Previous Page Next Page 
ఖజురహో పేజి 19


    తడిసిన శరీరం మరింత నునుపుదేరి మెరిసిపోతుంటే సర్దార్జీ కళ్ళు పెద్దవయ్యాయి. నోరు తెరిచేసాడు. నోట్లోంచి చుట్టపీక జారిపడింది.
    
    "కిరణ్ నా బ్యాగ్ లో ఇంకో జత బట్టలు తెచ్చుకున్నాగా, ఆ చాటుకి వెళ్ళి మార్చుకోనా?" చలికి వణుకుతూ అడిగింది చాయ.
        
    కిరణ్ చుట్టూ చూసి "అందర్ రూమ్ హైక్యా?" అని మెకానిక్ కుర్రాడ్ని అడిగాడు.
    
    "హా" అన్నాడు వాడు.
    
    "పద" అని దారి తీసాడు కిరణ్.
    
    చాయ లోపలికి వెళ్ళి పైజమా నాడా విప్పింది. అది ఒకంతట ఆమె ఒంటినించి విడి రాలేదు. గట్టిగా దాన్ని లాగుతుండగా బైటనుండి గలాటా, గట్టిగా కిరణ్ అరవడం వినిపించింది.
    
    "ఆగు.....రుకో...." కిరణ్ గొంతు గట్టిగా వినిపించింది.
    
    "క్యా చీజ్ హైబై! ఏక్ బార్.....బస్" సర్దార్జీ గొంతు బొంగురుగా వినిపిస్తోంది.
    
    చాయకి గొడవేమిటో అవగతమైపోయింది. కిరణ్, అతనితో కలియబడడం, అతను బూతులు తిడుతూ కిరణ్ ని కొట్టడం తెలుస్తోంది.
    
    చాయ అటూ-ఇటూ చూసింది. వెనుక తడికల తలుపు కనిపించింది ఆమె ఇక ఆలోచించలేదు. గబగబ రోడ్డుమీదకి పరిగెత్తింది.
    
    వెనుకనుండి సర్దార్జీ, కిరణ్ ల పోట్లాటా, తన్నుకోవడం వినిపిస్తూనే వుంది. అయినా ఆమె వెనక్కి తిరగలేదు. సర్దార్జీ బలం ముందు కిరణ్ ఆగలేడని ఆమెకు తెలుసు.
    
    దూరంనుంచి ఏదో వెహికల్ వస్తూ కనిపించింది.
    
    "లిఫ్ట్.....లిఫ్ట్...." ఆమె రెండు చేతులూ ఊపుతూ రోడ్డుమీదకి పరిగెత్తింది.
    
    దగ్గరగా వచ్చి ఆగింది కారు.
    
    చాయ విండో దగ్గరికి పరిగెత్తి లోపలికి తొంగిచూస్తూ గాబరాగా అంది- "నేను అర్జంటుగా సిటీకెళ్ళాలి. ప్లీజ్! లిఫ్ట్ ఇవ్వండి..... మేక్ ఇట్ ఫాస్ట్."
    
    లోపల వ్యక్తి ఒక్కక్షణం ఆలోచించినట్లుగా ఆగి నెమ్మదిగా ఫ్రంట్ డోర్ తీసాడు.
    
    "థాంక్యూ" చాయ ఎక్కి కూర్చుంటూ అంది.
    
    లోపల లైటు వెలిగింది. అతను స్టార్ట్ చేస్తూ అడిగాడు "ఇంత రాత్రివేళ ఇక్కడ ఎలా వున్నారు?"
    
    "మా ఫ్రెండ్ కి ఒంట్లో బాలేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసాను. వస్తూ వుంటే నా వెహికల్ ట్రబుల్ ఇచ్చింది. అది అక్కడ గ్యారేజ్ లో పడేసాను" అప్పటికప్పుడు ఓ కట్టుకథ కల్పించి చెప్పింది.
    
    "ఈ రూట్ లో ఏ హాస్పిటల్ వుంది?" అతను వెంటనే అడిగాడు.
    
    "అది.....అది వాళ్ళ మామయ్యా డాక్టర్. ఆయన దగ్గరే ట్రీట్ మెంట్ తీసుకుంటానని అది పట్టుబడితే తీసుకెళ్ళి వాళ్ళింట్లో వదిలిపెట్టి వస్తున్నాను" చలికి వణుకుతూ అంది.
    
    అతను నమ్మాడో-లేదో గానీ ఏమీ మాట్లాడలేదు.
    
    "ఐయామ్ ఏ లిటిల్ స్టుపిడ్ గర్ల్" అన్న పాట మంద్రంగా వినిపిస్తోంది.
    
    అతను సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు.
    
    చాయ అప్పుడు అతన్ని పరీక్షగా చూసింది. అతని విశాలమైన నుదురూ, దానిమీద పడుతున్న జుట్టూ చాలా ఆకర్షణీయంగా వుంది. నిర్లక్ష్యంగా ఓ చేత్తో డ్రైవ్ చేస్తూనే సిగరెట్ త్రాగుతున్నాడు.
    
