ఈ హడావిడి, ఆర్భాటము అంతా వింతగా చూస్తూ ఊళ్ళో పిల్లలందరూ భవంతి ముందుగుమిగూడి కూర్చునేవారు. ఆడ, మగ అంతా కుతూహలంగా తొంగి చూసేవారు. మంత్రిగారొస్తారు. జీపులొస్తాయి. పాటలు పెడతారు అంటూ ఆ రోజుకోసం ఆ ఊరు ఊరందరూ అరుణ కంటే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూడసాగారు.
అనుకున్నటైముకి ఓ రెండు గంటలు ముందుగానే మంత్రిగారు అరుణ ఊరు ఇన్ స్పెక్షన్ బంగళాలో విడిదిచేశారు. ఆయనతోమందీ మార్భలం అంతా చేరారు జీపులు ఇటు అటూ హడావిడిగా పరుగులెత్తాయి. ప్రెసిడెంటు ఎమ్.ఎల్.ఏ పెద్దలు అందరూ ఎదురు వెళ్ళిస్వాగతం చెప్పారు. మంత్రిగారి స్వాగతానికి ముందే ఊరినిండారంగు కాగితాలు వగైరా అంటించారు.
సభ ఓ అరగంటలో మొదలవుతుందనగా కృష్ణమూర్తి వెళ్ళిస్వయంగా మంత్రిగారినితోడు తీసుకువచ్చాడు. ఊరు ఊరంతా జమీందారుగారి ఇంటిముందే కూడింది. ఊరేమిటి పక్క ఊళ్ళనించి కూడా ఏదో వింత చూడడానికి వచ్చినట్లు వచ్చిపడ్డారు. జనాన్ని కంట్రోల్ చేయడంకాస్త కష్టమే అయింది సుబ్బారావుకి, కృష్ణమూర్తికి.
ఆ రోజు మధ్యాహ్నమే నరసరాజుగారు అన్నమాట తప్పకుండా వచ్చారు. ఆయన్ను చూసి బ్రహ్మనందపడిపోయింది అరుణ. ఆయనకి ప్రత్యేకంగా ఓ గది కేటాయించింది. స్వయంగా అన్నీ ఏర్పాట్లు చూసింది పనిలోనేకాక ఇలాంటి విషయాలలోకూడా ఆయన కెంత శ్రద్ద ఆడిన మాట ఏ విషయంలోనూ తప్పదు నిజంగా ఎంతటికర్తవ్యపరాయణులు.
ఆయనరాకతో అరుణ ఉత్సాహంమరింత పుంజుకుంది. ఆయన వచ్చిన ఇంకో గంటకి ప్రసాదరావు ఆదరాబాదరా వచ్చాడు. "అరుణా చూశావా వచ్చేశాను. వస్తానన్నాను కదూ అందుకని ఉన్న పనులన్నీ మానుకుని వచ్చేశాను. మీ అక్కయ్య తిడుతున్నా కూడా" చెమటలుకక్కుతూ అన్నాడు.
"థాంక్స్ బావగారూ థాంక్స్ నిజంగా మీలాంటి వాళ్ళందరూనాకండగా ఉన్నారని తలుచుకుంటే నాకెంతో ఉత్సాహం కలుగుతూంది."
అందరికి కాఫీలు, ఫలహారాలు చేయించడం సర్దిచూసి ఎవరి కేం కావాలో అమర్చడం సరస్వతి వంతుఅయింది. లంకంత భవంతికనక వసతి సౌకర్యానికే లోటు కనబడలేదు. "ఏదో నీ పెళ్ళి అయితేచాకిరీ చేసినా అర్ధం ఉంది ఇప్పుడీ చాకిరీ ఏమిటమ్మా నాకు తగిలించావు:"నవ్వుతూ విసుక్కునేది సరస్వతి.
