Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 19


    రిలీజైన ఓ సినిమాను గురించి మాట్లాడుకుంటున్న శెట్టి, మునిరత్నం తమ మాటల్ని ఆపి "మరోసారి చెప్పు" అన్నారు.
    "ఆడపిల్లను ఏమని సంబోధించాలి?"
    శెట్టీ, మునిరత్నం కూడా అతనికి డిటోనే ఆడపిల్లలతో మాట్లాడిన అనుభవం లేదు.
    శెట్టి చాలా ఆలోచించి చెప్పాడు "హలో మేడమ్ అంటే సరి"
    "మేడమ్ అని పిలిస్తే సరిపోతుందా?"
    "అంతే."
    ఆంజనేయులు ఇక వాళ్ళతో పనిలేనట్టు పక్కకు తిరిగి పడుకున్నాడు.
    రేపో, మాపో మంజుల వెళుతుంటే తను "మేడమ్" అని పలకరిస్తాడు. ఆమె ఆగిపోతుంది. ఎందుకు పిలిచావన్నట్లు కళ్ళు ఆడిస్తుంది. అప్పుడు తన ప్రేమంతా మాటల్లో పేర్చి చెబుతాడు. తామిద్దరూ అప్పుడు తురాయి చెట్టుకింద నిలబడి వుంటారు. కుంకుమపొడి రాలినట్లు అక్కడక్కడా తురాయిపూలు రాలుతుంటాయి. తను ఎంతో ఉద్వేగంతో చెబుతాడు. తనుమాత్రం చాలా కూల్ గా వింటుంది.
    తన ప్రేమనంతా వింటూనే తురాయిపూలకన్నా ఆమె బుగ్గలు మరీ ఎరుపెక్కాయి. పెదవులు ఎగ్జయిట్ మెంట్ వత్తిడికి వణుకుతాయి. కళ్ళు గందరగోళంలో గుండ్రంగా తిరుగుతాయి. కంఠం తెలియని భావావేశం అదురుతుంది.
    వెంటనే మాటలు  రాక కిందకు వంగి రెండే పూలున్న రెమ్మను ఎత్తుకుంటుంది. "జంట పూలు కాలాన్ని సమంగా పంచుకోమంటున్నాయి." అంటుంది. అంతకంటే అందంగా ఏ ఆడపిల్ల చెబుతుంది తన ప్రేమను. ఇక అక్కడ వుండలేక బిరాబిరా వెళ్ళిపోతుంది. రెండోరోజు ఒకరినొకరు చూసుకోవడమే కొత్తగా వుంటుంది. ఆ తరువాత ఇద్దరూ సినిమాలు, షికార్లు - ఒకటనేమిటి! అన్ని అనుభవాలను చవిచూస్తారు.
    ఆంజనేయులు తన స్వంత ప్రపంచంలో తానున్నాడు. మిత్రులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించలేదు. వూహల రెక్కలతో అతను ఎక్కడెక్కడో విహరిస్తున్నాడు.
    రేపే ఎలాగైనా మంజులను పలకరించాలని గట్టిగా నిర్ణయించుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు.
    మరుసటి రోజు మంజులను పలకరించాలనే గాఢమైన కోరికతో కాలేజీకి వెళ్ళాడు. క్లాసులైపోయే వరకు ఎంతో నిగ్రహంగా వున్నాడు.
    అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. మంజుల లేచిన తరువాతే లేవడం అలవాటు చేసుకున్నాడు. ఆమె పుస్తకాలాన్నీ సర్దుకుని పక్కనున్న లెక్చరర్ గదికి వెళ్ళింది. అతను గదిముందు శిలాప్రతిమలా నిలబడి చూస్తున్నాడు.
    మరో పది నిమిషాలకు ఆమె లెక్చరర్ గదినుంచి బయటకు వచ్చింది. వరండా నుంచి దిగి పచ్చికలో గీతలా వుండే కాలిబాటంట నడుస్తోంది.
    ఆంజనేయులు ఆమె వెనకే నడిచాడు. ఆమెతో మాట్లాడమని ఎవరో వేయి చేతుల్తో ముందుకు తోస్తున్నారు.
    "మేడమ్" అన్నాడు.
    ఉలిక్కిపడ్డట్టు ఆగి వెనక్కు చూసింది.
    క్లాస్ మేట్ ను ఎంతో భయభక్తులతో 'మేడమ్' అని పిలుస్తున్న అతని ఎదగనితనాన్ని, అమాయకత్వాన్ని ఆమె అంచనా వేయగలిగింది. అతని వేషాన్ని బట్టి ఆర్ధిక స్థితిగతుల్ని పసిగట్టింది. నీట్ గా టక్ చేసుకుని, కాస్ట్ లీగా కనిపించే ఏ అబ్బాయి అయినా 'మేడమ్' అని పిలిచి వుంటే సంస్కారవంతుడు అని అనుకునేది. కానీ ఇప్పుడు పిలుస్తున్నది ఓ మామూలు అబ్బాయి. తెలివితక్కువ తనంవల్ల, తెలియక పోవడం వల్ల తనను 'మేడమ్' అని సంబోధించాడని అనుకుంది. వేషం వల్ల అంత తేడా వస్తుంది మరి.
