"దేవుడైతే మాకేం దెయ్యమైతే మాకేం?" అన్నట్టుగా రోగులు తమ గొడవలో తాముండిపోయారు.
డాక్టరు చిరునవ్వులు చిందిస్తూ, అందర్నీ ఓసారి కలియచూసి ముందుకు వెళ్తూ, రఘురాం దగ్గిర ఆగాడు.
"రఘూ! కూర్చో!" అని భుజంతట్టి స్ప్రింగ్ డోర్ ను నెట్టుకొంటూ లోపలకు వెళ్ళిపోయాడు. అతడి వెనుక ఉన్న యువకుడు డాక్టర్ ను అనుసరించాడు.
రఘురాం డాక్టర్ కూర్చోమనగానే చటుక్కున కూర్చున్నాడు.
"మనం ఎంత చెప్పిన వినిపించుకోలేదు. డాక్టరుగారు చెప్పగానే కూర్చున్నాడు" అన్నాడు రఘు తండ్రి రాఘవరావుతో అతనితో వచ్చిన పెద్దమనిషి.
"అవునండీ డాక్టరుగారి గొంతు వినగానే వీడు ఎంత బిగిసిపోయివున్నా కదుల్తాడు. ఆయన చెప్పినట్టే చేస్తాడు. అంతేగాదు ఉన్నట్టుండి డాక్టరుగారికి ఫోన్ చేస్తానంటాడు. ఫోన్ లో ఆయన ఏం చెప్తాడో. ఆ రోజంతా చాలా వరకు బాగానే వుంటాడు" అన్నాడు రాఘవరావు.
బాయ్ డోర్ నెట్టుకుంటూ బయటికి వచ్చి "మగతాయారు! మంగతాయారు" అని పిల్చాడు.
మంగతాయారు కొడుకు ఆమెను "పదమ్మా! డాక్టరు పిలుస్తున్నాడు" అని లేవదీయ ప్రయత్నించాడు.
"నన్నుకాదు పిల్చింది. ఇద్దర్నీ పిల్చాడు. అది కూడా ఇక్కడే ఎక్కడో వుందన్నమాట."
"లేదమ్మా! మంగమ్మా అనబోయి పొరపాటుగా పిల్చాడు." బాయ్ ఆమె దగ్గరకొచ్చి "రండమ్మా!" అన్నాడు.
"ఈమె మంగమ్మ. అలాగే పిలువు" ఆమె కొడుకు బాయ్ తో అన్నాడు.
బాయ్ తల గోక్కుని ఏదో గుర్తొచ్చినట్లుగా "ఆఁ ఆఁ అవును. మంగమ్మా పద! డాక్టరుగారు పిలుస్తున్నారు.
మంగమ్మ లేచింది. కొడుకు కూడా ఆమెతో పాటు లోపలకు వెళ్ళాడు.
"ఎలా వున్నావమ్మా?"
"అది నన్ను చంపమని ఇక్కడికి కూడా మనిషిని పంపించింది డాక్టరుగారూ?"
"అలాగా? ఆ సంగతి నేను చూసుకుంటాలే!" అంటూ ఆమెను యాంటీ రూంలోకి తీసుకెళ్ళాడు. ఐదు నిముషాల తర్వాత డాక్టరూ, ఆయన వెనకే మంగతాయరూ బైటికి వచ్చారు. ఆమె కొడుకుతో "ఆ మందులే వాడండి. వచ్చే బుదువారం తీసుకురండి" అన్నాడు.
ఆమెను తీసుకొని కొడుకు బయటికి వచ్చాడు. స్ప్రింగ్ డోర్ దగ్గిర ఆగికొడుకును ఒడుపుగా తోసి మళ్ళీ లోపలకు ఉసిగా వెళ్ళింది.
"ఏం మంగమ్మా!"
"నేను మంగమ్మను కాదు తాయారును."
"ఆఁ అవునవును. మర్చిపోయాను. ఏం తాయారూ! ఇలా వచ్చారేం?"
"అది ఆ మంగమ్మ మీ దగ్గిరకు వస్తుందటగా? నా మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తోంది. నేను దాన్ని చంపించదానికి చూస్తున్నానట."
