"ఈయక యేం చేస్తుంది! ఈయకపోతే ఊరినిండా యెక్కడ పడితే అక్కడ దీనిపేర అప్పులు చేస్తాడు. అవన్నీ మళ్ళీ యిదేగా తీర్చుకోవాలి."
సుజాత ఆశ్చర్యంగా చూసింది. "నిజంగానా? అసలు-అసలాయన యిలా యెందుకు చేస్తారు" ఆశ్చర్యంగా, కుతూహలంగా ఆపుకోలేక అడిగింది సుజాత.
"ఎందుకా, దాని ఖర్మ. దాని అదృష్టం యిలా వుంది. దాని బ్రతుకు బండలయింది కనక. ఎవరితో చెప్పుకోలేక, కక్కలేక, మింగ లేక యిలా బ్రతుకీడుస్తూంది అది" సరస్వతమ్మ గొంతులో యేదో అడ్డు పడినట్టు ఇంక మాట్లాడలేకపోయింది. కళ్ళల్లో తిరిగిన నీరు పమిట కొంగుతో వత్తుకుంది. తెల్లబోయి చూసింది సుజాత.
ఆవిడ మాటలవల్ల క్రొత్తగా తెల్సిన సంగతులు ఏం లేక పోయినా సుజాత మనసులో ప్రశ్నలు మరిన్ని పుట్టాయి. ఆ ప్రశ్నలకి జవాబు తెలియకపోయినా కల్యాణి జీవితంలో ఏదో పెద్ద విషాద గాధ వుందన్న విషయం మాత్రం అర్ధం అయింది సుజాతకి. భోగభాగ్యాలు చదువు, సంస్కారం అన్నీ వుండి ఆమెకి బ్రతుకులో సుఖ సౌఖ్యాలు కరువయ్యాయి అన్న విషయం తలుచుకొంటే సుజాతకి కల్యాణిపట్ల మరింత సానుభూతి కల్గింది. ఆమె అంటే గౌరవాభిమానాలు మరింత ఇనుమడించాయి.
కల్యాణి మధ్యాహ్నం భోంచేస్తూండగా నెమ్మదిగా సుజాత రంగారావు డబ్బు అడిగిన మాట చెప్పింది. అన్నం తింటున్న కళ్యాణి ముఖం ఒక్కక్షణం నల్లబడింది. చిన్న నిట్టూర్పు వదిలింది. "అప్పుడే అయిదు వందలు అయిపోయాయన్న మాట" అని మాత్రం అంది. భోంచేసిన కల్యాణి విసురుగా రెండొందలు తెచ్చి సుజాతకి ఇస్తూ "ఆయనగారి కియ్యి" అంది.
సుజాత డబ్బు పట్టుకుని రంగారావు గదిలోకి వెళ్ళేసరికి ఆయన మంచంమీద పడుకొని వుండడం చూసి గుమ్మందగ్గిరే నిలబడి చిన్నగా దగ్గింది సుజాత. రంగారావు కళ్ళు విప్పి ప్రసన్నంగా సుజాత వంక చూసి "రా.....రా, నీ కోసమే చూస్తున్నాను. డబ్బు తెచ్చావా?" అన్నాడు. సుజాత చేయి చాపి నోట్లు ఆయన మంచంమీద పెట్టి వెనుతిరిగింది.
"సుజాతా, ఇదిగో చూడు......మాట అరే వెళ్ళిపోతావేం? ఆ.....
"మీ అమ్మగారేం అంది డబ్బడిగితే" అదో రకంగా నవ్వుతూ అడిగిన ఆ మాట తీరు, ఆ నవ్వు వెగటనిపించి చటుక్కున మొహం త్రిప్పుకుంది సుజాత. తనతో యీరోజు ఆయన ధోరణి వింతగానే కాక అసహ్యంగా అన్పించింది.
"ఏం అనలేదు, అడగ్గానే ఇచ్చారు" ముక్తసరిగా జవాబిచ్చింది సుజాత, వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ.
"అరే యేమిటా తొందర, ఉండు. వెళ్ళిపోరు" అంటూ మంచం మీదనించి లేస్తున్న రంగారావుని గాభరాగా చూసింది సుజాత! అప్రయత్నంగానే రెండడుగులు వేసింది గుమ్మంవేపు.
"అలా నిల్చోకపోతే ఆ కుర్చీలో కూర్చోకూడదూ. ఇప్పుడేం పని లేదుగా! ఆ అన్నట్టు నీకు పేకాట వచ్చా. మనిద్దరం ఆడుకుందాం కాసేపు. కూర్చో" అంటూ దారి కడ్డువచ్చాడు.
సుజాత కాళ్ళలో వణుకు ఆరంభించింది. ఆయన మాటల ధోరణికి గొంతు తడారినట్టు అనిపించి బితుకు బితుగ్గా చూసింది. "నాకు పేకాట రాదు, అసలు రాదు, వస్తా-డాక్టరుగారు పిలుస్తారు" అంటూ రెండు మాటలు అని గదిలోంచి బయటపడింది. గదిలోంచి క్రిందమెట్లు వరకు వచ్చేదాకా సుజాత ప్రాణం కుదుటపడలేదు. ఆ చూపేమిటి? ఆ మాటల ధోరణి ఏమిటి? త్రాగివున్నట్టున్నారు అనుకుంది సుజాత.