    "ఏమిటండీ!" అంది విసుగ్గా.
    తను మేడమ్ అన్నాడు గనుక తనను 'సార్' అని పిలుస్తుందని అనుకున్నాడు అతను.
    "నేను ఆంజనేయుల్ని" వినయంగా చెప్పాడు.
    "తోక ఎక్కడ?" అడిగింది సీరియస్ గా ముఖంపెట్టి.
    జీవంలేని నవ్వు నవ్వాడు.
    "చెప్పండి అవతల నాకు టైమ్ అయిపోతోంది" తొందరచేసింది ఆమె.
    దాంతో కంగారు పడిపోయాడు. గొంతు పెగలడంలేదు. అతని అవస్థ చూసి ఆమెకు నవ్వొస్తోంది. అలాంటప్పుడు నవ్వకుండా ఎలా ఆటపట్టించాలో ఆమెకు బాగా తెలుసు.
    "ఏమైనా కావాలా?"
    "అబ్బే.....ఏం వద్దు."
    "మరిక ఎందుకు పిలిచారో చెప్పండి. మీరేం అడిగితే అది ఇవ్వడానికి రడీ."
    ఆమె ఉడికిస్తోందని అతను గ్రహించలేక పోయాడు. అనుభవం లేకపోవడం, నిమ్నతా భావం వల్ల ఆమె మనసును పసిగట్టపోతున్నాడు.
    "బాగా ఆలోచించుకుని చెప్పండి." అని మనోహరంగా నవ్వి వెళ్ళిపోయింది.
    ఆ నవ్వును చూసి అతను ఐస్ అయిపోయాడు. ఆమె తనను ఇష్టపడుతూ వుందని భావించాడు. మొత్తం తన ప్రేమనంతా చెప్పలేకపోయానన్న వెలితీ, ఏదో ఒకటి మాట్లాడాన్న తృప్తీ అతన్ని చుట్టు ముట్టాయి.
    ఇక ఆ రాత్రి నిద్రకరువైంది అతనికి. తను ఏం అడిగినా ఇచ్చేస్తానన్న ఆమె మాటలు పదేపదే చెవుల్లో మార్మోగుతున్నాయి.
    అదే సమయంలా మంజులా ఆంజనేయుల అమాయకత్వాన్ని స్నేహితురాళ్ళకు చెబుతోంది. తను ఎలా రెచ్చగొట్టిందీ వివరించింది. అప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా మారాయో వర్ణించి, నటించి చూపించింది. అతని మీద వాళ్ళు ఎన్నో క్రూడ్ జోక్ లు వేసుకున్నారు.
    రెండో రోజు మరింత ముందుగా వెళ్ళాడు క్లాసుకి. మంజుల ఎప్పుడొస్తుందా అని ద్వారానికి చూపులు తగిలించాడు.
    మరో పది నిముషాలకు క్లాకు మొదలవుతుందనగా మంజుల తన ఫ్రండ్స్ తో కలిసి వచ్చింది. ఆంజనేయులు తప్ప మరో అబ్బాయి లేడు.
    "హలో" అంది కుడిచేయి పైకెత్తి వయ్యారంగా వూపుతూ.
    అతను వెనక్కీ, ముందుకు చూశాడు.
    "మిమ్మల్నే" అంది.
    ఠక్కున పైకి లేచాడతను ఏం చెప్పాలో తెలియక.
    "సిట్ డవున్" అంది.
    వూహించని ఈ పలకరింపులకి తేరుకొని అతను వెంటనే కూర్చుండిపోయాడు.
    "యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్" అంది చిన్నగా.
    ఈ మాటలు సరిగ్గా వినపడని అతను ఏమిటన్నట్టు పైకి లేచాడు.
    "తరువాత మాట్లాడుకుందాం. కూర్చోండి" గట్టిగా అని తన ఫ్రండ్స్ వైపు తిరిగి చిన్నగా "ఎలా చేయిస్తున్నాను డ్రిల్" అంది.
    అమ్మాయిలంతా పెదవులు బిగపట్టి నవ్వుతున్నారు.
    క్లాసులై పోయాయి.
    అబ్బాయిలంతా వెళ్ళిపోయే వరకు మంజుల, ఆమె ఫ్రండ్స్ అక్కడే వుండిపోయారు. ఆంజనేయులు చివరగా లేచి వెళ్ళడానికి తయారవుతున్నాడు.

 Previous Page Next Page