"మగాడి సంగతి నీకు తెలియదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు. మనం ప్రతిది నమ్మి అన్నింటికీ కరిగిపోతుంటే మగవాళ్ళని పట్టశక్యం కాదు కొట్టినా తిట్టినా భార్య తన కాళ్ళదగ్గరే పడి వుంటుందన్న అహంతో చాలామంది మగవాళ్ళు....." సీత పడి నిమిషాలపాటు కామా పులిష్టాపులు లేకుండా మగవాళ్ళ అహంకారం ఆడవాళ్ళ తెలివి తక్కువ తనం గురించి లెక్చారిచ్చింది.
సీత చెప్పిందంతా విని "అదేమో నాకు తెలియదు అమ్మగారూ! కొట్టినా తిట్టినా వాడు పరాయివాడు కాదు నా మొగుడు. నిజం చెప్పాలంటే అమ్మగారూ! కొట్టింది మొగుడు కాబట్టి పడ్డాను. అదే పరాయి మగాడు తన్నటానికి నామీదకొస్తే ఊరుకుంటానా ఆది కాళ్ళు చేతులు ఫెళ ఫెళ విరిచి పొయ్యిలో పెడతాను" అంది రంగి.
"నీవు బాధపడుతూ ఏడ్వటం మామూలే. అంతేనా!" సీత గుర్తు చేస్తున్నట్లు అంది.
"దెబ్బలు తగిలి వళ్ళు నెప్పులు చేస్తే కాస్త కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను. అంతే వాడు నా మొగుడు కాకపోయాడా నేను వాడి పెళ్ళాన్ని కాకపోయానా! ఈ మధ్యాన్నం రిక్షా యజమాని దగ్గర ముఫైరూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరికోసం, నాకోసం సినిమా చూపిస్తున్నాడు. హోటల్లో చాపలకూరతో అన్నం పెట్టిస్తున్నాడు. రూపాయి పూలు, జర్దా కిళ్ళి, మిఠాయి. గాక గాజులు నకిలీ గొలుసు కొని పెడతానన్నాడు. యిదంతా ఎవరికోసం నా కోసమే కదా! రేపు ఆ ముఫై రూపాయలు తీర్చుకోటానికి రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలయేలా రిక్షా తొక్కుతాడు. అయినా మీకు తెలియంది ఏముంది అమ్మగారూ! పెద్దవాళ్ళు అంటారు మొగుడు పెళ్ళాల పోట్లాట అద్దంమీద ఆవగింజట..... మీతో కబుర్లు చెపుతుంటే ఇట్ట ఒక్క క్షణాన పనైంది. వస్తానమ్మగారు. వాడు కళ్ళల్లో వత్తు లేసుకుని నాకోసం ఎదురు చూస్తుంటాడు." సీత పెదవి కదిపే లోపలే రంగి మాట్లాడటం శలవు తీసుకుని వెళ్లటం జరిగింది.
సీతామనోహరి కొద్దిసేపుదాకా తేరుకోలేదు.
"మొగుడు పెళ్ళాల పోట్లాట అద్దంమీద ఆవగింజ."
"మొగుడు పెళ్ళాల మధ్య పోట్లాట అద్దంమీద ఆవగింజ."
"నా మొగుడు నన్నుగాక ఎవరిని కొడతాడు?"
"పరాయి మగాడు తన్నటానికి వస్తే వూరుకుంటానా?"
రంగి అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి. సీతకి ఏ పని చేయబుద్ధి కాలేదు. రామకృష్ణ ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆర్. కె. వాళ్ళ గులాబ్ జామూస్ చేసి అటుకుల పులిహోర చేద్దామనుకుంది. అవీ చేయ్యబుద్ధి కాలేదు. రంగి గురించి ఆలోచిస్తూ పడక్కుర్చీలో అతుక్కుపోయి పడుకుంది.
7
రామకృష్ణ ఆఫీసు నుంచి యింకో పడి నిమిషాల్లో రానున్నాడు.
సీత పడక్కుర్చీలోంచి లేచింది.
"ఉదయమనగ భోంచేసి ఆఫీసుకి వెళ్లారు. ఆకలితో నక నక లాడుతుంటారు. స్వీటు హాటు రెండు రకాలు చేద్దామనుకున్నాను. ఈ రంగి గోల కాదు కాని, మైండ్ పాడయింది." అనుకున్న సీత చాకు అందుకుంది టక టక ఉల్లిపాయలు టమేటాలు కేరెట్ అల్లం పచ్చిమిర్చి తరిగింది.