అతడు నేరం చేశాడు. నేను అరెస్ట్ చేశాను. కనుకనే దోషి అన్నాను."
"అలా అనకూడదనే నేను తిరిగి చెబుతున్నాను ఇన్స్ పెక్టర్.
అతని మీద మీకు కంప్లైంట్ వచ్చింది.
అరెస్ట్ చేశారు!"
ఇక్కడికి తీసుకొచ్చి చావకొట్టారు.
కానీ అతను నేరం చేశాడా లేదా అని దర్యాప్తు మాత్రం చేయలేదు.
అవునా?"
"అవధాని గుర్రుగా చూశాడు ఆమెకేసి.
"ఎవరివే నువ్వు?' అన్నాడు కోపంతో.
ఆమె ఉద్రేకంతో ఊగిపోయింది - అతని సంబోధనకి.
"హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ అవధాని! పోలీసు స్టేషన్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఖాకీ బట్టల్ని చూసి హడలిపోతారని కలలు కనకు."
ఆమె గొంతులోని తీవ్రతకి అవధాని కొంచెం జర్క్ అయ్యాడు.
"ఎవరు మీరు?" సర్దుకుని అప్రయత్నంగా అన్నాడు.
"నా పేరు రమా చంద్రశేఖర్. నేను జువాలజీ లెక్టరర్ని. నా భర్త ఇంజనీర్" అందామె.
"లాభంలేదు మేడమ్! ఈ ఇన్స్ పెక్టర్ దగ్గర ఏం చెప్పినా చెవిటి వాడి దగ్గర శంఖం వూదినట్టే. నేను పోలీసు స్టేషన్ని ముట్టడిస్తాను!" పూర్ణచంద్రరావు కొరకొరా చూస్తూ అన్నాడు.
"అదుగో ఆ పిచ్చిమాటలు మాట్లాడితే లోపలేవేస్తాను!" వెర్రిగా అరిచాడు అవధాని.
"నీ చేతనయింది చేసుకో" అన్నట్టుగా చూశాడు పూర్ణ.
సెల్ లోపల గోడకి చేరగిలబడిపోయి నిస్త్రాణగా వున్న అభినయ్ ని చూడగానే ఆమె కళ్ళల్లో పల్చని నీటితెర కదలాడింది. అతి ప్రయత్నం మీద దాని వునికిని కనబడనీయకుండా జాగ్రత్త పడిందామె.
లాఠీ దెబ్బలకి గురయిపోయిన అభినయ్ పరిస్థితిని కళ్ళారా చూశాక రమాదేవిలో ఉద్రేకం ఎక్కువయిపోయింది.
"మిస్టర్ ఇన్స్ పెక్టర్! చట్టాన్ని కాపాడ్డం అంటే ఓ నిరపరాధిని స్టేషన్ కి తీసుకొచ్చి కొట్టడమని అర్దం కాదే?
శారీరకంగా అతన్ని హింసించే అధికారం నీకెవరిచ్చారు?
ఇప్పుడు... ఇప్పుడు అతన్ని కొట్టి నువ్వు నేరస్థుడివయినావు నీవు చేసిన ఈ దారుణానికి సంజాయిషీ యిచ్చుకోవాలి లేకపోతే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోతుందో మాకే తెలీదు" అంది రమాదేవి.
అవధానికీ బుర్ర తిరిగిపోతోంది.
ఓ పక్క అలాజనం... బయట స్టూడెంట్స్.....
ఇప్పుడు కాలేజీ లెక్టరర్ ఒకామె విరుచుకుపడింది.
ఏం చెయ్యాలి?
అసలు ...అసలు వీళ్ళంతా ఎవరు?
అభినయ్ వీళ్ళకి ఏమవుతాడు?
అవధాని ఆలోచనలు తెగడం లేదు.
తను మాట్లాడకుండా వూరుకుంటే తన మీద ఎదురుకేసుపెట్టి దోషిగా నిలబెట్టేలా వున్నారీ జనం!
అవన్నీ మీకు అనవసరం మీరొచ్చినపని చెప్పండి" అన్నాడు దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అవధాని.
"అభినయ్ కి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను" అంది రమాదేవి.
"సారీ మేడం...అతన్ని విడిచిపెట్టడానికి వీలులేదు" అన్నాడు.