"అలాగా?"
"మీకు చెప్పలేదా?"
"లేదు"
"డాక్టరుగారూ! ఆ గొలుసు అదే వాళ్ళు తమ్ముడికిచ్చింది. పైగా నేను కాజేశానంటున్నది."
వెనకనే లోపలకు వచ్చిన ఆమె కొడుకు తలవంచుకొని నిల్చున్నాడు.
"చూడు డాక్టరూ వీడు దాని కొడుకు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే పంపిస్తోంది.
"అలాగా? మీరు బయటికి వెళ్ళండి" అన్నాడు ఆమె కొడుకుతో. అతడు బయటికి వెళ్ళాక "మంగమ్మ సంగతి నేను చూసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళమ్మా!" అన్నాడు డాక్టరు ఉదయచంద్ర.
మంగమ్మ బయటికి వెళ్ళిపోయింది. ఉదయచంద్ర "డాక్టర్ జయంత్......ఈ కేసు అర్థం అయిందా?" తనతో వచ్చిన యువకుడ్ని ప్రశ్నించాడు.
"ఉహూ! అర్థం కాలేదు. కాసేపు తన పేరు మంగమ్మ అంటున్నది. మరి కాసేపు తాయారు అంటున్నది__ఏమిటో అంతా అయోమయంగా వుంది."
డాక్టర్ ఉదయ్ చంద్ర చిరునవ్వు నవ్వాడు.
"ఆమె అసలు పేరేమిటి?"
"మంగతాయారు."
"అంటే స్ల్పిట్ పర్సనాలిటి అన్నమాట. అసలు కేసేమిటి?" జయంతీ అడిగాడు.
"మగతాయారు ఖండితమూర్తి మత్త్వానికి గురి అయింది. ఆమె భర్త వడ్డీ వ్యాపారి. పరమ పిసినారి. సగటువడ్డీ వ్యాపారికి వుండే ఆవలక్షణాలన్నీ వున్నాయి. రకరకాల నగలు కుడువబెట్టుకొని డబ్బు అప్పులిస్తాడు. మంగళ సూత్రాలు కూడా కుదువ పెట్టుకోవద్దని భర్తతో అంటుంది. అతడు వినడు ఆమె మానసికంగా బాధకు గురిఅయింది. భర్తతో ఘర్షణకు దిగిలేక ఆ బాధను మనసులోనే అణుచుకొనేది. రెండు నెలల క్రితం భర్త దగ్గర ఎవరో కుదువ పెట్టిన చంద్రహారం వేసుకొని మేనకోడలి పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళిలో చంద్రహారం పోయింది. అంతేకాదు, కట్నం చాలలేదని పెళ్ళివారు పెళ్ళికూతుర్ని తీసుకు వెళ్ళకుండా వెళ్ళిపోయారు. మిగతా డబ్బుతో పాటు పెళ్ళి కుమారైను పంపించమని వెళ్ళి పోయారట. ఆమె మనసులో బాధ పడింది. ఆ తెల్లవారే చంద్రహారం కన్పించలేదు. భర్తకు తెలిస్తే చంపేస్తాడని భయం. అంతేకాదు నాగ పోయిందంటే నమ్మ్దడనీ, కష్టంలో వున్న తమ్ముడికి ఇచ్చిందనీ అంటాడని మరో భయం పట్టుకుంది. పెళ్ళి నుంచి తిరిగి వచ్చింది. కానీ చంద్రహారం గురించి భర్తకు చెప్పలేదు. అయితే ఏ నిముషంతో భర్త చంద్రహారం అడుగుతాడో ననే భయం విపరీతంగా పట్టుకుంది. మానసిక ఘర్షణకు లోనైంది. ఒక వైపు నిజం చెప్పెయ్యాలని___ చెప్పకుండా ఎలాగైనా ఆ గండంనుంచి బయటపడాలని రెండోవైపు____ రాత్రిళ్ళు నిద్ర వుండేదికాదు. అన్నం సహించేదికాదు. ఒకే కొడుకు. వాడూ తండ్రి వ్యాపారంలోనే సహకరిస్తూ వుండిపోయాడు. అతడూ పిసినారే. తల్లికి కొడుకు ఆ వ్యాపారం చెయ్యడం ఇష్టంలేదు. బాగా చదువుకున్నావాడు. ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఆమె కోరిక. ఆమె మాట తండ్రీ కొడుకులు ఖాతరుచెయ్యరు.
