Previous Page Next Page 
మనస్విని పేజి 18

 

    డాక్టరుగారు ఆలోచనలో పడ్డారు.
    
    ముందుమతి చలించింది-

 

    మళ్ళీ బ్రెయిన్ మీద దెబ్బ-
    
    మతిచలించవచ్చు-
    
    అలాఅని బాగుపడుతుందా?
    
    ఆయన ఆలోచనలకి  భంగంకలిగిస్తూ అన్నాడు.
    
    "ఎలక్ట్రిక్ షాకువల్ల కొన్ని కొన్ని పర్యాయాలు సాధీనం తప్పిన అవయవాలు తిరిగి షాకుతో బాగుపడుతాయి కదా"
    
    "నిజమే అది-కానీ ఇది మెడిసిన్ చరిత్రలోనే ఓ కొత్త కేసు అవుతుంది అలా జరిగేట్టయితే. కానీ ఇంతవరకూ అనుభవాల్నిబట్టి చూస్తే అది అసంభవమేననిపిస్తుంది"
    
    ఒక్క క్షణం ఆగి అన్నాడు.
    
    "మీరు ఊరికే గాబరాపడకుండా విశ్రాంతితీసుకోండి ఇక్కడే. ఏది ఎలా జరుగువలసిందో అలాగే జరుగుతుంది. ఊరికే ఆలోచనలతో మనసుని పాడుచేసుకోవటం ఎందుకు? అతన్ని ఉదయం చూద్దురుగాని"
    
    సూర్యోదయం కాబోతోంది.
    
    ప్రాగ్దిశాసతినిండు గర్భిణిలా ఉంది.
    
    తొలిచూలిజవరాలు పడేవేదనలాగా ఆకాశం వెలవెలాబోతోంది.
    
    హాస్పిటల్ లో లైట్లు వెలుగుతున్నాయ్ ఇంకా-
    
    స్పెషల్ రూమ్ లో-
    
    మంచంమీద పడుకున్నాడు గురుదేవ్-
    
    ఆ మంచం చుట్టూ డాక్టర్ గారు, సారధీ, గీతాంజలి, నిల్చున్నారు. ఇరువేపులా డాక్టరు గారు సారధీ నిల్చుని అతని ముఖంలోకి తీక్షణంగా చూస్తున్నారు.
    
    అతనికికాళ్ళవేపు నిల్చుని తదేక ధ్యాసతో చూస్తోంది గీతాంజలి.
    
    రాత్రంతానిద్రలేకపోవటంవలన పీక్కుపోయిన కళ్ళతో-సరైన తిండిలేక బలహీనంగా కనిపించే ముఖంతో ఎలాగో వుంది ఆమె-
    
    బయటవరుసగా ఆరుగంటలు మ్రోగింది. అటు సూర్యోదయము అయింది. కన్ను తెరిచాడు. ఎదురుగా అరవై కాండిల్ బల్బు వెలుగుతోంది. చూడలేక కళ్ళుమూసుకున్నాడు ఒక్క క్షణం వుండి వెలుతురికి చేయి అడ్డం పెట్టుకొని కళ్ళు తెరిచాడు.
    
    డాక్టరు సైగ చూసి నర్స్ లైట్ తీసివేసింది. హఠాత్తుగా వెలుతురు తగ్గటంతో మళ్ళీ అంధకారం ఆవరించి నట్లయింది.
    
    ఒక్క క్షణం వుంది. మళ్ళీ కళ్ళు తెరిచాడు.
    
    ఎదురుగా ఓ అమ్మాయి    
    
    కనుబొమ్మలు ముడివేశాడు.
    
    ఎవరు?
    
    ఎందుకుంది?
    
    కళ్ళుమూసుకొని మళ్ళీ తెరిచాడు.
    
    అలాగే ఎదురుగా వున్న అమ్మాయిని చూశాడు.
    
