Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 18

    జరగరానిది జరిగితే ఆస్తీ నాదవుతుందిగాని మీదేలా అవుతుందని భగవాన్ ని అడిగాను. ఎలా అవుతుందో మాకు తెలుసు నీపని నటించటమే నన్నారు.

    నన్ను చాలా భయపెట్టి మావాళ్ళని చిత్రవధలు చేస్తానని అదని యిదని చెప్పి యిక్కడ చేర్చారు ఈ యింట్లో కొందరు భగవాన్ మనుషులు. అందుకే నా నీడ కూడా నన్ను భయపెడుతున్నది ఎవరినని నమ్మను? పోనీ మీ మామయ్యగారికే చాటుగ ఈ విషయం తెలియజేద్దామా అంటే వారసలే హార్ట్ పేషెంట్, సమయం కోసం చూస్తున్నాను.

    దైవం పంపినట్లు మీరు వచ్చారు.

    నన్ను మీరు అనుమానించారని ఆలోచించి కొత్త పధకంతో నేనీ లెటర్ వ్రాయటం లేదు. యువకులు తెలివిగలవారు. ఈ విషవలయం చేదిస్తారని ఎత్తుకు పైఎత్తు వేసి వీళ్ళ ఆటలు కట్టిస్తారని నమ్మి యిదంతా రాస్తున్నాను.

    భగవాన్ గాడికి లక్షకళ్ళు ఈ యింట్లో సగంమంది వాడి మనుషులే. ఈ రాత్రికి ఏ ప్లాన్ తో మిమ్మల్ని వూరికి పంపిస్తున్నారు. దీనిని బట్టి వీళ్ళు ఎంత తెలివి గలవాళ్ళో వూహించండి. వీళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ముందు భగవాన్ గాడేవడో కనిపెట్టి ఈ యింటినీ ఆస్తినీ నన్నూ కూడా రక్షించగలరు.

    అంతా నిజమే రాసాను. మీరు నమ్మి రంగంలోకి దిగితే నేను నా తల్లి అదృష్టవంతులమే.

    చాలా జాగ్రత్తగా మెలగగలరు.

    నేను మోసగత్తేనుగాను. గాడ్ ప్రామిస్.

    ఆ మంచిరోజు కోసం చూస్తూ......


            అమల
   
        (రోజా వేషంలో వున్న అమల)


    అమల తాను రాసిన లెటర్ ఒకటికి రెండుసార్లు చదువుకుంది. మళ్ళి కొన్ని విషయాలు గుర్తుకు రావటంతో చివర నాలుగు బంతులు రాసింది.

    అమల రాసిన ఆ లెటర్ ని మడతపెట్టి జాకెట్ లో పెట్టి దాయబోతున్నది. గబగబ తలుపు తట్టిన చప్పుడు అయింది. అమల కంగారుగా జాకెట్ లో లెటర్ దోపి లెటర్ పాడ్ పెన్ను అలాగే చేతిలో పుచ్చుకుని వెళ్ళి తలుపు తీసింది.

    తలుపు అవతల భుజంగరావు ఆయన వెనుక కృష్ణ నిలబడి వున్నారు.

    అమల చేతిలో పెన్ను లెటర్ పాడ్ చూస్తూ "తలుపు లోపల గడియ వేసుకుని ఏం చేస్తున్నావు తల్లీ!" అన్నారు భుజంగరావు.

    "కనపడుతూనే వుందిగా మామయ్యా! ఎవరికో లెటర్ రాస్తున్నది." రెండర్థాలు వచ్చేటట్లు అని అమల వైపు తిరిగి "రోజా ఎవరికి లెటర్ రాస్తున్నావ్! నీ ఆప్తులకా?" రవంత వ్యంగ్యంగా అన్నాడు కృష్ణ.

    పిచ్చిగా యాక్షన్ చేయాలి కదా. అందుకని అమల మాట్లాడలేదు.

    భుజంగరావుగారు లోపలికి వచ్చి కూర్చున్నారు కృష్ణ కూడా వచ్చి కూర్చున్నాడు. యింక చేసేదేముంది అమల వచ్చి మంచంమీద కూర్చుంది.

    "ఏం రాశావ్ చూద్దాం యిటివ్వు." అని లెటర్ పేడ్ లాక్కున్నట్లే అమల చేతిలోంచి తీసుకున్నాడు కృష్ణ.

    "నేను ముగ్గులేశాను. ఎంచక్క ముగ్గు ముత్యాల ముగ్గు." రాగం తీసింది అమల పిచ్చి ధోరణిలో.

    పెన్ను సరీగ పనిచేయక పోవటంవల్ల లెటర్ ని నొక్కి గట్టిగా రాశింది అమల అందువల్ల అక్షరాలు నొక్కులు కాగితం మీద వత్తుకున్నట్లు పడ్డాయి.

    నొక్కులు పడ్డ కాగితాన్ని కృష్ణ పరీక్షగా చూడటం అమల గ్రహించింది.

    "నీ సంగతి గ్రహించాను. తలుపు గడియ బిగించుకుని ఎవరికి రహస్యంగా లెటర్ రాస్తున్నావు తల్లీ. మహాతల్లీ!" అన్నట్లు తీక్షణంగా చూశాడు కృష్ణ.

    కృష్ణని ఏడిపించాలన్న చిలిపి కోరిక ఆ నిముషాన కలిగింది అమలకి భుజంగరావు చూడకుండా "పోవోయ్! నీ లేక్కేమిటి, నా యిష్టమొచ్చిన వాళ్ళకి రాస్తాను. నీవేం చేస్తావ్!" అన్నట్లు పొగరుగా తల ఎగరవేసింది.

 Previous Page Next Page