ఓ మధ్యాహ్నం మూడుగంటలకి మంచి నిద్రలో వున్న కల్యాణికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. తనకి హఠాత్తుగా మెలకువ తెప్పించిందేమిటో నిద్రమత్తులో వున్న కల్యాణికి స్ఫురించలేదు. బద్ధకంగా, మత్తుగా పడుకున్న కళ్యాణికి ప్రక్క గదిలోంచి సుజాత గొంతు వినిపించగానే మత్తు వదిలిపోయింది ఒక్కసారిగా. సుజాత గొంతుతో కలిసి భర్త గొంతు వినిపించగానే ఒక్కసారిగా మంచంమీద లేచి కూర్చుంది. ఏదో అనుమానం తోచి చటుక్కున లేచి వరండా మీదుగా వున్న గది తలుపుదగ్గిర కెళ్ళింది. ఈలోగా సుజాత గొంతు కెవ్వుమంది. 'వదలండి.....వదలండి.....దయచేసి తలుపుతెరవండి.....ఇదేమిటిది.....ప్లీజ్.... మీకు నమస్కారం పెడతాను. తలుపు తెరవండి" అంటూంది.
రంగారావు "ష్ అరుస్తావెందుకు, ఇప్పుడెవరూ రారు యిటు. నీకేం ఫరవాలేదు. రా...." అంటున్నాడు గొంతు తగ్గించి. కల్యాణికి సంగతి వెంటనే అర్ధమయింది. తలుపులు దబదబ బాదింది. "సుజాతా, తలుపు తెరు" అంది.
"వీల్లేదు తలుపు తీయడానికి వీల్లేదు" కఠినంగా పలికింది రంగారావు గొంతు.
"డాక్టరుగారూ....."ఏడుపు గొంతుతో పిల్చింది సుజాత. "నేను....నేను.....నన్ను.....నన్ను....."అంటూ ఇంకేమీ చెప్పలేకపోయింది. లోపల సుజాత స్థితి అర్ధమయింది కల్యాణికి. ఏం చెయ్యాలో తోచక నిస్సహాయంగా ఒక్కక్షణం నిలబడిపోయింది. కిటికీవేపు పరిగెత్తింది. కిటికీ మూసివుంది. "ఏమండీ, తలుపు తెరుస్తారా లేదా? వెంటనే తెరవండి" తలుపులు బాదుతూ గట్టిగా అరచింది కల్యాణి.
రంగారావు "ఫో అవతలికి, తీయను" భీకరంగా అన్నాడు. "ఆగు. తలుపు తీయడానికి వీలులేదు" ముందుకు వచ్చిన సుజాతని వెనక్కి లాగి, తలుపుకి అడ్డం నిలబడ్డాడు రంగారావు.
కల్యాణికి మతిపోయింది. లోపల చిక్కుకున్న సుజాతని యెలా రక్షించడమో అర్ధం కాలేదు. సుజాత పెనుగులాట స్పష్టంగా బయటికి వినిపిస్తూంది. గట్టిగా అరిచి కేకలుపెడితే క్రిందనుంచి రోడ్డున పోయేవాళ్ళు యెవరయినారావచ్చు! కానీ పరువు, మర్యాద ఏమవుతుంది! ఆయన యెవరో కాదు! ఈ యింటి యజమాని-తన భర్త! ఆ తర్వాత లోకుల మొహం యెలా చూడగలదు? కల్యాణి నిస్సహాయంగా అటు యిటు పరిగెత్తింది. తలుపులు బాదింది. చటుక్కున ఆ గదికి పిల్లల గదిలోంచి ఓ ద్వారం వుందన్న సంగతి మెరుపులా తట్టింది. ఆ గాభరాలో ఆ మాటే మరిచిపోయింది. గబగబ ఆగడిలోకి పరిగెత్తింది. రెండు గదులకి వున్న గది గుమ్మందగ్గిర వున్న బట్టల బీరువాని అతి ప్రయత్నంతో కాస్త ప్రక్కకి జరపగలిగింది. గట్టిగా చప్పుడయితే అవతలపక్కనించి భర్త గొళ్ళెం పెట్టేస్తాడన్న భయంతో వీలయినంత నెమ్మదిగా గడియతీసింది. అదృష్టవశాత్తు అటు గడియ వేసిలేనందుకు సంతోషించి ఒక్కసారిగా తలుపు తోసుకొని గదిలోకి వెళ్ళింది. హఠాత్తుగా లోపలికి వచ్చిన కల్యాణిని చూసి రంగారావు తెల్లపోయాడు. భయంతో బిక్కచచ్చి పోయిన సుజాత కల్యాణిని చూసి తెలివి తెచ్చుకొని అతని చేతుల్లోంచి తప్పించుకోడానికి పెనుగులాడడం ఆరంభించింది. ఆ దృశ్యం చూసిన కల్యాణి అపరకాళిలా విరుచుకుపడి భర్త చేతుల్లోంచి సుజాతని లాగింది. రంగారావు కల్యాణివంక క్రూరంగా, తీక్షణంగా చూస్తూ "వదులు, ఆ అమ్మాయిని ముందు నీ కిక్కడేం పని? వెళ్ళక్కడనించి" అన్నాడు సుజాతని పట్టుకులాగి.