Previous Page Next Page 
లీడర్ పేజి 17

    సాయంత్రం బావి దగ్గర అంట్లగిన్నె లేసుకుని తోముకుంటున్న శారదని సైగచేసి పిలిచి, "ఏమయిందే! ఎందుకు చచ్చిపోతానంటున్నావు?" అనడిగేసింది.    
    "ఏం చెయ్యనత్తా! నా కష్టాలు ఆర్చేవారూ, తీర్చేవారూ యెవరు? అందుకే చచ్చిపోతానంటున్నా" అని ఏడవసాగింది.    
    "నీ ఏడుపు ఆపి ముందు చెప్పు! తర్వాత ఆలోచిద్దాం ఆర్చడం, తీర్చడం గురించి" అంది రమణమ్మ.    
    శారద ఏడుపు ఆపి ఈ విధంగా చెప్పింది నారాయణాచారి తన పిల్లకి సంబంధం చూసే విషయమై ఒకరింటికి వెళ్ళాడు. అక్కడ వారొక చిత్రమైన షరతు పెట్టారు, మీ యింట్లో వున్న శారద అనే దిక్కులేని పిల్లని "కళ్యాణదుర్గం"లో వున్న పిల్లవాడి మేనమామకి 60 ఏళ్ళు మాత్రమే!    
    అంతా విని రమణమ్మ నోరావులించింది, "పదిహేడేళ్ళ పిల్లకి అరవై ఏళ్లవాడినిచ్చి చేస్తాననడానికి ఆ ముసల్దానికి నోరెలా వచ్చింది?" అని ఆశ్చర్యపోయింది.    
    "అంతా నా ఖర్మ! మా అత్త ముహూర్త్ర్హం కూడా పెట్టించిందట. నాకింక అంబారాయుడి బావే శరణ్యం" అని శారద మళ్ళీ ఏడ్చింది.    
    "చాల్లే! మావయ్య రానీ ఏదో ఒకటి చేద్దాం! అనవసరంగా ఈలోగా ఏ అఘాయిత్యం చెయ్యక" అని పలు రకాలుగా ధైర్యం చెప్పి ఆ పిల్లని యింటికి పంపించేసింది రమణమ్మ.    
    శారదటు వెళ్ళగానే, ఇదంతా వింటున్న పనిమనిషి, "కృష్ణమూర్తి బాబుకి శారదమ్మంటే వల్లమాలిన ప్రేమ, పెళ్ళి చేసుకుంటానని అడిగితే కయ్యమాడి పంపించేసింది ముసల్ది" అంటూ మెటికలు విరిచింది.    
    "కృష్ణమూర్తెవరూ?" అంది రమణమ్మ "కృష్ణమూర్తి బాబు ఈ పక్కింట్లో వుండేవాడమ్మా! బాబుగారి తల్లి తులశమ్మగారు కూడా చాలా మంచిది. ఆవిడకి కూడా శారదని కృష్ణమూర్తి బాబుకిచ్చి చేసుకోవడం యిష్టమే! కానే ఈ ముసల్ది ఆ సంగతి తెలిసి చాలా రభస చేసేసింది. ఇంతలో ఆ బాబుకి బదిలీ అవడంతో వారు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారు"    
    "ఏ ఊరెళ్ళారు?"    
    "ఊద్గవి చాలా దగ్గరే" అంది.    
    ఆ మధ్యాహ్నం శ్రీహరిరావు భోజనానికొచ్చినప్పుడు, రమణమ్మ శారద కధంతా చెప్పుకొచ్చింది, అందులో ముఖ్యంగా శారదని చేసుకునే ఉద్దేశం కృష్ణమూర్తికున్నట్లు గట్టిగా చెప్పింది.    
    "ఆ పిల్లక అన్నంతపనీ చేసి, ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా వుందండీ!" అని కూడా అనేసింది.    
    అయన మౌనంగా అన్నీ విన్నారు. కాసేపు ఆలోచించారు. తరువాత లేచి నిలబడి "ఈ రాత్రికే నేను ఊద్గగవి వెళ్తాను" అని చెప్పారు.    
