"......"గెటవుట్-రాకూడదని తెలీదు-రాజాంతఃపురంలోకి రాణులతో మహారాజులున్నపుడు మగ పురుగు కూడా రారాదు. తెలీదా?"
మౌనంగా వెళ్ళాడు సారధి.
ఆమెవేపు ఎగాదిగా చూసి అన్నాడు.
"సరిగా కూర్చో"
కూర్చుంది.
"మనం వెళ్ళిపోదామా?"
"అలాగే"
"ఎప్పుడు?"
"మీ ఇష్టం"
"మంచిది" మళ్ళీ అడిగాడు.
"ఎక్కడికి?"
ఆమె జవాబు చెప్పక పూర్వమే మళ్ళీ తనే అన్నాడు.
"అదీ నా ఇష్టమే కదూ?"
నవ్వింది ఆమెనాధారంగా చేసుకొని లేవబోయాడు- బాండేజ్ కదలి బాధ అయింది.
"అబ్బా"
"అదిగో ఆ తొందర-అదే-వద్దన్నారు-వుండండి ఇంట్లోకి వెళ్ళివస్తాను-కొంచెం సేపు తర్వాత మనం వెళ్ళిపోదాం అంతవరకు మీరు పడుకోండి"
అతన్ని మెల్లిగా పడుకోబెట్టి బయటకు వచ్చేసింది.
13
"సుశీలా......"
"వస్తున్నానక్కా"
తలకి పోసుకోని తల ఆరబెట్టుకుంటున్న సుభద్ర దగ్గరిగా వచ్చింది సుశీల. మంచం మీద కూర్చోని ఆవిడ దగ్గరగా జరిగి వెంట్రుకలు విదిలిస్తూ అంది సుశీల.
"ఏమక్కా పిలిచావ్"
"ఏమిటమ్మా చదువుతున్నావ్"
"మహాభారతమక్కా"
"ఏ పరమో?"
"ఉద్యోగం-రాయబార ఘట్టం చదువుతున్నావా"
"ఓహో! ద్రౌపది ఉక్రోషం చదువుతున్నా-రాజ రాజు పీనుంగు కన్నారా కాన బడయమెతి మేని కృష్ణ-అంటోంది కదమ్మా"
మౌనంగా వింటోంది సుశీల.
"కర్ర్రి విక్రమంబు-పెనుగద పట్టిభీమ సేనుని పరాక్రమము కాల్చవా? అంటోంది కదా" వింటోంది సుశీల.
"తనువు ఇంతలింతలుగా తెగి పడాలి అనుకుంది"
"అయినా ఆడదానికి అంత ద్వేషం కూడదేమోనమ్మా"
"లేదక్కా! ప్రాణంకన్నా మానం మిన్న అనుకునే వారికి ఆ మానాన్ని భంగం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని..... వాళ్ళని ఏమైనా......."
"పోనిలేమ్మా- అవన్నీ నిజమే కాదనను-కానీ భర్తగారు అన్నగారు సంధికావాలంటూంటే- మిగతా నలుగురు భర్తలు కూడా అటూ ఇటూ కాకుండా కొంతకు కొంత మనసులోని దేషాన్ని చంపుకొని పెద్దపెద్ద ప్రతిజ్ఞలు చేసినవారే చివరికి సంథి వచనాలు అన్నారే-అలాంటప్పుడు ఈమె అన్నగారితో తనూ ధర్మరాజు రాజురాజు పీనుగు కన్నారచూడందే శాంతి లేదంటుందే-తన మనసులోని చిచ్చు ఆరదంటుందే-అదేం బావుందమ్మా?"