"నగవేసుకొని వెళ్ళినందుకు తనను తానే నిందించుకోసాగింది. వాళ్ళు చేస్తున్న పాపంలో తనకూ భాగంవున్నట్లు భావించసాగింది. విపరీతమైన మానసిక వత్తిడికి గురి అయింది___మతి చెలించింది. ఆమె వ్యక్తిత్వం రెండు భాగాలుగా విడిపోయింది. మంగమ్మగా తాయారుగా ఆమె మూర్తిమత్వం విడిపోయింది.
తాయారు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నదని మంగమ్మ (మూర్తిమత్వం) మంగమ్మ తనను అనవసరంగా బదనామ్ చేస్తున్నదని తాయారు (మూర్తిమత్వం) భావిస్తున్నాయి."
"రెండు మూర్తిమత్త్వాలూ ఏకం అయి మళ్ళీ మామూలు మనిషిగా అయే అవకాశం వుందా?"
"వుంది. ఆ విషయం తర్వాత చెబుతాను. రోగులు ఎదురుచూస్తున్నారు" అని డాక్టర్ ఉదయచంద్ర బెల్ నొక్కాడు. లోపలకు వచ్చిన బాయ్ తో "శివతాండవం!" అన్నాడు.
* * *
2
"శివతాండవం? శివతాండవం!" బాయ్ బయటికి వచ్చి పిల్చాడు.
శివతాండవం చివ్వున లేచి నిల్చున్నాడు. అతడితో వచ్చిన అతడి అన్నా, బావగారూ కూడా లేచారు. శివతాండవాన్ని పట్టుకొని లోపలకు తీసుకెళ్ళబోయారు. అతడు వాళ్ళిద్దర్నీ తోసేసి ఉసిగా లోపలకు వెళ్ళారు.
"వీళ్ళెందుకెళ్తున్నారూ?" గోడవారగా వున్న కుర్చీలో కూర్చున్న యువకుడు అన్నాడు.
"వీళ్ళు వాళ్ళవాళ్ళూ! వాళ్ళు వీళ్ళవాళ్ళు! ఏమిటా పిచ్చిమాటలు" కసిరినట్టుగా అన్నాడు ఆ యువకుడు.
ముసలాయన ముఖం పక్కకు తిప్పుకొని పై పంచతో కళ్ళు వత్తుకున్నాడు. అతడికి దాదాపు ఇరవై ఏడేళ్ళుంటాయి. అతడి పేరు అప్పారావు.
"మీ నాయనకు తెలియదులే అప్పారావ్?" అప్పారావు తండ్రి పక్కన కూర్చున్న అతడి మామగారు అన్నాడు.
"అది కాదు మామయ్యా! ముందెళ్ళినవాడి పెరేగా శివంతాండవం?"
"అవును. అప్పారావ్"
"అయితే వెనక వెళ్ళినోళ్ళు ఎందుకు చేశారంటావ్?"
"ఏమిటి చేసింది?" అప్పారావు మామ అన్నాడు.
"ఏమిటా? తాండవం! శివంతాండవం!" అప్పారావు పక పక నవ్వాడు.
ఆ యువకుడి తండ్రీ, మామా ఒకరి ముఖాల్లోకి చూశారు. వారి ముఖాల్లో నవ్వూ, ఏడుపూగాని భావం ఏదో కదలాడింది.
"మాట్లాడరేం? వాళ్ళెందుకు శివతాండవం చేశారూ?"
"ఏం సమాధానం చెప్పాలో ఒకరికీ తోచలేదు. ముఖాలు తిప్పుకొని దిక్కులు చూడసాగారు.
