Previous Page Next Page 
అరుణ పేజి 18

   
    "చాలా థ్యాంక్స్ బావగారూ మీ అమూల్యమైన సలహాలు గుర్తుంచుకుంటాను అన్నీ. "నవ్వుతూ అంది అరుణ.    
    "నీవుప్రాక్టీసు పెట్టాక ఒకసారి వచ్చి చూస్తాను ఏం?"  
   "ఓ తప్పకుండా అంతకంటేనా? బావగారూ ఏమైనా కాంప్లికేటెడ్ కేసులు వస్తే మీ సలహాకోసం రాస్తాను......సలహా చెబుతుంటారు కదూ? అంతేకాక నాకు కావలసినామందులు అవి నెలకోసారిరాస్తాను, అవన్నీ కొని పంపాలి మీరే."    
    "అలాగేనమ్మా ఈమాత్రం సహాయాలేగా? తప్పకుండా చేస్తాను"    
    "బావగారూ ఆస్పత్రి ప్రారంభోత్సవానికిమీరు రావాలి సుమా ఆహ్వానం పంపుతాను లెండితరవాత."    
    "ఏమిటి ప్రారంభోత్సవం అదీ అట్టహాసం చేస్తావేమిటి ఆహ్వానం అంటున్నావు. అవునులే, ఆ మాత్రం పబ్లిసిటీ లేకపోతేనలుగురికి తెలిసేదెలా ఎవారైనా మంత్రిగారిని ఆహ్వానించకూడదూ? పేపర్లో బొమ్మ వేయించుకుంటారు మంత్రిగారయితే."
    "మంత్రిగారువస్తారా ఇలాంటివాటికి, మనం ఆహ్వానిస్తే అరుణ నవ్వుతూ అంది.    
    "రాకపోవడం ఏమిటి పిలిచేవాళ్ళుండాలి గాని మంత్రులున్నది ఇలాంటి ప్రారంభోత్సవాలకోసమేగా?" వేళాకోళంగా అన్నాడు ప్రసాదరావు.    
    "ఏమిటో ఎవరిని పిలవడమోతేలడంలేదు. నాన్న చేతచేయించుధామని ఉంది. లేకపోతే మా హాస్పిటల్ చీఫ్ చేత చేయించాలని ఉంది. ఎవరినైనా కాస్త పెద్దవారిని పిలవాలనుకుంటున్నాను."    
    "నామాటవిని మంత్రిగారినో వారికివీలు కాకపోతే ఏ డిప్యూటీమినిస్టరుగారినో పిలిచేయి. ఈమాత్రం ప్రాపగాండా ఉండాలమ్మ ఏపని కన్నా."    
    "చూద్దాం" నవ్వింది అరుణ.    
    అరుణ హాస్పిటల్ ప్రారంభోత్సవం కాస్త అట్టహాసంగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది, జమీందారిణి సంతోషపూర్వకంగా అరుణకి ఆ భవంతి యథేచ్చగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది సుబ్బారావు ప్రెసిడెంటుగారి సహాయంతో ఆ ఇంటిని బాగుచేయించేవిషయానికి పూనుకున్నాడు. ఇంకో పదిహేనురోజుల్లో అంతా రెడీ అవుతుందని వ్రాశాడు.        
    ఇంతకుముందే ఒకరోజు తండ్రినితనకి కొంచెం డబ్బు కావాలి ఓ నాలుగైదు వేలుదాకా కావలసి ఉంటుందని ముందు ఇస్తే తరవాత ప్రాక్టీసు పెట్టాక నెమ్మదిగా ఇచ్చేస్తానని అంది. రామారావుగారు నొచ్చుకున్నట్లు చూశారు. అప్పు తీరుస్తావా అమ్మా నాకు?" అన్నారు అదోలా నవ్వుతూ ఆయన ముఖం చూసి తనుతప్పు మాట ఏం అన్నానా అని ఆలోచించింది అరుణ తల్లి తండ్రుల ఋణం ఎన్ని వేలు పెడితే తీరుతుంది ఆ భావంతో తండ్రి నొచ్చుకున్నట్లున్నారు.    
    "అదికాదు నాన్నగారు అప్పు తీరుస్తానని కాదు నేననడం నా గురించి ఇప్పటికేమీ చాలా ఖర్చు పెట్టారు. చదివించారు. నా కాళ్ళమీద నేను నిలబడగలిగేటట్టు చేశారు. ఇంకా నా గురించి మీచేత ఖర్చు చేయించటం నాకిష్టం లేదు. అందుకని అన్నాను." నెమ్మదిగా అంది అరుణ.    
