"ఫరవాలేదులెండి, ఎవరన్నా దొరికేవరకు యిలాగే గడుపుకు పోతాను, ఆయన నాకు తండ్రిలాంటివారు. ఆయన దగ్గిర నాకు భయం యెందుకు" అంది సుజాత ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
కల్యాణి సుజాత వంక చూసి వూరుకుంది.
10
"చూడు....నీ పేరేమిటి....సుజాత కదూ.....ఇదిగో మీ అమ్మ గారు వచ్చాక.....నాకో రెండు వందలు కావాలి.....అడిగి తీసుకొచ్చి యియ్యి...." అన్నాడు రంగారావు, వంటింటిలో పని చేసుకుంటున్న సుజాత దగ్గరకి వచ్చి.
ఉదయం పదకొండుగంట లయింది అప్పుడు. సుజాత వంటపూర్తిచేసి క్యారియర్లు సర్దుతూంది. ఆయన అలా వంటింటిలోకి వస్తూంటే ఆశ్చర్యపోయి ప్రశ్నార్ధకంగా చూసింది.
ఆయన సుజాత వంక యెప్పుడూ సూటిగా చూడకపోయినా ఆయన చూపులు సుజాతని యిబ్బంది పెట్టేవి. వెనకనించి ఆయన చూపులు వాడిగా తగిలినట్టయి, ఆయన సమక్షంలో వున్నంతసేపూ తడబాటు పడేది సుజాత. మొదటి ఒక వారం పదిరోజులు అయన మామూలుగానే వున్నా ఆ తర్వాత ఆయన చూపులలో యేదో మార్పు కనిపించడం మొదలు పెట్టింది సుజాతకి. నోరు విప్పి తనతో ఏం అనక పోయినా, ఆ కళ్ళు తనని యెలా చూస్తున్నాయో, ఆ చూపులకి అర్ధం ఏమిటో గ్రహించి సుజాత కాస్త గాభరా పడడం ఆరంభించింది. ఇలాంటి విషయం యెవరితో యేమని చెప్పాలో సుజాతకి అర్ధంగాలేదు. డాక్టరుగారితో యీ విషయం యేమని చెప్పగలదు, ఆయనవల్ల తనకేం హాని లేదేమో! తనెందుకిలా ఊహించి బాధపడడం అని ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నించింది.
జవాబు చెప్పకుండా నిల్చుని చూస్తున్న సుజాతని చూస్తూ "ఏం, వినిపించిందా? నాకు అర్జంటుగా కావాలి డబ్బు, మధ్యాహ్నం రాగానే అడిగితీసుకో' అన్నాడు రంగారావు మళ్ళీ.
ఆమె "అలాగే" అంది నెమ్మదిగా.
నెల మొదటితారీకు, ఉదయం టిఫిను చేస్తూ..... "చూడు సుజాతా, ఇదిగో యీ ఐదు వందలు ఆయన లేచాక కాఫీ యిచ్చేటప్పుడు తీసికెళ్ళి ఆయన కియ్యి" అంటూ ఐదు వందరూపాయలనోట్లు చేతిలో పెట్టింది. కల్యాణి పైకి ఏమనకపోయినా సుజాత మనసులో అనేకప్రశ్నలు ఉదయించాయి. ఆయన ఖర్చులకి కూడా భార్యనించి డబ్బు తీసుకోడం వింత అన్పించింది సుజాతకి. ఏ పని పాటా లేకుండా జల్సాగా తిరుగుతూ, త్రాగుతూ, పేకాడుతూ ఆ ఖర్చుకూడా భార్య నెత్తిన రుద్దడం. ఈవిడ ఆయనకి అలాంటి వాటికి డబ్బు యీయడంలో అర్ధం యెంత ఆలోచించినా సుజాతకి అర్ధంగాలేదు. ఆయన చదువుకున్నాడు. అయినా ఉద్యోగం చెయ్యకుండా తిని తిరుగుతూ నిర్వికారంగా యెలా తిరుగుతున్నాడు. ఎంత పౌరుషం లేదు! ఆయన ప్రవర్తన కంటే కూడా కళ్యాణి సంగతే చాలా ఆశ్చర్యం కలిగించేది సుజాతకి. ఆవిడకూడా భర్త ఏం చేస్తున్నా పట్టించుకోకుండా వూరుకోడం, పైగా ఆయన ఖర్చుకికూడా యీవిడ రాత్రింబగళ్ళు కష్టపడి ఆర్జించి యీయడం ఏమిటా అని విస్తుపోయేది. తనకి తెలియని రహస్యం ఏదో ఆ భార్యా భర్తల మధ్య వుందని మాత్రం సుజాతకి అర్ధం అయింది.
