'ఏడాదిపాటు రాకపోవటం ఏమిటో..... వీళ్ళకు అందుకే పిల్లలు పుట్టటం లేదు' మనసులోనే అనుకున్నాడు మధు.
స్నానం చేసి డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్న సమయంలో సుల్తాన్ వచ్చాడు.
"లెటర్ రాసావా?'
తీసిచ్చాడు మధు. చదవడం ప్రారంభించాడు సుల్తాన్.
"ప్రియమైన మీకు-
మిమ్మల్ని నేను మొట్టమొదటిసారిగా చూసిన క్షణంలోనే అభిమానించాను. ఆ అభిమానం, ఆరాధనగా మారడానికి కొన్నిగంటలే పట్టింది. ఆ ఆరాధన ప్రేమగా మారడానికి కొన్నిరోజులే పట్టింది.
ప్రేమమీద నాకు స్పష్టమైన అభిప్రాయం వుంది. ఆ విషయాన్ని తెలుగులో కంటే, ఇంగ్లీషులో చెప్పేస్తే బావుంటుందని, ఎక్కడో చదివిన కొటేషన్ రాస్తున్నాను.
ఒకసారి ప్రేమలో పడితే బయటకు రావటం కష్టం. దానికి మించింది కూడా లేదు. ద్వేషమనేది దానికి దూరం. ప్రేమను మరిచిపోవడం కూడా అసాధ్యం.
Love has only entrance not exit
Love do not alters once it enter
Love do not hate it love
Love do not forget once it remembers.
మీతో మాట్లాడుతున్నప్పుడల్లా మీ సున్నితమైన భావుకత వెనక గల స్పందనల్ని, నా హృదయం ఎప్పుడూ రికార్డ్ చేస్తూనే వుంది.
నాకు ప్రేమంటే ఫిజిక్ గానీ, స్టయిల్ గానీ, డ్రస్సింగ్, కళ్ళు, చిరునవ్వు, ఆకారం ఇవేవీ కావు. ఒక మనసుకి, మరో మనసు యిచ్చే శాశ్వతమైన చిరునామాయే ప్రేమని నేననుకుంటాను.
చప్పుడు చెయ్యని జలపాఠాన్ని మీరెప్పుడైనా చూశారా?
కనురెప్పలు మూసుకొని అందమైన కనుపాపల్ని మీరెప్పుడైనా చూశారా? మేఘాల సైకత వేదికపై హాయిగా పడుకుని చల్లగా ప్రపంచాన్ని పలకరించే జాబిలీ స్పర్శను ఎప్పుడైనా అనుభవించారా?!
తేట నీటి అలలమధ్య నుంచుని, ఆ అలల్లో మనః ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు.
మన మనస్సు మనకు కన్పించదూ!
అద్దాలతో తయారుచేసిన మనిషిని. పారదర్శకంలా నాలో ఆపాదమస్తకం ప్ర్మను మీరు చూడొచ్చు.
మీరంటే నాకిష్టం.
ఎంత యిష్టమో చెప్పడానికి ఒక్కొక్కప్పుడు మాటలు వుండవు. ఇప్పుడూ లేవు.
దట్టమైన అడవి మధ్యలో నుంచున్నప్పుడు ఎండ వెన్నెల్లా మెరుస్తుంది. వాన చినుకులు వజ్రపు తునకలుగా తళుకులీనుతాయి.
ప్రేమంటే మనోఃకాంతి......
ప్రేమంటే ఒక కపాలమోక్షం....
ప్రేమంటే త్వమేవాహం.....
మళ్ళీ చెప్తున్నాయి మీరంటే నాకిష్టం.
నా పేరు లేకుండానే నేనీ ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నానో తెలుసా? మీరు నన్ను గుర్తించగలరనే ఆశతో.
ఆ మాత్రం ఐక్యూ మీకుందని నాకు తెల్సు.
మన ఫ్యూన్ ద్వారా ఈ ఉత్తరాన్ని మీకు పంపుతున్నాను.
