కట్టిన తాళిబొట్టుని బానిసకు విధించే శృంఖలాలుగా తలపోస్తూ నిత్యం నఖశిఖ పర్యంతాన్ని తక్షకుడిగా కాటువేసే భర్తని కడతేర్చడమే న్యాయమని చెప్పగలిగే అరుదైన ఈ అనసూయ మధ్యతరగతి సాంప్రదాయాల బందీలైన ఎందరో ఆడపిల్లల్ని మించిన విశిష్ట వ్యక్తిత్వంగలది కదూ ఆమె చెబుతున్నది అమాయకంగానైనా ఎంతటి స్ఫూర్తి ఆమె మాటల్లో...
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగింది అనసూయ తేరుకుని.
"ఇది ఆలోచన కాదు ధ్యానం."
విస్మయంగా చూసింది అనసూయ.
"పెదవి విప్పితే గానం..." స్వప్నంలోలా అంది ఏకాంత..."ఎదను తాకితె ధ్యానం.....నేనూ ఓ ఖాండవ వనాన్నే నేస్తం..... మండపమంటే నాకు మరింత ఇష్టం"
అర్ధంకానట్టుగా అడిగింది అనసూయ "బహుశా రేపెలా బ్రతకాలో ఆలోచిస్తున్నట్టున్నావు!"
"కరెక్ట్ గా వూహించావు"
"వద్దు" బాధగా అంది అనసూయ. "నీలాంటి మంచి స్నేహితురాలిని నేను దూరం చేసుకోవటం నాకు భరించలేని విషయమైనా మరో మారు నువ్వీ జైలు గోడల మధ్యకి రావటం నేనిష్టపడలేను ఏకాంతా."
నిర్వేదంగా తలని గోడకి ఆనించింది ఏకాంత.
"నేనో మోసగించబడిన అమ్మాయిని అనసూయా.... నాకు తెలిసిన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు వున్నా అవి నాకే పరిమితమై వుండేవి. ఆస్తులు లేకపోయినా ఆత్మీయతలే నాకు పరిచయమైన విషయాలు రేగి చెట్ల మధ్య నిలబడి దూరంగా కనిపించే ఉదయ సూర్యుడ్ని, ఏటి ఒడ్డుకు చేరుకుని నిశ్చలంగా పారే నదిని చూస్తూ కాలం వెళ్ళబుచ్చిన బాల్యం నాది. అలాంటి నేను చాలా దారుణంగా ఓడిపోయాను. ఏకాంతనే నా పేరుకు తగ్గట్టు అందరూ ఆడుకుని ఓడించి నన్ను ఏకాంతని చేశారు. అలాంటి నేను ఎంత కోల్పోయినాగాని ఈ జైలు జీవితం, నన్నీ దశకి నెట్టిన వ్యక్తులు మానసికమైన రాపిడితో నన్ను చాలా బలవంతురాల్ని చేశారు అనసూయా.... మరి నేనూ ఆడుకోవాలిగా."
"నువ్వెంత తెలివైన దానివైనా ఆడదానివి"
"సామ్రాజ్యాన్ని రక్తపాతంతో వినాశనం చేసిన క్లియోపాత్రా ఆడదే"
"దానికి ఆమె అందాన్ని పెట్టుబడిగా పెట్టింది".
"నేనూ అందమైనదాన్నేగా."
అనసూయ మనసు చివుక్కుమంది "నువ్వంత దిగజారాల్సిన అవసరం లేదు"
అర నిమిషం మౌనం తరువాత అంది ఏకాంత "నమ్మకంగా అందాన్ని కోరుకున్న మనిషికి అందించాలనుకుని విఫలమైన నేను నమ్మకంతో అంతా సాధించడం తప్పు కాదుగా"
"అదో జీవితం కాదు."
