ తీసుకెళ్లి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తారేమో నన్నట్టుగా వుంది. అంత ఉత్రిక్తత కనబడుతోంది జనంలో.
    ఒకళ్లని చూసి ఒకళ్లు పోలీస్ స్టేషన్ బయట జనం పోగవుతున్నారు.
    తను ఓ నేరస్థుడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. కానీ జనం ఏకమై తననే నేరస్థుడిలా చూస్తున్నారు.
    అతడి పరిస్థితి చూసి కానిస్టేబుల్స్ ముసి ముసి నవ్వులు నవ్వటం చూసేసరికి అవధానికి అరికాలిమంట నెత్తికెక్కింది.
    "గెట్ అవుట్" అరిచాడు అలగాజనాన్ని చూస్తూ.
    వాళ్లు నించున్న చోటునుంచి అంగుళం కూడా కదల్లేదు.
    "ఆ బాబుని ఇడిచిపెడితే నువ్వుండమన్నా వుండం. ..." అంది పువ్వుల రత్తమ్మ.
    "అతను ఎలాంటి నేరం చేశాడో తెలుసా?
    మీ దృష్టిలో  అతను దేవుడైనా, నా చేతికి దోషిగా చిక్కాడు..... అంచేత అతన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు.
    మర్యాదగా మీ దారిన మీరు వెళ్లిపోండి. లేకపోతే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన నేరం కింద మీ అందర్నీ లోపలికి తోసేస్తాను" ఇంచుమించు అరిచాడు అవధాని.
    ఇక అధికారాన్ని వినియోగించడం  తప్ప వేరే మార్గం లేదనిపిస్తూ వుంది. కానీ స్టేషన్ లో సిబ్బంది తక్కువగా వున్నారు.
    "ఎవర్నయ్యా లోపలికి తోసేది? ఖాకీ బట్టలు వేసుకుంది లోపలకి తోయడానికనుకుంటున్నావా? మేం మర్యాదగా అడుగుతున్నామే తప్ప దౌర్జన్యం చేశామా? నిజంగా మేం తలుచుకుంటే నిన్ను లోపలపెట్టి ఆ బాబుని క్షణంలో బయటికి తీసుకెళతాము. కానీ 'కానూన్' అంటే కాస్త  గౌరవం వుండి నిన్ను మంచిగా అడిగాను" మైసయ్య ఎదురు తిరిగాడు.
    ఏమిటి? ఏమిటిదంతా? అవధానికి అంతు చిక్కడంలేదు.
    "దోషిలా ఎలా విడిచిపెట్టమంటారయ్యా"
    "దోషి అని మీరెవర్ని అంటున్నారు ఇన్స్ పెక్టర్?" ఓ స్త్రీ గొంతు.
    అప్పుడే  లోపలికి అడుగు పెట్టిన ఓ యువతి ప్రశ్నించేసరికి ఉలిక్కిపడ్డాడు అవధాని.
    "మీకు తెలీదనుకుంటాను పాపం! అతడు కేవలం నిందితుడు మాత్రమే ఇన్స్ పెక్టర్.
    కోర్టులో న్యాయమూర్తి కేసుని విచారించి దోషిగా నిర్దారించేవరకూ ఏ వ్యక్తినైనా సరే నిందితుడుగానే పిలవాలన్న కనీసపు సూత్రం కూడా మీకు తెలీనందుకు చాలా విచారంగా వుంది."
    ఇన్స్ పెక్టర్ కోపంగా చూశాడు.

 Previous Page Next Page