'నిజమే! శివతాండవం నిటారుగా నడుచుకుంటూ లోపలకు వెళ్ళాడు. అతనితోవున్న వాళ్ళిద్దరూగాభరాగా తత్తరబిత్తరలాడిపోయారు ఇంత తెలివిగా మాట్లాడే తన బిడ్డకు ఈ మాయదారి రోగం ఏమిటి? ఎలాంటివాడు ఎలా అయిపోయాడు?' అప్పారావు తండ్రి నిట్టూర్చాడు.
ఆ తండ్రి గుండె చెరువైంది. కళ్ళల్లోకి నీరు చిప్పిల్లింది.
అప్పారావు పైకప్పుకేసి చూస్తూ కూర్చున్నాడు.
"ఇంకా చేస్తున్నట్టున్నారు?"
"ఎవరు బాబూ! ఏం చేస్తున్నారు?"
"లోపలకు వెళ్ళిన వాళ్ళు శివతాండవం ఇంకా చేస్తూనే వున్నట్టున్నారు. పాపం! శివతాండవం ఆ ఇద్దరి పిచ్చోళ్ళనూ ఎలాతీసుకొచ్చాడో?" అన్నాడు అప్పారావు.
"పిచ్చివాళ్ళకు కాదు బాబూ! ఆ అబ్బాయికే."
"ఏయ్! మామా! నువ్వు కాసేపు నోరు మూస్తావా?" గద్దించాడు. అప్పారావు.
అప్పారావు మామ బిక్క ముఖం పెట్టి, నేల చూపుల చూడసాగాడు.
అప్పారావు చివ్వున లేచి నిల్చున్నాడు.
అతడి తండ్రీ మామా ఒక్కసారిగా లేచి అప్పారావును పట్టుకున్నారు.
"వదలండి నన్నెందుకు పట్టుకుంటారు?"
"రెండు నిముషాలు బాబూ! వచ్చేది మన నంబరే. కూర్చో" అన్నాడు అప్పారావు తండ్రి.
"నంబరా? ఏం నంబరూ? ఎవరి నంబరూ?"
"డాక్టరుగారి నంబరు"
"డాక్టరుగారి నంబరా! అంటే ఆయనకూడా చేస్తాడా శివతాండవం? పిచ్చిమాటలు మాట్లాడకు."
"కాదు బాబూ! మన నంబరు. నంబరువారీగా పిలుస్తున్నారు. శివతాండవం బయటికి రాగానే మనల్నే పిలుస్తాడు."
"ఎవరూ పిల్చేది?"
"డాక్టరుగారు"
"డాన్సు చెయ్యడానికేనా? నాకు రాదుగా. మామను చెయ్యమను. ఏం మామా డ్యాన్సు చేస్తావా? రాక్ అండ్ రోల్ చెయ్యి."
"డ్యాన్స్ చెయ్యడానికి కాదుబాబూ!"
"మరెందుకూ?"
"నిన్ను చూడటానికి"
"ఇప్పుడేగా చూశాను. మాట్లాడానుకూడా మళ్ళీ ఎందుకు పిలుస్తాడు?"
"మాట్లాడావా? ఎవరితో?"
"ఇంకెవరితో......డాక్టరుగారితో."
మామకు మతిపోయినట్టే అయింది. అసహాయంగా వియ్యంకూడి ముఖంలోకి చూశాడు.
అంతా ఖర్మ వీడికి తిక్క ఎక్కువనీ పెళ్ళయితే బాగుపడ్తాడనీ తను భావించాడు. పెళ్ళయ్యాక ఉన్న మతికూడా పోయింది. తన పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. వియ్యంకూడూ, కోడలు పిల్లా పిచ్చి వాడికి పెళ్ళిచేశాడని ఒకటే సాధింపు. పెళ్ళికిముందు పిచ్చిలేదని చెప్పినా ఎవరూ నమ్మడంలేదు తను మోసంచేసినట్టు అందరూ నిందిస్తున్నారు.
"నేను వెళ్తున్నాను. మీరు డాక్టర్ని చూసిరండి" అప్పారావు తండ్రి ఆలోచనల దారం పటుక్కున తెగింది.
