Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 17


    "లేవు......రావచ్చుగదా" ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడతను. మంచి గంధంలో ముంచి తీసిన మందార రెక్కవన్నెలో మెరిసిపోతోంది అన్విత ముఖం. గ్రే కలర్ కుర్తా పైజామా, లైట్ కలర్.

 

    "సుల్తాన్ గాడు తనని డార్క్ కలర్స్ వేసుకోమన్నాడే ఆడవాళ్ళు లైట్ కలర్స్ వేసుకోవాలేమో."

 

    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగింది అన్విత. ఇంతలో ఫోన్ రింగయింది. నవ్వుతూ మాట్లాడుతోంది.

 

    "ఫోన్లో జోక్స్ వెయ్యకు నవ్వాపుకోలేను. ఎదురుగా గెస్ట్ వున్నారు?" అంటోంది.

 

    "సందర్భం చూసుకుని పొగుడు" సుల్తాన్ మాట గుర్తు కొచ్చింది. ఇది మంచి సందర్భం. రిసీవర్ పెట్టెయ్యగానే పొగిడెయ్యాలి. అయిదు నిమిషాల తరువాత రిసీవర్ పెట్టేసింది.

 

    "మీ నవ్వు బావుంటుంది" అనబోయి 'మీ నవ్వు' ఆ మాటను గొంతులోనే అనేసుకుని- "బావుంటుంది" అన్నాడు పైకి.

 

    "ఏమిటి?" "ఏలూరు" అనేశాడు తత్తరపాటుగా గోడమీదున్న పెయింటింగ్ వైపు చూస్తూ.

 

    అన్వితను పెయింటింగ్స్ అంటే ఇష్టం కామోసు, లేకపోతే పెయింటింగ్స్  వేస్తుందేమో? లేచి గోడవారగా వెళ్ళి ఆ పెయింటింగ్ వైపు నిశితంగా, పరిశీలనగా చూసి-

 

    "వండ్రఫుల్ చాలా బావుంది. కలర్ కాంబినేషన్ అద్భుతం! ఇంత చక్కగా మీరు పెయింటింగ్స్ వేస్తారని నాకు తెలీదు" అన్నాడు వెనక్కి వస్తూ.

 

    "నాకూ తెలీదు" అంది అన్విత.

 

    "ఏం?"

 

    "ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ అది. ఆ మధ్య బొంబాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కొన్నాను."

 

    "ఓహో!" దెబ్బతినేశాను అనుకున్నాడు మధు.

 

    "సరదాగా ఏవైనా చెప్పండి" అంది అన్విత.


    
    "మీరంటే నాకిష్టం" బుల్ డోజర్ పెట్టి లాగినా, ఆ మాట మధు గొంతులోంచి రావడంలేదు. తెగ గింజుకుంటున్నాడు. ఆఖరికి "ఇష్టం" అని అన్నాడు.

 

    "ఏమిటి?"

 

    "జోక్స్....."

 

    "మీరు సీరియస్గానే వుంటారనుకున్నాను. జోక్స్ కట్స్ చేస్తారన్న మాట. సరదాగా జోక్స్  చెప్పండి" అంది.

 

    గొంతు సవరించుకున్నాడు మధు.

 

    "ఆ మధ్య అమెరికాలో, ఒక డిపార్ట్ మెంట్ స్టోర్ లో కెళ్ళిన ఇద్దర మ్మాయిలు లిప స్టిక్ బాక్స్ ని దొంగిలించారు. జడ్డీ వాళ్ళకే శిక్ష విధించాడో తెలుసా?"

 

    "నాకెలా తెలుస్తుంది - చెప్పండి."

 

    "బోనులో నిలబడి ఆ లిప్ స్టిక్ పూర్తిగా అయిపోయేవరకూ పెదవులకు రాసుకోమన్నాడు."

 

    అన్విత నవ్వుతుందేమోనని, ఆమె ముఖంలోకి చూశాడు.

 

    "ఇది జోకా..... నవ్వాలా, వద్దా" అని ఆలోచిస్తున్నట్టుగా చూస్తోందామె.

 

    "ఇది జోక్ కాదు" బయటికే అనేశాడు మధు.

 

    అప్పుడు నవ్వింది అన్విత.

 

    "మీ నవ్వు బావుంటుంది" చెప్పెయ్యాలి. మళ్ళీ అనుకున్నాడతను. ఏమనుకుంటుందో?

 

    నెమ్మదిగా అరగంట గడిచింది.

 

    వాచీవైపు చూసుకున్నాడు.

 

    "నే వెళతాను" అన్నాడు లేస్తూ.