ఏకాంత మొహం వివర్ణమైపోయింది. "ఏది జీవితం.... చుట్టూవున్న గంజాయి వనంలో తనకంటూ ఓ అస్థిత్వాన్ని సృష్టించుకోవాలనుకున్న తులసిమొక్క గంజాయి దుర్గంధంలో ఇమడలేక తనను తానే నులుముకుని తులసి తీర్ధాన్ని తన గొంతులోనే ఒంపుకుని కడతేరిపోవడం జీవితమా.... చుట్టూ వున్న పురుష వ్యవస్థలో అణువంత స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో తన వునికిని కోల్పోయి న్యాయబద్దంగా అన్యాయమై జైలుపాలవడమూ, చేయని తప్పుకు శిక్షపడి తల వంచుకుని బ్రతకడం జీవితమూ... అనసూయా....నీ పరిష్కారం జైలు జీవితంతో ఆగిపోతే నా పోరాటం జైలునుంచి విడుదలయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడో నాశనమయ్యాను కాబట్టి! శీలం, పాతివ్రత్యం అనే పదాలున్న పుటలు నా నిఘంటువు నుంచి ఏ రోజో చిరిగిపోయాయి కాబట్టి."
ఏం చేయాలని తీర్మానించుకుని ఏకాంత అలా మాట్లాడుతుందో అనసూయకి తెలీదు కానీ చేయని నేరానికి జైల్లో అడుగుపెట్టిన ఏకాంత ఏదో ఓ అనూహ్యమైన సంఘటనలకి కారణం కాబోతూందని మాత్రం అర్ధం చేసుకుంది.
'కాని నీది ఒంటరి పోరాటం....' గొణుగుతున్నట్టుగా అంది అనసూయ.
"కావచ్చు నాకంటూ బలగంలా మందీ మార్భలమూ లేకపోవచ్చు. కాని పతనమైన నా జీవితం అందించిన నిబ్బరం వుంది. ఏ స్థాయి మగాడినైనా ఆకట్టుకోగల అందముంది. ఆగిపోని నా వూపిరి వుంది. అంతకుమించి నాకైన గాయాల్ని గేయాలుగా మార్చే సరికొత్త కావ్య సృష్టికి కారణమయిన మేధస్సు వుంది. ఇవి చాలు నా పోరాటంలో సైన్యంలా నాకు సహకరించటానికి."
ప్రశాంతంగా చూస్తుంది ఏకాంత అది ప్రశాంతత కూడా కాదు- పగలబోయే అగ్నిపర్వతం లావాని గొంతుదాకా రప్పించుకునే ప్రయత్నం లాంటిది.
"అనసూయా..." భావరహితంగా అంది ఏకాంత. "నా మాటలు నీకు తిరుగుబాటు ధోరణిలా అనిపించొచ్చు కాని ఇవి జీవిత సత్యాలు... ఓ పువ్వు వికసిస్తుంది. దాని ఉనికి గంటలూ రోజులే!" ఆ పువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళేలోగా ఒక్కోమారు ఓ మేకపిల్ల తింటుంది. ఆ మేకపిల్ల ఉనికి మనిషికి ఆహరం అయ్యేదాకానే....! ఆ పువ్వు గురించి, మేకపిల్ల గురించీ తెలిసింది మనిషనే ప్రాణికి మాత్రమే! ఎందుకంటే- ఆలోచించే విశిష్టమైన లక్షణం మనిషికి వుంది కాబట్టి. చిత్రమేమిటంటే- తనకీ చావు తప్పదన్న విషయం మనిషి మరిచిపోతుంటాడు."
విప్పారిత నేత్రాలతో చూస్తూ వుండిపోయింది అనసూయ.
"మనిషి చావుకి తన ప్రమేయం అవసరంలేదు అనూ! ఎప్పుడో ఒకప్పుడు దానంతటదే తీసుకుపోతుంది. అయితే 'చేవ' అన్నది చావుకి కాక బ్రతకటానికి కావాలి. ఆ చేవ వుంటే చాలు బ్రతుకుతున్నాననుకునే మనిషిని సైతం జీవచ్చవంగా మార్చొచ్చు"
నిశ్చలంగా తల తిప్పి చూసిన ఏకాంత చెంపలపై ప్రతిఫలిస్తున్న జీవకళను చూస్తుంటే అనసూయకి ఆందోళనగా వుంది. అందులో చాలా సున్నితంగా వుండే ఏకాంతని జైలు జీవితం ఎంత రాటుదేల్చిందీ అర్ధమౌతూనే వుంది. "నిన్ను చాలా రోజులుగా ఓ విషయం అడగాలనుకుంటున్నాను".
"చెప్పు".
ఏదీ స్పష్టంగా చెప్పని ఏకాంత ఇది మాత్రం అంత తేలిగ్గా చెబుతుందన్న నమ్మకం లేదు. "నువ్వెంత వరకూ చదువుకున్నావ్?"