"బాబూ! కూర్చో డాక్టరుగారు పిల్చేటైం అయింది" కొడుకుని బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు ముసలాయన.
కట్నం డబ్బు వెంటనే కక్కమనకుండా బి.టెక్. చదివిన అల్లుడు దొరికాడని తను సంబర పడిపోయాడు. కుర్రాడి గురించి కొందరు చూచాయగా తన దగ్గర అన్నారు. గిట్టనివాళ్ళు చెప్పే మాటలుగా భావించి కొట్టిపారేశాడు. కొంతకాలం బాగానే వున్నాడు. ఉన్నట్టుండి ఇలా తయారయ్యాడు.
"మామా! నువ్వుండినాన్నను డాక్టరుకు చూపించి తీసుకురా నేను వెళ్తున్నాను."
"డాక్టరు నిన్ను చూడాలి అప్పారావ్. మీ నాన్నను కాదు."
"డాక్టరు చూశాడు."
"డాక్టరు ఇంకా నిన్ను చూడలేదు"
"డాక్టరు చూశాడని ఎవరన్నారు?"
"నువ్వే అన్నావ్ అప్పారావ్!"
"మతిలేని మాటలు మాట్లాడకు. డాక్టరు నన్ను చూశాడనలేదు. నేను డాక్టర్ను చూశానన్నాను" అప్పారావు ఉద్రేకంగా అన్నాడు.
"అవును బాబూ! నువ్వలాగే అన్నావ్. మీ మామగారికి తెలియదులే ఊరుకో" అన్నాడు అప్పారావు తండ్రి.
"అక్కడికి నీకు మహా తెలిసినట్టు. నీ తెలివి తెల్లారినట్టే వుంది. నువ్వు కాసేపు నోరుమూసుకో."
ఠపీమని ముఖంమీద గాజు పెంకులు పగిలినట్టు అయింది అప్పారావు తండ్రికి.
అప్పారావు మామ వియ్యంకుడి ముఖంలోకి "బాగా అయింది" అన్నట్టుగా చూశాడు.
"బాబూ!" అప్పారావు తండ్రి కంఠంలో దుఃఖం పోంగింది.
అప్పారావు తండ్రి ముఖంలోకి చూశాడు.
ఏమనిపించిందో ఏమో ఠక్కున కుర్చీలో కూర్చున్నాడు. కాళ్ళు భూమి మీద నిగడతన్ని నిటారుగా కూర్చున్నాడు.
"సరేలే! నేను ఆయనను చూశానని ఒప్పుకున్నావుగా? ఇప్పుడిక ఆయన నన్ను చూస్తాడు. అంతేగా? చూడమను. ఐ డోంట్ మైండ్! ఐ డోంట్ కేర్! వ్వాట్ ఈజ్ హీ? ఆఫ్టరాల్ ఒక డాక్టర్ నేనో! నేను ఇంజనీరును. లెక్కల్లో మార్కులు రానివాళ్ళంతా డొనేషన్ కట్టి డాక్టర్లవుతారు. నేను డొనేషన్ కట్టలేదు లెక్కల్లో యూనివర్శిటీటాప్ గోల్డ్ మెడ లిస్టును. ఆ డాక్టర్ నన్నేం చూస్తాడు సరే! చూడమను! నాకేం భయమా? డాక్టర్ను చుట్టానికి? నాకేం భయం? ఏయ్ మామా! వింటున్నావా? నేను గోల్డ్ మెడలిస్టును. డాక్టరంటే నాకు భయం అనుకుంటున్నావు కదూ? మాట్లాడవేం! అట్లా గుడ్లు మిటకరించి పిచ్చివాడిలా చూస్తావేం? ఆఁ మర్చిపోయాను. నీకు పిచ్చేగా? అందుకేగా నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాను"
"నాకు పిచ్చేమిటి?" అప్పారావు మామ గుటకవేశాడు.
"నిక్కాకమరి నాకా?" అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు అప్పారావు చివ్వునలేచి నిల్చున్నాడు.
"మళ్ళీ ఏం ముంచుకొచ్చిందిరా నాయనా! కూర్చో!" అంటూ అప్పారావు తండ్రి కొడుకును రెండు చేతులతో పట్టుకున్నాడు.
