అంతా అయోమయం మధ్యలో ఈ దేవయాని ఒకర్తి...." "టేకిట్ ఈజీ! మీ ఆంటీని చూడలేదుకదూ? పద లోపలికెళ్దాం- వేడివేడిగా ఇస్తుంది". "వేడివేడిగా ఏమిటి అంకుల్? అసలే బుర్రవేడెక్కి చస్తుంటే. మీరు మరీ అయోమయంగా మాట్లాడతారు". "పోనీలే. టీ, కాఫీ వద్దనుకుంటే కూల్ డ్రింక్ తాగుదువుగానిపద" "చచ్చాం! అదా సంగతి?" నవ్వేసింది మహతి. ఇద్దరూ డైనింగు హాల్లోకి వచ్చారు. ప్రొఫెసర్ గారి సతీమణి 'ఎవరూ' అంటూ కిచెన్ లో నుంచి బయటకు వచ్చింది. "ఏం మహతీ, కన్పించడం లేదు? ఏమయిపోయావ్" మహతిని అడిగింది వసుంధర. "ఇప్పుడు కూడానా" "మీరుండండి" ముద్దుముద్దుగా భర్తను మందలించింది వసుంధర. "ముందు మహతికి ఏదన్నా తాగడానికి ఇవు' "తాగడానికా? ఈ పిల్లకు కూడా చేస్తున్నారా ఏం కొంపదీసి" కయ్యానికి సిద్దం అయినట్టుగా అంది వసుంధర. "వండ్రఫుల్ సజెషన్. సైకియాట్రిస్టు భార్య వనిపించావ్. నాకు తట్టనే లేదుసుమా!" పరశురాం ఫ్రిజ్ తెరిచి ఒక బీర్ సీసా, రెండు సోడాలుతీసి టేబుల్ ముందుంచాడు. షెల్ఫ్ లోనుంచి వైట్ హార్స్ తెచ్చి ఆ పక్కనే పెట్టాడు. "వసూ రెండు గ్లాసులు" చాలా మెత్తగా అడిగాడు. "మీకేమన్నా మతిపోయిందా" అంటూనే రెండు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆవిడకదో సరదా. భర్త బలవంతం మీద అప్పుడప్పుడూ ఓ గ్లాసు బీరుపట్టిస్తూ వుంటుంది. "ఏడున్నరన్నా కాలేదు. అప్పుడే దుకాణం తెరిచారు. అవతల నాకింకా బోలెడంతపని వుంది". "పని పూర్తిచేసుకునేనువు వచ్చి మాతో జాయిన్ అవు. అంత వరకూ నేనూ మహీ కూర్చుంటాం". "అంకుల్! నా కలవాటులేదు" మహతి గాభరాగా అంది. "దాందేముంది? ఇప్పుడు చేసుకో" "నో.నో. అంకుల్. ప్లీజ్ వద్దు" "అదేమిటండీ, ఆ పిల్లను బలవంతం చేస్తారూ? పెళ్ళి కావలసిన పిల్ల. ఇట్లాంటి అలవాటున్నట్లు తెలిస్తే మహతికి మొగుడంటూ దొరకడు". "అంటే పెళ్లి అయాక అలవాటు చేసుకోవచ్చునన్నమాట". "ఆడది ఎందుకు అలవాటు చేసుకుంటుందండీ. మొగుడే నేర్పుతాడు. మొగుడి కోసమే ఇలాంటిపనులు చేస్తుంది ఏ భార్య అయినా" మూతితిప్పుతూ అంది వసుంధర.