                                      *    *    *    *    
    "ఇక్కడ కృష్ణమూర్తెవరూ?" అంటూ వాకిట్లోంచి అడుగుతున్న ఆగంతకుడ్ని చూసి, ఆశ్చర్యంగా "నేనే" అంటూ బయటికొచ్చాడా యువకుడు.    
    అతను బయటికొచ్చి, వచ్చిన వ్యక్తిని చూసి "మీరా!" అని అంత కంటే విస్మయం చెందాడు.    
    "నేనెవరో తెలుసా!"    
    "శ్రీహరిరావుగారిని తెలియని వాళ్ళెవరండీ ఈ చుట్టుప్రక్కల నేను విద్యార్ధిగా వున్నప్పుడు ఒక్కసారి మీ ఉపన్యాసం కూడా వినడం తటస్థించింది. మీ అంతటివారు మా యింటికి రావడం, నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. దయచేసి లోపలికి రండి" అని ఆహ్వానించి లోపలికెళ్ళాడు.    
    శ్రీహరిరావుగారు కుర్చీలో కూర్చోగానే....."నమస్కారం" అంటూ అతని తల్లి బయటికొచ్చింది. అప్పటికే కృష్ణమూర్తి ఈయన గురించి చెప్పినట్లున్నాడు. ఆమె కూడా విస్మయంగా చూస్తోంది.    
    శ్రీహరిరావుగారు చిరునవ్వుతో "మీ అబ్బాయికి మా అమ్మాయి నిచ్చి వివాహం చెయ్యాలనే ఉద్దేస్మతో వచ్చాను" అన్నారు.    
    ఇద్దరూ తెల్లబోయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.    
    "మా అమ్మాయంటే స్వంత అమ్మాయికాదు కానీ అలాంటిదే పేరు శారద. మీకు ఉరవకొండలో పరిచయమైన పిల్లే" అన్నారు అంతా తేటతెల్లం చేస్తూ.    
    కృష్ణమూర్తి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.    
    "ఏం మీకిష్టమేనా?" అని అతన్ని సూటిగా అడిగారు.    
    అతను ఠకీమని "నాకిష్టమే!" అని చెప్పాడు.    
    అయన తులశమ్మగారివైపు తిరిగి "మీకూ?" అన్నట్లు చూశారు.    
    "నాకు ఇష్టమే బాబుగారూ! కానీ ఆ మేనత్త మహాగయ్యాళి. ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలనివ్వదు, ఇక పిల్ల నిస్తుందా?" అందావిడ నిరుత్సాహంగా.    
    "అదంతా నాకొదిలిపెట్టండి! ఈ పెళ్ళి జరిపించే పూచీ నాది" అన్నారు సహజ గంభీరస్వరంతో.    
    మర్నాడు సాయ్మత్రం ఇంటిముందు జట్కా ఆగగానే "కలిశారా? ఏమన్నారూ?" అని అడుగుదామని పరుగు పరుగున బయటికొచ్చిన రమణమ్మకి, జట్కాలోంచి భర్తతోబాటు దిగుతున్న ఒక పెద్దావిడా, యువకుడూ కనిపించారు.    
    "ఏమిటలా నిలబడిపోయావు? ఇతను పెళ్ళికొడుకూ, ఆవిడ ఇతని తల్లీనూ, తెల్లవారితే పెళ్ళి! బోలెడు ఏర్పాట్లు చెయ్యాలి పద!" అన్నారు.    
    భర్త హడావుడి సంగతి తెలిసినదే కావడంచేత ఆమేమీ ఖంగారు పడకుండా వచ్చిన వారిని ఆప్యాయంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళింది.    
    ఆ రాత్రే పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. మర్నాడు ప్రొద్దుటే బళ్ళారి వెళ్ళి పెళ్ళి జరిపించెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి రాత్రే తన మిత్రుడైన ఓ కో ఆపరేటివ్ ఆఫీసర్ దగ్గరకెళ్ళి రెండొందలు రుణం తీసుకొచ్చాడు శ్రీహరిరావు. వాటితో మంగళ సూత్రం, చీరా, చాపూ కొని, మిగతా పెళ్ళికి ముఖ్యమైన సామాన్లు కూడా కొన్నారు.

 Previous Page Next Page