"నీ దగ్గిరా? ఇక్కడా? అదెలాకుదురుతుందమ్మా:"
"ఏంఎందుకు కుదరదు? అక్కడుండేది ఇక్కడుంటారు...... అంతేగా?" ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అంది అరుణ.
"కుదరదమ్మా ఏదో ఈ కాలం అంతా ఆ ఊళ్ళో ఆ స్వంత ఇంట్లో గడిచింది. మిగిలిన రోజులుకూడా అక్కడే గడవనీపుట్టి పెరిగిన ఊరు స్వంతంగా ఆర్జించుకుని కట్టుకున్న ఇంట్లోనే నా చివరిరోజులు వెళ్ళిపోనీ, అలవాటయిన ఊరు, పరిచయంఉన్న మనుష్యులు అక్కడ.
ఈ కొత్తచోటనేనిమడలేనమ్మా ఏదో ఈ కాలం అక్కడ అన్నయ్య చేతిలో దాటిపోనీనన్ను" అన్నారు రామారావుగారు.
అరుణ ఇంకేమనాలో తెలియక ఊరుకుంది. ఆ ఊరిమీద ఆ ఇంటిమీద తండ్రికున్న మమకారం ఆమెకి తెలుసు. అవును పుట్టిపెరిగిన ఊరు పేరు పరపతి ఉన్న ఊరు కాలక్షేపానికి ఆయన పాత స్నేహితులు టౌన్ హాల్. పక్కింటి, ఎదురింటి మిత్రులు......అందరిని వదులుకుని ముక్కుమొహం ఎరగని ఊరికి ఎలా వస్తారు? అన్నింటికంటే అన్నయ్యనివదిలి తన దగ్గరికి వచ్చి ఉండమనడగడం వృథా: పెద్ద కొడుకు దగ్గిరనించి ఆయన ఎక్కడికీ కదలరు.
"పోనీనీవన్నా ఉండకూడదమ్మా" తండ్రిని వదిలి తల్లి ఒక్కర్తీ ఉండదని తెలిసినా అడిగింది అరుణ తల్లిని.
"ఆయన్నొదిలి నేనిక్కడ ఎలా ఉంటానే ఏదో నాలుగురోజులు ఉండమంటే ఉండగలను గాని ఆయనక్కడా, నేనిక్కడా ఎలా కుదురుతుందే?"
అదీనిజమే ఎంత వయసుమళ్ళిన వారయినా, భార్యాభర్తలని ఎలా విడదీయడం? వదిన ఉండి అన్నీ చేసినా, నాన్నగారిపనులు అమ్మే స్వయంగా చూస్తుందిగదా? నాన్నగారిని వదిలి తనదగ్గిరెలా ఉంటుంది లాభం లేదని ఊరుకుంది అరుణ.
బయలుదేరివెళ్ళేముందు ఎన్నో జాగ్రత్తలు, మెలుకువలు బోధించారు కూతురికి రామారావుగారు. అందరితో మంచిగా ఉంటూపేరు తెచ్చుకోమన్నారు. రెండు మూడు నెలలకి వీలు చూసుకుని వచ్చిపోతూండమన్నారు. బద్దకించక వారానికి ఉత్తరం రామమన్నారు వంటవాడు మణికి కూతురి రుచులు అలవాట్లు ఇష్టాలు అన్నీ చెప్పి ఆయా వేళలకి ఆమె అన్నీ మరిచిపోకుండా అమర్చమని ఒకటికి రెండుసార్లు చెప్పింది. సరస్వతి ఇంటికి కావల్సినప్పుడు అన్నీ ఓ నెలకి కావలసినవన్నీ కొని సర్ది ఆ ప్రకారం తెప్పించుకోమనిలిస్టులు రాసి ఇచ్చింది. కృష్ణమూర్తి ఇంకోసారి ఊళ్ళో పెద్దలందరి ఇళ్ళకివెళ్ళి చెల్లెలిని అప్పగింత పెట్టాడు.
సుబ్బారావు బండిలో వెళ్ళి అందరిని బస్సు ఎక్కించి భారంగా తిరిగి వచ్చింది అరుణ. బస్సు దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోతుంటే అప్రయత్నంగా అరుణ కళ్ళు చెమ్మగిల్లాయి. బండిలో సుబ్బారావు ఎక్కడ చూస్తాడో పట్టుబడిపోతానన్నట్టు మొహం అటు తిప్పుకునికూర్చుంది. సుబ్బారావు చూడనే చూశాడు. "ఇదే మొదటిసారిగదూ ఒంటరిగా ఉండటం? రెండు మూడు రోజులు అలవాటయ్యేవరకూ అలాగే ఉంటుంది మేమంతా ఉన్నాంగా? రుక్కును పంపిస్తానుతరుచు. మీకు కాస్త తోస్తుంది. "ఓదారుస్తున్నట్లు అన్నాడు సుబ్బారావు.