"పెళ్ళి చేసుకున్నా, మీ కెవరికీ చాకిరీ తగలని పెళ్ళి చేసుకుంటాను. అందుచేత ఆ వంతు ఇప్పుడు చేయిస్తున్నాను వదినా, మరేం అనుకున్నావు: ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడని కదా......ఆమాత్రం చేయించనా" అంది అరుణ నవ్వుతూ. సభ ప్రారంభం అనుకున్న టైముకి అయింది. మంత్రిగారిని, నరసరాజుగారిని, రామారావుగారిని సభావేదిక మీద కూర్చోపెట్టింది అరుణ. ముగ్గురికీ మెడలోదండలు వేసింది. ఊరి పెద్దలు వారి వారి తాహతులని అనుసరించి వరసగా కుర్చీలలో కూర్చున్నారు. పిల్లలంతా అందిన చోటల్లా ఎగబ్రాకారు. ఆడవాళ్ళు గొడ్లవార నిలుచుని వింతగా చూస్తున్నారు.
అధ్యక్షోపన్యాసంనరసరాజుగారు ఆరంభించారు. అరుణ చేస్తున్నది ఎంత సత్కార్యమో, స్త్రీ అయివుండి స్వలాభాలను, స్వసుఖాలను ఓ ఆదర్శంకోసం వదులుకున్న ఆమెని ఎలా అభినందించాలో తెలియడం లేదనిపొగిడారు ఆమె చేయబోయేసత్యార్యానికి భగవంతుని సహకారంతో పాటు ఆ ఊరి ప్రజల సహకారంకూడా లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అరుణకి మనస్ఫూర్తిగా శుభంకలగాలని ఆశీర్వదించారు. మంత్రిగారిని ప్రారంభోత్సవం జరపమని కోరారు.
సభాపదులకి నమస్కారం చేసి మంత్రిగారు లేచికాసేపు మాట్లాడారు. అరుణ చేయబోయే మంచి పనిని మెచ్చుకుంటూ మాట్లాడారు. డాక్టరు అవసరం పల్లెలకి ఎంతో ఉందన్నారు. అరుణాదేవిలాగే మిగతా డాక్టర్లు కూడా పల్లెలని ఉద్దరించడానికి నడుం కట్టుకోవాలని ఉద్బోధించారు. అలాంటివారందరికి అరుణ మార్గదర్శి అవుతుందన్న ఆశ వ్యక్తపరిచారు. స్వసుఖాలనిత్యాగంచేసి ఆదర్శంకోసం నిలబడిన అరుణ సహాయంతో ఆ ఊరి ప్రజలే కాకచుట్టు ప్రక్కలప్రజలు కూడా అందిన అవకాశాన్ని పూర్తిగా వినియోగపరుచుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. ఆఖర్న అరుణలాగే అందరూ డాక్టర్లూ ఆలోచిస్తే భారతదేశం ఏనాడో ముదడుగు వేసేది అన్నారు.
ఇప్పటికయినా మించి పోలేదని ఛలోక్తి ఆడారు. ప్రసంగం అయ్యాక అరుణ డిస్పెన్సరీగా, కన్సల్టింగ్ రూముగా ఏర్పాటుచేసిన ముందు హాలు, ఇటు అటు ఉన్న గదులన్నింటిముందు గుమ్మానికి కట్టిన సిల్కురిబ్బను పెద్దలందరిసమక్షంలో కత్తిరించి ఆస్పత్రికి ప్రారంభోత్సవంజరిపారు. అందరూ చప్పట్లు చరిచారు మంత్రిగారితోవచ్చిన ఓ పత్రికావిలేఖరి చేతిలో కెమెరా ఫ్లాష్ బల్బులు వెలిగాయి. పెద్దలందరూ హాలులోకి చేరిచుట్టూ పరికించారు. కొత్తగా కొన్న ఫర్నీచర్ బల్లలు కుర్చీలు......అన్నీ నిగనిగమెరుస్తున్నాయి ఆస్పత్రికి కావల్సిన పరికరాలన్నీ వేటి స్థానాల్లో అవి నీటుగా సర్ది ఉన్నాయి. గుమ్మాలకి, కిటికీలకి కొత్తతెరలు వేలాడుతున్నాయికొత్తగా కొన్న గాజుబీరువాలనిండా మందులుసర్ది ఉన్నాయి.
