"అట్లా అని బుచ్చిగాడు మీతో చెప్పాడా?"
శివరామయ్య కంఠంలో వచ్చిన మార్పుకు ఉదయచంద్ర కలవరపడ్డాడు.
ఎందుకిలా అయిపోయాడు?
"లేదు. నేను ఇంతవరకూ బుచ్చయ్యతో మాట్లాడలేదు."
శివరామయ్య నిట్టూర్చాడు.
"పోనియ్ డాడీ ఆ పిచ్చాడి మాటలకేం?" మానసి అన్నది.
"బుచ్చయ్య చిన్నప్పట్నుంచీ ఇలాగే వున్నాడా?"
"అవును డాక్టర్ గారూ. వీడు పుట్టినప్పట్నుంచీ మందబుద్దిగానే వుంటున్నాడు."
"మానసిని అక్కా అని పిలవమని మీరేమైనా బలవంతం చేస్తారా?"
"అదేంలేదు డాక్టర్ గారూ. వాడికిష్టమైతే అక్కా,అక్కా అంటూ చుట్టుకొని తిరుగుతాడు. లేకపోతే ఇదీ వరస. మీరే చూశారుగా డాక్టర్ గారూ" అన్నది మానసి.
"రండి డాక్టర్ గారూ" అంటూ శివరామయ్య కొబ్బరితోటకేసి దారితీశాడు.
"ఇది వందెకరాల తోట. మామిడి, కొబ్బరి, జామ, అరటి, కలిసి తొంభై ఎకరాలదాకా వుంటుంది. మిగతాది బావులూ, పాకలూ ఓ ఎకరం కూరగాయలు, మరో ఎకరం పూలతోట. మొత్తం ఏడు బావులున్నాయి. ఒకప్పుడు ఏడు బావుల్లోనూ పుష్కలంగా నీరు వుండేది. అప్పుడు ఫలసాయంకూడా బాగా వుండేది. ఇప్పుడు మూడు బావులు ఒట్టిపోయినై. మిగతా నాలుగు బావుల్లో నీరు తగ్గిపోయింది. ఆ నాలుగు బావులమీదే ఇంతతోటా ఆధారపడివుంది....."
"మా డాడీకి ఈ తోటంటే ప్రాణం. మూడు రోజులయినా విసుగూ విరామమ లేకుండా ఈ తోటగురించి చెప్పుకుపోతూనే వుంటారు డాక్టర్ గారూ."
"నిజమే డాక్టర్ గారూ. మా సోదంతా వెళ్ళగక్కుతూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నాను."
"అదేమీ లేదులేండి. పట్నంలో జీవితం....నర్సింగ్ హొమ్, పేషెంట్స్ , నర్సుల మధ్యనుంచి ఇలా రావడం, ఈ పల్లెటూరి వాతావరణం ఈ విశాలమైన తోటా చూస్తూంటే హాయిగా వుంది."
శివరామయ్య చిరునవ్వుతో తల పంకించాడు.
"అమ్మాయ్ కి డాక్టర్ గారికి తోటంతా తిప్పి చూపించు భోజనటైం కూడా అవుతోంది. వేళదాటకుండా తీసుకొచ్చెయ్. నేవెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను."
శివరామయ్య ఇంటికేసి నడక సాగించాడు.
మానసీ, ఉదయ్ తోటలో అరగంట తిరిగి బావిదగ్గరకొచ్చారు.
"డాక్టర్ గారూ! ఇది అన్నిటికంటే పెద్దబావి" ఒడ్డున నిలబడి చెప్పింది మానసి.
ఉదయ్ చంద్ర అడుగులో అడుగు వేస్తూ బావి దగ్గరకొచ్చి నిలబడ్డాడు. కోనేరులా వుంది బావి.
అరవై డెబ్బయ్ అడుగులలోతున వున్న నీటిని చూస్తూ, నీళ్ళు ఎంత లోతుగా వుంటాయని వుంది బావి.
అరవై డెబ్బయ్ అడుగులలోతున వున్న నీటిని చూస్తూ, నీళ్ళు ఎంత లోతుగా వుంటాయని అంచనా వేస్తున్నాడు.