అరుణకళ్ళు తుడుచుకుంటూ చిన్నగా నవ్వింది. "అబ్బే ఫరవాలేదు అమ్మని, నాన్నని వదిలిఉండటం అలవాటులేక ఏదో అనిపించింది. చిన్నపిల్లనాఏమిటి అమ్మకోసం బెంగ పెట్టుకోడానికి" అంది.
ఇంటికివెళ్ళి ఇల్లు మమూలుగా సర్ధించి తొందరగా భోజనంచేసి ఇంకేం చెయ్యకుండా ఏంఆలోచించకుండా నిద్రపోవడానికి ప్రయత్నించింది అరుణ.
* * *
మర్నాటినించి అసలు కార్యక్రమంలోకి దిగింది అరుణ. ప్రొద్దున్న ఆరుగంటలకల్లా లేచిపోయి, గబగబ స్నానం అదికానిచ్చి, మణిచేసిన టిఫిన్ తినడం పూర్తిచేసి, సరిగా ఎనిమిది గంటలకి ముందు కన్సల్టింగ్ రూములోకి వచ్చింది అరుణ. మణి ఉదయమే తలుపులు అవి తెరిచి పని మనిషితో గది తుడిపించి టేబిల్ కుర్చీలు అవి సర్ది దుమ్ము దులిపిసిద్దంగా ఉంచాడు.
కన్సల్టింగ్ కుర్చీలో కూర్చుంటే అరుణ కాళ్ళు కొద్దిగా వణికాయి ఈ రోజునించి తను బాధ్యతతో కూడిన ఓ డాక్టరు ప్రతికేసు ఎంతో జాగ్రత్తగా స్టడీచేసిడయాగ్నైస్ చేసిమందు లీయాలి. ఏదో ఆశయంతో ఆరంభించితన ఆశయానికి, తనకీ మంచిపేరు తెచ్చుకోవాలి కష్టపడి ఓర్పుతో మంచిడాక్టరమ్మ అని పేరు తెచ్చుకోవడమే తన ప్రస్తుతధ్యేయం: కుర్చీలో కూర్చుని కాలక్షేపానికి వెంటతెచ్చుకున్న మెడికల్ జర్నల్స్ తిరగేస్తూన్న అరుణ మనసంతా వీధి గుమ్మం వైపే లగ్నం అయి ఉంది. ఆతృతతో తన మొదటిరోజు పేషెంట్స్ కోసం ఆరాటంగా ఎదురుచూస్తూ కూర్చుంది.
గంట, రెండు గంటలు, మూడుగంటలు గడిచినా ఒక్కరంటే ఒక్కరైనా రాకపోవడంతో అరుణకి కాస్త నిరుత్సాహం కలిగింది. మొదటిరోజు ఆరంభం రోజున ఒక పేషెంటైనా వస్తే తనకెంత ఉత్సాహంగా ఉండేది ఆరంభించినరోజే ఆశాభంగం ఎదురవడం అరుణకి కాస్త బాధకలిగించింది. పన్నెండువరకూ అలా కుర్చీలో కూర్చుని ఇంక అరుణ ఈ పూటకి మరెవరూ రారని నిశ్చయించుకుని అరుణ లేచి లోపలికి వెళ్ళిపోయింది.
ఆ మధ్యాహ్నం కాఫీ తాగి మళ్ళీ మూడుగంటలకి అరుణ కన్సల్టింగ్ రూములోకి వెళ్ళికూర్చుంది. ఆ పూట ఆశాభంగమే కలిగింది అరుణకి.
ఇదేమిటి, ఒక్కరంటే ఒక్కరయినా రాలేదు. శుభమా అని ఆరంభించినరోజు? అని వ్యాకులపడింది అరుణ. తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది. తనకి రోగులురావడం 'శుభం' అని ఆలోచిస్తూందిగానీ రోగాలు రావడం శుభమా అందరికి? ఈవేళ తనో డాక్టరుగా ఈ ఊరు వచ్చింది కదా అని ఊరందరికి ఒక్కసారిగా రోగాలువస్తాయా.
అయిదుగంటలవుతుండగా గుమ్మం దగ్గిర అయిదడుగులు చప్పుడయితే ఆతృతగా అటు చూసింది అరుణ. వచ్చినవాళ్ళు సుబ్బారావు రుక్కు ఒక్కసారిగా అరుణ ఉత్సాహం నీరుగారిపోయింది. వాళ్ళని చూసి లేచిఉత్సాహం తెచ్చిపెట్టుకుని "రండి రండి" అంది "ఎలా ఉన్నారు మీరు? ఎవరైనా వచ్చారా మందులకోసం:" కుర్చీలో కూర్చుని అడిగాడు సుబ్బారావు. అరుణ సమాధానంగా నవ్వుతూ ఆ తలఅడ్డంగా తిప్పింది.
"రాలేదా ఎవరూ రాలేదూ: ఆ ఈ వేళ మొదటిరోజుగా వస్తారులెండి రాకేం చేస్తారు రోగాలొస్తే?" అరుణ మొహం చిన్నపోయి ఉండడంచూసి ప్రోత్సహిస్తూ అన్నాడు సుబ్బారావు.