"నీ కన్సల్టింగ్ కుర్చీలో కూర్చో అమ్మా ప్రారంభోత్సవానికినాందీగా అన్నారు నరసరాజుగారు అరుణతో.
"అవునమ్మా ప్రారంభానికి సూచకంగా డాక్టరుగా ఆ కుర్చీలో ఒక్కక్షణం కూర్చో." రామారావుగారు కూతురిని చేయిపట్టుకు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టారు.
పెద్దలందరికి నమస్కరించి వెళ్ళి అరుణ కుర్చీలో కూర్చుంది అరుణ కాళ్ళు, చేతులు, వణికాయి. ఈ క్షణం నించితనో డాక్టరునని ఊరు ప్రజల ఆరోగ్యబాధ్యత తనది ఈ కుర్చీలో కూర్చున్న తన మీద ఎంతో బాధ్యత ఉంది తన కర్తవ్యం తను ఒక్క క్షణం కూడా మరచిపోకూడదు.
"ఆ స్టెతస్కోపు మెడలో వేసుకోండి ఒక్కసారి ఒక స్నాప్ తీసుకుంటాను." విలేఖరి అరుణని కోరాడు.
అరుణ మొహమాటపడింది" వద్దండి ఫోటోలవీ ఎందుకు? నా కిష్టం లేదు" అంది. "అలా కుదరదు. ఫోటో తీయించుకోవాలి అమ్మా నీవు ఇంత ఘనకార్యం చేస్తున్నందుకు ఒక్క ఫోటో అయినా లేకపోతే ఎలా?" మంత్రిగారు నవ్వుతూ అన్నారు.
స్టెతస్కోపు మెడలో వేసుకుని టేబిల్ ముందు నవ్వు ముఖంతో కూర్చున్న అరుణ ఫోటో తీసుకున్నాడు ఫోటోగ్రాఫర్.
"డాక్టరుగారి మొదటి పేషంటుని నేనే అవాలని ఉందికాని, దురదృష్టం......ఏం రోగంలేదే అని విచారంగా ఉంది" అన్నాడు మంత్రిగారు ఛలోక్తిగా.
"పోనీ? ఏ బి కాంప్లెక్స్ ఇంజక్షనో చేయించుకోండి" అన్నారు నరసరాజుగారు నవ్వుతూ." ఐడియా బాగానే ఉంది." మంత్రిగారు నవ్వారు" కాని తరవాత బోణీబాగులేదని నన్నుతిట్టుకుంటారేమో, డాక్టరుగారు:"
అందరూ నవ్వారు. తరవాత ఆహ్వానితులైన పెద్దలందరికి అల్పాహారవిందు జరిగింది. ఊరికే చూడవచ్చినపిల్లలకి, పెద్దలకి మిఠాయి పంచారు సుబ్బారావు, కృష్ణమూర్తి.
తరవాత రామారావుగారు కోరిక వెంటనే ఆహ్వానం మన్నించి శ్రమ తీసుకు వచ్చిన మంత్రిగారికి కృతజ్ఞత తెలిపారు. తమకుమార్తె సంకల్పించినపని జయప్రదం కావడానికి ఆ ఊరి ప్రజల పెద్దలసహకారం కావాలని ఆమెని తమ బిడ్డగానే భావించాలని ఆమెమంచి చెడ్డల బాధ్యత ఇక మీదట ఆ ఊరి ప్రజలదేనని చేతులు జోడించివిన్నవించారు. ముక్తకంఠాలతో ఆ ఊరి పెద్దలందరూ అభయం ఇచ్చారు.