మీరు నన్ను అభిమానిస్తే ఈరోజు సాయంత్రం నాలుగుగంటలకు కాలేజీ ఆడిటోరియం దగ్గరకు రండి.
నేనెవరో మీకు తెలుస్తుంది.
మీకోసం నిరీక్షిస్తూ...."
"వండ్రఫుల్.... చాలా బావుంది..... చాలా తెలివిగా రాశావే" మెచ్చుకున్నాడు సుల్తాన్.
"పేరు చెప్పకుండా సస్పెన్స్ లో వుంచితే థ్రిల్లింగ్ గా వుంటుంది. ఇంతకీ వస్తుందంటావా?" ఆశగా అడిగాడుమధు.
"తప్పకుండా వస్తుంది. కానీ నాకో అనుమానం. థ్రిల్లింగ్ గా వుంటుందని చేశావా? భయంతో చేశావా? ఉత్తరంలో నీ పేరు రాయకపోవటానికి నీ బిడియం, సంకోచం, సందేహం మాత్రమే కారణమై వుంటాయని నా నమ్మకం. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా నమ్మకం ధైర్యం వుండాలి. ఈ ఉత్తరాన్ని రాసిన నిన్ను మెచ్చుకోవడానికైనా వస్తుందిలే" అన్నాడు సుల్తాన్.
"అంటే నన్ను ప్రేమించదా?"
"మెచ్చుకోవడం, ప్రేమించడంలో ఫస్ట్ పార్ట్" అన్నాడు సుల్తాన్.
"నేను కాలేజీకొస్తాను...... ఆ బ్యూటీని చూసేసి, షాపుకెళ్ళిపోతాను" అన్నాడతను.
మరో పావుగంట తర్వాత ఇద్దరూ కాలేజీకి బయలుదేరారు.
* * *
సరిగ్గా పదిగంటల ఇరవై అయిదు నిమిషాలు. సాంత్రో కారులోంచి దిగిన అన్విత, తనని విష్ చేసిన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ, క్లాసు రూమ్ వైపు నడుస్తోందీ. ప్రిన్సిపాల్ రూమ్, ఆ తర్వాత లెక్చరర్స్ సిటింగ్ రూమ్ దాటాక క్లాస్ రూమ్ వస్తుంది.
"ఫ్యూన్ ద్వారా లెటర్ పంపితే రవి, రమణ మొదలైన జనాలకు తెల్సిపోతుందని, క్యాంటిన్ లోని కుర్రాడితో అప్పటికే మాట్లాడాడు మధు.
పరుగు పరుగు క్యాంటీన్ వైపు పరుగెత్తి, ఆ క్యాంటిన్ కుర్రాడి చేతిలో లెటర్ పెట్టి-
"చూడు! ఆ వరండా మీద వెళుతున్న అమ్మాయిల్ని చూశావా?" అడిగాడు మధు.
క్యాంటీన్ కుర్రాడు అప్పుడే అటుగా వెళుతున్న అమ్మాయిలకేసి చూశాడు.
"జాగ్రత్తగా చూడు..... వైట్ సిల్క్ డ్రెస్ చూశావా?"
"చూశాను సార్!"
"ఆవిడకి ఈ లెటర్ ఇచ్చేసి రా!"
"ఎవరిచ్చారంటే?"
"మీ ఫ్రెండ్ అని చెప్పు" చెప్తాడు సుల్తాన్.
"పరుగెత్తు" అన్నాడు మధు.
ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్న అన్విత, అప్పుడే తనని ఎవరో పిల్చినట్టు వినిపించడంతో తలతిప్పి చూసింది. వస్తున్నా కళ్యాణి కోసం ఆగింది.
లెక్చరర్స్ సిటింగ్ రూమ్ ఎదురుగా నిలబడ్డారందరూ.
అప్పుడే కెమిస్ట్రీ మేడమ్ ఎదురుపడడంతో ఆవిడ్ని విష్ చేసి, ముందుకెళ్ళారు అమ్మాయిలు.
క్యాంటీన్ మెట్లమీద, వాళ్ళకి కనిపించకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు మధు, సుల్తాన్.
