అప్పటికి ఆంజనేయులు తేరుకున్నాడు. మొత్తం విషయమంతా అర్ధమైంది అతనొక్కడికే అంతమందిలో.
"సారీ సార్! తప్పయిపోయింది. మావాడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను" అని అతనికి అడ్డంపడ్డాడు.
"ఏమిటి వీడికింత ఆత్రం. పెరుగు గిన్నెను తీసుకోవడానికి గంటలు గంటలా. పెరుగు కొంచెం తక్కువుంటే ఏమైపోతుంది? ఇలాంటి దరిద్రులకి హాస్టల్ సీట్లు ఇవ్వడమే తప్పు. ఆ గవర్నమెంటోడు ఇ.బి.సి. స్కాలర్ షిప్పులు ఇవ్వడంవల్లే ఇలాంటి వాళ్ళంతా చొరబడ్డారు. ఛీఛీ" ఆ విద్యార్ధి ఆమాటలన్నాక కాస్తంత శాంతించాడు.
అప్పటికి అర్ధమైంది శెట్టికి తను చేసిన తప్పు మనిషంతా కదిలిపోయాడు. తనకు క్షమించమన్నట్లు ఆ విద్యార్ధి చేతులు పట్టుకున్నాడు.
"నన్ను మన్నించండి. మీకు ఇబ్బంది కల్పించాను. మీరు చెప్పినట్లు నేను దరిద్రుడ్నే. మా నాన్న గాజులు వూరారా తిరిగి అమ్ముకుంటాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను అసలు గడ్డపెరుగుతో అన్నం తినడం ఫస్ట్ టైమ్ హాస్టల్ లోనే అంటే మీరు నమ్ముతారా. పాలు కొనడం అనేది మా ఇంట్లో ఇప్పటివరకు జరగలేదు. మజ్జిగ నేది మాయింట్లో ఎరగం. ఎప్పుడైనా పండుగలకో, పబ్బాలకో పావలా ఇచ్చి మజ్జిగ పోసుకొచ్చేది మా అమ్మ. ఆ చారెడు మజ్జిగ కోసం ఇంటిల్లి పాదీ కొట్లాడుకునే వాళ్ళం. నిజం సార్. అందువల్లే ఎక్కువ పెరుగున్న గిన్నె కోసం ఇలా గంటల తరబడి పరిశీలించడం సార్. అర్ధం చేసుకుంటారు కదా......"
ఆ తరువాత వినిపించలేదు ఆంజనేయులుకు. తనకంటే హీనంగా వున్న శెట్టి ఇంటి పరిస్థితుల్ని తలుచుకుని ఏడుపొచ్చింది. మిత్రుడ్ని పొదివి పట్టుకుని హాస్టల్ కు తీసుకొచ్చాడు.
తనలాంటి వాళ్ళే చాలామంది వున్నారని తెలియటంతో అతనికో విధమైన తృప్తి కలిగింది.
చాలా రోజుల తరువాత తన పరిస్థితులను తలుచుకుని కుమిలిపోకుండా ఆంజనేయులూ మరిచిపోయాడు.
ఆ రోజు సాయంకాలం మామూలుగానే బజారుకు బయల్దేరాడు.
రోడ్డుకు అటువైపు వెళుతున్న మునిరత్నం వాళ్ళను చూసి ఠక్కున ఆగాడు. రెండు అంగల్లో రోడ్డు దాటి దగ్గరికి వచ్చాడు.
"హలో సార్" అన్నాడు ఆంజనేయుల్ని చూసి.
"హలో! బావున్నారా?"
"ఏం బాగోలే సార్ - హాస్టల్ లో లేనుగా. అవునూ! మీరు హాస్టలేనా?"
ఆ ప్రశ్న విని బిత్తరపోయాడు ఆంజనేయులు. వారం క్రితమే ఆ ప్రశ్నకు తను జవాబు చెప్పాడు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడతను.
"అవును. ఈ టీ కొట్టు దగ్గరే ఇదే ప్రశ్న అడిగితే జవాబు చెప్పాను. మళ్ళీ అడుగుతారేమిటి?'
"ఈ మాటలకు చాలా దీనంగా ముఖం పెట్టాడు అతను.
"ఏం జేయనుసార్. మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినట్టు మరిచిపోయాను. నాకున్న ఏకైక సమస్య ఫుడ్డే సార్. అన్నానికి చాలా కష్టపడి పోతున్నాను. వూరికి వెళ్ళినప్పుడు రెండు కేజీలో, మూడు కేజీలో రైస్ తెచ్చుకోవడం - అవి వండుకుని తినడం -అవి అయిపోగానే పస్తులు, అందుకే కనిపించిన వాళ్ళనంతా ఇదే ప్రశ్న అడుగుతున్నాను సార్. ఎదుటివాళ్ళు హాస్టల్ అనగానే మరింత దిగులుపడటం అలవాటై పోయింది. సారీ..... ఏమీ అనుకోకండి."
ఆ జవాబు విని తల తిరిగింది. ఆంజనేయులుకు, అతన్ని చూస్తుంటే బాధ కలిగింది. తనకంటే దరిద్రంగా వున్న అతన్ని చూసి జాలిలాంటి భావన ఒళ్ళంతా కమ్మేసింది. అతని కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. నిజమే...... తనలాంటి వాళ్ళకు ఆకలి తీరడమే పెద్ద లగ్జరీ.
