Previous Page Next Page 
చదువు పేజి 2

   

    సుందరం తల్లికి సహాయ పడగలపనులెన్నిఉంటై కనకా? కూరలు అందించటమూ, పొయ్యి విసిరి పెట్టటమూ__ అదయినా బొగ్గులపొయ్యి అయితేనే! కొబ్బరి ఈనెలు తీయటం అటువంటి పనుల్లో ఒకటి. ఇది అన్నప్పుడల్లా పడే పనికాదు. మూడు నాలుగు నెలల కొకసారిగాని ఈ అవకాశంరాదు. అందులో ఇవాళ తన తల్లి ఖాళీగాఉంది కూడాను.

    "ఏ మమ్మా. కొబ్బరీనెలు తియ్యొద్దూ!" అన్నాడు సుందరం. తల్లిని తొందరచేస్తూ.
   
    సగం సుందరం ముచ్చట తీర్చటానికని సీతమ్మ ఒప్పుకుంది. సుందరం కొబ్బరిమట్టలు ఈడ్చుకురావటానికి పరిగెత్తాడు.
   
    తల్లీ కొడుకూ కలిసి కొబ్బరీనెలు తీస్తుండగా, పెళపెళ లాడే పట్టుచీరతో, మొహాన ఇంత పెద్దకుంకం బొట్టు పెట్టుకుని మెడనిండా గంధంరాచుకుని, భుక్తాయాసం ఇంకా తీరనిదానల్లే సుబ్బమ్మ చంటివాణ్ణి చంకనేసుకుని లక్ష్మిని రెక్కపట్టుకుని వచ్చి అరుగుమీద చతికల పడింది.

    "ఇదేనుటమ్మా రావటం?" అన్నది సీతమ్మ.

    "అవునమ్మా. ఇంకా తలుపుకూడా తెరవలా... చాలా హైరానయింది బాబూ." అన్నది సుబ్బమ్మ.

    "రెండు మట్టలు, ఈ సారి పెద్దచీపురవుతుంది." అన్నది సీతమ్మ. తాను తీస్తున్న కొబ్బరీనెలను గురించి మాట్లాడుతూ.

    "మాతల్లి రెండు కట్టలుతీసి నాకొకటిద్దూ." అన్నది సుబ్బమ్మ.

    ఆవిడకు చూచినదల్లా అడిగే స్వభావంఉన్నది. సీతమ్మ సంభాషణ మారుస్తూ, "అయితే పిల్లాణ్ణి బళ్ళోవేశారా?" అన్నది.

    "ఆహా, వేశారు___ ఎట్లాయితేనేం; యజ్ఞం చేసినంతపనయింది.... పోనిస్తూ. ఎందుకొచ్చిన చదువులూ. నేచెప్పా__ ఏదో మొక్కు తీర్చేశారు. సరిపోయింది. ఇంకో ఏడాదిపాటు, పాపం, వాణ్ణి బడికి పంపకండర్రా అని." అన్నది సుబ్బమ్మ.

    "ఏం? పాపం, బాగా ఏడిచాడా?" అని అడిగింది, సీతమ్మ.

    "ఏడుపా?" అన్నది. సుబ్బమ్మ అత్యాశ్చర్యంతో "ఏడుపేమిటీ? ఏడుపుతో పిల్లాడు మెలికలు తిరిగిపోయి ప్రాణం కడబట్టితేనూ!"

    సీతమ్మ తన కొడుకువంక చూసి సంభాషణ మార్చటం మేలనుకున్నది. సుందరం కొబ్బరాకు చేత్తో పట్టుకుని సుబ్బమ్మకేసి నోరు తెరుచుకు చూస్తున్నాడు. కాని వాడి మనస్సులో సుబ్బమ్మ మాటలకు భయం కలుగలేదు. ఆశ్చర్యం కలుగుతున్నది. బడికిపోయి చదువుకోటానికి ఎవరైనా ఏడుస్తారా. ఏడిచేవాళ్ళని ఎక్కడన్నా పెద్దవాళ్ళు పాపం తలుస్తారా అని సుందరం ఆశ్చర్యపడుతున్నాడు.