స్తంభం పక్క నుంచి పరుగెత్తి-
"మేడమ్" అని పిలిచాడు ఆ కుర్రాడు.
మేడమ్ తలెత్తి-
"మీకు లెటర్......" ఆమె చేతిలో లెటర్ పెట్టేసి పరుగు, పరుగున వెనక్కి వచ్చాడు.
స్తంభం అడ్డుగా వుండడం వల్ల ఆ సమయంలో అన్విత కన్పించలేదు.
"సక్సెస్!" అన్నాను సుల్తాన్.
ఎందుకో మధు గుండెలు గుబగుబలాడాయి.
"ఇచ్చేశాను...... సార్....." చెమట్లు కక్కుమంటూ వచ్చాడు కుర్రాడు. వాడి చేతిలో యాభైరూపాయలు పెట్టి "ఎవరికీ చెప్పకు" అని చెప్పి సుల్తాన్ వెళ్ళిపోయాడు.
* * *
ఫస్ట్ పిరియడ్ అయిపోయాక నెమ్మదిగా క్లాస్ రూమ్ లోకి వెళ్ళాడు మధు.
రెండో వరుసలో కూర్చున్న అన్వితవేపు చూశాడు. అన్విత అతని వేపు చూసి కళ్ళతోనే నవ్వింది.
ఆ నవ్వుకి మధు మనసు విశాల ఆకాశంలా పురులు విప్పింది. లెటర్ చదివాక నవ్విందా? చదవకుండా నవ్విందా? మధులో సందేహం.
ఫస్ట్ పిరియడ్ అయిపోయాక సిటింగ్ రూమ్ కొచ్చింది కెమిస్ట్రీ లెక్చరర్ మధుమతి.
ఎప్పుడైనా హైదరాబాద్ లో వుండే భర్త దగ్గర్నించి ఉత్తరం వస్తుంది. ప్రతి వారం ఆయన టెలిఫోన్ చేస్తాడు.
క్యాంటీన్ కుర్రాడు ద్వారా లెటర్ ఏమైయుంటుంది.....? అంటూ హేండ్ బ్యాగ్ లోంచి లెటరు తీసి చదివిన ఆమెకు వంటినిండా చెమటలు పట్టేశాయి.
ప్రేమలేఖ!
లవ్ లెటర్.....
తనకు 45 సంవత్సరాల వయస్సులో లవ్ లెటర్...... ఆ తెలుగు లెక్చరరు సుబ్బారావు మాటల్ని చూసే, ఎప్పుడో తను అనుమానించింది!
రాస్కెల్..... అటూ ఇటూ చూసి-
గబగబా బాత్రూమ్ కెళ్ళి 'గడియపెట్టుకుని' తీరుబడిగా చదివింది.
యుక్తవయసులో తనకు ఎవరైనా లవ్ లెటర్ రాస్తే బావుడ్నని అనుకునేది మధుమతి.
ఎవడు రాశాడో బాగానే రాశాడు. మళ్ళీ, మళ్ళీ చదువుకుని మురిసిపోయింది.
ఆ సుబ్బారావు రాసినట్టు తెలిస్తే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చెయ్యాలి. లేకపోతే ఎవరైనా కాలేజీ కుర్రాడు రాస్తే?
తను సన్నంగావుండడంవల్ల, తన వయసును ఎవరూ అంచనా వెయ్యలేరు. తనకి అదొక ప్లస్ పాయింట్.....
తనూ అందంగానే వుంటుంది.
తనను కూడా, ప్రేమించే వాళ్ళున్నారనే ఊహే మధుమతిని ఒకచోట నిలవనియ్యడం లేదు.
బాత్రూమ్ మిర్రర్ లో తనని, తన వైట్ మ్యాచింగ్ డ్రెస్ ను చూసుకునో, తన అందానికి తనే మురిసిపోయింది.
మరొకసారి లెటరు చదువుకుంది. రిస్ట్ వాచ్ వేపు చూసుకుంది.
మూడు నలభై ఐదు నిమిషాలు......
నెమ్మదిగా ఆడిటోరియంవేపు అడుగులు వేసింది మధుమతి.