    'అమ్మా నీకు చదువు చెప్పించాను. ఇంకా నిన్ను ఓ ఇంటిదాన్ని చేసే బాధ్యత నా మీద ఉందని ఆ పని కోసం ఓ పదివేలు వేరే ఉంచాను. నీ కోసమే ఉంచాను. నేననుకున్నపనికోసం ఆ డబ్బు ఎలాగూ వినియోగపడేటట్టులేదు. కనక బ్యాంక్ లో ఉన్న ఆ సొమ్ము నీ పేర ట్రాన్స్ ఫర్ చేస్తాను. దానిలోంచి నీకు కావలసినంత తీసుకో నీ అవసరాలకి ఖర్చు పెట్టుకో నీవు కాస్త నిలదొక్కుకునేటంత వరకు ఆ డబ్బు సరిపోతుందనుకుంటాను. నీకేం కావాలో అన్నీ కొనుక్కోరేపే అన్నయ్యతో చెప్పినీపేర పెట్టిస్తాను ఆ డబ్బు. అది చాలకపోతే నీవన్నట్టే అప్పు తీసుకుందువుగాని అన్నయ్య దగ్గిర. అంతకన్నా నా దగ్గిర ఏం లేదు కనక అన్నయ్య ఇస్తాడు అప్పుగా?"    
    అరుణ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. తండ్రిఅభిమానానికి జవాబుకూడా చెప్పలేనంతగా ఉక్కిరి బిక్కిరి అయింది. ఆమెమనసు:    
                                                                    * * *    
    రంగురంగుల కాగితాలతో మామిడితోరణాలతో జమీందారుగారిభవంతి కళకళలాడిపోతూంది. ఇల్లు, తోట బాగుచేయించి, చెత్తా చెదారంతుడిపించి, సున్నాలు వేయించేసరికి మళ్ళీ ఎన్ని సంవత్సారాలతరవాతో ఆ భవంతి కళకళలాడింది. గేటుదాకా రంగుకాగితాలు కట్టారు... మామిడితోరణాలు వ్రేలాడదీశారు. భవంతి ముందు ఖాళీస్థలంలో చాందినీ కట్టి, బల్లలు, కుర్చీలు వేసి సభావేదిక తయారుచేశారు ఆహ్వానితులకికుర్చీలు వేశారు. ఓ మైక్ తెచ్చి పెట్టారు.    
    అరుణ ఆస్పత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా మొదలయింది. అంతకుముందే అరుణ ఆస్పత్రికి కావలసిన సరజ్ఞమా, తనకి కనీసం కావలసిన సామాను అంతా ఓ లారీద్వారా ఆ ఊరు చేర్చింది.    
    ఆరోగ్యశాఖమంత్రిగారిని ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించమని అరుణ స్వయంగా వెళ్ళికోరింది. అరుణ లాంటి అందగత్తె, చుదువుకున్న ఆమే తన కంత ప్రాధాన్యంఇచ్చినందుకే తబ్బిబ్బయిపోయిన మంత్రిగారు వెంటనేసంతోషంగా ఒప్పేసుకున్నారు. అంతేకాకఅరుణ చేయబోయేసత్కార్యాన్ని అనేక విధాల పొగిడారు. ఆవేళకి తప్పక ఆ గ్రామం వస్తానని మాట ఇచ్చారు.    
    తన ఆస్పత్రి అధికారులకి, ప్రొఫెసర్లకి, సహోద్యోగులకి అన్నయ్యకి, తండ్రికి, తెలిసిన ఊరి పెద్దలందరికి స్వయంగా ఆహ్వానపత్రికలందించింది అరుణ. అందరూ అరుణని ఎంతో మెచ్చుకున్నారు. హాస్పిటల్ చీఫ్ నరసరాజుగారయితే అరుణ భుజంమీద చేయి వేసి ఆప్యాయంగా తట్టారు. తప్పకుండా ఎలాగైనా వీలుచేసుకుని ఆ రోజుకి వస్తానని మాట ఇచ్చాడు." నా విద్యార్ధినివి, నా కళ్ళఎదుటే ఇంత ఎత్తుకుఎదగటం పెద్ద పెద్ద వారెవరు చేయ సాహసించలేనిపని ఇంత చిన్న వయసులో ఉండి, అందులో స్త్రీవయి ఉండి చేయబూనుతున్నందుకు కనీసం కంటిలోనయినా చూడనా? ఎన్ని పనులున్నా తప్పక ఆవేళకి వస్తానమ్మా" అన్నారు వెంటనే ఆ తారీఖుడైరీలో గుర్తుగా రాసుకున్నారు. పని సందటిలో మరువకుండా.    