"మీరు ఓ పని చేయండి. మీ సామానంతా సర్దుకుని మా రూమ్ కి వచ్చేయండి. అనఫిషియల్ గెస్ట్ గా వుండిపొండి. పరీక్షలకు చదువుకోవాలనీ, మెస్ కి వచ్చే టైమ్ లేదనీ, క్యారియర్ పంపమని మెస్ లో చెబుతాం. నాకూ, శెట్టికి కలిపి రెండు క్యారియర్లు వస్తాయి. దానిని ముగ్గురం తింటూ ఉందాం. మీ సమస్య తీరుతుంది."
ఈ ప్రపోజల్ విని ఉబ్బితబ్బిబ్బయి పోయాడు మునిరత్నం.
"థాంక్స్ సార్!" అన్నాడు అంతకంటే మాటలు రాక.
అలా వాళ్ళు ముగ్గురూ ఒకే రూంలో సెటిలైపోయారు.
సరిగ్గా ఈ సమయంలోనే ఆంజనేయులు తన క్లాస్ మేట్ అయిన మంజులను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె తప్ప ప్రపంచమంతా శూన్యమనుకునే స్థాయికి చేరుకున్నాడు రెండు మూడు రోజుల్లోనే.
అంతవరకు ఏ అభిమానానికి నోచుకోని అతను ఆమె సాన్నిహిత్యం కోసం పరితపించసాగాడు.
పేదరికం దుమ్ము అంటుకుపోయిన అతని మనసు రంగురంగుల ఊహలను అద్దుకోసాగింది. పేలవంగా వున్న ఆ శరీరమూ మరో శరీరం కోసం యాగీచేయడం ప్రారంభించింది. అప్పీలింగ్ గా లేని ఆ ఆకారమూ మరో వ్యక్తిని పెనవేసుకోవాలని ఆరాటపడింది. నిమ్నతా భావంతో చిట్లిన ఆ నరాలూ అందమైన అనుభవం కోసం వెంపర్లాడసాగాయి.
మంజుల కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కూతురు. కాస్తంత పొట్టిగా వున్నా అద్భుతంగా వుంటుంది. డబ్బు తెచ్చిన పాయిజ్, ఎక్ స్ట్రా ఆకర్షణ. చాలా డిగ్నిటీగా, హుందాగా వుంటుంది. పసుపు పచ్చటి ఆమె శరీరపు రంగు, సూర్యాస్తమయం, సూర్యోదయం ఒక్కసారిగా జరిగినట్లుండే పెదవులు, ఆరోగ్యాన్నీ ఇముడ్చుకున్న బుగ్గలు - వీటిని చూసి చిత్తయి పోయాడు ఆంజనేయులు.
ఆమెతో మాట్లాడాలని బలంగా పీకుతున్నా ఎలా మాటలో పెట్టాలో తెలియడంలేదు. ఏదో బిడియం, తెలియని జంకు, అర్ధంకాని బెదురు వెనక్కు లాగుతుండేవి.
సాయంకాలం - సంధ్య కాంతిలో ఆమె క్వీన్స్ రోడ్డని పిలిచే వారు అబ్బాయిలు. మరి అబ్బాయిల హాస్టల్ కు వెళ్ళే రోడ్డును అమ్మాయిలు ఏమని పిలుస్తారనేది అప్పట్లో అతన్ని తొలచిన అనుమానం. శుక్రవారాల్లో తలంటిపోసుకుని అలా మొదట్లో క్లిప్స్ పెట్టిన జుట్టు ఎంత పొడవుంటుందో అతఃన్ని తికమకపెట్టిన సమస్య. ఆ కురుల్లోంచి వచ్చే షాంపూ వాసన ఏ కంపెనీదో ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్న. ఆమె కట్టుకున్న చీరకు ఎన్ని కుచ్చిళ్ళు తీస్తుందో ఎంతకీ తెగని ఆలోచన. ఆ కళ్ళలోతుల్లో ఏ అనుభూతి సుళ్ళు తిరుగుతున్నాయో అన్నది అతన్ని మింగేసిన ఫిలాసాఫికల్ ప్రాబ్లమ్. ఆమెను గాఢంగా వాంచించటం తప్పో ఒప్పో తెలియకపోవడం అతని ఎథికల్ సమస్య.
అమ్మాయిలంతా చాలా మంచివాళ్ళమని, డాలర్ - కల్చర్, కుల పిచ్చ తదితర వివాదాలేవీ వుండవని ఆమెను చూసినప్పుడు అనిపించేది.
అతనూ, శెట్టీ, మునిరత్నం ఓ రోజు రాత్రి హాస్టల్ డాబామీద పడుకున్నారు. పిండారబోసినట్లు వెన్నెల. యూకలిప్టస్ నుంచి వచ్చే గాలి ప్రశాంతమైన ఆ వాతావరణాన్ని మెడికేటెడ్ గా మారుస్తోంది.
గుండె అంతా మంజుల నిండిపోయి వుంది ఆంజనేయులుకు.
"ఇంతకీ ఆడపిల్ల - మన క్లాస్ మేట్ అనుకో - ఎలా పలకరించాలి?"