"రవీ! నువూ అంత కష్టపడి అంకుల్ కు చెప్పక్కర్లేదులే" మధ్యలోనే అందుకొని అంది మహతి. "వెల్ సెడ్ బేబీ, వెల్ సెడ్. కమాన్ మై బోయ్. లెటజ్ సెలబ్రేట్ విత్ ఎ డ్రింక్" అంటూ పరశురాం డైనింగ్ టేబుల్ కేసి దారితీశాడు. రవి, మహతీ మొహమొహాలు చూసుకొన్నారు. ప్రొఫెసర్ వెనకే నడిచారు. పరశురాం మరో గ్లాసు తెచ్చి రవి ముందు ఉంచి విస్కీబాటిల్ మూతతీశాడు. "క్షమించాలి నేను తీసుకోను" "పోనీ బీర్?" "నో సర్. థ్యాంక్స్" "యాపిల్ జ్యూస్?" మహతి అడిగింది. "వద్దు" "అయితే మజ్జిగతాగుతావా?" చిలిపిగా అంది మహతి. "మంచినీళ్ళివండిచాలు" ముక్తసరిగా అన్నాడు రవి. "పోనీ వట్టి సోడా తీసుకో" సోడా గ్లాసులోకి వంపి అందించాడు పరశురాం. గ్లాసు అందుకొని 'థాంక్యూసర్' అన్నాడు రవి. "వసూ! నువుకూడా వచ్చి జాయిన్ అవకూడదూ? ఫుల్ టేబుల్ అవుతుంది" వంటింట్లోకి చూస్తూ ఉషారుగా అన్నాడు పరశురాం. "రవి, అలా చెప్పా పెట్టకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోయావేం? ఎక్కడికెళ్ళావ్?" మహతి రవిని మాటల్లోకి దింపడానికి ప్రయత్నించింది. "అవునోయ్ ఎక్కడికెళ్ళావ్?" ఓ గుక్క విస్కీ మింగి అడిగాడు పరశురాం. "ఆమె బలవంతం మీద వెళ్ళక తప్పలేదు" "ఆ(ఆ( ఎవరి బలవంతంమీద" మహతీ, పరశురాంఒకేసారి అడిగారు. "ఆమేనండీ, మీ పేషెంటు" "దేవయానా?" ప్రొఫెసర్ కు పొలమారి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మహతికివెక్కిళ్ళు వస్తున్నాయి. "ఆమె పేరు దేవయానా?" రవి ప్రొఫెసర్‌ను అడిగాడు. "పేరు కూడా....తెలియకుండా....ఆమెతోవెళ్ళావా?" వెక్కిళ్ళమధ్య అడిగింది మహతి. ఆమెకళ్ళల్లో నుంచి అసూయ తొంగిచూసింది. కంఠంలో అవహేళన స్పష్టంగానే తెలుస్తోంది. రవి కళ్ళు పెద్దవిచేసుకొని మహాతిని చూశాడు. "ఆడదంటే మరో ఆడదానికి ఉండే చులకన భావనమగవాడికి ఉండదేమో". మహతి ముఖంమాడిపోయింది. పరశురాం కేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఆ ఒక్క మాటతో పరశురాంకు అతనంటే సద్భావం ఏర్పడింది. అవును ఇప్పుడు తనకుఅర్ధం అవుతోంది. మహతి ఇతడ్ని ఎందుకు వదులుకోలేకపోతోందో అర్ధం అయింది ప్రొఫెసర్ రవి ముఖంలోకి చూస్తూ అనుకొన్నాడు.