"మధ్యలో నువ్వోకడివి. నువ్వుండు వదులు నన్ను" తండ్రి చేతుల్ని విసురుగా తోసేసి, మామ ముందుకొచ్చి చొక్కా దొరకపుచ్చుకున్నాడు.
"ఏయ్! ఏమిటిది?వదులు!" అప్పారావు మామ గాభరపడి పోయాడు.
వదల్ను ముందిది చెప్పు నా మెడల్ ఏం చేశావ్?"
"మెడలా? ఏం మెడలు?"
"ఏం మెడలా? నా గోల్డ్ మెడల్, తెలియనట్టు దొంగవేషాల వేస్తున్నావా? ఏదీ అది? ఏం చేశావ్?"
అప్పారావు మామలో సహనం నశించింది అప్పారావ్ చేతులు విసురుగా నేట్టేశాడు.
"నీ గోల్డు మెడలేమైందో నాకేం తెలుసు?" "నీకే తెలుసు"
"నాకిచ్చావా?"
"నేను మీ అమ్మాయి కిచ్చాను. దాన్ని నువ్వు మీ అమ్మాయి దగ్గర్నుంచి లాగేసుకున్నావ్."
"ఊరుకో బాబూ!"
"మధ్యలో నిన్ను మాట్లాడొద్దన్నానా?"
"నీ మెడలు నేను అసలు చూడందే?"
"చూశావ్ చూట్టమేమిటి......మీ అమ్మాయినిబెదిరించి తీసుకున్నావ్ దాన్ని నాయుడమ్మ కొట్లో కుదవపెట్టి, నాలుగు కిలోల లంక పొగాకు తెచ్చుకున్నావ్.
"ఏమిటా పిచ్చి కూతలు?"
"మీరూరుకోండి బావగారూ! వాడు తెలియక అనే మాటల్ని పట్టించుకోకండి." అంటూ అప్పారావు తండ్రి వియ్యంకుడి రెండు చేతులూ పట్టుకున్నాడు.
"నేను తెలియక మాట్లాడుతున్నానా? అక్కడికి మీ ఇద్దరూమహా తెలివైన వాళ్ళయినట్టు. మామకు తెలిసింది. కూతుళ్ళను కనడం, అల్లుళ్ళను మోసం చెయ్యడం-అంతేగా మామ?" అప్పారావు విరగబడి నవ్వసాగాడు.
హల్లో కూర్చున్నవాళ్ళు, వాళ్ళ సంభాషణ కుతూహలంగా వింటున్నారు.
"నీకేం తెలియదు కదూ?" అప్పారావు ఠక్కున నవ్వు ఆపిమామను అడిగాడు.
"తెలియదు."
"పొగాకు కొనలేదూ?"
"లేదు! లేదు?"
"కొన్నావ్. ఆ పొగాకు ఎక్కడ దాచావోకూడా నాకుతెలుసులే."
"ఎక్కడ దాచానంటావ్?"
"ఇదిగో ఇక్కడ. అప్పారావు ఒక్కసారిగా మామగారి చొక్కా ఎత్తి, బొడ్డు దగ్గరున్న బనీను జేబులో చెయ్యి పెట్టాడు.
మామ కోపంతో అల్లుడ్ని బలంగా తోసేశాడు.
పడబోయిన అప్పారావును తండ్రి పట్టుకొన్నాడు.
అప్పారావు మామతో ముష్టి యుద్దానికి సన్నద్దుడయ్యాడు.
"ఏమిటయ్యా గోల? కూర్చోండి" బాయ్ అరిచాడు.
అప్పారావు కిక్కురమనకుండా కుర్చీలో కూర్చున్నాడు.
* * *
"నీ పేరేమిటి?"
"శివతాండవం?" డాక్టరు ప్రశ్నకు శివతాండవం తండ్రి సమాధానం ఇచ్చాడు.
"అదుగో! ఆ బుద్దితక్కువ మాటే అనొద్దన్నాను. నాపేరు శివతాండవం కాదు."