"జెవెఇథమ్ జీవించటానికి తప్ప అంతంచేసుకోటానికి కాదని తెలుసు కునేటంత..."
"జైలు నుంచి విడుదలయ్యాక నువ్వు ప్రేమించిన వ్యక్తిని కలుసుకో బోతున్నావా?"
"లేదు".
"ఎందుకని?"
"ఎందుకు కలుసుకోవాలి?" ఆమె నేత్రాలు అరుణిమలయ్యాయి.
"అతడు నన్ను ప్రేమించిందే నిజమయితే కనీసం ఒక్కసారైనా నన్ను కలుసుకుంటానికి వచ్చేవాడుగా! నో రిగ్రెట్స్..."
"నిన్ను అపార్ధం చేసుకుని వుండొచ్చుగా?"
"అలాంటివాడు నన్ను ఇక అర్ధంచేసుకుంటాడన్న నమ్మకంలేదు" నవ్వింది ఫిలసాఫికల్ గా.
"ఎలా నవ్వగలుగుతున్నావ్?"
"Laugh when you meet misfortune. There is nothing like this to overcome it and pass on to victory"
ఏ జ్ఞాపకాల దొంతరలు ఆమె ముందు కదలాడుతున్నాయో ప్రశాంతంగా అంది- "ఇంకెంతకాలం....మరో వారం రోజులు..."
"దేనికి?"
"నేను కోరుకున్న యజ్ఞం ప్రారంభించడానికి"
కసిగా నవ్వింది ఆమె దృఢ నిశ్చయంతో.
ఆ క్షణంలో ఆమెకు సవ్యసాచి గుర్తుకొచ్చాడు. ఇప్పుడతడు సామాన్యమైన స్థాయిలో లేడు. నగర పోలీసు కమీషనర్ గా ఈ మధ్యనే చార్జి తీసుకున్నాడు.
ఏ స్థాయిలో వుంటేనేం...
ఒకనాడు ఆమె శీలాన్ని కోల్పోయిందీ, ప్రేమించిన వ్యక్తికి దూరమై చేయని నేరానికి హంతకురాలిలా జైలులో అడుగుపెట్టిందా సవ్యసాచి మూలంగానే.
అందుకే ఆమెకు సవ్యసాచి మొదటి శతృవు...
ఇక్కడ ఆమె అతడి గురించి ఆలోచిస్తున్న రాత్రికి మరుసటి రోజే నగరంలో మరో సంఘటన జరిగింది. ఆటవిక న్యాయంలోని మరొక అధ్యాయంలా.
* * *
ఉదయం పదిన్నర కావస్తుండగా-
హఠాత్తుగా పదిమంది గూండాలు ఓ కాలేజీ క్యాంపస్ లో అడుగుపెట్టారు.
చేతిలో హాకీ స్టిక్స్ తో, సైకిల్ చైన్స్ తో వేగంగా నడిచి ఓ క్లాస్ రూంలో అడుగుపెట్టారు.
క్లాస్ లో ఇంగ్లీషు లెసన్ చెబుతున్న లెక్చరర్ అవాక్కయ్యాడు ముందు.
"రాజేష్ ఎక్కడ?" ఓ గూండా క్లాస్ రూంలోకి పరికించి చూస్తూ వుంటే "వాట్ హేపెండ్....?" అంటూ ముందుకు రాబోయిన లెక్చరర్ తలపై హాకీస్టిక్ పడింది బలంగా మరుక్షణం బ్లాక్ బోర్డ్ పై చివ్వున రక్తం తుళ్ళింది.
అనుకోని ఆ సంఘటనకి క్లాస్ రూంలోని విద్యార్ధులూ, విద్యార్ధినులూ కకావికలై బయటికి పరుగుతీశారు.
అయినా రాజేష్ తప్పించుకోలేదు, తనేం తప్పు చేసిందీ తెలీని అమాయకత్వం భయంగా వుంది అయినా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు.
"నేనే..." అన్నాడు కంపించిపోతూ.
అమాంతం అతని షర్టు కాలరు పట్టుకున్న ఇద్దరు గూండాలు రూం లోపల్నుంచి బరబరా ఈడ్చుకుపోతుంటే-
"ఎందుకు? నేనేం చేశానని?" రొప్పుతూ అడిగాడు రాజేష్ పెనుగులాడింది ఆత్మరక్షణ కోసం కాదు కాని గూండాలకది అవకాశమయ్యింది. మరుక్షణం ఓ గూండా కొట్టిన దెబ్బకి అతడి పెదవి చిట్లిపోయింది.