"ఆంటీ! అంకుల్ చేత ఈ డ్రింక్స్ మాన్పించలేరా?" మహతి వసుంధరకు వత్తాసు పలికింది. "మహతీ! నీకు పుణ్యం వుంటుంది. ఆవిడకు పురెక్కించకు. నీకు యాపిల్ జ్యూస్ ఇస్తాను. నన్ను విస్కీ తాగనివు". పరశురాం గోల్డ్ కాయిన్ కార్కు తీశాడు. ఒక గ్లాసులో యాపిల్ జ్యూస్ రెండో గ్లాసులో విస్కీ పోశాడు. బీర్ బాటిల్ ఫ్రిజ్ లో పెట్టివచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. "కమాన్ బేబీ చీర్స్" పరశురాం విస్కీ గ్లాసు ఎత్తాడు. మహతి యాపిల్ జ్యూస్ సిప్ చేసి గ్లాసు బల్ల మీద ఉంచింది. "అప్పడాలు వేయించమంటారా, వడియాలు వేయించమంటారా?" వంటింట్లో నుంచే వసుంధర కేక పెట్టింది. "వడియాలతో పాటు ఊర మిరపకాయలు కూడా వేయించువసూ" ప్రొఫెసర్ ఉషారుగా అన్నాడు. మహతి కిలకిలానవ్వింది. పరశురాం సగం గ్లాసుఖాళీ చేశాడు. మహతి ముఖంలోకి చూశాడు. "బేబీ నీ మొహం చూస్తూంటే ఇంకా టెన్షన్ లోనే ఉన్నట్టు కనిపిస్తున్నావ్. ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగాడు పరశురాం. "అంకుల్, దేవయానికి ఆ దెబ్బతగలడంవల్లనే అమ్నేషియావచ్చింది కదూ" సాలోచనగా అడిగింది మహతి. పరశురాం ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. గ్లాసు చేతిలోకి తీసుకుని విస్కీ సిప్ చేశాడు. తాపీగా గ్లాసు బల్ల మీద ఉంచాడు. "చెప్పండి అంకుల్" మహతి అసహనంగా అడిగింది. "ఏమిటమ్మా!" "అదే అంకుల్ ఆమెకు...." "ఓ అదా? చాలా చిన్న దెబ్బే తగిలింది. బ్రెయిన్ కంకషస్ లాంటి దేమీ జరగలేదు" ఆగి గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. "అబ్బా చెప్పండి అంకుల్" సస్పెన్స్ భరించలేనట్టుగా అడిగింది. "కారులో నుంచి రోడ్డు మీదకు తోసేసినప్పుడు తగిలినదెబ్బ అంత ప్రమాదమైందేమీకాదు. కాని దానికి ముందు ఆమె మనసుకు తగిలినగాయం చాలా ప్రమాదమైంది....." మళ్ళీ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. "చెప్పండి అంకుల్" ఊపిరి బిగబట్టివింటున్న మహతి నిట్టూర్పు విడిచింది. పరశురాం విస్కీ సిప్ చేసి, గ్లాసు ముందు పెట్టుకుని తాపీగా ప్ర్రారంభించాడు. "అప్పటి ఆమె మానసిక స్థితి, స్పృహ తప్పిపోవడంఅమ్నేషియాకు దారి తీశాయనుకుంటున్నాను" పరశురాం ఎదురుగా ఉన్న గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు. నోటి దగ్గర పెట్టుకోబోతున్న గ్లాస్ ను టేబుల్ మీద పెట్టేశాడు. ఏదో అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టు మహతికేసి చూస్తూ "బేబీ" అన్నాడు. "ఎస్ అంకుల్" మందుమీహ్డున్న పరశురాం ను చూస్తుంటే మహతికి కొంచెం భయంగా ఉంది.