    
    "వింతగా, అయోమయంగా మధువైపు చూసింది అన్విత.

 

    పోర్టికో వరకూ వచ్చాక, ఒక్కక్షణం అలా నిలబడిపోయాడు. ఏదో చెప్పాలని, చెప్పెయ్యాలని ఉందతనికి.

 

    "ఏదో మర్చిపోయాను" గిల్టీగా అన్నాడతను. అప్పుడుద్ అన్వితే జోకు వేసింది.

 

    "గుడ్ బై" అనుకుంటాను"

 

    మధుకి జోక్ మొదట అర్థంకాలేదు. అర్థమయ్యాక 'సీయూ' చెప్పేసి, గబగబా నడుచుకుంటూ గేటు బయటకు వచ్చేశాక గట్టిగా ఊపిరి పీల్చుకుని రెస్టారెంట్ వైపు నడిచాడు.

 

     మధు ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకొచ్చాడు? ఏదో చెప్పడానికి వచ్చాడని అర్థమైంది అన్వితకు.

 

    ఏ విషయం? లేక ఫ్రెండ్లీగా వచ్చాడా? ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది అన్విత.

 

    
                                        *    *    *

 

    కాలేజీ క్యాంపస్ మర్రిచెట్టు అరుగుమీద కూర్చున్నారిద్దరూ. రాత్రి ఎనిమిదిగంటలు దాటింది.

 

    లైబ్రరీలోంచి స్టూడెంట్స్ ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. జరిగిందంతా చెప్పాడు మధు.

 

    "కుక్కకోసమో, నక్కకోసమే అవన్నీ వదిలేస్తే నువ్వు వాళ్ళింటి కెళ్ళేసరికి, నీకోసం అన్విత ఎదురుచూస్తోంది. అవునా? ఒకటి ప్లస్ పాయింట్, రెండు కూల్ డ్రింక్స్ స్వయంగా తెచ్చిచ్చింది. సెకండ్ ప్లస్ పాయింట్- ఎదురుగా గెస్ట్ ఉన్నారని ఫోన్లో ఎవరితోనో చెప్పింది మూడో ప్లస్ పాయింట్.

 

    నువ్వేం చెప్తావోనని ఎదురుచూసింది. నాలుగో ప్లస్ పాయింట్. కానీ నువ్వే ఏవీ చెప్పలేకపోయావ్, అదీ నీ మైనస్ పాయింట్- లోపం నీదే.

 

    వండ్రఫుల్ ఎట్మాస్ఫియర్..... లోన్లీనెస్...... మరొకడైతే ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగి ఉండేవాడు. నువువ్ పిరికివాడై పోయావు" మందలిస్తున్నట్టుగా అన్నాడు సుల్తాన్.

 

    "సారీ రా" అన్నాడు మధు.

 

    మధు చిన్నప్పట్నుంచి పెరిగిన మౌన వాతావరణం అది. తల్లిని కూడా ఏమీ అడగలేని మొహమాటం.'

 

    "మొత్తం విషయాన్ని పరిశీలించి చూస్తే అమ్మాయికి నీమీద ఇష్టం వుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచివాడు, సంస్కారవంతుడూ అని - ఇప్పుడు చెయ్యాల్సినపని ఏమిటంటే నీ ఆరాధనను ప్రేమను వ్యక్తీకరించడం -తక్షణం జరిగిపోవాల్సిన పని అది" అన్నాడు సుల్తాన్.

 

    "ఎలా?"

 

    "నువ్వెలాగూ నోటితో చెప్పలేవు. అంచేత అందమయిన భావుకతతో ఉత్తరం రాయి" సలహా యిచ్చాడతను.

 

    "లెటర్ రాసి పోస్ట్ చేస్తే సరిపోతుందా?" అన్నాడు మధు.

 

    "ఇంకా నయం టెలిగ్రామ్ కొడతాననలేదు."

 

    "లవ్ లెటర్ ని పోస్ట్ చేస్తే, అది వ్యక్తిత్వానికి దెబ్బ, బ్యాడ్ రిమార్క్  వస్తుంది. లెటర్ రాయి. మీ కాలేజీ ఫ్యూన్స్ ఉంటారుగా- నమ్మకస్తుడ్ని పట్టుకో. వాడికి పదో, పరకో కొట్టు- అన్వితకు ఇవ్వమను. తర్వాత స్టోరీ, దానంతట అదే నడుస్తుంది" చెప్పాడు సుల్తాన్.

 

    ఆ ఐడియా నచ్చింది మధుకి.