"బాబుగారూ జాగ్రత్త"
ఉలిక్కిపడ్డాడు.
అడుగు వెనక్కు వేశాడు.
వెనకనుంచి ఎవరో తోసినట్టుగా అయింది.
ముందుకు తూలాడు.
కాళ్ళకింద మట్టి పెళ్ళ విరిగింది.
"డాక్టర్ గారూ?"
మానసి బిగ్గరగా అరిచింది.
డాక్టర్ అంచు పట్టుకుని జరజరా కిందకు జారాడు ఐదారడుగులు జారిన ఉదయ్ కు నీళ్ళగొట్టం చేతికి అందింది. గొట్టం పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించాడు.
గొట్టం జారిపోతూ వుంది. సాధ్యం కావడంలేదు. అలా కిందకుజారుతూ దిగితే నలభై ఏభై అడుగుల లోతున ఆయిల్ ఇంజన్ కు అమర్చిన ఇనప చట్రంమీద నిలబడవచ్చు. మెల్ల మెల్లగా కిందకు జారుతున్నాడు.
మానసి బావిలోకి తొంగిచూస్తూ ఆదుర్ధాగా అరుస్తోంది.
"బాబుగారూ! ఇది....ఇది అందుకోండి."
ఉదయ్ తల పైకెత్తి చూశాడు.
అడివయ్య ఇనప బొక్కెనకు గట్టితాడు కట్టి కిందకు వదులుతున్నాడు.
"తాడందుకొని బోక్కెన్లో కాళ్ళుపెట్టి నిలబడండి. పైకి గుంజుకొంటాను." పైనుంచి అడివయ్య సూచనలిస్తున్నాడు.
ఉదయ్ ఒకచేత్తో పైపుగొట్టం పట్టుకొని రెండోచేత్తో తాడు అందుకొన్నాడు.
"ఆఁ అట్టా బాబుగారూ అట్టాగే....బోక్కెన్లో కాలుపెట్టండి. ఆఁ హం అట్టాకాదు. ముందు బొక్కెన్ను బాగా దగ్గరకు లాక్కోండి. ఆఁ అట్లా! ఇప్పుడు కాళ్ళు-ఆ అద్గదీ....గట్టిగా పట్టుకొని నిలబడండి" అడివయ్య హెచ్చరికలు చేస్తూ గిలకమీదగా తాడును గుంజుకోసాగాడు.
బావిపైకి రాగానే ఉదయచంద్రను గిలకకొయ్య పట్టుకోమని చెప్పి బొక్కెన తనవైపు లాక్కున్నాడు.
అడివయ్య మానసి భుజాలను పట్టుకొని డాక్టర్ ఉదయ్ చంద్ర ఒడ్డున పడ్డాడు
13
రాత్రి పదిన్నర దాటింది. హరికేన్ లాంతరు వెలుగులో టేబుల్ ముందు కూర్చుని డైరీ తెరిచి పేజీలు తిప్పి రాయడం మొదలుపెట్టాడు.
డిసెంబరు30
"ఉదయం ఆలస్యంగా లేచాను. రాత్రి వేసుకొన్న వాలియం బాగా పనిచేసినట్టుంది. ఐదవ పాత్ర రంగప్రవేశం చేసింది. మానసి, శివరామయ్య వీరభద్రుడూ, అడివయ్య-ఐదోవాడుబుచ్చయ్య-బుచ్చీబుచ్చిబాబు- బుచ్చిగాడు-బుచ్చి మొరాన్, సందేహం లేదు. వీడు పుట్టుకతోటే మందబుద్ధా? లేక రైలు యాక్సిడెంటులో తలకు దెబ్బతగిలి ఇలా అయ్యాడా? ఇవి రెండూ కాదా? వీడికి చిన్నప్పుడే మాదకద్రవ్యాలూ నూరిపోయడంవల్ల ఇలా అయ్యాడా?