"అయినాబాగుంది ఊరికి డాక్టరుగారొచ్చారని ఒక్కసారిగా అందరికి రోగాలొస్తాయాచెప్పండి? కొన్నాళ్ళుమీరు ఓపిగ్గా ఎదురు చూడాలి అందులో మా ఊరు వాళ్ళకి డాక్టరు దగ్గరికి వెళ్ళడం అలవాటు బొత్తిగా తప్పిపోయింది: ఇంచుమించు చిన్న చిన్న రోగాలన్నింటికీ వాళ్ళే స్వంత వైద్యాలు చేసుకుంటారు. మరీ ఇంక వారికి లొంగనివైతేతప్ప డాక్టరు కోసం వెళ్ళారు. అయినా చూడండి. వీళ్ళందరూ పల్లెటూరి వాళ్ళు ఇంగ్లీషు డాక్టరు మందులు, ఇంజక్షన్లు అంటేకాస్త భయం అందుచేత వీళ్ళందరూ నెమ్మదిగా మీ వైద్యాన్ని నమ్మితే తప్ప వాళ్ళా రోగాలకి మందుల కోసం రారు. మీరుఓపిగ్గా ఆ మార్పుకి ఎదురు చూడవలసి ఉంటుంది కొన్నాళ్ళు అంత మాత్రాన మీరు నిరుత్సాహపడిపోకూడదు." అరుణకి ప్రోత్సాహం, ధైర్యం ఇస్తూ చిన్నలెక్చరిచ్చాడు సుబ్బారావు.
అతనన్నమాటలకి ఒప్పుకుంటున్నట్టు చిన్నగా నవ్వి తలఆడించింది అరుణ.
"రుక్కూ! మధ్యాహ్నంపూట రోజూ రాకూడదూ? నీకు ఇంగ్లీషు నేర్పుతాను. నాకూ తోస్తుంది. నీకు చదువొస్తుంది. పంపించండీ మీ చెల్లెల్ని ఏం వస్తావా రుక్కూ?" అరుణ ఇద్దర్నీ చూస్తూ అడిగింది.
"ఓమాకేం అభ్యంతరం? ఇంటి దగ్గిర చింతపిక్కలు, గచ్చకాయలు ఆడేకంటే రెండు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుంటే వద్దంటామా? ఏమే వింటున్నావా? ఇంక అరుణ గచ్చకాయలు మూలపడేసి, పలకా, బలపం పుచ్చుకుని మధ్యాహ్నంపూట రోజు వస్తుండు." నవ్వుతూ అన్నాడు సుబ్బారావు.
రుక్కు సిగ్గుతో తలవంచుకుంది "నాకేం రాదు. ఇంగ్లీషు నాకేం వస్తుంది?" అని నసిగింది.
"రాదుగనకే నేర్చుకోవడం" సుబ్బారావు అన్నాడు.
"ఫరవాలేదు నేను నేర్పుతాగా? అందరూపుట్టగానే నేర్చుకున్నారా నేర్చుకుంటే అదేవస్తుంది. రేపటినుంచి రెండు గంట్లకి రా. ఓ గంటచదువుకుంధువుగానీ ఏమండీ మీ చెల్లెల్ని స్కూలుకి పంపించకపోయినా పోనీ, ఇంట్లో చెప్పించి మెట్రిక్ పరీక్ష కట్టించకూడదండీ.
"ప్చ్ ఎలా కుదురుతుందండీ? అధప్పుడే స్కూలుమానేసి మూడు నాలుగు ఏళ్ల పైన అయింది. ఆ వచ్చినవేవో ఈపాటికి మరిచిపోయేఉంటుంది. పరీక్షకి కట్టించాలంటే ఇంట్లో నన్నా ఎవరయినా చెప్పాలి. ఎవరు చెబుతారు? నాకేమో ఆ పొలాలు పనితోటితీరిక ఎక్కడ?" నిర్లిప్తంగా చప్పరించేశాడు సుబ్బారావు.
"పోనీలేండి నేను చెపుతాను ముందు కాస్త ఇంగ్లీషు అదీస్టాండర్డ్ ఎంతలో ఉందో చూసి తరువాత పుస్తకాలు తెప్పిద్దాం ఏం రుక్కూ?"
రుక్కుతల ఊపింది సుబ్బారావుమరో పదినిమిషాలు కూర్చుని ఏవేవో ఊరి కబుర్లు చెప్పాడు. అరుణకు ఒక్కరోజుకే ఇలా నిరుత్సాహపడకూడదని, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పాడు.
సుబ్బారావు వెళ్ళిపోయాక అరుణ చీకటి పడిందని లేచి లోపలికివెళ్ళి పోయింది. ఎంతోఉత్సాహంగా ఆరాటంగా ఎదురుచూసిన ఆ రోజు అలా ముగియడం అరుణకి కాస్త అశుభంలాగా అనిపించి, నిరాశతో ఆమె మనసు నొచ్చుకుంది. వెంటనే లేచి ఉత్సాహం తెచ్చుకుని ఒక రోజుకే తను అలాఅనుకోడం భావ్యంకాదని నచ్చచెప్పుకుంది.
* * *