ఐదువందల రూపాయలు యిచ్చి పట్టుమని పదిరోజులు కాలేదు. అప్పుడే అంతా అయిపోయింది కాబోలు, మళ్ళీ రెండువందలు కావాలంటున్నారు అనుకుంది సుజాత.
"ఇవాళ యేమిటి వంట?" రంగారావు చాలా చనువుగా సుజాత ప్రక్కన నిలబడి అన్నం కలుపుతున్న కంచంలోకి చూస్తూ అడిగాడు. ఆయనంత చనువుగా అడగడం, అంత చేరువగా వచ్చి నిల్చోడం చూసి బిడియంతో ముడుచుకుపోయింది సుజాత. ఆయన అడిగే ప్రశ్నలకి తలవంచుకునే సమాధానం చెప్పింది. ఇంకా గదిలోనే తచ్చాడుతూ "పిల్లలకా క్యారియర్!" అనడిగాడు. మళ్ళీ ఏదో ఒకటి కల్పించుకు మాట్లాడుతున్నాడన్న ఆయన ధోరణి అర్ధం అయింది సుజాతకి! వంటింటిలో ఆయనలా తనతో తిరుగుతూ మాట్లాడడం యెవరన్నా చూస్తే ఏం బాగుంటుంది! ఇదేమిటి యెన్నడూలేనిది యిలా తనతో మాట్లాడుతున్నారు. వెంటనే వెళ్ళిపోతే బాగుండును - అనుకుంటూంది సుజాత. "కాసిని మంచినీళ్ళిస్తావూ!" మళ్ళీ అడిగాడాయన. సుజాత చప్పున ఫ్రిజ్ లోంచి నీళ్ళు తీసి అందించింది. గ్లాసు అందుకుంటూ సుజాత చేతి వేళ్ళని తాకించాలనే తాకించాడో లేక యధాలాపంగానే తగిలాయోగాని ఆ చర్యకి, గ్లాసు అందుకుంటూ తన కళ్ళలోకి అదోలా నవ్వుతూ చూసిన ఆ చూపుకి భయంతో వణికింది సుజాత. ఆ పరిస్థితి నించి ఎలా తప్పుకోవాలో తెలియలేదు. అదే సమయంలో దైవికంగా 'అమ్మాయ్ సుజాతా!" అంటూ సరస్వతమ్మ పిలవడంతో ఆమె ఆ అదను దొరికిందే చాలన్నట్టు గదిలోంచి చప్పున బయటికి వెళ్ళిపోయింది. రంగారావు ఆమె వంకే పట్టి పట్టి చూస్తూ మేడమీదకి వెళ్ళిపోయాడు.
గదిలోకి వచ్చిన సుజాతవంక అదోలా చూస్తూ "వంటింట్లో యెవరితో మాట్లాడుతున్నావు?" అనడిగింది సరస్వతమ్మ. ఆవిడ మొహంలో కనపడ్డ భావానికి సుజాత మొహం యెర్రబడింది! ఆవిడ చూపులని తప్పించుకుని "రవి నాన్నగారు" అంది కాస్త తొట్రుపాటుతో. ఆవిడమొహం చిట్లించింది. "ఏమంటున్నాడు?" అంది.
"డబ్బు కావాలట, డాక్టరుగారు రాగానే అడిగి తీసుకొచ్చి యీయమన్నారు" అంది.
"ఎంత?"
"రెండొందలు."
"హు....దాన్నిలా పీడించి పీల్చి పిప్పి చేస్తున్నాడు.....డబ్బు......అంటూ....." ఆవిడ తనలో తాను అనుకుంటున్నట్టు గొణుక్కుంది.
"మీరేం అనుకోకపోతే ఒకమాట. డాక్టరుగా రెందుకు ఇస్తారు డబ్బు? ఆవిడ యీయకుండా వుంటే ఆయనెలా ఖర్చు పెడతారు?" ధైర్యంగా అడిగింది సుజాత.