    మళ్ళీకళ్ళు మూసుకున్నాడు మళ్ళీ తెరిచాడు. ఎదురుగా వుందా అమ్మాయి ఒక్కక్షణం తటపటాయించి దగ్గరగా రమ్మని సైగ చేశాడు.
    
    ఆమె డాక్టరువైపు చూసింది.
    
    వెళ్ళమన్నట్లు తలూపాడు.
    
    దగ్గరగా వెళ్ళింది.
    
    సారధి తప్పుకున్నాడు తలవేపుకి-ఆమెకి స్థానం ఇస్తూ.
    
    అతడు ఎడమ చేతినెత్తబోయాడు. బరువుగా వుంది. తలతిప్పి చూశాడు. అక్కడక్కడ ప్లాస్టర్సు వేశారు.
    
    "ఏమిటన్నట్టు" చూసాడు.
    
    "దెబ్బతగిలింది-కట్టుకట్టారు-"
    
    "ఎక్కడ?"
    
    "తలమీద"
    
    తడుముకున్నాడు
    
    గడ్డంమీదుగా చుట్టితలకు ఒక కట్టుకట్టారు తలచుట్టూ నొసటి మీదుగా మరొకటి.
    
    "ఎందుకు తగిలిందో?"
    
    "ఏమో"
    
    "నీకు తెలియదా?"
    
    "ఊహు"
    
    ఒక్కక్షణం ఆగి అన్నాడు.
    
    "నీవునర్సా?"
    
    "కాదు"
    
    "మరి"
    
    "మీ ఫ్రెండ్ ని"
    
    అతను మళ్ళీ ఏమీ ప్రశ్నించలేదు. ఒక్క నిమిషం ఆగి ఆమె అడిగింది.
    
    "మీకు దెబ్బ తగిలిన విషయం మీకు తెలియదా?'
    
    "ఉహూ"
    
    "ఆవిషయమే గుర్తులేదా?"
    
    "లేదు"
    
    ఆశ్చర్యపోయాడు డాక్టరుగారు.
    
    "నిజంగా ఆ ప్రమాదం అతని మానసికమైన గాయాన్ని ఆ మెంటల్ షాక్ ని రికవర్ చేసిందా?" అని అతనిదృష్టికి అందేలా నడిచాడు డాక్టరుగారు.    
    
    కెవ్వుమని కేకవేశాడు అతను-
    
    డాక్టరుగారు స్థాణువయ్యాడు......
    
    కళ్ళుతెరిచి ఆమె వేపుచూచి దగ్గరగా రమ్మనిసైగ చేశాడు వెళ్ళింది.    

 

    "కూర్చో" కూర్చుంది.
    
    ఆమె చేయి నందిపుచ్చుకుని అన్నాడు:
    
    "నాకుభయమేస్తోంది"
    
    "ఎందుకు?"
    
    "అతను చంపుతాడు" డాక్టరువేపు చేయిచాపి చూశాడు.
    
    "ఉహూ అలాంటివారు కాదు"
    
"లేదు......నీకుతెలియదు.....రాక్షసుడు విషాలన్నీ త్రాగమంటాడు-బల్లెంతోపొడుస్తాడు......
    
    వద్దు.....వద్దుమనం వెళదాంపద......"
    
    ఆమెకి ఏమి చేయటానికి తోచలేదు.
    
    "పోనీ అతన్ని పంపేయ్"
    
    డాక్టరు గారు మౌనంగా బయటికివెళ్ళారు. వెడుతూ సారధికి సైగచేశారు. ఏదో ఆలోచిస్తూ సైగనర్దం చేసుకున్న సారధి అతని దృష్టికి అనేట్టుగా నడిచి వెళ్ళిపోయాడు బయటికి.
    
    "ఆగు"
    
    అరుపుకి గది అంతా దద్దరిల్లిపోయింది. సారధి ఆగిపోయాడు భయంగా.
    
    "ఏయ్"
    
    "......."
    
    "ఇటు తిరుగు"
    
    తిరిగాడు.
    
    "ఎవడునువు? ఎందుకొచ్చావీ గదిలోకి?"

 Previous Page Next Page