    "టర్....ర్....ర్" ఫోన్ మోతకి ఆమె ఆశ్చర్యంగా చూసింది.
    
    "హలో....జేసీ స్వీకింగ్!" అతను సెల్యులర్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
    
    "ఓకే...యాభై లక్షలేగా.....వెంటనే ఒప్పుకున్నట్లుగా అతనికి ఇన్ ఫార్మ్ చేయండి. ఆలస్యం చేయవద్దు. ఆల్ రైట్.....ఓకే...." అతను ఫోన్ పెట్టేసి ఆమెవైపు తిరిగి చూసాడు.
    
    ఆమె కళ్ళు కారడవిలో ఖైదు చేయబడ్డ కాంతిపుంజాల్లా తళుక్కుమని మెరుస్తున్నాయి.
    
    అతనోసారి ఆమెవైపు పరికించి చూసి చటుక్కున తల తిప్పుకున్నాడు.
    
    అతని చూపు కలిసినచోట తనవైపు చూసుకుంది చాయ.
    
    ఆమెకి తన నున్నటి మోకాళ్ళు.....పచ్చగా.....అరటిబోదెల్లా మెరుస్తూ కనిపించాయి. ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది తన వంటిమీద పైజమా లేని సంగతి ఆమె పెదవులమీద పలుచటి హాసరేఖ పరుచుకుంది.
    
    వాన కాస్త తగ్గుముఖం పట్టింది.
    
    అతను చాలా ఏకాగ్రతగా డ్రైవ్ చేస్తున్నట్లు అతని ముఖమే చెబుతోంది. అతని వేళ్ళకున్న వుంగరాలూ, ఛాతీమీద గుబురుగా వున్న వెంట్రుకల మధ్యగా మెరుస్తున్న పులిగోరు చెయిన్, ఆధునికంగా వున్న కారులోని సౌకర్యాలు అతను ఎంత గొప్పవాడో చెప్పకనే చెబుతున్నాయి.
    
    చాయ నెమ్మదిగా వెనక్కి వాలి తన మోకాళ్ళు కాస్త పైకి ఎత్తిపెట్టి కూర్చుంది.
    
    జయచంద్ర ఒక్కక్షణం ఆమె చేసిన పనికి విస్తుబోయాడు. నగ్నంగా మెరుస్తున్న ఆమె తొడలు తగులుతున్నాయి.
    
                                                * * *
    
    'నేను మహాగ్రంథాలు చదివి అర్ధం చేసుకున్నాను. కానీ స్త్రీ హృదయాన్ని మాత్రం అర్ధం చేసుకోలేకపోయాను' అని వాపోయాడు థామస్ మూర్ అనే తత్వవేత్త.    
    
    జయచంద్ర సిగరెట్ తీసి విండోలోంచి అవతల పారేశాడు.
    
    అతనికి స్త్రీ స్పర్శ కొత్త కాదు. పెళ్ళయినవాడు, పద్దెనిమిదేళ్ళ కూతురున్నవాడు. కానీ బ్రహ్మచర్యం వహిస్తున్నవాడు. భార్యకు జబ్బుచేసినప్పటి నుండీ స్త్రీ సౌఖ్యాన్ని పూర్తిగా కోల్పోయి బ్రతుకుతున్నవాడు. అతను తలచుకుంటే అతని పొందు కోరే స్త్రీలు కోకొల్లలు. కానీ అతనికి ఆ దృష్టేలేదు. కాంచన అతని ప్రాణం. కాంచనని తప్ప మరో స్త్రీని స్పృశించలేనని అతని అభిప్రాయం.
    
    చాయ తల నెమ్మదిగా అతని భుజంమీద వాలింది.
    
    అతను ఉలిక్కిపడి ఆమెవైపు చూసాడు. ఆమె నిద్రపోతోంది. మూసిన కనురెప్పలు మన్మధుడి విల్లులా వంగి వున్నాయి. ఆ కనురెప్పలకున్న పొడవాటి వెంట్రుకలు అమ్ములపొదిలా కనిపించాయి. ఆ చూపుల అస్త్రాల తాకిడికి ఎన్ని బలహీనమైన హృదయాలు చిద్రమౌతాయోకదా అనుకున్నాడు.
    
    మంద్రంగా వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం, ఆమెనుండి వీస్తున్న ఇంటిమేట్ సెంట్ పరిమళం, బయట హోరున కురుస్తున్న వర్షం, అతనిలో ఏదో అలజడి కలిగించాయి.
    
    ఆమె దాదాపుగా అతన్ని కౌగలించుకుని వుంది. ఆ గోరువెచ్చని ఉచ్చ్వాస-నిశ్వాసాలు అతని చెవి పక్కన గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె లేలేత ఊరువుల తాకిడికి అతని నరాలు జివ్వుమంటున్నాయి. పయ్యెద లేని ఆమె ఎదపొంగులు ఖజురహో శిల్పసంపదల్ని, అరకులోయ అందాల లోయల్ని ఒకేసారి చూపిస్తున్నట్టున్నాయి.

 Previous Page Next Page