    అందరితోపాటు వేణుకి కూడా ఆహ్వానపత్రిక అరుణ మౌనంగా అందుకుని విప్పి చూశాడు వేణు. "ఓ ఇదా ఇంకా నీ వివాహ ఆహ్వానం అనుకున్నాను" అన్నాడు రాని నవ్వుమొహం మీదకు తెచ్చుకుంటూ.    
    అరుణకి ఒళ్ళు మండింది.    
    "మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నావన్నమాట, కంగ్రాచ్యులేషన్స్ బెస్టు ఆఫ్ లక్:"    
    పొడిపొడి మాటలు మాట్లాడుతున్న వేణునిచూసి ఈ కొద్దిరోజుల్లోనే తనకెంతదూరమయి పోయాడా అని ఆలోచిస్తూంది. అరుణ నిజంగా తనని, తనపట్లప్రేమని ఇంత త్వరలో మరిచిపోయాడా లేకఅలా నటిస్తున్నాడా? తనకయితే ఇప్పటికీ కనీసం రోజుకోసారన్నా ఏదో సందర్భంలో వేణుగుర్తురాక మానడంలేదుకాని, వేణు .....   
    "వీలుంటే వస్తాను. కాని, వీలుంటుందని అనుకోను. ఇక్కడే శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను. ఏం అనుకోకు" అన్నాడు.
    "థాంక్స్" అరుణ కూడా పొడిగా అని ముందుకుకదిలింది.  
    ప్రారంభోత్సవానికి రెండు మూడు రోజులు ముందుగానే అక్కడికిచేరింది అరుణ. 'ప్రయాణం చెయ్యలేనమ్మా' అంటున్న తండ్రినికూడా బలవంతంగా ప్రయాణం కట్టించింది. తల్లి, తండ్రి, అన్న, వదిన......మొత్తం ఇంటిల్లిపాదిని బయలుదేరదేసింది. ఓ వారంరోజులుండివద్దురుగాని అంటూ.    
    "అయ్యోరాత ఏమిటే ఇది ఏదోపెళ్ళి అయి మూడు నిద్రలకివెడుతున్నట్టు నీ వెంట మేమంతా ఎందుకే?" కమలమ్మ విసుక్కుంది.    
    "పోనీపెళ్ళే అనుకో అమ్మ పెళ్ళి చేసి అత్తారింట దిగవిడిచినట్లునన్నంతా అక్కడ దిగవిడిచి వద్దురుగాని, రండి" అంటూ బలవంతపెట్టింది. అరుణనిజంగా పెళ్ళివారి లాగేబయలుదేరారు అందరూ. పెళ్ళికి జరిగినంతహడావిడీ జరిగింది. ఓ వంటవాడిని కుదిర్చారువంటలకి, వడ్డనకి, పాత్ర సామానంత సుబ్బారావు ఇంటినుంచి వచ్చింది. సరే కూరలు పాలు వద్దాన్నా సప్లయి చేశాడు సుబ్బారావు. అందరూ ఉత్సాహంగా అరుణ సామాన్లు సర్దారు. రంగు కాగితాలంటించారు మామిడాకులుకట్టారు. ప్రారంభోత్సవానికి అట్టహాసంగా ఏర్పాటుదగ్గిరుండి జరిపించాడు కృష్ణమూర్తి. సుబ్బారావుసాయంతో ఆస్పత్రి తెరిపించాక అందరికి మిఠాయిలు పంచిపెట్టడానికి దగ్గరుండి మిఠాయి ఉండలుకట్టించింది కమలమ్మ.    
    "పెళ్ళికొడుకు మినహా మిగతా తంతంతా పెళ్ళిలాగే ఉంది. ఆ కొరతఒక్కటీ తీర్చకూడదుటమ్మా?" సరస్వతి హాస్యం ఆడింది. రామారావుగారికీ అలాగే అనిపించింది. కూతురి పెళ్ళి ఒక్కటీ జరిపించగలిగితే తనకెంత సంతృప్తిగా ఉండేది ఊరు వచ్చి అంతా చూసి అరుణ పట్ల అందరూ కనపరిచే గౌరవాదరాలు అరుణ చేయబోయేపనికి దరి సహాయసహకారాలు ఎలాలభిస్తున్నదీ చూశాక ఆయనకి సగం బెంగతగ్గింది. పెద్దలందరూ అరుణని మెచ్చుకుంటూంటే నిజంగా అరుణ ఆలోచనమంచిదనే అనిపించింది ఆయనకీ మనులో ఏమూలో గర్వం తొంగిచూసింది అరుణని చూస్తూంటే:

 Previous Page Next Page