 

    ఆలోచనలో పడ్డాడతను.

 

    "ఏంటాలోచిస్తున్నావ్?" అడిగాడు సుల్తాన్.

 

    "లవ్ లెటర్ రాయడం ఎలా?" అని చెప్పాడు మధు.

 

    "పద....."

 

    "ఎక్కడికి?"

 

    "పద చెప్తా."

 

    ఇద్దరూ ఆటో ఎక్కి మెయిన్ రోడ్డులోని బుక్ సెంటర్ కి వెళ్ళారు. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఒక డజను పుస్తకాలు తీసుకున్నాడు.

 

    "ఈ పుస్తకాలన్నీ జాగ్రత్తగా రిఫర్ చెయ్యి. అందమైన కొటేషన్స్ తో నీ  మనసులోని భావాలకు ఒక ఆకృతిని కల్పించు. నేను మార్నింగ్ వస్తాను. ఎలా రాస్తావో చూస్తాను.....ఓ.కె...." ఇంటివరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు సుల్తాన్.

 

    
                                     *    *    *


    
    అన్ని పుస్తకాలు పట్టుకుని మెట్లెక్కుతున్న మధు వేపు, పేపర్ చదువుతున్న మైదానం నారాయణ తలెత్తి చూసి "ఏమిటా పుస్తకాలు?" అని అడిగాడు.

 

    "రిఫరెన్స్ బుక్స్" చెప్పాడు మధు.

 

    "గుడ్..... ఇప్పటి నుంచే రిఫరెన్స్ బుక్స్  స్టడీ చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది" అన్నాడు మెచ్చుకోలుగా.

 

    తనరూమ్ లోకి వెళ్ళిపోయి గడియ పెట్టుకుంటుండగా, ఒక చేతిలో క్యారేజీతో వచ్చాడు నారాయణ.

 

    "ఇదిగో గాడ్రెజ్ కప్ప..... ఇదిగో క్యారేజీ."

 

    "ఎందుకు సార్ ఇవ్వన్నీ."

 

    "విషయం నీకు తెలీదన్న మాట. ఊళ్ళో దొంగలు పడుతున్నారట. క్యారేజీ తీసుకుని వెళ్ళిపో."

 

    "రూమ్ లో మీరుండగా తాళం ఎలా వేసుకుంటాను సార్? గడియవేసుకుంటాను."

 

    "నీకు జనరల్ నాలెడ్జి లేదయ్యా. తలుపుకి బయటనుంచి తాళం నేను వేస్తానయ్య. అవసరం వచ్చినప్పుడు తలుపు కొట్టు. నేను తీస్తాను. మన  సెక్యూరిటీ మనం చూసుకోవాలి. పక్కింటివాడు చూడడు కదా."

 

    తాళం వేసి ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ.

 

    నవ్వాలో, జాలిపడాలో అర్థం కాలేదు మధుకి.

 

    

                                        *    *    *    

 

    మధుకు మెలుకువ వచ్చేటప్పటికి ఉదయం ఎనిమిదిగంటలు దాటింది. కళ్ళు మండుతున్నాయి. అన్వితకు బుక్స్ రిఫర్ చేసి, లవ్ లెటర్  రాసేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలు దాటింది.

 

    అరడజను చిత్తప్రతులు రాసి, పారేశాక ఆఖరుసారిగా రాసిన ఉత్తరం అతనికెంతో నచ్చింది. రాసిన ఉత్తరాన్ని చదువుకుని, గుండెలమీద పెట్టుకుని నిద్రపోయాడతను.

 

    నెమ్మదిగా జోగ్గుంటూ వచ్చి తలుపులు తెరిచేసరికి ఎదురుగా మైదానం నారాయణ నిలబడ్డాడు.

 

    "ఏమిటి? కాలేజీకి రావా?" అడిగాడతను సీరియస్ గా.

 

    "తాళం పట్టుకుని నిలబడ్డారేమిటి? తలుపు తెరవొచ్చుగా" చికాగ్గా అడిగాడు మధు.

 

    "డిస్ట్రబ్ చెయ్యడం నాకిష్టం లేదు. ఇదిగో తాళం. కాలేజీకి వచ్చే ముందు తలుపు లాగి, తాళం వేసి, తన్ని, పడిందో లేదో బాగా చూసి, క్యాంటిన్ కి రా..... టిఫిన్ అక్కడ చేద్దాం. ఎందుకంటే..... మీ మేడం పుట్టింటికి వెళ్ళింది. ఈ ఏడాది రాకపోవచ్చు" హాయిహాయిగా చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ.

 Previous Page Next Page