బుచ్చీ-ఏర్ర గులాబీ-మానసి- వింతేమిటి? అక్కా తమ్ముడూ అయినా బుచ్చికి మానసిని 'అక్కా' అని పిలవడం ఇష్టంలేదు. ఎందుచేత?
బావిలోకి నన్ను తోసిందెవరు? నిజంగా నన్ను తోశారా?లేక అలా అనుకొన్నానా? ఆడి భ్రమా? ఒకవేళ తోసివుంటే ఎవరైవుంటారు? అప్పుడు అడివయ్య దగ్గర్లోలేడు. ఇంజన్ షెడ్ దగ్గిర వున్నాడు. తన వెనక నిలబడి వున్నది మానసి ఒక్కతే. ఆమె తోసిందా?
"నో!నో!మానసికి అలా చెయ్యాల్సిన అవసరంలేదు. అవును, అంతకుముందే అడివయ్య "బాబుగారు జాగ్రత్త!" అని కేకవేశాడు. దానర్థం ఎవరో నన్ను తోసే ప్రయత్నంలో వుండటం చూసి హెచ్చరించాడన్నమాట. అతడి కేకకు నేను వెనక్కు రావడం, నన్ను ఎవరో ముందుకు తొయ్యడం జరిగింది. లేకపోతే దాని ఒడ్డున నిలబడి వున్నాననీ, కాలికింద మట్టి పెళ్ళ విరిగిపడే ప్రమాదం వుందని గ్రహించి హెచ్చారించాడా? కాని ఎవరో తోసినట్టే అన్పించింది. తొయ్యడం అంటూ జరిగితే అది మనసిపనే అయి వుండాలి.
లేక-లేక-బావి దగ్గర జలకాలాడే దెయ్యం తోసిందా? అది అడివయ్యకు కన్పించి వుంటుంది. అవును. అంతే అయివుండాలి. అందుకే అడివయ్య అరిచి హెచ్చరించాడు. దెయ్యాలు పగటిపూట కూడా వుంటాయా? రాత్రిపూట వుండే దెయ్యం పగటిపూట వుండదా?
__భోజనంచేసి వచ్చి పడుకొన్న నాకు నిద్రపట్టలేదు. ఇవే ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. లేచి బట్టలు మార్చుకొని గదిలో నుంచి బయటికొచ్చాను. శివరామయ్య, మానసీ, ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. రాత్రి నిద్ర సరిగా వుండివుండదు. ఆదమరచి నిద్రపోతున్నారు.
మెట్లు వెనగ్గావున్న గది బుచ్చిబాబుది. వాడు గదిలో లేడు.
బుచ్చయ్యను చూసినప్పట్నుంచీ నాకు వాదిమీదే అనుమానం వుంది.
మానసిని వెంటాడుతున్నది వీడే.
మనిషి మందబుద్ది అయినా సెక్సువాంఛా, మొహమూ ఉండవని ఏమీలేదు. పైగా ఇలాంటివారి వాంఛలు అసహజంగా వికటంగావుంటాయి. పైగా వీడు మానసిని అక్కా అని పిలవడానికి ఇష్టపడటంలేదు. సోదరిని కోరడం తప్పు అని వాడి మనసులో వుండడంవల్లనే. మానసి తన సోదరి అనే భావాన్ని తిరస్కరిస్తున్నాడు. వాడి కామవాంఛకు చిహ్నంగా ఎర్రగులాబి__ఎర్ర గులాబిని మానసికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
అందుకే వాడన్నా, ఎర్రగులాబి అన్నా మానసికి అసహ్యం. భయం. మానసికి అంతరాంతరాల్లో బుచ్చి తనను కోరుతున్నాడని తెలిసి వుండాలి. హేయమైన ఆ కోర్కెను బయటికి చెప్పుకోలేక మానసి ఇలా ప్రవరిస్తూ వుండివుండాలి.
బుచ్చయ్య నిన్నరాత్రి సర్కస్ కు వెళ్ళాడని చెప్పడం నిజంకాదు అబద్దం. వాడు బస్తీకి వెళ్తున్నానని చెప్పి ఊరు బయట చీకటి పడేదాకా వుండి తిరిగివచ్చి వుంటాడు.