క్లాస్ లో రేంక్ స్టూడెంటుగా బుద్దిమంతుడైన విద్యార్ధిగా పేరున్న రాజేష్ కిదో కొత్త అనుభవం! స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం వింతకాదని తెలిసినా, తనెందుకు బలిపశువుగా మారిందీ అర్ధంగాని స్థితిలో చేతులు జోడించాడు.
"నేనేం తప్పు చేశాను?"
కారిడార్ లోని జూనియర్ కాలేజీ విద్యార్ధులు బిక్కమొహం వేసుకుని చూస్తుండగా ఇది వూరు కాదు వల్లకాడన్న సత్యానికి సాక్ష్యంలా రాజేష్ జుట్టుపట్టుకుని ఈడ్చుకుపోతుంటే కొందరు విద్యార్ధులు గుర్తించారు. ఆ గూండాలు ఏ మంత్రిగారికి అనుచరులో పద్దెనిమిదేళ్ళ వయసు దాటని ఇంటర్ మీడియట్ స్టూడెంట్సు కావడంతో విస్తుపోయి చూస్తున్నారు తప్ప ఆపే సాహసం చేయలేకపోయారు.
జీపులో రాజేష్ తోబాటు వెళ్ళిన గూండాల్ని చూస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయిన ప్రిన్సిపాల్ గారు ఆగిపోయారు ఎవరో నిలదీసినట్టుగా.
తను ఫోన్ చేసిన మరుక్షణం రాష్ట్ర హోం శాఖామంత్రి సూర్నారాయున్ని ప్రతిఘటించినవాడవుతాడు. చుట్టూ కలియచూశాడాయన. సూర్నారాయణగారి కూతురు శ్వేత కనిపించలేదు. ఒక హోం మినిస్టర్ కూతురిగా ఆమె కాలేజీలో ఎలాంటి స్వాతిశయాన్ని ప్రదర్శించేదీ అన్న విషయం ఒక్కటే కాదు, రాజేష్ స్నేహం కోసమో మరి దేనికోసమో అతడ్ని ఆమె ఎలా వెంటాడి వేధించేదీ తెలుసు.
అయితే సహజంగా బిడియస్తుడూ, పిరికివాడైన రాజేష్ ఆమెకు దూరంగా వుండేవాడు. నిన్న క్లాసురూంలో తనకు ఆమె రాసిన ప్రేమలేఖ విషయంలో అమాయకంగా అందరిముందూ మందలించాడు కూడా అప్పుడే ఇలాంటి ప్రమాదాన్ని గెస్ చేశాడు ప్రిన్సిపాల్ కానీ ఇంత త్వరగా ఈ రూపంలో కాదు.
రాజేష్ ని గూండాలు లాక్కుపోయిన అయిదు నిమిషాలకి కొందరు స్టూడెంట్సు రాజేష్ ఇంటికి వెళ్ళి జరిగింది తెలియజేశారు. నిన్నగాక మొన్న స్కూలు హెడ్ మాస్టరుగా చేసి రిటైరైన రాజారాంగారు ముందు కంపించిపోయారు జరిగింది వినగానే. జవసత్వాలుడిగిన వయసు.... ఏం చేయాలో వెంటనే పాలుపోలేదు. అయినా మూడుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బహుమతుల్ని అందుకున్న చరిత్ర ఆ మాత్రం సహకరించదా అనుకుంటూ రోడ్డుమీదికి రొప్పుతూ నడిచారు. చట్టంమీద, మనుషులమీద వున్న నమ్మకం సడలని మాస్టారు నగర పోలీస్ కమీషనర్ కి ఫోన్ చేశారు. ఒకటే దైర్యం..... నగర ఉపాధ్యాయుల సంఘ్ అప్పుడెప్పుడో కమీషనర్ సవ్యసాచి ముఖ్య అతిథిగా రాజారాంగారికి సన్మానం చేసి వుండటంతో ఆ చిన్ని పరిచయంతో సహాయం కోరాలనుకున్నారు. ఫోన్ అందుకున్న సవ్యసాచి నిజంగానే రియాక్టయినట్టు కనిపించాడు. అయినా మనశ్శాంతిగా వుండలేకపోయారాయన.