"దేవయానికి స్పృహతప్పింది ఎప్పుడు? మీరు ఆమెను సమీపించే సరికే ఆమె స్పృహలోలేదా?" "లేదంకుల్ అప్పటికే ఆమె...." "బాగా గుర్తుచేసుకుని చెప్పు బేబీ" మహతి ఆలోచనలో పడింది. "బాగా గుర్తు చేసుకో" "యస్ అంకుల్ అప్పటికి ఆమెకు స్పృహ తప్పలేదు. కిరణ్ ఆమెను లేవదీస్తున్నపుడు కిరణ్ ముఖంలోకి చూసింది. ఆ తర్వాతే ఆమెకు స్పృహ తప్పింది". "ష్యూర్!" "అవును అంకుల్. ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు ఆమె చూసిన చూపులు ఇంకా నా కళ్ళకు కట్టినట్టే కనిపిస్తున్నాయ్". "ఫైన్, మహతీ ఫైన్ నౌ ఐ అండర్ స్టాండ్-- "గ్లాసు అందుకున్నాడు. గ్లాసు ఖాళీ చేశాడు. ముఖం సంతృప్తిగా పెట్టాడు. మహతి పరశురాం ముఖంలోకి చూసింది. చిక్కుపడిన దారపు ఉండలోనుంచి కొనకోసం వెదుకుతున్నట్టుగా ఉంది మహతి మానసికస్థితి. "అంకుల్, ఇందాక ఆమె ఎవరికోసం అంత ఉద్వేగంగా అడుగుతోంది?" మళ్ళీ విస్కీ కలుపుకోవడంలోని నిమగ్నం అయ్యాడు పరశురాం. మహతికి మనసులో నుంచి ఏదో తన్నుకొస్తున్నట్టుగా ఉంది. ఆమె ఎవరిగురించి అడుగుతోంది. చివరిసారిగా ఆమె చూసింది కిరణ్ ను. అతన్నిగాని అడగడంలేదుగదా? ఆమెకు ఏదో గొంతుకు అడ్డుపడ్డట్టుఅయింది. "అంకుల్! చెప్పరేం? ఎవర్ని?" గొంతు పెకిలించుకొని మాట్లాడింది. "భర్తను" తాపీగా అన్నాడు ప్రొఫెసర్. "అంకుల్" టుప్. కార్కు ఎగిరి అల్లంతదూరంలో పడింది. సోడా బస్సున పొంగి ఆరిపోయింది. "అతడు...అతడు ఆమెభర్తా?" సుడిగుండంలో పడిగిరగిర తిరిగి మునిగిపోతున్న ఆడదాని జుట్టు కన్పించింది మహతి కళ్ళకు. ఆమె ముఖంపాలిపోయింది. టేబుల్ మీద పరశురాం ముందున్న విస్కీ గ్లాసు రెండుగా కన్పించిందామెకు. అందుకేనా అతడు పారిపోయింది? నో నో అలా కావడానికి వీలు లేదు. కాదు--కాకూడదు. కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపుతెరిచాడు. "గుడ్ ఈవెనింగ్ సర్" "గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్" పరశురాం తడబడ్డాడు. "మహతి ఉందాండి" "ప్లీజ్ కమాన్" పరశురాం వెనక్కు తిరిగి డైనింగ్ హాలువైపు చూశాడు. మహతి ఇంకాఆలోచనల్లోనే ఉంది. "మహతీ! నీకోసం కిరణ్ వచ్చాడు" పరశురాం బిగ్గరగా చెప్పాడు. "కిరణా? వస్తున్నా అంకుల్" కంఠం బిగిసిపోతుండగా అరుస్తున్నట్టు అని ఒక్క పరుగులో వాకిలి దగ్గరకొచ్చింది. "సారీ మహతీ! అర్దాంతరంగా వెళ్ళిపోవాల్సివచ్చింది. ఏమిటి మీ అంకుల్ కిరణ్ అంటున్నాడు? అతని కోసం ఎదురు చూస్తున్నారా? వస్తానన్నాడా? సారీ నేనువచ్చి ఉండాల్సిందికాదు" గిర్రున వెనక్కుతిరిగాడు రవి. మహతి ఒక్కసారిగా అతని చెయ్యిపట్టుకొని ఆపింది. "రవి, అంకుల్ పొరపాటు పడ్డారు. ఆయనకు మహామతిమరుపు. ఒకరి పేరు మరొకరికి తగిలించేస్తూ ఉంటారు. అవునుకదూ అంకుల్?" మహతి పెదవుల మీద తెచ్చి పెట్టుకొన్న చిరునవ్వు వెలవెలాపోతోంది. "అవునవును. మిస్టర్ రవి! ఈ పేర్లున్నాయ్ చూశావూ? మహా కన్ ఫ్యూజింగ్ గా ఉంటాయి. కొన్ని పేర్లు మరీను. రవి--కిరణ్ ఎంత దగ్గరపేర్లో చూడు. అని రెండూ అవినాభావ సంబంధంఉన్న పేర్లు-అర్ధాలు కూడా ఆల్ మోస్టు..." సార్ మీరంతగా అవస్థ పడి ఎక్స్ ప్లెయిన్ చెయ్యనక్కరలేదు. మేధావులైన ప్రొఫెసర్లకు సాధారణంగా ఉండే లక్షణమే అది".