జువ్వి చెట్లకింద దెయ్యాల ఆట ఆడింది వీడేనా?
అవును వీడే. రాత్రి కిటికీలోంచి తన గదిలోకి చూసింది వీడే. సందేహం లేదు వీడే.
వీడే కళ్ళే అలా భయంకరంగా మెరుస్తూ కనిపించాయి. మెట్లు మీద కన్పించిన కళ్ళుకూడా వీడివే. చెక్కల మెట్లమీద ధనధనా బాదుతూ నడిచిందికూడా వీడే.
అయితే వీడు ఒక్కడే అన్ని వేషాలు వెయ్యలేదు. ఆ తెలివితేటలు వీడికి లేవు. వీడికి అంత బుద్దిగానీ, తెలివితేటలుగానీ లేవు.
మరొకడు వీడికి తోడుగా వున్నాడు. వాడే వీడిచేత ఈ ఆటలన్నీ ఆడిస్తున్నాడు.
బుచ్చిగాడి పర్వెర్టెడ్ సెక్సు వాంఛలకు ప్రోదల్చం ఇస్తున్నదెవరు?
దానివల్ల వాడికొచ్చే ప్రయోజనం ఏమిటి?
ఇదంతా ఒక దారిన పడుతున్నట్టుగా వుంది. వాణ్ణి పట్టుకోవడం ఎలా? వాడ్ని పట్టుకుంటే తన స్టడీ పూర్తి అవుతుంది. అప్పుడు మానసికి ట్రీట్ మెంటు ఇవ్వడం తేలిక అవుతుంది.
బుచ్చిబాబును ఆడిస్తున్న సూత్రదారి ఎవడో తెలుసుకోవాలి. ఉన్నది ముగ్గురు. ఒకరు శివరామయ్య, రెండోవాడు వీరభ్రదుడు, మూడవవాడు అడివయ్య, శివరామయ్య అయా పని చెయ్యడు. మరి మిగతా ఇద్దర్లో ఎవడు చేస్తున్నట్లు?
ఇద్దరూ కలిసే బుచ్చిబాబుచేత ఈ నాటకం ఆడిస్తున్నారేమో? కావొచ్చు. కారణం స్పష్టంగానే కన్పిస్తున్నది. శివరామయ్య మానసిని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతే లాభం వీళ్ళిద్దరికే.
తోటమీద అజమాయిషీ వాళ్ళదే అవుతుంది. దానిమీదే వచ్చే ఆదాయం కొంతయినా కొట్టెయ్యొచ్చును. కొబ్బరికాయలూ, మామిడిపళ్ళూ వగైరా దొంగచాటుగా అమ్ముకోవచ్చు. మానసీ, శివరామయ్య నర్సింగ్ హొంలో వున్నంతకాలం ఆ పనే చేసివుంటారు.
ఇప్పుడు వాళ్ళు తిరిగోచ్చేసరికి ఇరుకునపడ్డారు. పైగా నేనుకూడా రావడం. మానసికి చికిత్స చెయ్యడం. తను ఇక్కడ వుండటం వాళ్ళిద్దరికీ ఇష్టంలేదు. వాళ్ళ ఎత్తు ఎలాగయినా తండ్రీ కూతుళ్ళను ఇక్కడ్నుంచి తరిమెయ్యడం. అందుకే మందబుద్ది బుచ్చయ్యను ప్రయోగించారు. వాడి బలహీనతనూ, తెలివితక్కువతనాన్నీ ఉపయోగించుకొని ఆటలు ఆడుతున్నారు.
వాళ్ళ ఎత్తు ఫలించింది మానసికి మతిభ్రమణం కలిగింది. తండ్రీ కూతుళ్ళు పట్నం వెళ్ళిపోయారు. బాగయిందని తిరిగొచ్చేసరికి వాళ్ళ ఆటకట్టాయి. మరో నాటకం ఆది మళ్ళీ ఇంటినుంచి వెళ్ళిపోయేలా చేశారు.