ఆఖరన అరుణ వందన సమర్పణ చేసింది. ఆహ్వానించినవెంటనే కాదనకుండా వచ్చిన మంత్రిగారికి ఉన్న పనులన్నీ మానుకుని శ్రమ తీసుకుని వచ్చిన నరసరాజుగారికి, ఆస్పత్రి ప్రారంభోత్సవానికి తనకంటే ఎక్కువ శ్రమపడిన వారికి, అన్ని విషయాలలో తనకంటే ఉత్సాహం చూపిన ఊరి ప్రజల ఆదరాభిమానాలకి కృతజ్ఞత చెప్పింది ఈ ఆదరాభిమానాలు ఉంటే ఇంక తనుచేయలేనిది ఏమీ ఉండదన్న దృఢనమ్మకం వ్యక్త పర్చి, సభపదులకి మరోసారి కృతజ్ఞతాభివందనం చేసింది.
కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
అనుకున్నదానికంటే ఉత్సాహంగా ఘనంగా ప్రారంభోత్సవం ముగిసింది. అరుణ తృప్తిగా నిట్టూర్చింది తన సహోద్యోగులనించి మిత్రులనించి అభినందనల టెలిగ్రాములువచ్చి పడ్డాయి.
"ఇప్పటివరకు అనుకున్నదంతా సవ్యంగా ముగిసింది జరిగినదంతాచూస్తే తను అనుకున్నది నిరాటంకంగా సాగిపోవచ్చు" తృప్తిగా అనుకుంది అరుణ.
మర్నాడుమధ్యాహ్నం అందరూ ప్రయాణం అయ్యారు. ఆడపిల్లని అత్తారింటదిగవిడిచి వెడుతున్నట్లే బాధపడ్డారు అందరూ అందరి మనసులు బరువెక్కాయి. అరుణని ఒంటరిగా దిగవిడిచివెడుతూంటే పెళ్ళిచేస్తే భర్త ఉంటాడు నీడలా భర్త చేతిలోపెట్టి తమ బాధ్యత తీర్చుకుంటారు. ఇప్పుడు ఎవరికి అప్పగించి వెడుతున్నట్లు అరుణని? ఆ మాట అనుకోగానే రామారావుగారికి దుఃఖం పెల్లుబికింది. కమలమ్మ అయితే ఉదయం నుంచికళ్ళు తుడుచుకుంటూనే ఉంది. పైకి కన్నీళ్ళు పెట్టుకోకపోయినా, కృష్ణమూర్తికి గుబులుగానే ఉంది.....చెల్లెల్ని పుట్టిన తరవాత మొదటిసారిగా విడిచివెళ్ళాలంటే.
అంతవరకు ఎంతో బింకంగా ధైర్యంగా ఉండగలననుకున్న అరుణకి కూడా ఏదో బెంగ అనిపించింది. అందరూ వెళ్ళిపోతారు. తను ఒంటరిగా ఇంతభవంతిలో ఉండాలి. తోడుగా వంటవండడానికి తెచ్చుకున్న అయ్యరు కుర్రాడు మణిఉన్నారు, ఇంకో ఆడమనిషిని ఎలాగో కుదుర్చుకుంటుంది. కాంపౌండు చుట్టూగుడిసెల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరు ఉన్నా అన్నా, అమ్మా, నాన్నామధ్య ఉన్నట్టెలా ఉంటుంది? ఇప్పటివరకు ఒక్కరోజన్నా పైన ఉండి ఎరగదు తనుచదువు అంతా కూడా అమ్మా, నాన్నలదగ్గిరే సాగింది. అందుచేత హాస్టల్ లైఫ్ కూడా తెలియదు. అమ్మ, నాన్న తనదగ్గిర ఉండిపోకూడదూ? అక్కడుండి చేసేదేముంది? తండ్రి ప్రాక్టీసెలాగూ చేయడం లేదు. ఇంట్లో అయినా ఆయన చేసేదేంలేదు. ఆలాంటప్పుడు తనదగ్గిర ఉంటే ఏం? ఆమాటే రాత్రి అడిగింది అరుణ...... తండ్రిని.