ప్రియంవద గుడ్ మార్నింగ్ చెప్పినా తను ఎందుకలా మూగగా అయిపోతాడు. తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలని తనకీ వుంటుంది. కానీ గొంతు పెగలదు. ఎందుకు? బహుశా మంజుల చేసిన అవమానం తన శక్తియుక్తులనంతా క్రుంగదీసిందా! న్యూనతా భావాన్ని తన నరనరాల్లో నింపిందా! ఏమైంది తనకు.
ఆ రోజు మంజుల అలా ప్రవర్తించకుండా వుంటే ఈ రోజు తనిలా వుండడు. యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వుంటాడు. మంచి ఉద్యోగం వచ్చి వుంటుంది. తన చెల్లెళ్ళకు పెళ్ళి చేసే వుంటాడు. తమ్ముళ్ళకు ఏవో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వుండేవాడు. మంజులతో తన జీవితం రంగుల పెయింటింగ్ లా అధ్బుతంగా వుండేది.
కానీ మంజుల అలా తన ప్రేమను స్వీకరించలేదు. తన పేదరికం మీద తన అనాకారితనం మీద తఃన అమాయకత్వంమీద తన యవ్వనం మీద గుప్పెడు అప్పులను విసిరివేసింది. దాంతో తన జీవితం కాలిపోయింది.
ప్రియంవదతో నడుస్తున్నాడేకానీ అతని గుండెల్లో మిగిలిపోయిన ఒక్కో సంఘటనా నెగెటివ్ లు వాష్ అయి కళ్ళల్లో ఫోటోలుగా తెలుతున్నాయి.
యూనివర్సిటీ జీవితమంతా కళ్ళముందు కదులుతోంది.
కొత్త ఆశలతో రంగుల ఊహలతో ఆంజనేయులు యూనివర్శిటీ లో అడుగుపెట్టాడు.
అంత పెద్ద కాలేజీలో చదువుతానని అతను అనుకోలేదు. పిన్ని చదువు వద్దని సాధించినా తమ శక్తికి మించిన పని అని నాన్న వద్దన్నా పట్టుబట్టి యూనివర్శిటీలో చేరాడు. ఫీజులు కోసం వ్యవసాయ కూలీగా మారాడు. నెలరోజులపాటు మటిక దున్నాడు. పళ్ళతోటలకు నీళ్ళు కట్టాడి. బండి తోలాడు.
యూనివర్శిటీ లో చేరగానే తను పడ్డ కష్టాన్నంతా మరిచి పోయాడు. అంత వరకు వూర్లోపడ్డ అవమానాలను అనుభవించి పేదరికాన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు.
యూనివర్శిటీ అతన్ని తల్లి లాగా దగ్గరకు తీసుకుంది.
పెద్ద లైబ్రరీ నిండా పుస్తకాలు. అందమైన పూల చెట్లు. గొప్ప వాళ్ళ సూక్తులతో నిండిపోయి ప్రాంగణం అంతా కనిపించే రాతిఫలకలు ఆడిటోరియంలో సాయంకాలం అయితే విరబోసే సాంస్కృతిక కార్యక్రమాలు. ఒళ్ళంతా తుపాకులు మొలిస్తే బావుండుననిపించే ఎర్రవాళ్ళ పాటలు. కబుర్లు పొగతో ఉక్కిరిబిక్కిరి చేసే క్యాంటీన్ ఇవన్నీ అతన్ని మరో లోకంలోకి తీసుకెళ్ళాయి.
ఇ.బి.సి. స్కాలర్ షిప్ రావడంతో హాస్టల్లో చేరాడు. 'ఇ' బ్లాక్ లో రూం నెంబర్ ఇరవై ఒకటి కేటాయించారు. తన రూమ్మేటు శెట్టిని చూస్తూనే చాలా ఆనందపడిపోయాడు ఆంజనేయులు. తనలాంటి పరిస్థితుల నుంచే వచ్చిన శెట్టిని చూసి తనకు మంచి స్నేహితుడు దొరికాడని సంబరపడిపోయాడు.
మొద్తయ్రోజు హాస్టల్ లో పెట్టిన భోజనాన్ని చూసి వాళ్ళిద్దరూ తమకు పట్టిన అదృష్టాన్ని చూసి మురిసిపోయారు. ఎప్పుడూ గొడ్డు కారంతో అన్నం తినే ఖర్మ తప్పిందని ఆనంద పడిపోయారు.
ఆ రాత్రి చికెన్ వడ్డించారు. రోజూ రాత్రిపూట చికెన్ పెడతారని పక్క కుర్రాడు చెప్పినప్పుడు శెట్టి అయితే ఏకంగా మూర్చవచ్చి పడిపోయినంత పని చేశాడు. ఆంజనేయులకయితే పొలమారింది. తను వూరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఈ విషయం చెప్పాలని ఉబలాట పడ్డాడు.
మంచి భోజనం చక్కటి వాతావరణం వల్ల అతను బాగా తేరుకున్నాడు బక్కగా పీలగా వుండే అతను కాస్తంత పుష్టిగా తయారవడం మొదలుపెట్టాడు.