    కాని సీతమ్మకది తెలీదు. "సరేకాని, ఒరేసుందరం, ఒసే లక్ష్మి, మీరిద్దరూ వెళ్ళి ఆడుకోండి" అన్నదావిడ.

    సుబ్బమ్మ అదొక రకం మనిషి. అనేక విషయాల్లో ఆవిడ అమాయకురాలు, సీతమ్మ తనకొడుకును ఎందుకు ఆడుకోవటానికి పంపిందీ, ఆవిడ గ్రహించలేదు. అసలాసంగతే ప్రత్యేకంగా గమనించలేదు. ఆనాడు అక్షరాభ్యాసం జరిగిన కుర్రవాడు ఎట్లా ఏడిచాడో, పదిమందీ కలసి వాణ్ణి ఎట్లా పట్టుకోలేకపోయినారో, వాడు వాళ్ళ ముసలమ్మను ఎట్లా వాటేసుకున్నాడో, పిల్లవాణ్ణి తల్లి కాస్త సముదాయించటానికి ప్రయత్నం చేస్తుంటే తండ్రి ఆవిణ్ణి ఎట్లా తిట్టిపోశాడో సుబ్బమ్మ చాలాసేపు వర్ణించి చెప్పింది. ఆ చెప్పటంలోనే, పిల్లల్ని చదవెయ్యటమంటే తనకెంత అయిష్టమో కూడా బయటపెట్టింది. పాపం, సుబ్బమ్మకు ఎవరు ఏమాత్రం బాధపడటమూ ఇష్టంలేదు. బాధకలిగించే పనులు ఎవరూ చెయ్యకుండా ఉంటే జీవితం చాలా ఆనందంగా వుంటుందని ఆవిడ వుద్దేశ్యం. ఎటువంటి బాధ అకారణమైనది, ఎటువంటి బాధ తప్పనిసరి అయినది అన్న విషయం ఆవిడ కేఅభిప్రాయాలూ లేవు. పిల్లలు బళ్ళోకి వెళ్ళటానికి ఏడుస్తారు, కనుక అక్షరాభ్యాసం చెయ్యరాదు. శోభనపు పెళ్ళికూతుళ్ళు గర్భాదానపు గదిలోకి పోవటానికి బెదురుతారు. కనుక గర్బాదానాలు చెయ్యరాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కనటానికి హింసపడతారు. కనుక పిల్లల్ని కనరాదు. ఆవిడ తాత్విక దృష్టి అంత సంకుచితమైనది. ప్రపంచం తనదృష్టిప్రకారం నడిస్తే ఆవిడకు. ఒక్కనాటికి సంతృప్తి కలగదు. కాని ఆవిడకు కావలసింది ప్రపంచాన్ని తన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చటం కాదు__ వున్న ప్రపంచాన్ని తప్పు పట్టటం మాత్రమే.
                 
                                                ౨

    సుందరానికి అయిదో ఏడు వెళ్ళుతుందనగా పుట్టువెంట్రుకలుతీసి అక్షరాభ్యాసం చెయ్యటానికి మంచిరోజు నిర్ణయించారు. దీనికి చాలామంది బంధువులు వచ్చారు. వీరిలో ఎక్కువమంది పల్లెటూళ్ళకు చెందినవాళ్ళు. ఆ రోజుల్లో బస్సులులేవు కనుక వీళ్ళు ఎడ్ల బళ్ళమీదా కాలినడకనా వచ్చారు. సుందరం వారిని చాలామందిని ఎరగడు. సుందరం తండ్రి శ్రీమన్నారాయాణ అన్నప్పుడల్లా ఇల్లు కదిలేరకం కాదు. సుందరం భారసాల తరువాత శ్రీమన్నారాయణ ఇంట అక్కర జరిగి నలుగుర్నీ పిలవడం మళ్ళీ ఇప్పుడే.

    సుందరం వాళ్ళ నెరక్కపోయినా బంధువులు సుందరాన్నెరుగుదురు. కనక అక్షరాభ్యాసం విషయమై వాణ్ణి ఏడిపించటానికి ప్రయత్నం చేశారు.

    "ఏంరోయ్, రేపన్నుంచీ ముక్కుకు తాడు పోస్తార్రా?" అని ఒకాయన అన్నాడు.

 Previous Page Next Page