"ఎందుకని?"
"పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారమ్మాయిని పబ్లిగ్గా ముద్దు పెట్టుకుని అవమానించాడు."
"ముద్దు పెట్టుకోవడం అవమానించడం అవుతోందా ఇన్స్ పెక్టర్?" ఆమె నవ్వుతూ ప్రశ్నించింది.
ఆమె ప్రశ్నకి అదిరిపోయాడు అవధాని.
ఆమె కూడా ఆడమనిషే. అలా అంటుందేమిటి? పబ్లిగ్గా ముద్దు పెట్టుకోడం తప్రుకాదా?
"బహిరంగ ప్రదేశంలో ఓ పెళ్ళికాని పిల్లని, ఆమె అనుమతి లేకుండా ముద్దుపెట్టుకోవడం నేరమే అవుతోంది. ఇది మీ కాలేజీ స్టూడెంట్స్ దృష్టిలోనూ, మీ దృష్టిలోనూ, ఈ అలగాజనం దృష్టిలోనూ ఓ గొప్ప విషయం కావచ్చు కానీ చట్టం దృష్టిలో మాత్రం ఇది ఘోరమైన నేరం" కటువుగా సమాధానం ఇచ్చాడు ఇన్స్ పెక్టర్.
"ఇన్స్ పెక్టర్! నేను లెక్చరర్ నన్న సంగతి మరచిపోయి మీరు తెగ లెక్చరిస్తుననారు.
నేను లెక్చరివ్వడానికి అలవాటుపడినదాన్నే తప్ప వినడానికి కాదు. అభినయ్ కి నేను బెయిల్ యిస్తాను. విడిచిపెట్టండి" అడిగింది రమాదేవి.
"నో..... అది మాత్రం కుదరదు. పరువు, ప్రతిష్టగల పి. పి. గారు తన కూతురికి ఇంత అవమానం జరిగితే చూస్తూ చేతులు కట్టుకు కూర్చోరు కనీసం మూడేళ్ళు జైల్లోకి తోయించేస్తాడు ఈ వెధవని"
రమాదేవి అనాలోచితంగా వుండిపోయింది. ఏం చేయడానికీ ఆమెకి తోచకుండా వుంది ఎలాగయినా అభినయ్ ని పోలీసుల కబంధ హస్తాల నుంచి తప్పించాలి చూడబోతే ఇన్స్ పెక్టర్ చాలా మొండివాడిలా వున్నాడు. మాట వినేలా కనిపించడంలేదు.
అతన్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తోంది.
కానీ కంట్రోల్ చేసుకుంటోంది.
"ఇన్స్ పెక్టర్! దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసిన వాళ్లకి బెయిల్ యిస్తారు అట్లాంటిది...."
"దయచేసి నా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ గో...." అని కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు.
నలుగురు కానిస్టేబుల్స్ లోపల జనాన్ని బయటికి గెంటడానికి ప్రయత్నించసాగారు.
రమాదేవి కళ్లలో ఎర్రజీరలు రూపుదిద్దుకోసాగాయి.
"ఇన్స్ పెక్టర్....! బహుశా నేనెవరో పూర్తిగా తెలీక నీ మొండి వాదనతో వుండిపోయావు పి పి, గారు పి. పి. గారు అని పట్టుకు వేలాడుతున్నావు. నేనిప్పుడు డి. జి. పి. తో పర్సనల్ గా మాట్లాడతాను"
"డి. జి. పి తోనా?"
"ఎస్ హీ ఈజ్ మై అంకుల్! అవసరమయితే మిమ్మల్ని శ్రీకాకుళము ట్రాన్స్ ఫర్ చేయిస్తాను"
"మీరు తొందరపడుతున్నారు మేడం. నా పరిస్థితి కూడా కొంచెం అర్దం చేసుకోవాలి ఆ పి. పి. గారు అసలే....."
"పోనీ... హోం మినిస్టరుగారితో మాట్లాడనా?" హుందాగా ప్రశ్నించింది రమాదేవి.
"ఆయన ఏమవుతారు మేడం మీకు?" కాస్త వినయంగా అడిగాడు.
"మా చినమామగారు!" అంది రమాదేవి.
అవధాని నీరుకారిపోయాడు.