పగలు క్లాసులకి వెళ్ళడం సాయంకాలమైతే టౌన్ కొచ్చి టీ తాగి తిరిగి హాస్టల్ కి వెళ్ళడం రాత్రి చికెన్ తిని ఏదో బుద్ది పుట్టినంత వరకు చదవడంతో సరదాగా గడిచిపోతోంది కాలం.
ఓ రోజు సాయంకాలం శెట్టి ఆంజనేయులు అలా తిరిగిరావడానికి బజారుకు బయల్దేరారు.
బాలాజీ కాలనీ సెంటర్ కు వచ్చి ఓ టీ కొట్టు దగ్గర నిలుచున్నారు.
"హలో సార్!" ఎవరో దీనంగా పిలుస్తున్నట్లనిపిస్తే వెనక్కి తిరిగాడు ఆంజనేయులు.
"నేను సార్ మునిరత్నాన్ని. ఎం.ఏ. తెలుగు."
"ఓ మీరా!" అప్పటికి గుర్తుపట్టాడు ఆంజనేయులు.
"అన్నం ఎలా చేస్తున్నారు సార్. హాస్టల్ లో చేరారా?" మొదట ఆ ప్రశ్న అడగడంతో కొంత ఆశ్చర్యపోయాడు ఆంజనేయులు.
"అవునండీ హాస్టల్ లో చేరాను"
"అదృష్టవంతులు సార్. బిల్లు కట్టవలసి వస్తుందేమోనని హాస్టల్ లో చేరలేదు. అప్లయ్ చేసిన వాళ్ళందరికీ ఇ.బి.సి. స్కాలర్ షిప్పులు ఇచ్చాడు కదా. ఆ విధంగా నేను నష్టపోయాను సార్. ఇప్పుడు భోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను" అతను చాలా నొచ్చుకుంటూ చెప్పాడు.
"ఏదైనా మెస్ లో చేరారా?"
"లేదు సార్ స్వయం పాకం"
అంతలో టీ వచ్చింది. వస్తానని చెప్పి మునిరత్నం వెళ్ళిపోయాడు.
అతని గురించే చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు ఆంజనేయులు.
దాదాపుగా తన పరిస్థితీ అంతే. అదృష్టం కొద్దీ ఇ.బి.సి. స్కాలర్ షిప్పు వచ్చింది. లేకుంటే తను కూడా అతను పడుతున్న ఇబ్బందులన్నీ పడేవాడే.
టీ తాగాక మరికొంతసేపు మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు.
చీకట్లు ముసురుకున్నాయి.
తిరిగి హాస్టల్ కు బయల్దేరారు.
డ్రస్సు మార్చుకుని మెస్ కి వెళ్ళారు.
సర్వర్లు ప్లేట్లు సర్ది వడ్డీస్తున్నారు. విద్యార్ధులతో మెస్ రద్దీగా వుంది. శెట్టి, ఆంజనేయులు ఓ మూల కూర్చున్నారు.
అన్నం వడ్డించాక, చికెన్ వచ్చిందిట.
చికెన్ ముక్కలు ఏ ప్లేటులో ఎక్కువగా వున్నాయో పరిశీలిస్తున్నాడు శెట్టి. ఓ రెండు నిముషాలసేపు చూపులతోనే ప్లేట్లులోని చికెన్ ను తూకం వేశాక తనకు సంతృప్తికరంగా అనిపించినా ఓ ప్లేటు అందుకున్నాడు అతను. పక్కనున్న విద్యార్ధి విసుగ్గా అతనివైపు చూసాడు.
రసంతో తిన్నాక పెరుగు గిన్నెలతో వచ్చాడు సర్వర్.
తిరిగి శెట్టి ప్లేట్లను పరిశీలించడం మొదలుపెట్టాడు. పెరుగు ఇందులో ఎక్కువుందో చూస్తున్నాడు. పక్కనున్న విద్యార్ధి అసహనంగా శెట్టిని గమనిస్తున్నాడు. అతను ప్లేట్లను ఎంపిక చేసుకున్నాక గానీ సర్వర్ తన దగ్గరకు రాడు గనుక ఆ విద్యార్ధి చిరాకును కళ్ళతోనే ప్రదర్శిస్తున్నాడు పాపం శెట్టి తన ధ్యాసలో తానున్నాడు.
మరో నిముషం గడిచిందిగానీ శెట్టి దాంతోపాటు గిన్నె అందుకోలేదు.
ఆ విధ్యార్ధికి సహనం నశించింది. దాంతోపాటు కోపం వచ్చింది. ఆవేశంతో లేచి శెట్టి చొక్కాను పట్టుకున్నాడు. ఎడా పెడా పిడిగుద్దులు గుద్దాడు. ఈ హఠాత్పరిమాణాన్ని వూహించని శెట్టి బిత్తర చూపులు చూస్తున్నాడు తప్ప ప్రతిఘటించలేదు.