"గో ఆన్ మై బోయ్" అని పరశురాం లేచాడు. టెలిఫోన్ దగ్గరఉన్న రైటింగ్ పాడ్, పెన్సిల్ తెచ్చుకుని కూర్చున్నాడు. "ఊ( తర్వాత ఏం జరిగింది" పరశురాం తలెత్తి రవిని చూశాడు. రవి చేతిలోని పెన్ కేసి పాడ్ కేసి, చిత్రంగా చూస్తున్నట్లు గమనించాడు. "ఆమె నా పేషంటని నీకు తెలుసు. ఆ కేసు ఎనాలిసిస్ కు నువు చెప్పే విషయాలు కూడా ఉపయోగపడవచ్చు" "నేను చెప్పే విషయాలా?" "అంటే....అదే....ఆమెనిన్ను చూసింది. ఏమన్నదీ? నువు ఆమెతో వెళ్ళినప్పుడు ఆమె ప్రవర్తన ఎలాఉందీ? ఏం మాట్లాడిందీ...." ఆగి రవి ముఖంలోకి చూశాడు ప్రొఫెసర్. మహతికి దుఃఖం వస్తోంది. రవి ఆలోచిస్తున్నాడు. "చెప్పు రవీ, ఎగ్జాక్టుగా జరిగిందేమిటో చెప్పు. మహతి ఏమి అనుకోలేదు చెప్పు. ప్లీజ్ స్టార్ట్ మిస్టర్ రవి". ఉత్కంఠతతో ముందుకు వంగి రవిని చూశాడు పరశురాం. గ్లాసులో ఉన్న సగం సోడా తాగి చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు రవి. "ఆమె మీ గదిలోనుంచి వస్తూ నన్ను చూసింది" "చూసి అలాగే శిలా ప్రతిమలానిలబడి పోయింది" మధ్యలో అందుకొని కసిగా అంది మహతి. రవి చివ్వున తలతిప్పి మహతి కేసి చూశాడు. 'ఈ ఆడవాళ్ళకు అసూయ ఎక్కువ' అనుకున్నాడు రవి మనసులోనే. "బేబీ ప్లీజ్'ఊ(ప్రొసీడ్ రవి, ఆమె నా గదిలోనుంచి వస్తూ నిన్ను చూసింది. ఆ తర్వాత?" "నన్ను దాటుకొని కొంతదూరం వెళ్ళి ఆగింది. ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఆమె రెక్కపట్టుకొని ముందుకు నడిపించడానికి ప్రయత్నించాడు" "ఆమె అతన్ని విదిలించికొట్టి, అదే విలన్ బారినుండి తప్పించుకొని హీరో దగ్గరకు పరుగుతీసిన సినిమా హీరోయిన్ లా, నీ ముందుకు పరుగెత్తుకొచ్చి నీ చేతుల్లోవాలిపోయింది!" కసిగా అంది మహతి. "మహతీ!" కొంచెం విసుగ్గా మందలించాడు పరశురాం. రవి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన మహతికి ఉక్రోషం పెల్లుబికింది కానీ అంకుల్ కు కోపం వచ్చినట్టుగ్రహించి మనసును అదుపులో పెట్టుకొనే ప్రయత్నంలో పడింది. "బేబీ కాసేపు వెళ్ళి మీ ఆంటీతో మాట్లాడుతూకూర్చో కూడదూ?" "సారీ అంకుల్! ఇక నేను మాట్లాడను. కానివ్వండి" అంది మహతి.
"చెప్పు రవీ!" నోట్ చేసుకోవడానికి సిద్దంగా కూర్చున్నాడు పరశురాం. "మహతి బాగానే ఊహించింది. అతడ్ని విదిలించుకొని గిర్రున వెనక్కు తిరిగింది. రెప్పవాల్చకుండా నాకేసి కొంతసేపు చూసింది" ఆగిమహతికేసి ఓ క్షణం చూశాడు. "ఊ ( తర్వాత?" ప్రొఫెసర్ తరుముతున్నట్టుగా అన్నాడు. "హఠాత్తుగా వచ్చినా మీద పడిపోయింది" మహతి కుర్చీలో అసహనంగా కదిలింది. "నేను గాభరాపడి ఆమెను దూరంగా నెట్టడానికి ప్రయత్నించాను. కాని ఆమె...." అతడు ఆగిపోయాడు. "ఊ( ఆమె?" పరశురాం అందించాడు. "నన్ను తోసేయకంది. మీ కాళ్ళు పట్టుకొంటాను. ఇన్ని రోజులు నన్నువదిలేసి ఎక్కడ కెళ్ళారండీ? రండి! మన ఇంటికి పోదాం" అంటూ ఏడుస్తూ నన్ను చుట్టుకొంది. అంతలో ఆమెతో ఉన్న వ్యక్తి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించాడు. అందుకామె తోక తొక్కినపాములా బుసకొట్టింది" దారం పుటుక్కున తెగినట్టుగా ఆగిపోయాడు. "ఊ( బుసకొట్టి?" "ఏమన్నదంటే..." "ఫరవాలేదు రవీ చెప్పు" "ఎవడ్రా నువ్వు? మాభార్యా భర్తల్ని విడదీయడానికి? అంటూ నా కాళ్ళు గట్టిగా పట్టేసుకొంది. నేను అతడ్ని ఏమిటిది అని అడిగాను" అంటూ పరశురాం ముఖంలోకి చూశాడు. ప్రొఫెసర్ గుబురు నొసలు ముడిపడ్డం చూశాడు. "సైకియాట్రిస్టు దగ్గరకు వచ్చి నామె సైకోటిక్ అయి ఉంటుందని నీకు తెలియక కాదు" అంటూ మహతిముఖంలోకి చూశాడు. అప్పటికే ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. అతని చూపులకు ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. "ఊ( తర్వాత?" అర్జెంటు పనిమీద ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరిన మనిషిని చెయ్యి పట్టుకొని బలవంతంగా కూర్చోబెట్టినట్టుగా అన్నాడు పరశురాం. "ఆమె నన్ను తన భర్తే అని ఎందుకనుకొంటుంధో నాకు అర్ధం కాలేదు. అతడ్ని అడిగాను. అదే తనకూ అంతుపట్టడం లేదని మీ గది వైపుకు గబగబానడిచాడు. అది చూసి ఆమె ఊ( బయలుదేరండి. పారిపోదాం. ఆ దుర్మార్గుడు వెళ్లిపోయాడు అంటూ నన్ను బయటికి లాక్కెళ్ళింది. అదిచూసి మీ గదివరకూ వచ్చిన అతను వెనక్కు పరుగుతీశాడు. మాతోపాటు బయటికి వచ్చాడు. ఆమెను ఇద్దరం కలిసి రిక్షాలో కూర్చోబెట్టాం....." "మరి నువెందుకెళ్ళావ్? కార్లో వెళ్ళావుగా?" మహతి అంది. ఒకక్షణం మహతి ముఖంలోకి చూసి ప్రారంభించాడు "కాని ఆమె రిక్షాలో నుంచి కిందకు డదిగింది. ఆపడం మా వశం కాలేదు. నన్ను పట్టుకొనివదలడం లేదు. అతడు విసిగిపోయాడు. చివరకు తప్పదను కొన్నాడో ఏమో నన్ను బతిమిలాడాడు" "ఏమని?" పరశురాం అడిగాడు.
