Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 19

    కృష్ణకి వళ్ళు మండింది.

    రోజా అంటే కృష్ణకి చాలా యిష్టం. రోజా ప్రభాకర్ ని ప్రేమించి వుండకపోతే పెళ్ళాడేవాడే. విశాల హృదయం మంచితనం మూర్తీభవించిన కృష్ణ రోజామీద కోపం తెచ్చుకోలేదు.

    రోజాకి ప్రేమించిన ప్రభాకర్ తో పెళ్ళి కాలేదు. పైగా పిచ్చిది అయింది.

    తన ఆప్తురాలు రోజా స్థానంలో దొంగచాటుగా ఈ నయవంచకి ప్రవేశించిందిగాక నువ్వు నన్నేం చేయలేవన్నట్లు పొగరుగా తల ఎగరవేస్తుందా? ఏం చూసుకుని దీని ధైర్యం, దీని పని పట్టాలి.

    కశిగా అనుకున్నాడు కృష్ణ.

    "టిఫెన్ తిన్నావా తల్లీ!" భుజంగరావు అమల చెయ్యి ఆప్యాయంగా నిమురుతూ అడిగాడు.

    "ఓ......నేను ప్రభ తిన్నాంగా!" అంది అమల ఓసారి నాలుక బయటపెట్టి చూపి.

    సుందరమూర్తి వచ్చాడు. "మామయ్యా! రావులపాలెం రంగరాజులు వచ్చాడు నిన్ను చూడాలంటున్నాడు" అంటూ వార్త చెప్పాడు.

    "రంగరాజు వచ్చాడా! పద వస్తున్నాను." అని భుజంగరావు లేచి నుంచున్నాడు.

    అమల కూడా భుజంగరావు చేయి పుచ్చుకుని లేచి నుంచుంది. "ప్రభ వచ్చాడు. నన్నూ రమ్మన్నాడు నేనూ వస్తాను" అంది.

    వంటరిగా అమలను పట్టుకొని నాలుగు వుతకాలని కృష్ణ ప్లాను.

    ఆ ప్లాను తెలిసే అమల ఆ గదిలోంచి బయట పడాలనుకొంది.

    "అక్కడికి రాకూడదు రోజా తలీ! మా అమ్మవు కదూ, మంచి దానివి. ప్రభా దగ్గరకు కృష్ణ తీసుకెళతాడు వెళ్ళు" అని అమలతో చెప్పి, కృష్ణ వైపు తిరిగి "కృష్ణా! రోజా జాగ్రత్త. రంగరాజుతో యింకా వాళ్ళ మనుషులు వచ్చి వుంటారు. అదో వ్యవహారం. వాళ్ళతో మాట్లాడి పంపించి వస్తాను. రోజాని చూడంగానే సానుభూతి మాటలు చెపుతారు. అది నేను భరించలేను." అని వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు భుజంగరావు.

    ఆ గదిలోంచి బైట పడదామని చూసింది అమల.

    ముందే అది గ్రహించిన కృష్ణ వక్కంగలో వెళ్ళి వాకిలి కడ్డంగా నుంచున్నాడు.

    బోనులో చిక్కినట్లంది అమల పని.


                                   13


    "టట్టటాం." అన్నాడు కృష్ణ మహా వుషారుగా.

    అమల ఏమీ మాట్లాడలేదు. తలవంచుకుంది.

    "ఎవరికి లెటర్ రాశావ్ బుజ్జి!" రవంత వ్యంగ్యంగా లాలన కలిపి అడిగాడు.

    అమల చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది. సమయం కలిసి వచ్చింది. కృష్ణకు లెటర్ అందించవచ్చు కాని రాత్రి భగవాన్ కి తను కృష్ణ విషయం చెప్పింది. ఈ రాత్రికి ఉపాయంగా ఊరికి పంపిస్తామన్నారు కృష్ణని. రాత్రి లోపల కృష్ణని వెయ్యి కళ్ళు వెంటాడుతుంటాయి. తను కృష్ణకి లెటర్ అందించటం చూస్తె కొంప మునుగుతుంది. చాలా జాగ్రత్తగా లెటర్ ని కృష్ణకి అందివ్వాలి. తను తొందరపడకూడదు.

    "నిన్నే బుజ్జి తల్లీ! ఎవరికి లెటర్ రాశావని అడుగుతున్నాను." మళ్ళి అడిగాడు కృష్ణ.

    "ప్రభకి. నా ప్రభకి." పిచ్చిగా అంది అమల.

    "వేషాలు వేయకు తోలు వలిచేస్తాను. ఎవరికి రాశావ్ ఆ లెటరు?"

    "ఓ ఇడియట్ కి."

 Previous Page Next Page