"అదే బావుండక్కా మనసులో ఒకటిపైకి ఒకటి అనలేదు! ముమ్మూర్తుల తన మనసులోని చిచ్చు ఆరే విధానం మాత్రమే చెప్పింది అందులో తప్పేముంది-అయినా ఈనాడు కూడా చూడటం లేదా మనసులో ఒకటి పైకి మరొకటి అనేవాళ్ళని-ఒక వంక సంధి అంటారు-మరోవంక మామూలుగా చేసేది చేసేస్తుంటారు-అప్పుడూ అంతే-ఇప్పుడూ అంతే-ఇది ఎప్పుడూ ఇంతే అక్కా"
"అవునమ్మా"
"కాల గతిలో మార్పులేదక్కా కాల స్థితిలో మార్పు వుండొచ్చు. మనుషులు మారొచ్చు-మనసులు మారొచ్చు అంతేకాని స్వభావాలు మాత్రంమారవు-ఒకటే అక్కా-అది ఈ గాలిలోనే ఉందేమో?"
"పోనీలేమ్మా మనవంతు అందని విషయాలవి-నీవు! శ్రద్దగా చదువుతున్నావా?"
ఆవేశానికి సిగ్గుపడింది మెల్లిగా అంది.
"ఇంగ్లీషు, లెక్కలు తప్ప అన్నీ బాగా చదువుకుంటున్నానక్కా" ఆశ్చర్యంగా అడిగింది.
"మరి అవెందుకు చదవటం లేదమ్మా-అవేకదా గొంతు పట్టుకునేవి-"
"ఆయన రావటం లేదు-చెప్పేవాళ్ళు వేరు"
"ఎవరు? సారధా?"
"ఊ"
"ఎన్ని రోజులైంది"
"వారమవుతోంది"
"నిజమే గుర్తులేదు. ఈరోజు కబురంపుతాన్లే బహుశా టౌన్ కి వెళ్ళాడేమో? లేకుంటే ఇన్ని రోజులు నన్ను చూడకుండా వుండలేడు"
మౌనంగా కూర్చుంది సుశీల.
"చదువుకో పోమ్మా"
సుశీల వెళ్ళాక అలాగే మంచంమీద అట్లేపడుకొని సారని గురించి ఆలోచించసాగింది సుభద్ర-
14
ఆతురతతో బయట కూర్చున్నారు సారధి, డాక్టరుగారు గీతను చూసి ఇద్దరూ దగ్గరగా వచ్చి ఒక్కసారిగా అడిగారు.
"ఏమైంది?"
"ఏమీ కాలేదు"
"మరి?"
"ఇక్కడ నుంచి పారిపోదాం.....ఇక్కడ వద్దు- డాక్టరు రాక్షసులు.......బల్లెలతో పొడుస్తారు.......విషాలు తాగుతారు......అంటున్నాడు. మిమ్మల్ని చూచి భయంతో అరిచాడు కదా? సారధిని చూసి కోపగించుకుని బయటకు వెళ్ళి పొమ్మన్నాడు ఆగ్రహమంతా మూర్తీభవించిన మాటలతో తర్వాత నన్ను పిలిచి వెళ్ళిపోదామన్నాడు. ఎక్కడికి ఎందుకు అవి అడిగాడు-అతని ఇష్టమన్నాను. నవ్వాడు సరేనన్నాడు'
"తర్వాత ఏమన్నాడు"
మధ్యలో అడిగాడు డాక్టరుగారు
"వెంటనే పోదామని లేవబోయాడు. నొప్పి కలిగింది. బాధతో ఆరిచాడు విశ్రాంతిగా పడుకోమని చెప్పి బయటికి వచ్చాను"
"పడుకున్నాడా"
"ఆ!"
"మళ్ళీ ఏమైనా చెప్పాడా?"
"లేదు"
"త్వరగా రమ్మన్నాడా?"
"ఉహూ"
"ఏమీ అనలేదా?"
"లేదు"
మరేమీ ప్రశ్నించలేదు డాక్టరుగారు. మౌనంగా ఆలోచనల్లో మునిగిపోయాడు. సారధి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇద్దర్నీ చూస్తూ వాళ్ళ ఆలోచనలని గమనిస్తూ అలాగే నిలబడింది గీతాంజలి. కళ్ళు పీకుతున్నాయ్. కాళ్ళు లాగుతున్నాయ్. నిస్సత్తువగా వుంది. కొద్ది సేపయ్యాక డాక్టరుగారు పచార్లు చేయటం సాగించారు. సారధి నిశ్శబ్ధాన్ని భరించలేక పిలిచాడు.