"బాబూ! మీరెవరో ఏమిటో నాకు తెలియదు. మాతోపాటు మీరు మా ఇంటిదాకావస్తేగాని దీన్ని ఇవాళ ఇంటికి చేర్చలేను, ఈ సహాయం చేసిపెట్టండని ప్రాధేయపడ్డాడు. ఇంకా కాసేపు మీరు ఈమె భర్తగా ఒప్పుకోండి అని అడిగాడు. అప్పుడతని ముఖం చూస్తుంటే జాలివేసింది, బాధకలిగింది. ఆమె భర్తగా నటించడానికి నాకేమిటో చాలా ఎబ్బెట్టుగా అన్పించింది. అయినా అతనిముఖం చూస్తుంటే తప్పదనిపించింది. అది నా కర్తవ్యమని కూడా అన్పించింది. సరే పదఇంటికెళ్దాం అంటూ ఆమెను బుజ్జగించాను. ఆమె ఉద్రేకం ఇట్టేచల్లబడిపోయింది. సంతోషంగా అంగీకరించింది. నాకార్లో బయలుదేరాం. ఆమె నాప్రక్కన కూర్చుంది. ఆ పెద్ద మనిషి వెనకసీట్లో కూర్చున్నాడు. వాళ్ళింటికి వెళ్ళే త్రోవ చెప్తూ కూర్చున్నాడు. ఇంటికి చేరగానే మళ్ళీ మొదలుపెట్టింది" అంటూ ఓ క్షణం ఆగాడు రవి. "ఏమని" పరశురాం మంద్రస్థాయిలో అజ్ఞాపిస్తున్నట్టుగా అడిగాడు.
"అడుగో-వాడు-ఆ విలన్ గాడుమన వెనకే వస్తున్నాడు అంది ఉద్రేకంగా. మళ్ళీ ఆ పెద్ద మనిషి నన్ను బతిమాలాడు. భర్తగా నేను ఆ ఇంట్లో కాలు పెట్టాను. ఆమె నా వెనకే లోపలకువచ్చింది భార్యగా--ఘోరమైన పరిస్థితిలో పడ్డాను. తెలియని వాళ్ళ ఇంట్లో ఒకరి భార్యకు భర్తగా తలచుకొంటేనే ఆశ్చర్యంగా ఉంది, అంతా ఒక కలలా జరిగిపోయింది. ఆమెను బ్రతిమాలి, మీరిచ్చిన రెండు మాత్రలు మింగించి, ఆమె నిద్రపోయేదాకా కూర్చుని వచ్చాను ప్రొఫెసర్....." ఆగినపరశురాంకేసి చూసి ఏదో చెప్పబోయాడు. "సందేహించకు చెప్పు" గ్లాసు పక్కకు పెట్టి తాపీగా అన్నాడు పరశురాం. "మీరొక్కసరి వచ్చి చూస్తే బాగుంటుందేమో?" ఆగి పరశురాం ముఖంలోకి చూశాడు. పరశురాం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. "నా కార్లో వెళ్ళివద్దాం!" ఓ క్షణం ఆగాడు. మహతిని చూశాడు. "మహతీ ఓపికుంటే నువు కూడా రావచ్చు" "గుడ్! మైబాయ్ నిన్నుచూసి నేను నిజంగాగర్వపడుతున్నాను. యు హావ్ డన్ యాన్ ఎక్సలెంట్ జాబ్.